
ఎపి ఎన్డీయే లో కదులుతున్న పావులు
ఆందోళనతో జనసేన
“కలిసి వుంటే కలదు సుఖం” ఇది ఏపీలో కూటమి నేతలు బయటకు చెబుతున్న మాట. దానిని ఎవరు కాదనేది లేదుగాని.. కానీ సంకీర్ణంలో భాగస్వాములు తమ స్థానం బదులు నాయకత్వ స్థానం లో ఉన్న భాగస్వామి తన స్థానాన్ని ఖరారు చేసుకునే దిశగా పావులు కదపటాన్ని అంగీకరిస్తారా అన్నది ప్రశ్న. ఆంధ్ర ప్రదేశ్ ప్రతేక పరిస్థితుల్లో తెలుగుదేశం తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే భాగస్వాముల స్పందన ఎలా ఉంటుంది అన్నది మరో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అంగీకరించినా అంగీకరించక పోయినా ఎన్డీయే కూటమి అధికారం లో ఉన్నది అన్నది వాస్తవం. కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపి ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఎదుగటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు అన్నది కూడా వాస్తవం. ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్దం అయి కూడా కలిసుండటం సాధ్యమా.? అన్నది ఇంకో ప్రశ్న. కూటమి కి పెద్దదిక్కుగా చంద్రబాబు ప్రస్తుతానికి అన్నీతానై చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయకత్వంలో కలిసి పనిచేస్తామని పదేపదే చెబుతున్నారు.ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం సాగుతుందని చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ ఆకర్షించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి గా వుంటే నాకు ఒకే ఆయన కాకపోతే …అన్న ప్రశ్నలు వచ్చే విధంగా పవన్ వ్యాఖ్యలు వున్నాయన్న చర్చలు జరిగాయి.
తాజాగా విశాఖలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేయడం, రిటైర్మెంట్ కు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నానని నర్మగర్భంగా చెప్పడంతో తనయుడు లోకేష్ కు పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిస్తారా… అన్న చర్చ మొదలైంది. 75ఏళ్ల చంద్రబాబు ఇప్పటికీ ఆరోగ్యంగా, ఫిట్‌గానే ఉన్నారు. అయితే..ఆయన మరెన్నో రోజులు రాజకీయాల్లో ఉండరని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన తన తనయుడు లోకేష్‌కు పగ్గాలు అందిస్తారని, రాబోయే ఏడాది కానీ ఆ వచ్చే ఏడాది కానీ లోకేష్‌ను ముఖ్యమంత్రి ని చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే అది ఇప్పుడున్న పరిస్థితి లో కుదిరే అవకాశం లేదు.ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి స్వతహాగా మెజార్టీ వున్నా, అంతా జనసేన అధినేత పవన్ కనుసైగలలోనే నడుస్తోందన్న భావన వుంది.
ఎన్నికల ముందే వీరంతా కూటమిగా ఏర్పడి పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో కీలకమైన జనసేన శ్రేణులు అధినేత ‘పవన్‌కళ్యాణ్’ను సిఎం చేయాలని ముఖ్యమంత్రి గా వున్నంత వరకూ ఓకే ఆ తరువాత పవన్ ముఖ్యమంత్రి అని జనసేన శ్రేణులు ఫిక్సై పోయాయి. ఇటీవల కాలంలో..లోకేష్‌ను డిప్యూటీ సిఎం చేయాలని కొందరు టిడిపి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించిన సమయంలోనే జనసేన నేతలూ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌ను డిప్యూటీ సిఎం చేస్తే తమనేతను ముఖ్యమంత్రిని చేయాలని వారు పబ్లిక్ గానే డిమాండ్ చేశారు. ఇరు పార్టీల మధ్య తీవ్రంగా మాటల వాదనలు సాగాయి. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు.
తెలుగుదేశం పరంగా చూస్తే లోకేష్ నెంబర్ టూ దానిని ఎవరూ కాదనలేరు. చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో పార్టీ పరంగా లోకేష్ కు స్వేచ్ఛ ఇస్తున్నారు. పార్టీలో చర్చలకు లోకేష్ నిర్ణయాలే కీలక మవుతున్నాయి. అయినా ఏదో లోటు … కూటమి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ కు దక్కినంత ప్రాధాన్యం మంత్రిగా వున్నా లోకేష్ కు దక్కడంలేదన్న భావన టీడీపీ కార్యకర్తలలో వుంది. అలాంటిది ఏమీ లేదని లోకేషే సర్ధిచెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నా.. పార్టీ నేతలను, శ్రేణులను సంతృప్తి పరచలేని పరిస్థితి. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ కు చంద్రబాబు బదులు లోకేష్ హాజరై కూటమి ప్రభుత్వం, పాలనాపర నిర్ణయాలను వివరించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులనే ఆహ్వానించే ఆ కాంక్లేవ్ లో లోకేష్ పాల్గొనడం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో జోష్ తెచ్చింది. చంద్రబాబు నాయుడు కావాలనే లోకేశ్ ను పంపారని, ఆయన ప్రాధాన్యత పెంచుతున్నారన్న చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. టిక్కెట్ కోసం తన దగ్గరికి వచ్చిన వాళ్లను లోకేష్ ను కలవమన్నారంటేనే పార్టీలో ఆయన ప్రాధాన్యత అర్థంచేసుకోవాలి. లోకేష్ అనుయాయులకు ఏం ఎల్ సి టికెట్లకు దక్కటమూ వాస్తవమే అని అభ్యర్థుల జాబితా చూస్తే అర్థం అవుతుంది. లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ఆయనకు సొంతంగా ప్రాధాన్యత పెంచింది. పార్టీ పరంగానూ పట్టుసాధించారు. యువగళానికి ముందు లోకేష్ , యువగళం తరువాత లోకేష్ అన్నట్లుగా ఆయనలో మార్పు వచ్చింది. ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా లోకేష్ అదే చెప్పుకొచ్చారు. యువగళం తన జీవితంలో రాజకీయంగా ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.
కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి గా వున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విషయాల్లో ఆయన దూరంగా ఉంటున్నారు. మంచి పేరు వచ్చే విషయాల్లో ఆయన ముందుంటున్నారు. కొన్నింటికి ఆయన బాధ్యత తీసుకుంటూ..మరి కొన్ని విషయాల్లో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం తరుపున తాను ప్రజలకు క్షమాపణ చెప్పడం, ముఖ్యమంత్రి తో కలిసి రాకుండా తానే ఒంటరిగా బాధితులను పరామర్శించడం పెద్ద చర్చకే దారితీశాయి.
అంతకు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం బహిరంగ సభలోనే హోం మంత్రి అనిత పనితనాన్ని విమర్శించారు. చేతగాగపోతే తానే హోం శాఖ ను కూడా తీసుకుంటానని హెచ్చరించడం , పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం లో వున్న పవర్ ఏంటో తెలియపరుస్తోందంటూ చర్చోపచర్చలే సాగాయి. ఇలా అన్ని విషయాలలోనూ ఆచితూచి స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ తన బలాన్ని , సొంత ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. మరి లోకేష్ పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్న టీడీపీ శ్రేణుల మనస్సులలో పెరిగిపోతోంది.
మరోవైపు చంద్రబాబు తరువాత ఏమి చేయాలి అన్నదానిపై ఇప్పటికే బీజేపీ, …జనసేనతో కలిసి ప్లాన్ వేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రిటైర్ అయితే..అంత సాఫీగా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. కూటమిలో విభేదాలు వస్తే ప్రతిపక్ష వైసీపీ కి ఇటునుంచే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మరి ఈ పరిస్థితిలో లోకేష్ భవిష్యత్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆలోచనలు ఆసక్తిగా మారాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో నడిచిన రచ్చ, పిఠాపురం టీడీపీ నేత వర్మ, జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం కూడా అనేక వాదనలకు దారితీసింది. ఇప్పుడు కనుక చంద్రబాబు రిటైర్ అయి లోకేష్ ను సిఎం చేయాలనుకుంటే..వెంటనే చేసుకోవచ్చు. కానీ..కూటమి నిలువునా చీలిపోతుంది. కూటమి చీలితే..ఆ దెబ్బ వచ్చే ఎన్నికల్లో నే కాకుండా మధ్యలో జరిగే స్థానిక ఎన్నికలో కూడా భారీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు మోసం చేశారని ప్రజలలో భావన వస్తే టీడీపీ కి మైనస్ గా మారుతుంది. అలాగని పవన్ చంద్రబాబు మోసం చేరారు అన్న అభిప్రాయం వస్తె అప్పటికే ఈ పొత్తు పట్ఎ విముఖంగా ఉన్న టిడిపి శ్రేణులు స్వైరవిహారం చేస్తాయి. సిఎం పదవిని చంద్రబాబు సగం రోజులు పవన్ సగం రోజులు పంచుకోవాలని డిమాండ్లు వచ్చాయి.. అయితే..జగన్ ను ఓడించడం ముఖ్యమని, ముందు అది చేద్దామని పవన్ సీట్ల విషయంలో తగ్గి, అధికారం వచ్చాక ఉపముఖ్యమంత్రి పదవితో సర్దుకున్న తీరు అందరూ మెచ్చుకునేలా చేసింది.
అయితే..ఇవన్నీ ఊహాగానాలే అని, చంద్రబాబు ఇప్పట్లో రిటైర్ కారని, 2029 ఎన్నికల తరువాతే ఆయన రిటైర్ అవుతారని, అప్పటి వరకూ ఏమీ జరగదని కొందరు టిడిపి నేతలు అంటున్నారు. ఏదేమైనా భవిష్యత్ లో పవన్ వర్సెస్ లోకేష్ గా నడిచే రాజకీయాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.