
రష్యాకు ఉక్రెయిన్‌కు మధ్య శాంతి చర్చలలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కీని ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా నుండి అందుతున్న యుద్ధ సంబంధిత సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఒక దశలో అణ్వాయుధాలు తీసుకు వెళ్లగలిగిన యుద్ధ విమానాలు, శతగ్నులు కూడా ఉపయోగించటానికి ఉక్రెయిన్‌కు అనుమతించిన అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందే జెలిన్స్కీతో ముఖాముఖి సమావేశాన్ని కూడా ట్రంప్ నిర్వహించారు. అమెరికా సహకారం లేకుండా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడం అంత తేలికేమీ కాదు.
అయితే, ఈ వార్తలపై స్పందిస్తూ ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రస్తుతం ఉక్రెయిన్ స్వాధీనంలోని అమెరికా ఆయుధ సామాగ్రి మరో రెండుమూడు నెలలకు సరిపోతుందన్నారు. ఈ మధ్య ట్రంప్ మనసు మార్చుకొని ఆయుధ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప మరో మూడునెలల తర్వాత యుద్ధం ముగింపుకు రాక తప్పదని తెలిపారు.
రష్యాతో సంప్రదింపులు ప్రారంభించాలని, దానికోసం మేమే ఒకడుగు ముందుకు వేస్తున్నామన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో ప్రకటనను గమనిస్తే యుద్ధం నిలిపివేయడంతో పాటు పలు దౌత్యపరమైన వ్యూహాలకు కూడా అమెరికా తెరతీస్తున్నట్టుగా అర్థం అవుతోంది.
ఇదిలా ఉండగా వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్(యుద్ధ అధ్యయనాల కేంద్రం) ఉక్రెయిన్‌కు ఉన్న పళంగా ఆయుధ సరఫరా నిలిపివేస్తే ట్రంప్ లక్ష్యమయిన సుస్థిర శాంతి సాధన దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్, జెలిన్స్కీ భేటీ తర్వాత స్పందన ఎలా ఉండబోతోంది అన్నది ప్రశ్న. ఈ దిశగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ కొన్ని షరతులను ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనవి ఇప్పటివరకు జరిగినదానికి ఉక్రెయిన్ పశ్చాత్తాపం ప్రకటించాలి. ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకాలు చెయ్యాలి. శాంతి చర్చలు మొదలు పెట్టాలి. ఈ షరతులు ప్రస్తావించిన వాల్ట్జ్ ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కాదని కూడా స్పష్టం చేశారు. అమెరికా, ఉక్రెయిన్, రష్యాలతో పాటు ప్రపంచ శాంతికి ఇవి అవసరమని తెలిపారు.
అయితే, ఈ షరతులను ఉక్రెయిన్ అంత తేలిగ్గా ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనపడటం లేదు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎటువంటి భరోసా లేకుండా ఉన్న పళంగా యుద్ధ విరమణ చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు.
రష్యాను కట్టడి చేసే షరతులు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఒకసారి కాల్పుల విరమణ ప్రకటించి సంధి కుదుర్చుకున్న తర్వాత సంధి నుండి రష్యా వైదొలిగితే ఉక్రెయిన్ ఒంటరిగా మిగలడమే కాక తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నది జెలిన్స్కీ ఆందోళనగా కనిపిస్తుంది. 2014, 2015లో మాదిరిగా మిన్స్క్లో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి రష్యా వైదొలగిన సందర్భాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు గుర్తు చేశారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నెలరోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రోన్ ప్రతిపాదనలో భాగస్వామి కావడానికి అప్పట్లో ఇంగ్లండ్ సిద్ధం కాలేదు.
ఇమిలి గోల్బర్డ్
(ఫైనాన్షియల్ టైమ్స్ సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.