
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీలు అత్యంత వెనకబడిన కులాలకు చెందిన ఓటర్ల కోసం గాలం విసురుతున్నాయి.
రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన తరగతుల ఓట్లను కూడగట్టుకునే ప్రయత్నాలను ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సీనియర్ సోషలిస్టు నేత మంగనిలాల్ మండల్‌ను రంగంలోకి దించారు. ఆయనను రాష్ట్రీయ జనతా బీహార్ విభాగానికి అధ్యక్షుడిగా లూలూ నియమించారు. అత్యంత వెనుకబడిన తరగతుల ఓటర్లు బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఓటర్లు 2005 అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రమంగా నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతా యునైటెడ్ వైపు మొగ్గు చూపారు.
ఈ సామాజిక తరగతుల జనాభా రాష్ట్ర జనాభాలో దాదాపు 36% ఉన్నారని ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన కులగణనలో తేలింది. ఈ సామాజిక తరగతులే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.
ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అత్యంత వెనకబడిన కులాల ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలు తమవంతుగా వ్యూహ రచనలో మునిగిపోయాయి.
మంగనీ లాల్ కులం రీత్యా ధనుక్ కులానికి చెందిన వారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో గుర్తింపు, గౌరవం కలిగిన అత్యంత వెనకబడిన కులాల నాయకుడుగా ఆయనకు పేరుంది. లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ లాగానే మంగని లాల్ కూడా లెజెండరీ సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్ నాయకత్వంలో 1970 దశకంలో రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. లాలు, నితీష్‌లు జాతీయ రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకితే మంగని లాల్ మాత్రం క్షేత్రస్థాయిలో తన పలుకుబడి పెంచుకునే పనిలో ఉండిపోయారు.
కర్పూరి ఠాకూర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక న్యాయం పతాకాన్ని ఎత్తిపట్టిన నేతగా లాలూప్రసాద్ గుర్తింపు తెచ్చుకున్నారు. 1990 దశకం ఆరంభంలో లాలు కూడా భాగస్వామిగా ఉన్న వీపీ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు జరపంది. దీంతో సామాజిక న్యాయానికి మాజీ సోషలిస్టు శక్తులు ప్రాధాన్యత ఇస్తారన్న విషయం ఖరారు అయ్యింది.
బీహార్‌లో 17 శాతంగా ఉన్న మైనారిటీలు హిందూత్వ రాజకీయాలకు వ్యతికేంగా లాలు ప్రసాద్ తీసుకున్న వైఖరితో ప్రభావితం అయ్యారు. దీర్ఘ కాలం రాష్ట్రంలో మైనారిటీలు ఆర్జేడీ ఓటుబ్యాంకుగా నిలిచారు. ఫలితంగా మైనారిటీలు, బీసీ సామాజిక తరగతులతో కూడిన సామాజిక సంకీర్ణం పునాదిగా ఆర్జేడీ రాష్ట్రంలో పాతికేళ్ల పాటు 1995 నుంచి 2005 వరకు అప్రతిహతంగా అధికారం చెలాయించింది.
సోషలిస్టు శిబిరంలో చీలికలు..
తొలుత సోషలిస్ట్ శిబిరంలో భాగస్వాములుగా రాజకీయ జీవితాన్ని లాలు ప్రసాద్ యాదవ్ ప్రారంభించారు. లాలు నేతృత్వంలోని ఆర్జేడీ, శరద్ యాదవ్ నేతృత్వంలోని జేడీయూ, నితీష్ కుమార్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో సమతా పార్టీలుగా ఏర్పడ్డారు. అంతిమంగా సోషలిస్టు రాజకీయాలు, సామాజిక న్యాయం, రాజకీయాల ఆధారంగా ఘనీభవించిన ఓటు బ్యాంకు ఈ చీలికల వలన నెర్రెలు బారాయి. సోషలిస్టుల చీలిక, లాలు చేతిలో పదేపదే పరాజయం చవి చూసిన బీజేపీ నూతన తరహా సామాజిక సమీకరణాలకు తెర తీసింది. పలువురు మాజీ సోషలిస్టు నేతలను తన శిబిరంలోకి లాగింది.
1990లో హుకుం దేవ్ నారాయణ్ యాదవ్‌ను బీజేపీలో చేర్చుకున్నారు. 2004లో మంగని లాల్ కూడా నితీశ్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్‌లో చేరారు. 1986 నుంచి మూడు సార్లు మంగనిలాల్ బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. లాలు ప్రసాద్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.
2004లో జేడీయూ తరఫున రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో ఝంఝార్పూర్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. హుకుమ్ దేవ్‌తో పాటు మంగనిలాల్ కూడా ప్రతిపక్షంలో చేరారు. దీంతో మిథిలా ప్రాంతంలో ఆర్జేడీ బలహీనపడింది.
2005 తర్వాత అధికారానికి వచ్చిన నితీశ్ కుమార్ ప్రభుత్వం అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారికి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే చర్యలు తీసుకుంది. ప్రస్తుతం నితీశ్ కుమార్ రాజకీయ ప్రభ తగ్గిపోవడంతో ప్రభుత్వంపై పట్టు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఆయన ఓటుబ్యాంకుగా మారిన సామాజిక తరగతుల రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
నితీశ్ పలుకుబడి తగ్గటంతో అత్యంత వెనకబడిన సామాజిక తరగతులకు చెందిన రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఇమడ లేకపోతున్నారు. ప్రస్తుతం జేడీయూతో పాటు ప్రభుత్వంపై కూడా బీజేపీ పట్టు బిగిసింది. మంగని లాల్ తిరిగి ఆర్జేడీలోకి చేరటం ఒకరకంగా స్వంత ఇంటికి తిరిగి రావడం లాంటిదే. కాకపోతే మంగనిలాల్ రాజకీయ ఆరంగేట్రం చేసినపుడు లాలు చేతిలో పార్టీ పగ్గాలు ఉన్నాయి. ప్రస్తుతం లాలు కొడుకు తేజస్వి యాదవ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ పునాదులను బలోపేతం చేసుకునేందుకు తేజస్వి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త అడుగులు వేస్తున్న తేజస్వి..
పార్టీ అధ్యక్ష పదవికి ఇప్పటివరకు మంగనిలాల్ ఒక్కరే నామినేషన్ వేశారు. జూన్ 20వ తేదీ జరిగే పార్టీ సమావేశాల్లో ఈయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో లాలు ప్రసాద్ యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోనున్నారు. కానీ లాలు ప్రసాద్ రాజకీయ వారసుడిగా తేజస్వి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్జేడీలో తిరుగులేని అధికార కేంద్రంగా తేజస్వి ఉన్నారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి నాయకత్వంలో 79 స్థానాలు సాధించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అప్పటికింకా లాలు జైల్లోనే ఉన్నారు. నిరుద్యోగం, వలసలు, సాగునీరు, అధిక ధరలు, ఆరోగ్యం వంటి క్షేత్ర స్థాయి సమస్యలపై ఆందోళనలు చేపట్టడం ద్వారా తేజస్వి పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు.
ఆర్జేడీ ఓటు బ్యాంకుగా ముస్లిం – యాదవ తరగతులు ఉండేవారు. రాష్ట్ర జనాభాలో మూడో వంతుగా ఉన్న అత్యంత వెనుకబడిన కులాలు ఆర్జేడీని వదిలి నితీశ్ నాయకత్వంలోని జేడీయూ పంచన చేరడంతో ఆర్జేడీ పునాదులు బలహీనపడ్డాయి. ఈ సమయంలో పార్టీ పునాదులు బలోపేతం చేయటానికి తేజస్వి వినూత్న చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ నాయకుడు మల్లా కులానికి చెందిన ముఖేష్ సాహనిని కూడా ఆర్జీడిలోకి ఆహ్వానించారు. తాజాగా ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద సింగ్, పార్టీ వ్యవస్థాపకుడు లాలు సహకారంతో మంగనిలాల్ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు.
నిరద్యోగం, యువతను దృష్టిలో పెట్టుకొని ఆర్జేడీ అధికారానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నూటికి నూరు శాతం స్థానిక బీహార్ వాసులకు మాత్రమే రిజర్వు చేస్తామని తేజస్వి ప్రకటించారు. అధికారానికి వస్తే 10 లక్షలు మందికి ఉద్యోగాలు కల్పిస్తాన్న నినాదం 2020 ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపింది. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగింది. ఈ నేపథ్యంలో తేజస్వి స్థానికులకే వంద శాతం ఉద్యోగాలనే నినాదం యువతను ఆకర్షించనున్నది.
రాష్ట్రంలో నితీశ్ కుమార్, దేశంలో మోడీ ప్రతిష్టతో పాటు ప్రజాదరణ తగ్గిపోతున్న తరుణంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు పునాదులు వేయనున్నాయి. రాజకీయంగా అగమ్యగోచరంగా ఉన్న అత్యంత వెనకబడిన కులాలు తాజాగా మంగనిలాల్ ఆర్జేడీ పగ్గాలు చేపట్టడంతో ఆర్జేడీ వెనక సంఘటితం అయ్యే అవకాశం ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, రచయిత, మీడియా ఉపాధ్యాయుడు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.