ఓ పక్క అమెరికా చైనాలు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతున్నాయి. మరో పక్క మరికొన్ని అంతర్జాతీయ గుత్త పెట్టుబడి కంపెనీలు చంద్రునిపై నివాసాలు ఏర్పాటు చేయొచ్చా లేదా అని ప్రయోగాలు చేస్తున్నాయి. ఇంకోపక్క గురు గ్రహంపై కాలు పెట్టడానికి మానవ మేధ తహతహలాడుతోంది. ఇవన్నీ చాలవన్నట్టు మానవ మేధ నుండి పుట్టుకొచ్చిన కృత్రిమ మేధ, యాంత్రిక అభ్యాసం (మెషిన్ లెర్నింగ్), విడివిడిగానూ, ఉమ్మడిగానూ మనిషికి ఉండే సహజమైన ఆలోచన, రూపకల్పన, పరిష్కార సామర్థ్యానికి సవాలు విసురుతున్నాయి.
ప్రపంచం ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంగలు పంగలతో పరుగులు తీస్తుంటే విశ్వగురువు కావాలన్న తాపత్రయంతో ఉన్న భారతదేశం ఎటువైపు చూస్తోంది ?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశం ఫిబ్రవరి 2న కుంభమేళా లో జరగబోయే బృహత్ కార్యక్రమం వైపు చూస్తోంది.
హిందూ కేలండర్ ప్రకారం ఫిబ్రవరి 2 వసంత పంచమి. ఎవరో ఒక వేద పండితుడు వసంత పంచమి ప్రాశస్త్యాన్ని ఏదో ఒక అల్లిన కథలో వివరించే ఉంటారు. అటువంటి ప్రశస్తమైన రోజున భారత దేశాన్ని హిందూ రాష్ట్ర గా మార్చటానికి అవసరం ఆయిన నూతన రాజ్యాంగాన్ని ఆవిష్కరించబోతున్నారు.
నిజం. కళ్ళు నులుముకుని మరీ చూడండి. వివిధ రంగాలకు చెందిన 25 మంది మేధావులు చాణక్యుడి అర్థశాస్త్రం మొదలు రామాయణం చెప్పిన నీతి శాస్త్రం, గీతా రహస్యాల వరకు ఔపోసన పట్టి రాజ్యాంగ బద్ధమైన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతాన్ని హిందూరాష్ట్రగా మార్చేందుకు కావల్సిన 501 పేజీల ఉద్గ్రంధాన్ని తయారు చేసారు. ఈ గ్రంథాన్ని విడుదల చేయటానికి కుంభమేళా ను వేదిక గా ఎంచుకోవడం లోనే దేశానికి చెప్పాలనుకున్న సందేశం ఇమిడి ఉంది.
అఖండ హిందూ రాష్ట్ర రాజ్యాంగానికి తుది రూపం ఇచ్చాము. వసంత పంచమి రోజున మహా కుంభమేళా లో విడుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నాము అని హిందూ రాష్ట్ర సంవిధాన నిర్మల కమిటీ ఓ ప్రకటన లో తెలిపింది. ఈ కమిటీ లో బెనారస్ హిందూ విశ్వ విద్యాయలం, వారణాశి లోని సంపూర్ణనంద విశ్వవిద్యాలయం, ఢిల్లీలోనీ కేంద్ర సంస్కృత విశ్విద్యాలయాలకు చెందిన సనాతన ధర్మ పండితులు విద్వాంసులు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీకి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ పాట్రన్ గా ఉన్నారు. భారత దేశాన్ని 2035 నాటికి హిందూ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఆనంద్ స్వరూప్ మహారాజ్ కుంభమేళా వద్ద సోమవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. “ఈ రాజ్యాంగానికి మానవ విలువలే కేంద్రంగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి 14 మంది పండితులు, దక్షిణాది నుండి 11 మంది పండితులు కలిసి ఈ విలువలను క్రోడీకరించారు.
మా రాజ్యాంగం ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇప్పుడు అమల్లో ఉన్నాడానికంటే కఠినమైన దండనలు ఉంటాయి.” అని తెలిపారు ఆనంద్ స్వరూప్. ఈయన వారణాశి కి చెందిన శాంభవి పీఠాధిపతి గా ఉన్నారు.
” ఏడు దశాబ్దాల్లో భారత రాజ్యాంగానికి 3000కు పైగా సవరణలు జరిగాయి. కానీ వేల సంవత్సరాల నుండి ఒక్క మార్పూ లేకుండా మన పవిత్ర గ్రంథాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 127 క్రైస్తవ దేశాలు, 57 ముస్లిం దేశాలు, 15 బౌద్ధ దేశాలు ఉన్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల జనాభా కలిగిన హిందువులకు హిందూదేశం మాత్రం కరువైంది.” అన్నారు.
ఈ కమిటీ అధ్యక్షుడు కామేశ్వర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ హిందూ రాష్ట్ర లో ప్రతి పౌరుడికి సైనిక విద్య అనివార్యం అన్నారు. “దొంగతనానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. పన్నుల విధానం మారుతుంది. వ్యవసాయం పై పన్నులు ఉండవు.”అన్నారు కామేశ్వర్ ఉపాధ్యాయ.
హిందూ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో ఒకే సభ ఉంటుంది. దాన్నే హిందూ ధర్మ పార్లమెంట్ అని పిలుస్తారు. పార్లమెంట్ సభ్యులను ధార్మిక సంసద్ లు అని పిలుస్తారు. 16 ఏళ్లకే ఓటు హక్కు ఇస్తారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హులు.
ఎన్నికైన ప్రతినిధుల్లో నాలుగింట మూడు వంతుల మంది రాష్ట్రాధ్యక్షుడి ని ఎన్నుకుంటారని స్వరూప్ తెలిపారు.
వారణాశి కి చెందిన ఓ సాధువు ది టెలిగ్రాఫ్ పత్రిక తో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు చూస్తే ఇది అర్థం లేని వ్యవహారంగానే కనిపించవచ్చు. కానీ ఇలాంటి విషయాలు ఇలానే మొదలవుతాయి. జనాన్ని ఈ విషయం వైపు చర్చ జరిగేలా మళ్లించడం ఇందులో ఓ భాగం. కాలక్రమంలో ఆ చర్చలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఆచరణ రూపం దాలూస్తాయి అన్నారు.