
మోదీ బీజేపీని ఆర్ఎస్ఎస్ మార్గదర్శకం చేస్తుందా? లేక ఆర్ఎస్ఎస్ను మోదీ బీజేపీ మార్గదర్శకం చేస్తుందా? అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గత నెల రోజులుగా చేస్తున్న కొన్ని ప్రకటనలు, మాట్లాడుతన్న మాటలను గమనిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆయన మాటలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయి.
75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అన్ని పదవులకు ఎవరైనా సరే రాజీనామా చేయాల్సిందేనని, నెల రోజుల క్రితం భాగవత్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ విషయంపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. మాట మార్చిన తీరును గమనిస్తే, ఎవరు ఎవరిని మార్గదర్శకం చేస్తున్నారనేది కొంత వరకు అస్పష్టంగా– అయోమయంగా ఉంది.
ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి కావడంతో, ఆ సంస్థ సభ్యులు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, కొద్ది రోజుల క్రితం పలు దేశాల రాయబారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో, సంఘ్ భావజాలం– అఖండ భారత దేశ అర్థాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వారికి వివరించారు.
తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగవత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో, 75 సంవత్సరాలు నిండితే పదవీ విరమణ, బీజేపీ– సంఘ్‌కు మధ్య సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటే శాసనం..!
భాగవత్ మాటలను గమనిస్తే, ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ఆవిర్భవించిందా? లేక బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందానే అనుమానం కలగ తప్పడం లేదు. సేవారంగంలో ఆరెస్సెస్ జోక్యం నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. అలాంటి సంస్థకు చెందిన చీఫ్ ఏదైనా చెపితే దానికి తిరుగు ఉండదని భావిస్తారు.
గడిచిన అనేక దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ఇదే తీరును కొనసాగించింది. కానీ, ఈ దశాద్దకాలంగా ఆర్ఎస్ఎస్ దేశానికి సంబంధించి కీలకాంశాలు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాలపై ఏ మాత్రం స్పందించకుండా మౌనం పాటించడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ పదవులలో ఉన్న ఎవరైనా సరే 75 సంవత్సరాల వయసు నిండగానే, తమ పదవులకు రాజీనామా చేయాలని భాగవత్ మొదటి సారి అన్నారు. అయితే, ఈ నెల 11వ తేదీ నాటికి భాగవత్‌కు 75 సంవత్సరాలు నిండుతాయి. 17వ తేదీ నాటికి ప్రధాని మోడీకి 75 సంవత్సరాలు వస్తాయి.
చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి క్యూలో పది మంది అర్హులు..
రాజ్యాంగ పదవులలో ఉన్నవారందరికి తాను చెప్పేది వర్తిస్తున్నట్టుగా మోహన్ భాగవత్ మాట్లాడారు. భాగవత్ మాటలతో అందరి దృష్టి ప్రధాని మోదీపై పడింది. సెప్టెంబర్ 17వ తేదీన తన పదవికి మోదీ రాజీనామా చేస్తారా లేదానెది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. అయితే, ఈ అంశంపై భాగవత్ ఊహించని విధంగా మాటమార్చిన తీరు ఆయన నిబద్ధతనే ప్రశ్నిస్తుంది.
వాస్తవానికి బీజేపీ 1983లో ఆవిర్భవించక ముందు, ఆ తర్వాత కూడా దాని వెనుకాల ఆర్ఎస్ఎస్ ఉందని, తెరచాటు నుంచి బీజేపీకి సంఘ్ మార్గదర్శకం చేస్తుందని ప్రతీ ఒక్కరు భావిస్తారు. రాజకీయ రంగంలో కూడా ప్రతీ ఒక్కరు అదే నమ్ముతారు. కానీ బీజేపీ– ఆర్ఎస్ఎస్ మధ్య ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి.
భాగవత్ ఇంకా మాట్లాడుతూ, “నేను పదవీ విరమణ చేస్తానని ఎవరికి చెప్పలేదు. అలాగే రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రిటైర్ కావాలని ఎవరినీ కోరలేదు. వాస్తవానికి సంఘ్‌లో పదవీవిరమణ అనేది ఏదీ ఉండదని, చివరి వరకు స్వచ్ఛంద సేవకులుగా పని చేస్తూనే ఉంటామ”ని అన్నారు.
“ఒకవేళ నేను రిటైర్మెంట్ తీసుకుంటే, చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి, అన్ని అర్హతలతో పది మంది సిద్ధంగా ఉన్నారు. అయితే, రిటైర్ కావాలని మాత్రం నేను ఎవరికీ చెప్పలేదు. చెప్పలేను కూడా” అని భాగవత్ పేర్కొన్నారు.
సంఘ్ ఏ పనిని అప్పగిస్తే, స్వయం సేవకులుగా తాము ఆ పనిని చేసుకుంటూ పోతామని తెలియజేశారు. సంఘ్ కేవలం రామమందిర ఉద్యమానికి మాత్రమే పరిమితమైందని, కాశీ– మథుర ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం లేదని, అయినప్పటికీ ఎవరైనా స్వయం సేవకులు ఈ ఉద్యమాలలో పాల్గొంటే అది వారిష్టమని అన్నారు.
ఎన్ని విభేదాలున్నా భారతదేశంలో నివసిస్తున్న వారందరూ భారతీయులేనని, అందరూ కలిసి– మెలిసి సహజీవనం చేయడమే అఖండ భారతని అన్నారు. బీజేపీకి తాము సూచనలు చేస్తామే తప్ప ఆదేశించలేమని, పార్టీతో తమకు ఎలాంటి ఘర్షణలు లేవని పేర్కొన్నారు. అయితే, పలు కీలక అంశాలపై అభిప్రాయ భేదాల వల్ల ఇరువరి మధ్యన గొడవలు జరుగుతాయని భాగవత్ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు బీజేపీపై రుద్దలేమని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.