
వామపక్ష భావాలతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా, ఆంధ్రజ్యోతి పత్రికలో ఉపసంపాదకునిగా, సాఫ్ట్వేర్రంగంలోనూ అధ్యాపక రంగంలోనూ చాలా కాలం పాపారావు పనిచేశారు. ఆర్థిక విశ్లేషణలు, అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచగమనంలాంటి వివిధ అంశాలపై చక్కటి విశ్లేషణ చేయగల ఫ్రీలాన్స్ పాత్రికేయులు. ప్రపంచ పెట్టుబడిదారీ దోపిడీకి గుండెకాయగా, వెన్నుదన్నుగా ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్థ పునాదులు నేడు కదిలిపోతున్నాయి. ఇటువంటి స్థితి రాబోతోందని రెండున్నర దశాబ్దాల క్రితమే పలు పత్రికల్లో వ్యాసాల ద్వారా ఆర్థిక విశ్లేషకులైన ఈ గ్రంథ రచయిత పాపారావు ముందుగానే చెప్పారు. అంతేకాకుండా ‘సమాధిలోకి సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని 2012లోనే రాశారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం విధిస్తోంది. నేడు ప్రపంచమంతటా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తున్న క్రమంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, పర్యావరణ విధ్వంసం, ఆకలి, అరాచకవాదం, ఫైనాన్స్ సంక్షోభం, పరిశ్రమల మూత, వ్యవసాయరంగం కుదేలు లాంటి ఎన్నో సమస్యలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి.
సకలలోక కల్యాణానికి ‘సోషలిజమే’ ఏకైక పరిష్కారమని రచయిత ఘంటాపథంగా చెప్పారు. 84 వ్యాసాలున్న ఈ సంకలనంలోని వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురణై, పాఠకుల ఆదరాభిమానాలను పొందాయి. 2008- 2024 వరకు ప్రపంచగమనాన్ని ఆయా వ్యాసాల్లో గమనించగలరు. మన దేశ ఆర్థిక పరిస్థితుల్ని కొన్నిచోట్ల అందరికి అర్ధమయ్యేలా రాశారు. రూపీ.. నిర్మల టోపి, సంక్షేమానికి సమాధి, అమెరికా విష పరిష్వంగంలాంటి వ్యాసాలు భారత దేశ ఆర్థిక ‘దు’స్థితిని తెలియజేస్తాయి.
2025లో మరింత ఉధృతంగా కమ్ముకొస్తున్న ఆర్థికమాంద్య మేఘాలగమనాన్ని తెలిపే వ్యాసాలున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభాలైన అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్లు మూడు శరవేగంతో ఆర్థికంగా సంక్షోభపు ఊబిలో కూరుకుపోతున్నాయి. ఉద్దీపన ప్యాకేజీలతో అప్పుల ఊబిలో ఇప్పటికే చాలా దేశాలు కూరుకుపోయాయి.
రీగనామిక్స్, థాచరిజం పేరుతో మొదలైన ఆర్థిక విధానాలు ఊపందుకున్నా కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేదల మధ్య అంతరం పెరిగిపోతోంది. ప్రపంచంలోని వివిధ పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక విధానాలు ఆత్మహత్యా సదృశ్యంలా మారి పేద ప్రజానికాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. 120 కోట్ల మంది కార్మికులు పేదరికంలో జీవిస్తున్నారు.
1999 అక్టోబరులో తమను తాము ధనికులుగా భావించకునే నాటి అమెరికన్ల సంఖ్య 67 శాతంగా ఉంటే అది 2001 నాటికి 52 శాతానికి పడిపోయింది. జపాన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఏడాదికి 20 శాతానికి పైగా పడిపోయింది. నిరుద్యోగం 4.8 శాతానికి పెరిగింది. ఇలా ఎన్నో దేశాల్లోని ఆర్థికపరిస్థితులు ఇరవై ఏళ్ల క్రితమే ‘ఆర్థిక సంక్షోభం దిశగా’ పురోగమిస్తున్న ‘ప్రపంచం’ అంటూ రాసిన వ్యాసం ఎన్నో అంశాలని తేటతెల్లం చేస్తుంది. ఫ్రాయిడ్ వందేళ్ల క్రితమే యూఎస్ఏకు డబ్బుజబ్బు పట్టిందని ‘డబేరియా’గా వర్ణించారు.
ప్రపంచంలోని ప్రతిదేశమూ నిట్టనిలువుగా ‘చీలిపోతోంది’. ఇది ఒక పక్క దోపిడీదారులు, మరోపక్క పీడిత ప్రజలుగా ఏర్పడుతోన్న చీలికగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు ‘భూతాన్ని’ అంతమొదించేందుకు గుడ్డిగా తాలిబాన్లను సమర్ధించిన అమెరికా, పాకీస్తాను అనంతర కాలంలో అదే తాలిబాన్ల ఆగ్రహావేశాలకులోనయ్యారని గ్రంథ రచయిత అంటారు. ‘అమెరికా సృష్టించిన ఆటవికులే తాలిబాన్లు’ వ్యాసంలో తర్వాత కాలంలో లాడెన్ ట్విన్ టవర్లు అమెరికాలో కూల్చడం జరిగింది. ‘వర్గరాజకీయాలలో కరుకుదేలుతున్న కార్మికవర్గం’ వ్యాసం చాలా విలువైనది. అంతేకాకుండా, ఆయా దేశాలలో తన తైనాతీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా గట్టెక్కించే పేరుతో అమెరికా బహుళజాతీ సంస్థలకు లాభాల పంటను పండించడమే అసలు రహస్యమని రచయిత అంటారు.
చాలా వ్యాసాలు 2009 కాలంలో ప్రపంచపరిణామాల చుట్టూరాసినవే, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లమంది కార్మికుల పేదరికంలో జీవిస్తున్నారు. 1930వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మహామాంద్యం కాలంలో అమెరికాను నాటి డెమోక్రటిక్ పార్టీ నేత దేశాధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ విధానాలు గట్టెక్కించాయి. 2009లో అమెరికా అధ్యక్షుడైన ‘ఒబామా మరో రూజ్ వెల్ట్ కాగలడా?’ అంటూ రాశారు. ‘మౌలిక మార్పుల యుగం ఆరంభం అయ్యే వరకూ అమెరికా రాజకీయాలు అట్టుడుకుతూనే ఉంటాయి. అమెరికా ప్రజలు అంతిమంగా చరిత్రను తమ చేతిలోకి తీసుకొని తీరుతారు’ అంటూ పై వ్యాసాన్ని రచయిత ముగిస్తారు. చాలా వ్యాసాలు ‘సంక్షోభంలో పెట్టుబడి దారీ వ్యవస్థ’ అనే అంశంపై కేంద్రీకరించి సాధారణ పాఠకునికి అర్ధమయ్యేలా రాశారు.
ఇంకా చెప్పుకుంటూపోతే, 1973- 79 కాలం నాటి పెట్టుబడిదారీ వ్యవస్థ తీరుతెన్నులు చక్కగా చెప్పారు. ‘నోబెల్ బహుమతులు- చరిత్ర’ చరమాంకం వ్యాసంలో పెట్టుబడిదారీ దేశాల తాలూకూ పలు అవార్డులలాగానే ఈ ‘ప్రతిష్టాత్మక అవార్డులు’ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సైద్ధాంతిక సేవలో తరిస్తున్నాయి. ఈ కారణం చేతనే జీన్‌పాల్ సార్రై (ఫ్రెంచి రచయిత) 1964లోనే తిరస్కరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు వివిధ దశలలో దాని సైద్ధాంతిక అవసరాలను పరిపూర్తి చేయగల వారిని గుర్తించడం వారికి నోబెల్ బహుమతిని అందించడం పరిపాటిగా మారిందని అంటారు.
1973- 79 కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షేమ రాజ్యకాలం ముగిసి నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు తెరలేచింది. గ్రీస్, ఐర్ల్యాండ్, దుబాయ్‌ల ఫైనాన్స్ సంక్షోభాన్ని చదవాలి. 1973 వరకూ నడిచిన సంక్షేమ రాజ్యానికి తూట్లు పొడిచే పనిని అమెరికాలో రోనాల్డ్ రీగన్, బ్రిటన్‌లో మార్గరేట్ థాచర్ స్వీకరించారు.
అమెరికాలోని అత్యంత ధనిక కుటుంబాలు 15,000. జాతిసంపదలోని 6.04% సొంతం చేసుకున్నాయని అన్నారు. ‘ధనికులున్న పేదదేశం- అమెరికా’, ‘అలెండీ నుంచి జెలియా వరకూ’ అనే వ్యాసాలలో వామపక్ష నేతలపై అమెరికా హత్యా రాజకీయాలని వివరించారు. అలెండీ(చీలి), జెలియా (హోండూస్), ఛావెజ్ (వెనిజులా)లాంటి వారిపై అమెరికా హత్యాప్రయత్నాలు చేసింది. అలానే కాస్ట్రోను(క్యూబా) 632 సార్లు హత్య చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇరాన్‌లాంటి దేశాలు అమెరికాకు హెచ్చరికలు చేస్తున్నా వాటిని ఖాతరు చేయనిస్థితి నెలకొంది.
కోపెన్హాగన్ పర్యావరణ సదస్సుపై రాసిన ‘అందరం పరాజితులమే’ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు ఆలోచించదగినవి. చమురుస్థానంలో సరికొత్త ఇందన వనరు కోసం అన్వేషణలు, సౌరశక్తి వినియోగంలో విద్యుత్ ఉత్పత్తి, వాయుశక్తిని భారీగా వినియోగించుకునే యత్నాలపై చర్యల్ని బాగా విశ్లేషించారు. ఒకనాడు బొగ్గు ప్రధాన ఇంధనవనరుగా ఉండేది. వాయుశక్తి ప్రధాన ఇంధన వనరుగా ఉన్నప్పుడు డచ్ దేశం(నెదర్లాండ్స్) ప్రపంచశక్తిగా వెలుగొందింది. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ గ్రంథంలో ప్రస్తావించారు.
‘ఉన్మాదికి ఉపదేశం సాధ్యమా’ వ్యాసంలో ప్రపంచపెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి నిజ ఆర్థిక వ్యవస్థ, రెండు ఫైనాన్స్ లేదా ద్రవ్య ఆర్థికవ్వవస్థ. అమెరికా వ్యవస్థపైచక్కటి విశ్లేషణ ఇది. 1980 దశకం యావత్తు క్రెడిట్ కార్డుల వంటి ద్వారానూ, 1990వ దశకంలో డాట్‌కామ్ (షేర్ మార్కెట్) బుడగ ద్వారానూ ద్రవ్య పెట్టుబడులు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలు కొనుగోలు శక్తిని కాపాడాయి. అయితే, 2008లో ద్రవ్యఫైనాన్స్ పార్శ్వం కూడా కుదేలయ్యింది.
విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ రుణాలు ఇచ్చిన పలు పెట్టుబడిదారీ దేశాల బ్యాంకులు దివాలా తీయడం వేగంగా మొదలైంది. దీనిలో పెట్టుబడిదారీవ్యవస్థ రెండు ముఖాలు పక్షవాతంబారిన పడినట్లుయ్యింది. నోముచోమస్కీలాంటి వారు అదే చెప్పారు కదా? ఒకదేశం రెండు కరెన్సీలు, యధార్థవాది అమెరికా విరోధి, గ్రీస్ సంక్షోభం- పాఠం, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనే ప్రజల కర్తవ్యం, పెనం నుంచి కుంపట్లోకి, దిగజారుతున్న అసమానతలు, డాలర్ యుగం పతనంతో పొంచి ఉన్న అణుయుద్ధభూతం, సంక్షోభాల సుడిగుండంలో యూరప్!, రిపబ్లికన్లు- డెమోక్రట్లు, పార్టీలు వేరైనా పాలన ప్రతిపక్షాలుగా ఉన్న ఆలోచనల- విధానాలు ఒక్కటి. 2011 నాటికే 14.3 లక్షల కోట్ల డాలర్ల రుణం ఉంది లాంటి విషయాలు చెప్పిన వ్యాసం కోలుకోలేని ఊబిలో అమెరికా. కొడిగడుతున్న డాలర్ దీపం వ్యాసంలో సుమారు 71 దేశాలు డాలర్ కరెన్సీని, దాని రూపంలో అమెరికా చేసిన అప్పును వదిలించేసుకుంటున్నాయని (2022లో రాసిన వ్యాసం ఇది) అంటారు. మొత్తం 84 వ్యాసాల్లో చాలా విలువైన వ్యాసం ‘కాగితం పులి కరవక తప్పదా? భవిష్యత్తే సోషలిజం, సత్యం- శాశ్వతం, మూడక్షరాల లెనిన్ వ్యాసాలు విలువైనవిగా చెప్పవచ్చు. విజయ సాహితీ ప్రచురించిన ఈ పుస్తకం ప్రతి సామాజిక కార్యకర్తకు కరదీపిక. రచయిత, వ్యాసకర్త పాపారావు కృషికి అభినందనలు.
– తంగిరాల చక్రవర్తి (ఎంఏ)
(పుస్తక ప్రతుల కోసం: డీ పాపారావు. కీర్తి అపార్ట్మెంట్స్- ఏ బ్లాక్, ఫ్లాట్ నెం.301, ఎల్లారెడ్డి గూడ- హైదరాబాద్- 500073(టీజీ), ఫోన్ నెం: 9866179615)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.