
హైదరాబాద్లోని వివిధ పాఠశాలలో పర్యావరణ అవగాహన సదస్సులు జరిగాయి. ఇందులో భాగంగా, వినాయకచవితి సందర్భంగా మట్టి గణపతి పంపిణీ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షులు సీహెచ్ భద్ర ఆధ్యర్యంలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై పర్యావరణ విశిష్టతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకతను తెలియజేశారు.
ప్రపంచ పర్యావరణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అప్పికొండ అనురాధ అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీచాముండేశ్వరి పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వరి స్వామి పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తమ పీఠం ఆధ్వర్యంలో గత నాలుగు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చాముండేశ్వరి స్వామి అన్నారు. “మట్టి గణపతులను పూజిద్దాం మహాగణపతిని పూజిద్దాం”అనే నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా విద్యార్థిని- విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన తెలియజేశారు.
“పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమంలో మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ఖైరతాబాద్ భారీ గణపతి విగ్రహం దగ్గర 2017వ సంవత్సరంలో “మట్టి గణపతిలే ముద్దు- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు” అన్న భారీ ర్యాలీని ఏర్పాటు చేసి, ఖైరతాబాద్ ఉత్సవ సమితికి విజ్ఞప్తి చేశాము. దీని మూలంగా ఈరోజు మహాగణపతి విగ్రహాన్ని కూడా మట్టితోనే ఏర్పాటు చేస్తున్నారు”అని కార్యక్రమానికి హాజరైన ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ గ్లోబల్ చైర్మన్ రమేష్ నాయుడు అన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నష్టాలు..
కెమికల్స్ వాడి తయారు చేసిన విగ్రహాల వల్ల జరిగే నష్టాన్ని సీహెచ్ భద్ర తెలియజేశారు. “దేశవ్యాప్తంగా జరుగుతున్న గణపతి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు ఆనందంగా పాల్గొంటూ పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల మూలంగా చెరువులు, నదులు, కుంటలు, సరస్సులు సముద్రాలు పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి. దీని వల్ల అందులోని జీవవైవిద్యం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంద”ని ఆయన పేర్కొన్నారు.
తమ సంస్థ భవిష్యత్తు కార్యాచరణను ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి ప్రకటించారు. విద్యాలయాలు- దేవాలయాలు పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా తమ సంస్థ భవిష్యత్తులో భారీ కార్యక్రమాలను, భారీ సదస్సులను నిర్వహించబోతుంది తెలియజేశారు.
“పర్యావరణ పరిరక్షణ కోసం అందరు ఈరోజు ఏకం కావడం, ఐక్యంగా పనిచేయడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేద”ని సంస్థ కోశాధికారి, కేంద్ర ప్రభుత్వ ఆహార పంపిణి సలహా మండలి సభ్యులు రిజ్వాన్ అన్నారు.
సంస్థ పీఆర్ఓ శ్రావణ్ మాట్లాడుతూ, “దేశంలోని 14 రాష్ట్రాలలో పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది విద్యార్థులు చైతన్యంగా ముందుకు సాగుతున్నారు” అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రమోద్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. అన్ని రకాల కాలుష్యం నుంచి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యతను ఆయన తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.