
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ప్రతిపక్ష హోదా అంశం హాట్ టాపిక్‌గా మారింది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని వైసీపీ అధినేత జగన్ అంటుంటే, 10 శాతం సీట్లు లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ తెగేసి చెపుతున్నారు. మరి ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడేది ఎప్పుడు? ఈ విషయంలో కోర్టు మెట్లు ఎక్కినా శాసనసభ స్పీకర్ విచక్షణ పరిధిలోని అంశంలో కోర్టులు ఏం తేలుస్తాయన్నది అందరికీ సందేహమే.
అభియోగాలు, బెదిరింపులతో గత జూన్‌లో జగన్ తనకు లేఖ రాశారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. నాడు లోక్‌సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పటంలో వాస్తవం లేదన్నారు. నాడు టీడీపీ గ్రూపు నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని చెప్పుకొచ్చారు. జగన్ తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. జగన్ పిటీషన్‌ను విచారణ చేయాలా వద్దానే దశలోనే ఆ పిటీషన్ ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా స్పీకర్ సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ సరికాదన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10 శాతం సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు 18 సీట్లు, ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలో 10శాతం నిబంధన వుందా?
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకూ రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ, లేదా అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. నిజానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు. ఇంతకుముందు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ, మొదటిసారి 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా పై ఎలాంటి నిబంధనలు లేవు.
అయితే, 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్/శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు. వాటి ప్రకారం, ప్రధాన పార్టీగా గుర్తింపు దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి. లేకుంటే పార్టీగా కాకుండా గ్రూపుగా మాత్రమే గుర్తిస్తారు. ఈ మేరకు లోక్‌సభలో 55, రాష్ట్ర అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు.
అయితే, 10శాతం సీట్లు రావాలన్నది రాజ్యాంగంలో లేదని పది శాతం సీట్లు అనే నిబంధన మధ్యలో తీసుకువచ్చిందనే వాదన సాగుతోంది. ప్రతిపక్ష నేతగా కొన్ని సౌకర్యాలను ప్రభుత్వపరంగా అందించడానికే 10శాతం సీట్ల నిబంధనను తెచ్చారంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలైన తరువాత ఆ పది శాతం నిబంధన కూడా పోయిందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే వచ్చే ఉపయోగాలు ఏంటి?
ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. పీఎస్, పీఏ సహా సిబ్బంది, అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. సభలో మాట్లాడడానికి సమయం సభా నాయకుడితో సమానంగా ఉంటుంది. కాబట్టే జగన్ ప్రతిపక్ష హోదా కోసం పట్టబడుతున్నారు.
16, 17 లోక్‌సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే, స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో లోక్‌సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.
1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే ఢిల్లీ అసెంబ్లీలో 70 స్ధానాలకుగాను ఆప్‌కు 67 స్థానాలు, బీజేపీకి కేవలం 3 సీట్లు వచ్చాయి. అయినా స్పీకర్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అదే విషయాన్ని ఇప్పుడు జగన్ పదేపదే గుర్తుచేస్తున్నారు. రాజ్యాంగంలో ఎక్కడా పది శాతం నిబంధన లేదని వాదిస్తూ వస్తున్నారు.
2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21 , వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాల చొప్పున దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు, ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా, 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలంటున్నారు. ఇప్పుడు జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలోనే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని బెదిరించిన విషయం గుర్తుతెచ్చుకోవాలంటున్నారు. ఏదైనా జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అన్నది మాత్రం స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంది. జగన్‌ను అసెంబ్లీకి రప్పించి సభలో అవమానించడానికైనా అధికార పక్షం ప్రతిపక్ష హోదా ఇస్తుందని కొందరు వాదిస్తున్నా, జగన్ మాత్రం అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.