
నా నవ్వు వాళ్ళకి ముల్లు లా గుచ్చుకుంటుంది.
ఎందుకంటే.,వాళ్ళు నేను నిత్యం దేనికో చింతిస్తూ ..బక్క చిక్కిపోయి వాళ్ళ ముందు దీనాతి దీనంగా…చేతులు చాపి యాచిస్తూ విషాదం లోనే ఉంటూ., “నీ బాంచెన్” అంటూ దేబరించాలని కోరుకుంటారు.
**
నా నవ్వు చూసినప్పుడల్లా వాళ్ళకి గుచ్చుకుంటుంది….
అసలు ఇతనిలా నవ్వుతూ
ఇంత సంతోషంగా ఎలా ఉండగలడు?
ఇతను ఎందుకు బాధ పడడు?
నా ముందెందుకని గోజారడు?
అసలు ఇంత స్వేచ్ఛగా ఎలా ఉన్నాడు?
ఇన్ని ప్రశ్నలు వాళ్ళకి!
**
నా నవ్వు చూడండీ వాళ్ళనెలా గుచ్చుతుందో ?
వాళ్ళ నిద్రనెలా దూరం చేస్తుందో?
నేను నవ్వితే వాళ్ళు నోట్లో పెట్టుకొనే అన్నం ముద్ద రుచి పోతుంది !
మహా ఆందోళన పడి పోతారు.
నేను ఇంత నిర్భయుడిగా ఎలా మారిపోయానని దీర్ఘాలోచనలో పడిపోతారు వాళ్ళు !
పాపం వాళ్ళకి నా నవ్వు ఎంత కష్టం తెచ్చి పెట్టింది?
*****
నా నవ్వు వాళ్ళని కత్తిలా గుచ్చుతుంది…
ఇంత హాయిగా నవ్వుతున్నాడంటే వీడు సుఖంగా ఉన్నాడని..
దేన్నీ లెక్క చేయడని!
ఇది చాలా తప్పని..జరగరానిది జరిగిపోతుందని..వాళ్ళు కుమిలిపోతారు !
ఇక లాభం లేదు..ఇతన్ని మరింతగా సతాయించాలని,
మళ్ళీ ఇతన్ని తమ ఉచ్చులో ఇరికించాలి తప్పదు అనుకుంటారు కంగారు పడుతూ !
***
నా నవ్వు వాళ్ళకి గుచ్చుతుంది!
నా నవ్వు వాళ్ళకి కడుపులో నొప్పిని కలిగిస్తుంది.
వీళ్ళు మా ముందు చేతులు జోడించాలి..మా కాళ్ళు పట్టుకోవాలి…ఇలా ప్రశాంతంగా నవ్వకూడదు అంతే అనుకుంటూ రగిలి పోతారు.
వాళ్ళకి మనశ్శాంతి ఎక్కడ?
ఇక వాళ్ల పనులు మొదలై పోతాయి. చక చకా జరగాల్సిన సంఘటనలు జరిగిపోతాయి.
అశాంతితో రగిలి పోతారు
స్వేచ్ఛగా మేము నవ్వుతూ..ఆత్మవిశ్వాసంతో ఉండడాన్ని చూస్తూ…
ఇక వాళ్ళ మెదళ్ళు మాత్రమే కాదు.. వాళ్ల ఇళ్ళు కూడా చెద పట్టటం మొదలవుతాయి !
పాపం ..మా నవ్వు వాళ్ళకి ఎన్ని కష్టాల్ని తెచ్చింది చూశారా..?
మరాఠీ- శరన్ కుమార్ లింబాలే
హిందీ – రీనా త్యాగి
తెలుగు -గీతాంజలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.