బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74 శాతం నుండి 100 శాతానికి పెంచాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా ప్రతిపాదించారు. అయితే వందశాతం ఎఫ్‌డీఐ అనుమతి కోరే కంపనీలు తాము వసూలు చేయబోయే ఇన్సూరెన్స్ ప్రీమియంలను భారత దేశంలోనే పెట్టుబడులుగా పెట్టవలసి ఉంటుందని, ఆ నిబంధనకు లోబడి అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు.
మితవాద జాతీయవాదమే దేశాన్ని ముందుకు నడిపించే ఏకైక మార్గమని నమ్మే వారికి, మరియు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహానికి గేట్లు తెరిచిన చారిత్రక క్రమం గురించి, దశలవారీగా కేంద్రం తీసుకున్న నిర్ణయాల పట్ల అవగాహన అంతగా లేని వారు ఈ షరతుతో (ప్రీమియంలను భారత్ లో పెట్టుబడులుగా వినియోగించాలన్న) సంతృప్తి పడవచ్చు.
కానీ 2015 లోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 26% నుండి 49% కి పెంచినప్పుడే అంతకు ముందు నుండే అమలులో ఉన్న రీపాట్రియేషన్ క్లాజ్ ( విదేశీ కంపెనీలు ఆర్జించిన లాభాలను కనీసం మూడు సంవత్సరాల వరకు దేశ సరిహద్దులు దాటకుండా ఇక్కడే పెట్టుబడులుగా వినియోగించాలనే నిబంధన) ను తొలగించేశారు. ఇపుడు ఈ క్లాజు గురించిన ప్రస్తావన కేవలం కంటి తుడుపు మాత్రమే కాదు. మోసకారి చర్య కూడా.
రిపాట్రియేషన్ క్లాజ్ తొలగించిన తర్వాత యథేచ్ఛగా ఎప్పుడైనా కంపనీలు తామార్జించిన లాభాలు విదేశాలకు తరలించుకు పోయే అవకాశమున్న తర్వాత ప్రీమియంలు మాత్రమే ఈ దేశంలో వినియోగించాలని పెట్టే నిబంధన నామమాత్రమైనదే.
ఇన్సూరెన్స్ రంగం దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ను అమలు పరిచే నమ్మకమైన స్థితిలో ఉండాలి. కాబట్టి అట్టి రంగం ప్రభుత్వ రంగంలోనో లేదా దేశీయ భాగస్వాములతోనో కలిసి ఉంటేనేనో మేలు అన్న అభిప్రాయం ఇన్సూరెన్స్ రంగాన్ని 2000 సంవత్సరంలో ప్రైవేట్ కంపెనీ లకు బార్లా తెరవక ముందు నుండి, ఆ తర్వాత కూడా వ్యక్తమవుతూనే ఉన్నది.
అందుచేతనే ఉన్న ఫళంగా ఎఫ్‌డీఐ లిమిట్ ను 74% నుండి 100% కు పెంచితే విమర్శనాస్త్రాలు పెరుగుతాయని తమను తాము కాస్త విమర్శల నుండి రక్షించుకునే ప్రక్రియలో భాగమే బడ్జెట్లో ఒక చిన్న మెలిక లాంటి వెసులుబాటును పెట్టుకున్నారు.
భారత ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐలు వందశాతం అనుమతించబడిన తరువాత ఇప్పటి వరకు దేశీయ కంపెనీలతో భాగస్వాములుగా ఉంటూ నడిచిన అనేక కంపెనీలు తమకు తాము 100% ఎఫ్‌డీఐని తెచ్చుకొని దేశీయ భాగస్వామ్య కంపెనీలను కాలదన్నడం ఖాయం. అనగా ఇక నుండి భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగంలో అన్నీ విదేశీ కంపెనీలే ఉండే అవకాశాలకు ఇది నాంది.
ఇదివరకే ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ చట్ట సవరణలలో ఒక బీమా కంపెనీని నెలకొల్పడానికి కావాల్సిన కనీస మూల ధనాన్ని కూడా తగ్గించాలనే ప్రతిపాదన ఉన్నది. 100% ఎఫ్‌డీఐలకు అనుమతి దొరికిన తర్వాత విదేశీ కంపెనీలు అత్యంత తక్కువ మూలధనంతో తమ దుకాణాలను ఇక్కడ తెరుచుకోవడానికి మార్గం మరింత సుగమం అయినట్లే!
దీంతో పాటు ఇన్సూరెన్స్ చట్ట సవరణలలో; మల్టిపుల్ ఏజెన్సీ అనగా ఒక ఏజెంట్ అనేక కంపెనీలతో ఏజెన్సీ ని కలిగి ఉండడం; మరియు ఏజెన్సీ పోర్టబిలిటీ అనగా ఓ ఏజెంట్ ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి బదిలీ అయ్యే అవకాశం; పాలసీ పోర్టబిలిటీ అనగా ఒక పాలసీదారుడు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారిపోవడం.. వంటివన్నీ చకచకా జరిగిపోయేందుకు భీమా సుగమ్ అనేపేరున మూలధన ఆవశ్యకత లేకుండానే ఇంటర్నెట్ కెఫెలు లాంటి దుకాణాలు తెరుచుకునే వెసులుబాటును కూడా పొందుపరిచారు.
బీమా చట్ట సవరణలన్నీ రూపుదాల్చి, 100% ఎఫ్‌డీఐ అనుమతి చట్టరూపమైతే అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘ కాలంలో నమ్మకంతో సేవలందించే అవసరమున్న భీమా రంగం పూర్తిగా విదేశీ సంస్థల హస్తగతమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. 1956 కు ముందు భారతదేశంలో విదేశీ స్వదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కలగలిసి చేసిన మోసాలు చరిత్ర సాక్ష్యాలుగా ఉండబట్టి ఆనాటి ప్రధానమంత్రి జవాహరలాల్ నెహ్రూ ఆర్థిక మంత్రి సి డి దేశ్‌ముఖ్ గార్లు పూనుకుని 245 ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ కలిపి జాతీయకరణ చేసి పాలసీదారులకు భద్రత కల్పించడమే కాకుండా సేకరించబడిన చిన్న మొత్తాలన్నింటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ఉపయోగపడ్డారు.
ఈరోజు గుత్త సంస్థలు లాభాపేక్ష కోసం పెరుగుతున్న ఆ కాస్త మధ్యతరగతి వ్యక్తుల ఆదాయాలపై కన్నేసి లాభాలు ఆర్జించడానికి వేసిన పన్నాగంలో ప్రభుత్వాలు ప్రజలను సమిధలుగా మారుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం.
ఆర్థిక ముఖ్య సలహాదారు శ్రీ అనంత నాగేశ్వరన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పబడిన అంశం ఏమంటే ప్రభుత్వ రంగ ఎల్ఐసీ మూలంగానే ఈరోజు దేశంలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ పెరిగింది అని, అనగా ఈ 24 ఏళ్ల ప్రైవేట్ కంపెనీల ప్రయాణ పరంపరలో దేశంలో ఇన్సూరెన్స్ రంగ అభివృద్ధికి అవి ఇచ్చిన తోడ్పాటు ఏమీ లేదు అని ఈ ఆర్థిక సర్వే ద్వారా స్పష్టమైంది. దీని బట్టి అర్థమైంది ఏమంటే గతంలో మాదిరిగానే ఆర్థిక సర్వేలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రధాన రంగాలను వదులుకోవడానికి ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి.
ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిపాదించబడుతున్న సంస్కరణల్ని ప్రజలకు మరింత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడానికి లేదా పొదుపు మొత్తాలను సేకరించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించడానికి అన్ని ఆశయం కన్నా బహుళజాతి కంపనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉండడమే లక్ష్యంగా ఉన్నవి.
ఏ సంస్కరణలైన జరిగిన నష్టాన్ని పూడ్చాలి, అభివృద్ధి పథంలోకి అడుగులు వేయించాలి. కానీ ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిపాదించబడుతున్న సంస్కరణలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్య పరిచి పెట్టుబడులకు పెద్దగా ఆస్కారం లేని సేవారంగంలోకి వచ్చి హామీలను మాత్రమే ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి గుత్త మరియు బహుళజాతి సంస్థలకు అనుమతులు ఇవ్వడానికి మాత్రమే చోటుచేసుకుంటున్నాయి.
నిజానికి ఇన్సూరెన్స్ రంగంపై అత్యధిక మంది భారత పార్లమెంటేరియన్లకు అంతగా అవగాహన లేదు. పౌర సమాజంలోనూ దీనిపైన విస్తృతమైన విషయ సంగ్రహణ ఉండదు. ఇన్సూరెన్స్ ఒక అవసర వస్తువు కాదు. ఇన్షూరెన్స్ లేని లోటు కనపడదు. కానీ సమగ్రమైన పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ప్రజలందరికీ ఉంటే కుటుంబాల ఆర్థిక స్థితిగతుల కొనసాగింపుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఎంతటి సూక్ష్మమైన ప్రధాన అంశం ఆర్థికవేత్తలకు సామాజిక దృక్కోణంలో ఆలోచించేవారికి మాత్రమే అవగతమవుతోంది.
అయితే ఈ ఇన్సూరెన్స్ రంగం సృష్టిస్తున్న సంపద చాలా పెద్దమొత్తంలో ఉంటుంది. 2023- 24 ఆర్ధిక సంవత్సరానికి గాను 8,00,000 కోట్ల రూపాయల పైనే ఇన్సూరెన్స్ వ్యాపారం దేశంలో జరిగింది ఒక్క ఎల్ఐసీ ఆఫ్ ఇండియా 4,75,000 కోట్ల ప్రీమియంను సేకరించగలిగింది. ఇది మరింత విస్తరించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని మౌలిక స్వభావమైన కో ఆపరేటివ్ వెంచర్ ద్వారా ఒకరికి జరిగిన నష్టాన్ని మిగతా వారందరూ భర్తీ చేసే విధానం లాభాపేక్షకు తావులేనిచోట మాత్రమే సక్రమంగా ఉండగలదు.
లాభాపేక్షకు అవకాశం ఉండే ప్రైవేట్ కంపెనీల వ్యాపార చట్రంలోకి ఇది నెట్టివేయబడ్డప్పుడు పలితాలు ప్రజా సంకటంగానే మారుతాయి. అందుచేత ప్రభుత్వ రంగంలోనే ఉండవలసిన ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడమే సరైనది కానప్పుడు దానిని పూర్తిగా విదేశీ సంస్థల హస్తగతం చేయడం మరింత ప్రమాదకరం.
జి. తిరుపతయ్య
ఇన్స్యూరెన్స్ రంగ నాయకులు