
మెజార్జీ హిందూత్వ రాజకీయ అల్లకల్లోలం మధ్య అచార్య సత్యేంద్ర దాస్ హేతుబద్ధమైన ఓ ప్రశాంతమైన స్వరానికి ప్రతీకగా నిలిచారు.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయ ప్రధాన పూజారి, హిందూ దేవుళ్లను రాజకీయం చేయడాన్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తి అచార్య సత్యేంద్ర దాస్ ఫిబ్రవరి 12న 86 ఏళ్ల వయసులో చనిపోయారు. మూడు దశాబ్దాలుగా బాలరాముని పూజకు సంబంధించిన పనులను ఎంతో నిష్టతో ఆయన నిర్వహించారు. అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యూయేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఆయనను చేర్చారు. అక్కడ చికిత్స పొందుతు దాస్ తుదిశ్వాస వదిలారు.
తన కాషాయ వస్త్రాలకు ఆనుకొని ఒత్తైన మెరిసే తెల్లటి గడ్డంతో ఉండే ఆయనను ఎవరైనా తేలిగ్గా గుర్తుపడతారు. 1980- 90లో విశ్వహిందూ పరిషత్ నడిపించిన రామజన్మభూమి ఉద్యమాన్ని దాస్ బలంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ఇది బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కోసం పన్నిన కుట్ర అని ఆయన అనుకునేవారు. దాస్ హిందూ భక్తుడు, పండితుడు, రామాలయ నిర్మాణ ఆలోచనకు బద్ధుడై ఉన్నారు, అయోధ్య రాముని జన్మస్థలమని కూడా భావించేవారు. కానీ, సమాజంలో ఎటువంటి విభేదాలను, విభజనను సృష్టించలేదు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యను ఎటువంటి రాజకీయ జోక్యానికి తావివ్వకుండా న్యాయపరంగా, సమాజంలో ఎటువంటి మతకల్లోలాలు లేకుండా శాంతితో పరిష్కరించుకోగలమని ఆయన అనుకునేవారు. రాజీకీయ జోక్యం దేశంలో కేవలం మతకలహాలకు మాత్రమే దారితీస్తుందని భావించారు. అయోధ్య- ఫైజాబాద్ జంటనగరాలు కీలకంగా మారిన మెజారిటీ హిందూత్వ రాజకీయ అల్లకల్లోలం మధ్య దాస్ హేతుబద్ధమైన ఓ ప్రశాంతస్వరానికి ప్రతీకగా నిలిచారు.
రామాలయంలో ప్రధాన పూజారిగా నియమితులైన దాస్ నిష్టతో ఆచారబద్ధంగా బాలరామునికి పూజలు చేశారు. తనకు కేటాయించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎటువంటి సంచలనాల జంజాటంలో పడకుండా నిరాడంబర జీవితాన్ని దాస్ గడిపారు. వీహెచ్‌పీ దాని అనుబంధ సంస్థలు ఆలయపట్టణంలో నడిపే రాజకీయ శ్రేణి సాధువులకు విరుద్ధంగా ఆయన ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఎన్నడూ సమాజాన్ని విభజించే విధంగా మాట్లాడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఈ ధోరణే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారు. రామునికి సంబంధించిన ఆయన దృష్టికోణాన్ని అందరితో పంచుకునేవారు. రామాలయ ఉద్యమాన్ని, చట్టపర చర్యలను లేదా దాన్ని చుట్టుముట్టిన రాజకీయాలను ఎగతాళి చేసేవారు.
ఆయన బ్రేన్స్ట్రోక్తో చనిపోయారని తెలిసిన తర్వాత పలువురు ప్రముఖ బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మత ఆచారాలు విషయంలో, గ్రంథాల అధ్యయనంలో దాస్ ఉద్ధండులని, తన పూర్తి జీవితాన్ని శ్రీరామునికి సేవ చేయడానికే అంకితం చేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
దాస్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సంతాపం వ్యక్తంచేశారు. ఒకప్పుడు వీహెచ్‌పీ కార్యకర్తగా ఉండి, రామాలయ ఉద్యమంలో పాలుపంచుకున్నటువంటి ప్రస్తుత యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. దాస్ మృత్యువుపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. రామజన్మభూమి ఉద్యమం నుంచి బాలరాముని పునఃప్రతిష్ఠ వరకు సాగిన ఆయన భాగస్వామ్యం మర్చిపోలేనిదని, అది ముందు తరాలకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు.
నిక్కచ్చిగా మాట్లాడే ఆయన స్వభావం బీజేపీ, రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ మద్దతుగల వీహెచ్‌పీకి వ్యతిరేకంగా నిలబెట్టేది. కేవలం అధికారంలోకి రావడం కోసం మాత్రమే వాళ్లు రాముడిని ఉపయోగించుకుంటున్నారని ఆయన భావించేవారు. ‘రామాలయం కోసం విశ్వహిందూ పరిషత్ నిర్వహించే ఆందోళనలన్నీ బీజేపీని అధికారంలోకి తేవడం కోసమే, దానికి మించి ఏం లేదు.’ అని 2019లో ద వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాస్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికలముందు అయోధ్యలో ధర్మసభ పేరుతో ఓ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ నిర్వహించింది. సభ ముఖ్య ఉద్దేశ్యం అందరి మద్దతు కూడగట్టి రామాలయ నిర్మాణం కోసం కోర్టులను ఒత్తిడి చేయడం. అయితే, ఈ కార్యమ్రానికి దాస్ గైర్హాజరైయ్యారు.
దేశ రాజకీయ చరిత్రలోని ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ సాగిన మూడు వేరువేరు సందర్భాలలో బాలరామునికి దాస్ పూజలు చేశారు. బాబ్రీ మస్జీద్లోని తాత్కాలిక ఆలయానికి ప్రధాన పూజారిగా దాస్‌ను ప్రభుత్వం నియమించింది, 1992 మార్చి 1న ఆయన బాధ్యతలు స్వీకరించి పూజలు నిర్వహించారు. 1949 డిసెంబర్ 22- 23 రాత్రి మొగల్ కాలంనాటి మస్జీద్‌లో జరిగిన ఘటన ఆలయం, మస్జీద్ వివాదాన్ని పూర్తిగా మార్చేసి.
బాలరాముని విగ్రహాన్ని మస్జీద్‌లో పెట్టిన వారిలో నిర్మోహి సాధు అభిరాం దాస్ కూడా అందులో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సత్యేందర్ దాస్ గురుగా మారారు. 1992 మార్చ్ ఒకటి నుంచి డిసెంబర్ 6 వరకు మస్జీద్లోని విగ్రహానికి దాస్ పూజలు చేశారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేతకు గురైనప్పుడు బీజేపీ, వీహెచ్‌పీ ఇచ్చిన పిలుపు మేరకు గుమిగూడిన కరసేవకులలో దాస్ కూడా ఉన్నారు.
మస్జీద్ ధ్వంసం చేయబడినప్పుడు దాస్ అక్కడే ఉన్నారు. ‘సుమారు ఉదయం 11 గంటలకు కొబ్బరికాయ, ఒక వస్త్రం ఇవ్వమని కరసేవక ప్రముఖ్ నన్ను అడిగారు. ‘మేము పూజ చేయాలని అనుకుంటున్నాము’ అని ఆయన అన్నారు.’ అని రచయిత శారద దూబేకు దాస్ చెప్పారు. శారద దూబే అమోధ్యకు సంబంధించిన అంశాలను తన పుస్తకంలో పొందుపరిచారు. కరసేవకులు సరయూ నది నుంచి ఇసుక, నీరు తీసుకువచ్చి స్థలాన్ని శుభ్రం చేశారని ఆయన వివరించారు. దీంతో దాస్ హిందూత్వ శ్రేణుల మీద కోపాన్ని పెంచుకున్నారు. ఎప్పుడైతే 1949లో విగ్రహాలను ప్రతిష్టించారో అప్పుడే నమాజ్ చేయడం ఆగిపోయింది. అది ఆలయంలా మారిపోయింది. కరసేవకులు మస్జీద్ని కాదు ఆలయాన్ని ధ్వంసం చేశారు.
ప్రభుత్వం పూర్తి స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దాస్ ప్రధాన పూజారిగా నియమించబడ్డారు. బాల రాముని విగ్రహానికి ఆయన పూజలు చేసేవారు. తన పాండిత్యానికి, ఎటువంటి మచ్చలేని తన వ్యక్తిత్వానికి దాస్‌ను పాలకమండలి పూజారిగా నియమించింది. ఆ రోజుల్లో ఇటువంటి కలయిక కలవారు చాలా అరుదుగా ఉన్నారు. ఎటువంటి నేరచరిత్ర, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని పూజారి నియామకం కోసం ప్రభుత్వం చాలా కష్టపడిందని దూబే తెలిపారు.
ఆయోధ్యలోని ఆలయాలు, మఠాల భూమి, ఆస్తి హక్కుల కోసం చట్టపరమైన వివాదాలలో చాలామంది ఉండడం సాధారణమైన విషయంగా ఉండేది. దీంతో ఇది తరచు హింసకు దారి తీసేది.
దాస్ ఆధ్యాత్మిక జీవితం..
1992 డిసెంబర్ 6న బాబ్రీ మస్జీద్ కూల్చివేయబడిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర పోలీసుల రక్షణ మధ్య తాత్కాలిక ఆలయంలో దాదాపు మూడు దశాబ్దాలు దాస్ పూజలు చేశారు. ఒకప్పుడు మస్జీద్ గోపురం ఉన్నటువంటి చోట సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టిన టెంట్ కిందికి సందర్శకులు కంచె, లోహ ఫ్రేమ్‌లు, బారీకేడ్స్ మధ్యలో నుంచి వెళ్లి దర్శించుకునే వారు. శ్రీరాముని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం దాస్ అక్కడే ఒక పూట ఉండేవారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత తర్వాత కరసేవకులు తొందరగా ఇటుకలతో తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. ఒకవైపు కోర్టులలో చట్టపరమైన కేసులు నడుస్తున్నా దాస్ పూజను నిర్వహించేవారు, భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు.
2019లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివాదస్పదభూమిలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించేలా హిందూ పక్షానికి బాధ్యతలను అప్పజెప్పింది. దీంతో ఏడు దశాబ్దాల పాటు సాగిన ఉద్మమానికి ఫుల్స్టాప్ పడింది. దీని ఫలితంగా బీజేపీ రాజకీయ ప్రాబల్యాన్ని చూపించింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆధిపత్యం కూడా పెరిగింది.
2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడంతో నిర్మాణంలోనే ఉన్నటువంటి ఆలయంలో ఆదరాబాదరాగా 2024 జనవరి 22న బాలరాముడి ఆలయంలో ప్రతిష్ఠించి, ఆలయాన్ని ప్రారంభించారు.
బాబ్రీ మస్జీద్‌లో విగ్రహాలను పెట్టడం దగ్గర నుంచి మస్జీద్ కూల్చివేత, రామాలయ నిర్మాణం వంటి వరుస ఘటనలలో కేవలం దాస్ మాత్రమే స్థిరమైన వ్యక్తిగా ఉన్నారు. ఈ ఘటనలకు సాక్షీభూతంగా నిలిచారు.
వారికి రాముని భక్తి అర్థం కాదు..
1938 నవంబర్ 12న పూర్వాంచల్‌లోని బస్తీ జిల్లా సంత్ కబీర్ నగర్లో దాస్ జన్మించారు. 20 ఏళ్ల వయసులో హిందూ పురాణ, ఇతిహాసాలను అధ్యయనం చేయడానికి ఆయన అయోధ్యకు వెళ్లారు. తన తమ్ముడు పెళ్లి చేసుకున్న సందర్భంలో తనకు చెందిన భూమిని దాస్ అతనికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రసిద్ధ హనుమాన్ గర్హీ ఆలయానికి పూజారిగా నియమితులు అయ్యారు. అంతేకాకుండా వారణాసి నుంచి మతబోధకులకు ఇచ్చేటటువంటి ‘ఆచార్య’ బిరుదును దాస్ అందుకున్నారు.
1958లో దాస్ అయోధ్యకు చేరుకున్నారు. బాబ్రీ మస్జీద్‌లో సీతారామలక్షణ విగ్రహాలను పెట్టిన బీహార్‌కు చెందిన అభిరామ్ దాస్ సాధును దాస్ కలిసి, ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. ఎంఏ సంస్కృతంతో పాటుగా మొత్తం మూడు డిగ్రీలను దాస్ పూర్తి చేశారు. 2007లో పదవీ విరమణ చేసే వరకు అయోధ్యలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బోధించారు. తాత్కాలిక ఆలయంలో తన బాధ్యతలను పూర్తి చేసుకున్న తర్వాత రాముడి భూమిలో కృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయాలలో ఒకటైన గోపాల ఆలయంలోని తన సాధారణ నివాసానికి తిరిగి వెళ్ళారు.
ఆలయం 500 వందల ఏళ్ల క్రితం నాటిదే కానీ తమ గురువులు ఎటువంటి లిఖిత ఆధారాలు వదిలి వెళ్లలేదు దీంతో ఎటువంటి సాక్ష్యాలు లేవని తాను నమ్ముతున్నట్టుగా దాస్ ఒకానొక సందర్భంలో చెప్పారు. ‘ఒకసారి రామభక్తుడు నగరానికి వచ్చి, అయోధ్యలో రామాలయాలు మాత్రమే ఉండడాన్ని చూశారు. దీంతో కృష్ణుడి ఆలయం కూడా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.’ అని ఈ వివరాలన్ని హనుమాన్ గర్హి ఆలయం దగ్గరలోని ఆయన ఆలయ నివాసం దగ్గర దాస్ వివరించారు.
అయోధ్య రామాలయం ప్రాచీన, సంప్రదాయ నగారా శైలిలో రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. రామాలయం ప్రారంభించిన కొద్దిరోజులకే లికేజీ వల్ల వర్షపు నీరు ఆలయంలోకి వచ్చింది. ఈ సందర్భంలో దాస్ అందరి చూపును తమ వైపుకు తిప్పుకున్నారు.
చట్టపరమైన వివాదంలో కాలయాపన జరిగినా కానీ న్యాయవ్యవస్థ మీద దాస్ దృఢమైన విశ్వాసంతో ఉన్నారు. చట్టపరమైన చర్యలను తీసుకోకుండా ఆలయం చుట్టూ రాజకీయమైన వాగ్ధానాలు వ్యర్ధమని ఆయన భావించారు. ఆయన ప్రకారం ఆలయ సమస్యను పదేపదే తీయడం వల్ల కేవలం దేశంలో మతకలహాలు మాత్రమే రాజుకుంటాయని, చివరికి నిర్ణయం తీసుకునేది ఉన్నత న్యాయస్థానమని అన్నారు.
ముస్లింలను మస్జీద్‌ల నుండి వెళ్లగొట్టడమే లక్ష్యంగా చట్టపరమైన వివాదాలు మళ్లీ తలెత్తడంపై 2024 డిసెంబర్లో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘మత విభజనను రెచ్చగొట్టేవారెవరు హిందువుల నాయకులు కాలేరు’ అని హెచ్చరించారు. ఈ దృక్కోణంతో దాస్ కూడా ఏకీభవించారు. న్యూస్ ఏజన్సీతో మాట్లాడుతూ ‘ఆలయం, మస్జీద్ మధ్య జరిగే వివాదం అనేది మతపరమైన వివాదం. ఇటువంటి వివాదాలు ఈ మధ్య పెరుగుతున్నాయి, కొంతమంది ఇటువంటి వివాదపూరిత అంశాలతో రాజకీయనేతలులుగా ఎదుగుతున్నారు. కేవలం రాజకీయ నేతలుగా ఎదగడమే వారి లక్ష్యం, అయితే ఇటువంటి వివాదాలు సరైనవికావు. ఎవరైతే రాజకీయనేతలుగా ఎదగడానికి ఇటువంటి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారో వారు సరైనవారు కారు.
1980 మధ్య కాలంలో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆలయ ఎజెండాను వీహెచ్‌పీ ప్రవేశపెట్టినప్పుడు దాస్ దానిని గమనించారు. ‘మొదట వారు ఒక రామజన్మభూమి ఆలయంతో ప్రారంభించారు. ఎప్పుడైతే ఎక్కువమంది ఈ సమస్య మీద సమావేశమవ్వడంతో దానిని చూసి మూడు ఆలయాల(అయోధ్య, వారణాసి, మధుర) గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రజలు దానికి కూడా కనెక్ట్ అవ్వడంతో అప్పటి నుంచి మూడు కాదు, మూడువేల దేవాలయాలను కూల్చి మస్జీద్ లు నిర్మించబడ్డాయని చెప్పడం ప్రారంభించారు.’ అని దాస్ గుర్తు చేశారు.
రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించిన వివిధ సమయాలలో సమాజాన్ని విభజించే వీహెచ్‌పీ చర్యలను, ప్రయత్నాలను దాస్ వ్యతిరేకించారు. 2023 ఆగస్టులో 273కిలో మీటర్ల ‘సాంస్కృతిక సరిహద్దు’ వెంట 84 కోశి పరిక్రమ యాత్రను అయోధ్యలో చేపట్టాలని వీహెచ్‌పీ సంకల్పించింది. యాత్రకు మతపరమైన అనుమతి లేదని, కేవలం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్లను మతపరంగా విభజించడానికి మాత్రమే ప్రణాళికను రూపొందించారని దాస్ ఈ ఆలోచనను తిరస్కరించారు.
2014 వేసవి కాలంలో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో అయోధ్య రామాలయ నిర్మాణం అంశాన్ని చేర్చింది. అప్పుడు దీనిని ‘రాజకీయ ఎత్తుగడ’అని కొట్టిపారేసిన వారిలో దాస్ కూడా ఒకరుగా ఉన్నారు. ఈ అంశం కోర్టులో ఉన్నప్పుడు ఇటువంటి వాగ్ధానాలు హిందూ ఓటర్లను తప్పుదారి పట్టించడానికని అన్నారు.
రామాలయం నిర్మించినప్పటికి 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అవమానకరమైన తరహా ఓటమిని ఫైజాబాద్‌లో చవిచూసింది. మితవాదులు తమ కృత్రిమ ప్రచారంలో భాగంగా ఓటమికి అయోధ్య ప్రజలే కారణమని నిందించారు. అటువంటి వారు తెలివితక్కువవారని ద వైర్‌కు దాస్ తెలిపారు.
‘భగవంతుడు రాముడి భక్తిని వారు అర్థం చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే రాముడిని కేవలం ఎన్నికల అంశంగా చూస్తారో వారు నీచమైనవారు’ అని దాస్ మండిపడ్డారు. ఆయనకు రాముడు ఎప్పుడూ విశ్వాసానికి సంబంధించిన విషయమే కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా అందరివాడు.
– ఒమర్ రషీద్
అనువాదం: క్రిష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.