
‘అగ్ని దారుల గుండా నడిచి వచ్చినవాళ్లే అత్యంత ప్రియమైన వాళ్లు’ – హేమింగ్వే
నా దివారాత్రులని గుంజుకున్నారు
నా చలన శీలతల్ని గుంజుకున్నారు
నా జీవితాన్నే నా నుండి గుంజేసుకున్నారు
నేనొకడిని ఉన్నానని
ప్రపంచమే మరిచిపోయింది
యవ్వన ప్రాయాన
ఉజ్వల భవిష్యత్తును చేరాలనుకుంటే
నన్ను జైలుకు చేర్చారు
నా నిర్దోషిత్వ నిరూపణకై
నేను తట్టిన ఒక్కొక్క తలుపూ
నిర్ధాక్షిణ్యంగా మూసుకుపోయింది
యాభై నాలుగు ఏళ్లుగా
ప్రతిరోజు దిగ్గున మేలుకొని
ఈ శీతల పురాతన గోడల్ని చూడడానికి
అలవాటు పడిపోయా..
మెల్లమెల్లగా
నా కాళ్ళ కింద స్వాతంత్రం కరిగిపోతుంటే
దిగ్భ్రాంతితో చూస్తుండిపోయా
స్నేహితుల పలకరింపులు లేవు
కుటుంబ ప్రేమలేవు
నేకన్న కలలన్నీ
ఒక్కొక్కటిగా గుంజేసుకుంటుంటే
వేడి పెనం మీద
ఆవిరైపోతున్న బిందువునయ్యాను
అయినా సరే
వాళ్లునా జీవితాన్నయితే గుంజేసుకున్నారు
కానీ నా సంగీతాన్ని కాదు
నన్ను నేను నిలబెట్టుకోవడానికి
ప్రపంచానికి నా ఉనికిని చాటుకోవడానికి
గాఢాంధకారంలో సైతం
నేను పాటెత్తుకున్నా
ఊసర క్షేత్రంలో
నేను కొత్తగా మొలకెత్తడం నేర్చుకున్నా
ఒంటరి సెల్ నా విశాల వేదిక అయింది
నా గొంతు ఒక వాయిద్యమయింది
పిట్టలు, పూలు, ఖైదీలు నా శ్రోతలయ్యారు
పాట నన్ను నిలబెట్టింది
ప్రపంచం నన్ను గుర్తించింది
ఇప్పుడు
ఈ శరీరంలో
అంగాంగమూ క్షీణించిన వేళ
నా బక్క చిక్కిన వేళ్ళు
గిటార్ మీద తచ్చాడుతుంటే
మీ ముందు నిలిచాను
‘ఇప్పుడు ఏం పాడబోతున్నారు’
అడిగాడొకడు
‘మానవుడజేయుడు
మొక్కవోని ఆశయమే దారి దీపం’
పాటందుకున్నాను
గాలికి ఊగే వరి చేనులా
సభంతా పరవశించింది..
– ఉదయమిత్ర
(పద్దెనిమిది సంవత్సరాల వయసులో చేయని దొంగతనానికి యాభై నాలుగేళ్ళు శిక్ష అనుభవించిన నీగ్రోకవి ‘యేసయ్య మ్యాథ్యూస్’కు అంకితం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.