
ఏది ఎవరి కోసం ?
రాజ్యాంగ పు ప్రాథమిక కర్తవ్యం ఏమిటి ?
తోటి పౌరుల హక్కులు, హామీలకు పూచీపడి వారికి సాధికారత కల్పించే చట్టాలను రూపొందించడం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగడం అవసరం.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిస్టు, సెక్యులర్ భావాల పట్ల అంకిత భావం ఉన్న ఎవరికైనా ‘హిందూ రాష్ట్ర సంవిధాన్ నిర్మాణ్ సమితి’ ముందుకు తీసుకువస్తున్న ప్రతిపాదనలు ఆందోళన కలిగించకమానవు.
25 మంది మేధావులతో కూడిన ఈ సమితి 501 పేజీలతో కూడిన ‘హిందూ రాజ్యాంగాన్ని’ రూపొందించింది అని వార్తలు వెలువడ్డాయి. రామాయణం, కృష్ణుని బోధనలు, మనుస్మృతి నియమాలు, చాణిక్యుని అర్ధశాస్త్రాల ప్రేరణతో ‘హిందూ రాజ్యాంగం’ రూపొందించారని కూడా ఆ వార్తలు వివరించాయి. దీనికి సంబంధించిన సవివరమైన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయానికి చెందిన సనాతన ధర్మ పరాయణులైన మేధావులు ఈ చిత్తుప్రతిని రూపొందించారు.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య తరచూ రాజ్యాంగం మీద వాదవివాదాలు నడుస్తున్నాయి. అయితే, ఈ చర్చ ఏ అంశాలకు వ్యతిరేకంగా నడుస్తుంది?
భారత రాజ్యాంగం ప్రజల జీవితాలను, జీవనోపాధులను పరిరక్షించి మరింత మెరుగు పరచడానికి ఎలా తోడ్పడుతుంది. అనే అంశం మీద చర్చ జరగడం ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సౌర్వభౌమాధికారులు కాబట్టి చర్చ ప్రజల ప్రయోజనాల కేంద్రంగా జరగాలి.
కార్మికుల నిరసనలు..
దేశంలోని మెజారిటీ ప్రజానీకం ఉపాధి సౌకర్యాలు కల్పించలేని భవిష్యత్తుపట్ల, వయసు మళ్లిన తల్లిదండ్రులను సాకడం, బిడ్డలకు మెరుగైన విద్యాబుద్ధులు నేర్పించడం ఎలాని ఆందోళన పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు వేగంగా విస్తరిస్తూ ప్రస్తుత ఉద్యోగాలకు ఎసరు తెస్తూ, జనానికి చేతి నిండా పని కల్పించలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి.
పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఉన్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్టోర్ ఎదుట కంపెనీ అనుసరిస్తున్న జీతాల చెల్లింపు విధానానికి వ్యతిరేకంగా కొద్దిమంది కార్మికులు నిరసన తెలిపారు. వీరంతా ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(ఏఐసీసీటీయూ)కు అనుబంధంగా ఉన్న ‘యాప్ కర్మచారీ ఏక్తా యూనియన్’ సభ్యులు.
‘గిగ్’ కార్మికుల పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని ఈ సంఘం అధ్యక్షురాలు అపూర్వ శర్మ తెలిపారు. సరుకులు బట్వాడా చేసే క్రమంలో సగటున వారానికి ఒక కార్మికుడు మరణిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలిందని ఆమె చెప్పుకొచ్చారు. బట్వాడా కార్మికుల మీద ఎంత ఒత్తిడితో కూడిన ఆందోళన పడుతుందో మీరు ఊహించలేరు అని చెప్పారు.
2022లో నీతి ఆయోగ్ వెలువరించిన నివేదికలో 2021 నాటికి దేశంలో 77 లక్షల మంది ‘గిగ్’ కార్మికులు పని చేస్తున్నట్లు పేర్కొంది.
భారతదేశంలో విస్తరిస్తున్న గిగ్, ఫ్లాట్ ఫామ్ ఆర్థిక వ్యవస్థ పేరిట వెలువరించిన నివేదికలో 2030 నాటికి ఈ సంఖ్య 2 కోట్ల 35 లక్షలకు పెరగవచ్చని అంచనా వేసింది. ‘అవుట్‌లుక్ బిజినెస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రభుత్వ అధికారిక అంచనా ప్రకారం ఇప్పటికే గిగ్ కార్మికుల సంఖ్య 2 కోట్ల వరకు ఉండవచ్చని తెలిపారు.
హిందూత్వ శక్తులు తాము హిందువుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని రేయింబగళ్లు ప్రచారం చేస్తున్నాయి కదా! మరి దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట భారత కార్మిక వర్గంలో కూడా మెజారిటీ హిందువులే కదా. వారి హక్కుల కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ఆందోళన ఈ హిందూత్వ శక్తులకు పట్టదా?
ఈ ఏడాది జనవరి 5న మారుతీ సుజుకీ కంపెనీలో పనిచేసే తాత్కాలిక కార్మికులు సంఘం పెట్టుకుని తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం కోసం గురుగాం లేబర్ కోర్టులో వేసిన కేసు జనవరి 31న వాయిదా ఉంది. దీంతో ఆ ముందు రోజు అంటే జనవరి 30వ తేదీన కంపెనీ ఎదుట నిరసన నిర్వహించతల పెట్టారు.
వీళ్లంతా 18 నుండి 26 ఏళ్ల వయసులో ఉన్న యువకులు. పేరుకే టెంపరరీ ఉద్యోగులుగానీ పని మాత్రం పర్మినెంట్ కార్మికులు చేసే అన్ని పనులూ, అంత పనీ చెయ్యాలి. కానీ జీతాలు మాత్రం పర్మినెంటు కార్మికులకు చెల్లించే జీతాల కన్నా చాలా తక్కువ.
జనవరి 30న మారుతీ సుజుకి యాజమాన్యం హిందూత్వ అనుకూలురు నిర్వహించే ‘జైపూర్ లిటరరీ ఫెస్టివల్’ను ప్రయోజితం చేయడంలో బిజీబిజీగా ఉంటే, కంపెనీ ఎదుట నిరసనకు దిగిన కార్మికులను పోలీసులు చుట్టుముట్టి జెండా కర్రలు, ప్లకార్డులు లాగేసుకుని, ధర్నా శిబిరాన్ని, రెండు మోటరు సైకిళ్లను స్వాధీనం చేసుకొని కార్మికులను గొడ్లను అదిలించినట్లు అదిలిస్తే బస్సుల్లో కుక్కి అక్కడ నుండి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఒక జపాన్ బహుళ జాతి కంపెనీ ఒక వంకర సాహిత్య ఉత్సవాలను స్పాన్సర్ చేస్తూ, మరో పక్కన ఈ దేశ పౌరులయిన కార్మికుల పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడాన్ని హిందూత్వవాదులు ఎలా సమర్ధిస్తారు? ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటంటే మారుతి సుజుకి కంపెనీలో పనిచేసే ‘ఫిక్డ్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్’ పేరిట కాంట్రాక్టు కార్మికులకు కూడా నిర్దిష్ట వేతనాలను నిర్ణయిస్తూ జపాన్‌లో 2024లో ఒక చట్టం తీసుకు వచ్చారు. కానీ మన దేశంలో ఇలాంటి చట్టం వర్తింప చెయడానికి నిరాకరించడమే కాదు కార్మికులను ఇష్టారాజ్యంగా పనిలో నుండి తీసివేసే హక్కును కూడా ఎడాపెడా వాడుతున్నది.
మన దేశంలోని మారుతి సుజుకి కంపెనీలో అత్యున్నత స్థాయి మేనేజరుకు సాలీనా 5 కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ అందులో పనిచేసే టెంపరరీ కార్మికులకు నెలకు 30,000 రూపాయల వేతనంతో సరిపెడుతున్నారు.
ప్రాథమిక హక్కులు..
మన దేశ ప్రస్థుత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయం పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు గ్యారంటీ చేస్తుంది. (దేశ సరిహద్దులోపల జీవించే పౌరయేతరులకు కూడా కొన్ని హుక్కులు కల్పించింది.)
కానీ, ఈ రాజ్యాంగం హిందువులకి వ్యతిరేకమైంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని వాదిస్తున్నారు. మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని అత్యధికులు హిందూ మతానికి చెందిన వారే అన్న వాస్తవాన్ని ఈ నయా హిందూత్వ శక్తులు మరిచిపోయినట్లున్నారు. దేశ విభజన సందర్భంగా చోటు చేసుకున్న అమానవీయ ఘర్షణలు, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకొని మన దేశానికి లౌకిక రాజ్యాంగమే సముచితమైందన్న నిశ్చితాభిప్రాయంతో ఈ నిర్ణయం చేశారు.
వలస పరిపాలకులు తృతీయప్రపంచ దేశాలు అన్నింటా ఇలాంటి విభజన చిచ్చే రగిలించారు. కాబట్టి మనం రూపొందించుకున్న లౌకిక రాజ్యాంగం ఆయా తృతీయ ప్రపంచ దేశాలకు దారిదీపంగా భాసించాలని రాజ్యాంగ నిర్మాతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇంతకీ హిందూ రాజ్యాంగంలో ప్రజలకు ఏ స్వేచ్ఛ, ఏ హక్కులు గ్యారంటీ చేశారు?
ఆధునిక భారత న్యాయ విద్యకు పితామహుడు అనదగ్గ ప్రొఫెసర్ ఎన్ఆర్ మాధవ మీనన్(1935- 2019)తో నేను ఒకసారి ఈ అంశాల మీదనే చర్చించడానికి వెళ్లాను. 1990లో బెంగళూరులో స్థాపించిన ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’ కోసం మానవహక్కుల మీద ఒక కోర్సు రూపొందించమని నన్ను కోరారు.
నేను రూపొందించాల్సిన మానవహక్కుల కోర్సు భారతీయ నేపథ్యంతో కూడుకుని ఉండాలి. పశ్చిమ దేశాల తాత్విక భూమిక మనకు అవసరం లేదని కూడా మీనన్ నాకు సూచించారు. ‘సామ్రాజ్యవాదం మానవ హక్కులని బలమైన ఆయుధంగా వాడుకుంటుందనే’ స్పష్టత నాకు ఉంది. వలసవాదాన్ని, బానిసత్వాన్ని, వర్ణ వివక్షని ఆమోద యోగ్యంగా మలుచుకోవడానికి వలస పాలకులు బైబిల్‌ను ఎలా ఆయుధంగా వాడుకున్నారో, అమెరికా దాని మిత్రదేశాలు తృతీయ ప్రపంచ దేశాల సౌర్వభౌమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి, యుద్ధాలకు తెగబడడానికి మానవ హక్కులను అలా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు.
ఏది ఏమైనా మీనన్ నన్ను ‘హిందూ మానవ హక్కుల సంవిధానాన్ని’ రూపొందించమని కోరారని అర్ధమైంది. 1981లో ఐరోపా ఇస్లామిక్ కౌన్సిల్ మానవ హక్కులపై విశ్వజనీన ఇస్లామిక్ డిక్లరేషన్‌ను ఆమోదించింది. అలాగే 1990లో ఇస్లాంలో మానవ హక్కులపై ‘కైరో డిక్లరరేషన్’ కూడా ఉండనే ఉంది.
కాబట్టి హిందువుల హక్కుల కోసం హిందూ డిక్లరేషన్ ఎందుకు ఉండకూడదు? ఈ ప్రశ్న నన్ను చాలా సతాయించింది. చివరికి నేను అర్ధం చేసుకుందేంటంటే మీనన్ కూడా చాలా మంది మాదిరే ‘హిందూ’ పదాన్ని ‘ఇండియా’కు సమానార్ధకంగా భావిస్తున్నారని కానీ వాస్తవంలో ఈ రెండు ఒకటి కాదు.
మహాభారత గుణపాఠాలు..
హిందూమతం అనేది ఏకశిలా సదృశ తాత్విక సిద్ధాంతం కాదు. మహాభారతాన్నే ఉదాహరణగా తీసుకుందాం. భారతంలో అనేక హక్కులు, విధుల గురించి ప్రస్థావన ఉంది. ఇవాళ్టి సమాజ విలువలతో వాటికి భాష్యం ఎలా చెబుతారు. బహుభర్తత్వాన్ని సమర్ధిస్తారా? నా దృష్టిలో సహజన్యాయ సూత్రాలకు కట్టుబడి ఉన్నది విదురుడు ఒక్కడే. నిండు సభలో పాండవుల భార్యని అవమానించడాన్ని వ్యతిరేకించింది విదురుడు ఒక్కడే. కాబట్టి మానవహక్కుల కోసం బలంగా నిలబడ్డది విదురుడు మాత్రమే అని నేను భావిస్తాను. భార్యలు, భర్తల గుత్త సొత్తు అని ఎలా భావిస్తారు అని విదురుడు నిలదీశాడు. కాబట్టి హిందూత్వశక్తులు మహిళా హక్కుల విషయంలో విదురనీతిని ఆదర్శంగా తీసుకుంటారా లేక మహిళలను వంటింటి కుందేలుగా, కుటుంబానికి సేవకిగా భర్తమాట జవదాటని ఆదర్శ స్త్రీగా ఉండాలని చెప్పే మనుస్మృతిని ఆదర్శంగా తీసుకుంటారా? వారికి మనువే ఆదర్శమని వేరుగా చెప్పనక్కరలేదు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను మానవ హక్కుల దృక్పథంతో మహాభారతాన్ని బోధించడానికి అవకాశం కల్పించమని మీనన్‌ను అడిగాను. మహాభారతంలోని పాత్రలు అనేకం ఆధునిక న్యాయసూత్రాల దృష్ట్యా చూస్తే డోలాయమాన పరిస్థితులను ఎదుర్కోవడం, పరస్పర విరుద్ధ హక్కుల ఘర్షణకులోనుకావడం మనం చూడవచ్చు. అయితే ఇలాంటి ప్రతి సందర్భంలో అంతిమ న్యాయం అధికారంలో ఉన్న వారికి బలవంతులకు, అగ్రవర్ణాల వారికేదక్కడం కూడా మనం గమనించవచ్చు.
హిందువులు పవిత్ర మతగ్రంథంగా భావించే భగవద్గీత అర్థరహిత యుద్ధాలను వ్యతిరేకించేందుకు ఉపకరిస్తుంది. మహాభారత యుద్ధంలో విజేతలు ఎవరూలేరు. అందరూ పరాజితులే.
మహిళలు, దళితులు, ఆదివాసీల హక్కుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను మహాభారత కథలకు భాష్యం చెబుతూ వివరించేదాన్ని. ఇదేమీ నా స్వంత ఆలోచనకాదు. గతంలో చాలామంది ఇదే మార్గాన్ని అనుసరించారు. అయితే, మానవ హక్కులను న్యాయపరంగా భారత కథలను ఆధారం చేసుకుని విశ్లేషిస్తూ ప్రచారంలోకి తీసుకురావడం మాత్రం నాతోనే మొదలయ్యింది. ఇరావతి కర్వే రాసిన యుగాంతం పుస్తకం ఇందుకు మేలిమి ఉదాహరణ. దానాదీనా చివరికి మానవ హక్కులను తృతీయ ప్రపంచ దేశాల దృక్పథంతో బోధించమని మీనన్ అడిగారు.
కాబట్టి మనం హిందూ రాజ్యాంగం మీద చర్చ చెయ్యడం కంటే మన తోటి లక్షలాది మంది పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రస్తుత రాజ్యాంగం ఎలా ఉపకరిస్తుందో జాతీయ స్థాయిలో చర్చ నడపడం ఉపయుక్తంగా ఉంటుంది. దేశ ప్రజలను పేదరికం నుండి దోపిడి నుండి పవిత్రమతగ్రతంథాలు రక్షించలేవు. భారత రాజ్యాంగంలోని హక్కులు, హామీలు దేశప్రజానికానికి దక్కేలా చూడడం ద్వారా ప్రజలకు సాధికారత కలిగించేలా ప్రయత్నించడం ద్వారా మాత్రమే వారిని రక్షించగలం.
– నందిత హస్కర్
అనువాదం: కే సత్యరంజన్
‘జపాన్ యాజమాన్యం, భారతీయ ప్రతిఘటన మారుతి సుజుకి కార్మికుల పోరాటం’ (స్పీకింగ్ టైగర్ ప్రచురణ 2023) పుస్తకం సహరచయిత నందిత హక్సర్
వ్యాసం స్క్రోల్ నుండి స్వీకరించబడినది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.