
ఈనెల 27వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని మూడు శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టబధ్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
మిగిలిన సాధారణ ఎన్నికల వలె గాక ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. శాసనమండలిని పెద్దల సభ అని కూడా పిలుస్తారు. రాజ్యాంగం లోని నిబంధన ప్రకారం ఆయా రాష్ట్రాల శాసనసభల ఆమోదం పొందితే ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి అనుమతితో శాసనమండలిని ఏర్పాటు చేయవచ్చు. ఆ రకంగా మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటయింది. దీనిని 1985లో నాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది. మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2007లో శాసన మండలిని పునరుద్ధరించింది. అప్పటి నుండి నేటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా శాసన మండలి కొనసాగుతోంది.
పెద్దల సభ ఏర్పాటు పై రాజ్యాంగ పరిషత్ లో పెద్ద చర్చే జరిగింది. ఇది అవసరమా, అనవసరమా అనే రెండు కోణాల నుంచి పరిశీలన జరిపిన పిదప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచన మేరకు దీని ఏర్పాటుకు రాజ్యాంగంలో అవకాశం కల్పించబడింది.
శాసనమండలిలో పట్టభధ్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం మండల సభ్యులతో పాటు, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడిన సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులచే ఎన్నుకోబడిన సభ్యులు, గవర్నర్ నామినేట్ చేసి సభ్యులు వంటి వారు కూడా ఉంటారు.
అయితే పట్టబధ్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ మండల సభ్యత్వం పార్టీ గుర్తులపై కాక స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా శాసన మండలిలో వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించడానికి అర్ధం, పరమార్థం ఉన్నాయి. మన రాష్ట్రంలో మొత్తం శాసనమండలి 58 స్థానాలలో ఐదు స్థానాలు పట్టభధ్రుల నియోజకవర్గాలకు, మరో ఐదు స్థానాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కేటాయించబడ్డాయి.
పెద్దల సభకు ఎన్నికయ్యే ఈ పది మంది సభ్యులు పైన ఒక గురుతరమైన బాధ్యత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అదేమిటంటే ఎంత మంచి ప్రభుత్వమైనా నిర్ణయాలను చేస్తున్నప్పుడు తన రాజకీయ ప్రయోజనాలను కూడా చూసుకుంటూ ఉంటుంది. అందువల్ల సహజంగానే తప్పుడు నిర్ణయాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో పెద్దల సభ జోక్యం చేసుకొని అటువంటి నిర్ణయాలను మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు సహజంగానే ఈ పని చేయలేరు. అందువల్ల ఈ పెద్దల సభకు ఎన్నికయ్యేవారు రాజకీయరహితంగా, ప్రజల పక్షాన నికరంగా నిలబడి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించి, సరిచేయగలిగే స్థాయి కలిగి ఉండాలి. అటు వంటి తెగువ, నిస్వార్ధత, దార్శనికత ప్రదర్శించేవారు ఈ సభకు ఎన్నికైతే అది పెద్దల సభకు గౌరవం దక్కించినట్లు లెక్క.
అయితే ఇటువంటి సభను కూడా పునరావాస కేంద్రంగా మార్చేసిన పాలకులు, పెద్దల సభను కూడా అపహాస్యం పాలు చేస్తూ రాజకీయ సభలుగా మార్చేస్తున్నారు. డబ్బలకు సీట్లు కొనుక్కున్న సందర్భాలు కూడా. ఉన్నాయంటే , ఎంతగా ఈ సభా విలువను దిగజారుస్తున్నారో తెలుస్తోంది. ఇతరత్రా పదవులుపొందని వారిని సంతృప్తి పరచడానకీ పెద్దల సభే వేదిక అవుతోంది. కాంట్రాక్టర్లను, బడా వ్యాపారస్తులను, పోటీలకు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎలాగైనా గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు తప్ప ఈ పెద్దల సభకు తగ్గ హుందాతనం ప్రదర్శించడం లేదు. సరికదా, ఇలా ఎన్నికైన వారు ఈ పదవిని, హోదాను తమ స్వప్రయోజనాల కోసం, వ్యాపార విస్తరణల కోసం, కాంట్రాక్టులు పొందడం కోసం వినియోగించుకుంటూ, సభా గౌరవాన్ని మంట గలుపుతున్నారు తప్ప, సభలో ప్రజా సమస్యలపై చర్చించిన సందర్భాలే లేవు.
నేడు కృష్ణ, గుంటూరు జిల్లాలకు జరుగుతున్న ఎన్నికలలో కోటేశ్వరుడైన బడా పారిశ్రామికవేత్త అధికార కూటమి అభ్యర్ధి గానూ, ప్రముఖ విద్యావేత్త, మేధావి అయిన కె ఎస్ లక్ష్మణ రావు గారు మరొకవైపు తలపడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ, బీజేపీ మద్దతుతో ఒక మాజీ ఎమ్మెల్సీ పోటీ చేస్తుండగా, వారిద్దరితో ఒక ఉపాధ్యాయ ఉద్యమ నేత శ్రీమతి కోరెడ్ల విజయ గౌరి గారు తలపడుతున్నారు. గోదావరి జిల్లాల పట్టభధ్రుల స్థానానికి ప్రజా ఉద్యమ నాయకులు డివి రాఘవులు గారు పోటీ చేస్తుండగా, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి వ్యాపారవేత్త, కోటీశ్వరుడు పోటీకి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థులలో ఎవరిని గెలిపించుకుంటే పెద్దల సభకు గౌరవం దక్కుతుంది, ప్రజా సమస్యలు ఈ పెద్దల చట్ట సభలో చర్చకు వస్తాయి, ఎవరు ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై గళమెత్తుతారన్నది పట్టభధ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞతతో ఆలోచించి, ఓటు వేయవలసిన రాజ్యాంగబద్ద భాధ్యత ఉంది. దానికి భిన్నంగా ఇక్కడ కూడా కులం, డబ్బు, గిఫ్టులు వంటి ప్రలోభాలకు గురి చేయాలని శత విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి లోనయితే విద్యావంతుల కోవలోనికి వస్తామా అన్నది ఒకసారి ఎవరికివారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
నేడు రాష్ట్రంలో రాజకీయాలు కలుషితమైపోయాయి. ప్రతిపక్షం శాసన సభకు వెళ్ళడం మానేసింది. ఇక సభలో అంతా అధికార పక్షమే. ప్రజా సమస్యలు చర్చకే రావు. నేడు ఈ మూడు స్థానాలలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా ప్రభుత్వ మనుగడకు వచ్చే ఢోకా ఏమీ లేదు. కానీ, ఈ మూడు స్థానాలలో సామాన్యుల పక్షాన నికరంగా నిలిచే అభ్యర్ధులు గానీ గెలవకపోతే, ఇక పట్టభధ్రుల, ఉపాధ్యాయుల, ప్రజల వాణి చట్ట సభల్లో వినపడనే వినపడదు.
2007లో శాసన మండలిని రాష్ట్రంలో పునరుద్ధరించిన తరువాత స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి, గెలిచిన ఎమ్మెల్సీలు కలసి, పెద్దల సభలో రాజ్యాంగ బాధ్యత కనుగుణంగా వ్యవహరించేలా ప్రోగ్రసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్,(పిడిఎఫ్) అనే వేదికను ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు గెలిచిన 14 మంది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఒకే నిబద్దతతో చట్ట సభ లోన, బయట ప్రజా పక్షం వహించారు. వహిస్తున్నారు. చట్ట సభల్లో అసలైన ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నది పిడిఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మాత్రమే. సమాజాభివృద్ధికి సహకరించేలా విద్యా వ్యవస్థ బలోపేతం, ఉపాధి కల్పన వంటి ప్రధాన లక్ష్యాలతో వీరు కృషి చేస్తున్నారు. నేడు ఈ మూడు స్థానాలలోనూ పిడిఎఫ్ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.
పాఠశాలలను కుదించేలా చేసిన 117 జిఒ రద్దుకోసం కృషి చేసింది పిడిఎఫ్ ఎమ్మెల్సీలే. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి, దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై నిర్భందాన్ని ఖండించి, వారికి అండగా నిలిచింది పిడిఎఫ్ ఎమ్మెల్సీలే. ఉద్యోగుల కర్రువు భత్యం, ఖాళీ పోస్టులు నింపకపోవడం, పీఆర్సీ ఛైర్మన్ నియామకం వంటి అనేక అంశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షం వహించి, ప్రభుత్వ తీరు ఎండగట్టింది పిడిఎఫ్ ఎమ్మెల్సీలే. అక్షరాస్యతలో అధ్వానంగా ఉన్న గిరిజన ప్రాంతంలో వారివారి గిరిజన బాషల్లో చదువు చెప్పే బాషా వాలంటీర్లను తొలగించాలని గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. గిరిజన ప్రాంతంలో జీఓ నెంబరు 3 కు చట్టబద్ధత కల్పించకుండా గిరిజనులకు హాని చేసింది. వీటితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలపై అత్యాచారాలు వంటి అనేక సమస్యలపై చట్ట సభలో చర్చకు పెట్టి, వాటిపై పట్టుబట్టిన చరిత్ర పిడిఎఫ్ ఎమ్మెల్సీలకే ఉంది.
ప్రభుత్వ విద్య బలహీనపడడంతో నేడు ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో 50 శాతం మంది, ఉన్నత విద్యలో 80 శాతం విద్యార్ధులు ప్రైవేటు విద్యా సంస్థలలోనే విద్య పొందుతున్నారు. అటువంటి విద్యా సంస్థల సిబ్బంది బాధ్యత తనకేమీ లేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చిన్న యాజమాన్యాలను ఇబ్బంది పెడుతోంది.
కేంద్ర ప్రభుత్వంజాతీయ విద్యా విధానం 2020 పేరున విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపారమయం, కార్పొరేటీకరణ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థ చిన్నాభిన్న మయిపోయింది. గత ప్రభుత్వం జిఒ నెం 117 ద్వారా రేషనలైజేషన్ పేరున పాఠశాలల మూసివేతలు, విలీనాలు చేపట్టింది. ఇప్పటికే మిగిలిన అనేక చిన్న చిన్న దేశాలతో పోల్చినా మన దేశంలో ఘోరంగా అక్షరాస్యత 77 శాతం మాత్రమే. అందులోనూ 66 శాతంతో అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం 32వ స్థానంతో అడుగున ఉంది. అలాంటి సమయంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే ప్రభుత్వ విద్య బలోపేతం కావలసిన అవసరం ఉండగా, విచిత్రంగా మన పాలకులు దానిని మరింత బలహీనపరిచే విధానాలు అవలంభిస్తున్నారు. విద్యాహక్కు చట్టాన్ని కాగితాలకే పరిమితం చేసారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. జిఒ117 ను నామమాత్రంగా రద్దు చేసి, అందులోని అంశాలను మాత్రం యధాతధంగా అమలు చేస్తూనే ఉన్నారు. అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డీఎస్సీ నిర్వహణ అనే హామీ నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. శాశ్వత నియామకాలు చేపట్టకుండా, ఉపాధ్యాయ, అధ్యాపకులను కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫాకల్టీ వంటి వివిధ పేర్లతో నియమిస్తూ, ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, తక్కువ వేతనాలతో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఆ వృత్తికే ప్రభుత్వం కళంకం తెస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినా, పోటీపడి ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్నస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది.
మన దేశంలో పౌరులందరికి ఒకే ఓటు ఉంది. అయితే పట్టభద్రులకు మాత్రం దానితో పాటు మరో ఓటు, అంటే రెండు ఓట్లు వేసే అధికారం ఉంది. ఉపాధ్యాయులకు ఆ రెంటితో పాటు, ఉపాధ్యాయ ఓటు ద్వారా మూడో ఓటు కూడా వేసే హక్కు రాజ్యాంగం కల్పించి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఆ రాజ్యాంగబద్ద నమ్మకానికి తగ్గట్లుగా విద్యావంతులయిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎటువంటి ప్రలోభాలకు లోనూ కాకుండా, పెద్దల సభకు అసలైన పెద్దలనే పంపే చైతన్యం ప్రదర్శిస్తారని ఆశిద్దాం.
— ఎ. అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.