
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని కొంత మంది ప్రముఖులు కొన్ని విశేషమైన సందేశాలు ఇచ్చారు. వివిధ ప్రాంతాలకు, వివిధ రాజకీయ నేపథ్యాలకు చెందిన వీరందరూ ఇచ్చిన సందేశాలు, కొన్ని ఘటనలు చూస్తే వాటన్నిటి మధ్య అంతర్లీనంగా ఉన్న ఒక ప్రధానమైన విషయం, దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులు అవగతమవుతాయి.
శ్రామిక మహిళల శ్రమ దోపిడీ..
భారతదేశ రాష్ట్రపతి, దేశ మొదటి పౌరురాలు ఆ రోజు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ‘మహిళల అభివృద్ధితో వికసితభారత్’ అనే ఒక సదస్సులో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున శ్రామిక రంగంలో అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. పిల్లల్ని కనడం, పెంచడం వంటి పనులకే పరిమితం కాకుండా వాటన్నిటిని అధిగమించి శ్రామికులుగా అత్యధిక మంది మహిళలు వస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇది బయటకు చూస్తే చాలా అభ్యుదయంగాను, మహిళల సాధికారతకు ఉపయోగపడేదిగాను కనపడుతోంది. కానీ నేడు దేశంలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని చూస్తే దీని డొల్లతనం బయట పడుతుంది. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కూడా లేని కోట్లాది మంది మహిళల దుస్థితి నేడు దేశంలో నెలకొంది. నిజంగా మహిళల అభివృద్ది లక్ష్యం అనుకుంటే, గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న దేశంలోని కోటి మందికి పైగా ఉన్న స్కీం వర్కర్ల స్థితిగతులను మార్చాలని రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి సూచించవలసిందే. కానీ ఆ పని చేయకుండా మరింతమంది అటువంటి కార్మికులుగా చేరాలని ఆమె పిలుపునచ్చారు. దీనర్థం ఏమిటంటే కార్పొరేట్లకు సేవ చేయడానికి మరింత మంది శ్రామిక మహిళలు ఎటువంటి కోరికలు కోరకుండా బానిసలుగా పని చేయమని. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం వంటివి దేశంలో ఎక్కువగా ఉండడంతో అనేక కుటుంబాల్లో మహిళలు ఏదో ఒక పని చేసి, ఎంతో కొంత సంపాదిస్తేనే కానీ ఇల్లు గడవని స్థితి నెలకొంది. అందువల్ల ఎవరు కోరినా, కోరకపోయినా లేబర్ మార్కెట్లోకి వీరి ప్రవేశం అనివార్యంగా జరిగేదే.
వ్యవసాయ సంక్షోభం, వివక్షత..
అదే రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొంతమంది మహిళల సోషల్ మీడియా పోస్టులపై స్పందిస్తూ వీరి ద్వారానే వికసిత భారత్ సాకారం అవుతుందని
సెలవిచ్చారు. దానికో ఉదాహరణగా బీహార్ రాష్ట్రానికి చెందిన మధోవ్ పూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ యజమాని దేవి అనే మహిళ ఆ గ్రామంలోని అనేకమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్న అంశాన్ని ఉదహరించారు. ఇక్కడ కూడా గమనించవలసిన విషయమేంటంటే మహిళలకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదు, మీ దారి మీరే ఇలా చూసుకోవాలని పరోక్షంగా సూచించడం. అదే సందర్భంలో వ్యవసాయ రంగంలో నేడు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని బయటపడేలా, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలని రైతుల డిమాండును ఒక పక్క తోసిపుచ్చుతూ, మరోపక్క తానేదో వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించేవాడిలా ఫోజు పెట్టడానికే ఇది సహకరిస్తుంది. వాస్తవంగా మన దేశంలో వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితి, వారి పట్ల ఉన్నంత వివక్షత మరే రంగంలోనూ కానబడదు. నేడు దేశంలో అత్యధిక మంది మహిళలు ఉపాధి పొందుతున్నది వ్యవసాయ రంగంలోనే. అటువంటి వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు అనుకూల విధానాలు అవలంబిస్తూ నేడు మోదీ ప్రభుత్వం రైతులకు తీరని హాని కలగజేస్తోంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే
ఇటువంటి మోసపూరిత నినాదాలను ఇస్తోంది.
పెరుగుతున్న అత్యాచారాలు..
అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవర్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే ఒక విచిత్రమైన ప్రతిపాదన పెడుతూ భారత రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. అదేమిటంటే భారతదేశంలో మహిళలు ఒక హత్య చేయడానికి అనుమతి ఇవ్వాలని, దానికి ఎటువంటి శిక్ష విధించకూడదని ఆమె కోరారు. ఈ రకంగా కోరడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇటీవల మహారాష్ట్రలోని ముంబాయి నగరంలో 12 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఇటువంటి ఘటనలు దేశంలో అనేకం నిత్యం జరుగుతున్నాయి. భారతదేశం మహిళలకు అత్యంత రక్షణ లేని ప్రదేశమని, ఆసియా ఖండంలోనే మహిళలపై అత్యాచారాల్లో భారతదేశం అగ్రభాగాన ఉందని ఇటీవల ప్రపంచ బ్యాంకు జనాభా సమీక్ష సర్వే తెలియజేసిందని ఆమె ఉదహరించారు. అలాగే గృహహింస, మహిళలు మాయమవడం వంటివి కూడా అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వం నారీ శక్తి, బేటి బచావో వంటి ఎన్ని ఆకర్షణీయ నినాదాలు ఇస్తున్నా ఇటువంటి ఘటనలు, మహిళలపై హింస నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీని మార్చాలా, వద్దాని తేల్చుకోవాల్సిన సమయం నిజంగా వికసిత భారత్ కోరుకునే వారందరి ముందు నేడు పెద్ద సవాల్ గా మారింది.
రక్షణ ఏదీ?
అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరిగిన మరో రెండు ఘటనలు దేశంలోని మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దర్పణం పడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో పర్యాటక బృందాన్ని ముగ్గురు వ్యక్తులు
అడ్డుకొని అందులో ఒక పురుషుడిని తుంగభద్ర నది కాలువలోకి తోసి చంపేసి, ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో ఒక మహిళ ఇజ్రాయిల్ దేశానికి చెందింది. గతంలో కూడా దేశ, విదేశీ పర్యాటకులపై ఇటువంటి ఘాతుకాలకు పాల్పడిన సంఘటనలు మనదేశంలో ఉన్నాయి. టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న మన పాలకులు విదేశీ పర్యాటక మహిళలకు కూడా రక్షణ లేని దేశంగా భారతదేశాన్ని మార్చేయడం ప్రపంచ దేశాల ముందు దేశాన్ని తలదించుకునేలా చేస్తుంది.
మరో ఘటన అదే మహిళా దినోత్సవం రోజున జరిగింది. మణిపూర్ లో కుకీ మహిళలపై భద్రతా దళాలు విరుచుకుపడి, దాడులు చేశారు. రెండేళ్ల నుంచి రావణాకాష్టంలా రగులుతున్న మణిపూర్ లో జాతుల ఘర్షణ నివారించవలసింది పోయి, దాన్ని మరింత పెంచేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ దుర్నీతికి ఇది పరాకాష్ట. మహిళలపై పురుష పోలీసులు చేసిన దాడుల్లో ఒక మహిళ మృతి చెందింది. ఇది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.
చిరు వ్యాపారులూ పారిశ్రామిక వేత్తలే..
అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సంవత్సరంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అందులో భాగంగా పది వేల మంది మహిళలు ర్యాపిడోతో అనుసంధానం చేసి ఆటోలు, మోటార్ సైకిల్ నడుపు కోవాలని ఆయన తెలిపారు. అంటే శ్రామిక మహిళలు ఆటో డ్రైవర్లుగా స్థిరపడడం కూడా ఈయన దృష్టిలో పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం గానే లెక్క. మరో నాలుగు వేల మంది మహిళలు పర్యాటక రంగం ద్వారా ఉపాధి పొందాలని సెలవిచ్చారు. అసలు పర్యాటకులకే రక్షణ లేని దేశంలో పర్యాటక రంగంలో పనిచేసే మహిళలకు రక్షణ ఎలా వస్తుందో మనం ఊహించుకోవచ్చు. మరో నాలుగు వేల మంది తృప్తి హోటల్స్ పెట్టుకుని బతకాలని తెలిపారు. అంటే ఆహార బడ్డీలు పెట్టుకోవాలని. మరో రెండు వేల మంది స్మార్ట్ వీధుల్లో వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అంటే రోడ్డు పక్కనే చిన్న చిన్న కూరగాయల కొట్లు లేదా పకోడి బండి వంటివి పెట్టుకుని బతకమని చెబుతూ, వీరందరికీ తామే ఉపాధి కల్పిస్తున్నట్లు, వీరిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేస్తామని తెలిపారు. దీన్నిబట్టే తెలుస్తోంది, ఆయన దృష్టిలో మహిళా పారిశ్రామికవేత్తలు అంటే ఎలాంటి అవగాహన ఉందో!
పిల్లల్ని కనండి..
అదే రోజు మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కూడా చంద్రబాబు సెలవిచ్చారు. ఇదే పిలుపు విచిత్రంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటుగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వంటి వారు కూడా ఇచ్చారు.
దీనికి వారు చెప్పిన కారణం దేశంలో హిందూ మతస్తుల సంఖ్య తగ్గిపోతుందని. అందువల్ల హిందూ ధర్మం కాపాడబడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని వారు పిలుపు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో అన్నా, ఆయన కూడా అదే పిలుపునిచ్చారు. వీరందరూ పైకి చెప్తున్న కారణం ఒకటి. కానీ దీని వెనుక అసలు రహస్యం మాత్రం వేరేగా ఉంది.
కార్పొరేట్ల సిరికే..
అదేంటంటే, మన దేశంలో కుటుంబ నియంత్రణతో యువకుల సంఖ్య తగ్గిపోతోంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు పనిచేసే కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోంది. సహజంగానే కార్మికుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో లేబర్ డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో కార్మికులకు బేరాసారాలాడే శక్తి పెరుగుతుంది. అంటే కార్మికులు తక్కువ పనిగంటలు, హెచ్చు జీతాలు డిమాండు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పారిశ్రామికవేత్తలకు సుతారాము నచ్చదు. అందువల్లే ఎల్అండ్టి చైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ అధినేత శ్రీ నారాయణ మూర్తి లాంటి వారు వారానికి 90 గంటలు పని చేయాలని, సెలవు రోజులు కూడా తీసుకోకుండా కార్మికుల పని చేస్తేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని గొప్ప అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. మరోపక్క కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వీరి కోర్కెలకు అనుగుణంగా కార్మిక చట్టాలను కూడా సవరించి వేసింది. అధిక పని గంటలు నేరంగా కాక చట్టబద్ధం చేసింది. అయితే ఇది కార్మికుల ప్రతిఘటనతో అనుకున్నంత సులువుగా అమలు చేయలేరు. అందువల్ల చౌకగా పనిచేసే కార్మికులు మార్కెట్ లోకి అదనంగా రాకుండా వీరి లాభాలు పెరగవు. ఈ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికుల సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిందే ఈ జనాభాను పెంచమని వీరందరూ ఇచ్చిన పిలుపు.
స్వేచ్ఛలేని మహిళ..
మహిళా దినోత్సవం సందర్భంగానే దీనిని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, వాస్తవంగా పిల్లలను కనాలా, వద్దా, కంటే ఎంత మందిని అనే అంశం పూర్తిగా మహిళలకు సంబంధించింది. వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పిల్లల్ని కనాలనడం వారి స్వేచ్ఛను హరించడమే. పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పిల్లల్ని కనాలని పిలుపునివ్వడం క్షంతవ్యం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతకంటే మహిళలను అవమానించడం మరొకటి ఉండదు.
నినాదాలలోనే సాధికారత..
కుటుంబంలోనూ, పని ప్రదేశంలోనూ రక్షణ, ఆర్థిక స్వావలంబన, లింగ వివక్షత లేని సామాజిక సమానత్వం, నిర్ణయాలలో భాగస్వామ్యం, అవకాశాలను ఎంచుకేనే స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం వంటివి సాధికారతకు కొన్ని కొలమానాలు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు ప్రకారం ఆర్థిక,
అక్షరాస్యత లింగ అసమానతలో 146 దేశాలకు గాను మన దేశం 129వ స్థానంలో నిలిచింది. ఈ పదేళ్ళ కాలంలో ఇది మరింత క్షీణించిందని అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. ఇంత అధమంగా ఉన్న దేశంలో సాధికారత ఊకదంపుడు ఉపన్యాసాలలో తప్ప ఆచరణలో కనపడదన్నది స్పష్టం.
ప్రత్యామ్నాయ విధానాలే శరణ్యం..
అందువల్ల మహిళా సాధికారత, మహిళల అభ్యున్నతి, నారీ శక్తి, బేటీ బడావో, వికసిత భారత్ వంటి ఎన్ని ఆకర్షణీయ నినాదాలు ఇచ్చినా ఆచరణలో మన పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు శ్రామికులను, అందులోనూ ముఖ్యంగా శ్రామిక మహిళల రక్త మాంసాలను పీల్చి, పిప్పిచేసి ఉపయోగించుకుంటున్నారు అనే విషయమే స్పష్టంగా అవగతమవుతుంది. పాలకుల ఈ దుర్నీతిని లోతుగా పరిశీలించి, వీటి వెనుక దాగి ఉన్న అసలు నిగూఢాలను వెలికి తీసి, ప్రత్యామ్నాయ విధానాల అమలు ద్వారా మాత్రమే అసలైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
ఎ. అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.