
సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ‘ఇంకా ఎంతకాలం పడుతుంది?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం కోరడంతో కేసు ఆగస్టు 19కి వాయిదా పడింది.
మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గొంతు గుర్తు పట్టేందుకు అందుబాటులో ఉన్న ఆడియో రికార్డ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక తెప్పించటానికి ఇంకా ఎంత కాలం పడుతుందని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఈ వాయిస్ రికార్డు కోర్టుకు వచ్చి మూడు నెలలు అవుతోంది. అప్పటి నుంచి వాయిస్ రికార్డును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపటానికి కేంద్ర ప్రభుత్వానికి సమయం సరిపోలేదు.
జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వడానికి తమకు మరో రెండు వారాల గడువు కావాలని మెహతా న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో కోర్టు ఈ ప్రశ్నను సంధించింది.
‘‘ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైంది? కనీసం అదన్నా వచ్చి ఉండాలి కదా? మే 2025లో ఈ ఆదేశాలు వచ్చాయి. మూడ్నెళ్లు గడిచాయి. ఈపాటికి ఫోరెన్సిక్ రిపోర్టు మీ చేతికి వచ్చి ఉండాలి కదా. కనీసం ఓ విషయం చెప్పండి. నివేదిక వచ్చిందా లేక దారిలో ఉందా?’’ అని సుప్రీం ధర్మాసనం నిలదీసింది.
సుప్రీం కోర్టు ప్రశ్నకు స్పందిస్తూ తుషార్ మెహతా నివేదిక ఇంకా సిద్ధం కాలేదని బదులిచ్చారు. దాంతో “ఆ గొంతు ముఖ్యమంత్రిదా కాదాని విస్పష్టంగా చెప్పటానికి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెడుతున్నాము. ఇలా పదేపదే వాయిదాలు వేయలేమ”ని న్యాయమూర్తులు అన్నారు.
ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరిక..
మే 5వ తేదీన జరిగిన విచారణలో భాగంగా, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కీలక విషయాలను తెలియజేసింది. కుకీ– మెయితి ఘర్షణలకు కారకులైన వారెవరినైనా కాపాడేందుకు ప్రయత్నం చేయకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ చట్టబద్ధతను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
గతంలో, కుకీ– మైతీల మధ్య ఘర్షణలు చెలరేగటానికి వెనుక ఉన్న కుట్రదారులు మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డులు వెలుగు చూశాయి. అందులో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ గొంతును పోలిన గొంతు ఉంది. దీంతో ఈ ఆడియా రికార్డులపై దర్యాప్తు చేయించాలని కుకీ మానవ హక్కుల సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ ఘర్షణల్లో 250 మంది చనిపోయారు. మరో 50 వేలకు పైగా నిర్వాసితులయ్యారు. ఇప్పటికీ వీరంతా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిర్వాసిత శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. ఆర్నెళ్ల గడువు ముగిసిన తర్వాత మరో ఆర్నెళ్లపాటు రాష్ట్రపతి పాలనను పొడిగించింది.
ఈ ఆడియోలో ఉన్న గొంతు విశ్వసనీయమైనది కాదనీ, ఈ ఆడియోను ముఖ్యమంత్రి గొంతుగా ప్రచారం చేస్తున్న వార్తా సంస్థలపై చర్యలు తీసుకుంటామని బీరెన్ సింగ్ కార్యాలయం హెచ్చరించింది.
ఏది ఏమైనా, కుకీ మానవ హక్కుల సంస్థ అభ్యర్థనను స్వీకరించిన సుప్రీం కోర్టు నవంబరు 2024లో ఈ ఆడియో టేపులపై దర్యాప్తుకు ఆదేశించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఈ ఆడియో టేపులను ధృవీకరించమని పిటిషనర్లను కోరారు.
ఇంతకు ముందే ఈ టేపులను కేంద్ర హోం శాఖ నియమించిన న్యాయ విచారణ సంఘం విచారణలో భాగంగా స్వీకరించిన తర్వాత, ఈ టేపుల్లోని విషయాలను ప్రజా ప్రయోజనార్ధం ది వైర్ ప్రచురించింది.
ఈ పరిస్థితుల్లో ఈ ఆడియోను ప్రతిష్టాత్మకమైన ట్రూత్ ల్యాబ్స్‌కు పంపగా ఈ ఆడియోలోని గొంతు ముఖ్యమంత్రి గొంతుతో 93 శాతం కలుస్తోందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వ ధృవీకృత సంస్థ నుంచి నివేదిక కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం చెప్పారు. దీంతో కేసును ఏప్రిల్ 2025కు వాయిదా వేశారు.
పర్సపర విరుద్ధమైన మాటలు..
ఆ సమయంలో తుషార్ మెహతా వక్ప్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జరుగుతున్న వాదోపవాదలతో బిజీగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం మరింత గడువు కోరింది. ఏప్రిల్‌లో ప్రభుత్వం తరఫున న్యాయస్థానం ముందు హాజరైన న్యాయవాది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సిద్ధం అయ్యిందని చెప్పగా, ఆగస్టులో ఇదే అంశంపై కోర్టు ముందు హాజరైన తుషార్ మెహతా మాత్రం నివేదిక సిద్ధం కాలేదని చెప్పారు.
ఈలోగా మేలో జరిగిన విచారణలో న్యాయస్థానానికి ఓ సీల్డ్ కవర్‌ను అందించిన తుషార్ మెహతా దర్యాప్తు కొనసాగించవచ్చనీ, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో సమస్యను జఠిలం చేయాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. సీల్డ్ కవర్‌ను చదివిన న్యాయమూర్తులు మండిపాటుతో ‘‘మిష్టర్ మెహాతా, మీ అధికారులతో మాట్లాడండి. ఇదేనా ఫోరెన్సిక్ నివేదిక’’ అని నిలదీశారు.
దీనికి స్పందిస్తూ తుషార్ మెహాతా తనకు ఆ కవర్లో ఏ ముందో తెలీదని చెప్పారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి ‘‘మీ అధికారులతో మాట్లాడండి. తాజా నివేదిక తెప్పించండి.’’ అని ఆదేశించారు. జూలై 21వ తేదీ నాటికల్లా తాజా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. జూలై 21న జరిగిన విచారణలో నివేదిక ఇంకా సిద్ధం కాలేదని కేంద్రం తరఫున వాదిస్తున్న తుషార్ మెహతా చెప్పారు. దీంతో ఆగస్టు 4వ తేదీ వరకూ గడువును సుప్రీం కోర్టు పొడిగించింది.
ది వైర్‌తో కుకీ మానవ హక్కుల సంస్థ అధ్యక్షులు బెంజమిన్ మతే మాట్లాడుతూ, ‘‘కుకీ, జో తెగలకు చెందిన ప్రజలు రెండేళ్ల నుంచి సొంత రాష్ట్రంలో శరణార్ధులయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు. ఈ తెగలకు వ్యతిరేకంగా సాగిన నరమేధంలో నేరుగా ముఖ్యమంత్రే ఉన్నారని ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు కళ్ల ముందున్నా గౌరవ న్యాయస్థానం అతన్ని ఏమీ చేయలేకపోతోంది. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే అన్న సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని సత్వర న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాము’’ అన్నారు.
మైనారిటీ తెగలకు వ్యతిరేకంగా సాగుతున్న నరమేధాన్ని నిలువరించాలంటే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘జాతి హత్యాకాండలో ప్రభుత్వ సహకారం, పాత్రలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నది మా అభ్యర్థన. ఈ దేశపౌరులుగా కుకీ, జో తెగలకు చెందిన వారికి న్యాయం జరగాలంటే ఈ ఆడియో టేపులో ఉన్న వాస్తవాలు వెలుగు చూడటం అనివార్యమైన అవసరం’’ అన్నారు బెంజమిన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.