
ఎవడు కవి ఎవడికి కవి?
నాలుగు ప్రశంసల వలువలు కట్టుకు తిరిగితే
నలుగురి నమ్మికతో లేని కిరీటం ఉందని నమ్మితే
చప్పట్ల మోతలు వీనులకు విందులా తలిస్తే
హంగుల నిచ్చెనెక్కి విను వీధులు విహరిస్తే
జరగని జాతరలో గజారోహన ఊరేగింపే..
ఏ పుటం వెనుక ఎవడి కష్టం చరిత్ర కట్టిందో
ఏ కష్టం వెనుక ఏ స్వేద సాగరం వెలిసిందో
తలాన్ని ఈదే కవితల కాగితపు నౌకలు
ఏ వేసారిన బతుకుల సాంద్రతను కొలవగలవో?
మంట తగిలేది ఎవడికి, సురుకు పుట్టేది ఎవడికి
బరువు మోసేది ఎవడు, కండలు కరిగేవి ఎవడివి
ఇనుము వంచిందెవ్వడు, కత్తి దూసేదెవ్వడు
చిందే నెత్తురు ఎవడిది, మండే గుండె ఎవడిది
ఎండిన గొంతుల, అడుగంటిన డొక్కల
ఆకలి ఆర్తనాదం ఆవహించేది ఎవడిని
క్షణ కాలం నిలవక సాగే సమాజంలో
పరస్పర విరుద్ధమైన నిత్య సంఘర్షణల్లో
కొత్తగా పుట్టే ఆలోచనకు
చలింపజేసే శక్తి లేనప్పుడు
కవిత వల్లించి కాగితాలకు
ఆహరంగా వేయడమే తప్ప
ప్రజా కనువిప్పు కలిగించి
కదిలించడానికి పనికి రాదు
కందూరి శ్రామిక్
ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్