
మా ఇంటిపక్కన భవననిర్మాణంలో పనిచేసే బీహార్‌కి చెందిన కూలివాళ్ళు ఇక్కడి వాళ్ళతో హిందీలో మాట్లాడతారు. కానీ, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేది మాత్రం హిందీ కాదు, వేరే భాష, వాళ్ళ మాతృభాష. హిందీ తేలిగ్గా అర్థమయ్యే ఎవరికైనా ఆ భాష అస్సలు అర్థం కాదు. మా ఇంటి చుట్టుపక్కల రాజస్థాన్‌కి చెందిన చాలా మార్వాడి కిరాణా షాపులున్నాయి . వాళ్ళంతా కస్టమర్లతో హిందీలోనే మాట్లాడతారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ ప్రాంతం వారితో మాట్లాడేది హిందీ కాదు. వేరే భాష. అది మనకు అర్థం కాదు. మరి వీళ్ళంతా హిందీ బెల్ట్ అని చెప్పుకునే ప్రాంతాల నుంచి వచ్చినవారే కదా? వీళ్ళు హిందీలోనే కదా మాట్లాడాలి. మరి వీళ్ళు హిందీలో కాకుండా వేరే భాషలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు?
ఎందుకంటే – హిందీ భాష, హిందీ రాష్ట్రాలు, హిందీ ప్రజలు.. మొత్తంగా హిందీ బెల్ట్ అనేది కేవలం కొందరు రాజకీయ లబ్ధి కోసం ఆయా ప్రాంతాల ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా కప్పిన కృత్రిమ తొడుగు. అదే హిందీ గొడుగు.
హిందీ రాష్ట్రమైన మహారాష్ట్రలోనే హిందీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే .. ఏ విషయంలోనూ ఏమాత్రం అవగాహన లేని పవన్ కల్యాణ్ మాత్రం హిందీ లేకపోతే భవిష్యత్తే లేదనీ, హిందీ పెద్దమ్మ అనీ ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ మాటలకు విలువివ్వాల్సిన అవసరం లేకపోయినా జెండా కూలీల బానిసత్వం, అజ్ఞానాన్ని దృష్టిలో పెటుకుని ఆ భయంతో అయినా స్పందించక తప్పని దుస్థితి ఏపీలో దాపురించింది. ఏం చేస్తాం ! రాయి విసిరేది పిచ్చోడే అయినా తిప్పికొట్టక తప్పదు. దీనికి తోడు ఈ ‘తండ్రీ కొడుకులు’ బీజేపీ మెప్పు కోసం హిందీని జాతీయభాష చేసేశారు. జాతీయ భాష హోదా దేవుడెరుగు, అసలు హిందీ భాషకు ప్రాంతీయ హోదా అయినా ఉందా అనేది పెద్ద ప్రశ్న ! నిజంగా హిందీ మాతృభాషగా ఉండి, హిందీ మాట్లాడేవాళ్ళు ఈ దేశంలో ఎంత మంది?
‘దక్షిణ భారతదేశంలో సరే గానీ మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకత ఏంటి ?’ ఆశ్చర్యంగా అన్నాడు నా ఫ్రెండ్ మొన్నా మధ్య ఓసారి. చాలా మంది ఇదే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. దక్షిణ భారతీయులు మాత్రమే హిందీ భాషా వ్యతిరేకులు అనుకుంటారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలే హిందీ వల్ల ఎక్కువగా నష్టపోయాయి. తమ మాతృభాషల్ని, సంస్కృతీ సంప్రదాయాల్ని తద్వారా తమ అస్తిత్వాలనే కోల్పోయే ప్రమాదంలో పడిపోవడంతో తమ భాషల్ని బతికించుకోవాలనే ఆకాంక్షతో పాటు దానికి అడ్డుపడుతున్న హిందీ పట్ల వ్యతిరేకత ఉత్తరాది ప్రజల్లో (మీడియా కవర్ చేయకపోయినా) తీవ్రస్థాయిలోనే ఉంది.
హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మాట్లాడేది హిందీయేనా?
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, ఢిల్లీ, హర్యానా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్- ఈ పది రాష్ట్రాలను హిందీ బెల్ట్ గా పిలుస్తున్నాం. భారతదేశమనేది భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో మిళితమై ఉంది. ‘కోస్ కోస్ పర్ బద్లే పానీ, చార్ కోస్ పర్ వాణి’ – (ప్రతీ కోసు దూరానికీ నీటిలో మార్పు, ప్రతీ నాలుగు కోసులకూ భాషలో మార్పు) అని హిందీలో ప్రసిద్ధ నానుడి. మరి పశ్చిమాన రాజస్థాన్ నుంచి తూర్పున బీహార్ వరకు ఉత్తరాన హిమాచల్ నుంచి దక్షిణాన చత్తీస్‌గఢ్ వరకూ కొన్ని వేల కిలోమీటర్లు ఒకే భాష హిందీ భాష ఉండడం ఎలా సాధ్యం!
అవన్నీ మాండలికాలేనా?
అవన్నీ హిందీ భాష మాండలికాలని కొందరు బుకాయించొచ్చు. తెలుగు భాషకూ మాండలికాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో ఎంత తేడా ఉన్నా, కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు కానీ తెలుగు తెలిసిన ఎవరికైనా మాండలిక భాష అర్థమవుతుంది. కానీ హిందీ భాషలో పండితులైనవారికి కూడా హిందీ బెల్ట్‌లోని ప్రజలు మాట్లాడే మగధి, అవధి, భోజ్‌పురి, భ్రజ్, బుందేలి, బగేలి, భౌలి, కాంగ్డీ, గడ్వాలి, హరియాన్వీ, మార్వాడి, మాల్వీ, చత్తీస్గఢి, కనౌజి, కడిబోలి, కొట్ట, పహాడి, మైథిలి వంటి అనేక భాషల్లో ఒక్కటి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ భాషలన్నీ హిందీ మాండలికాలు కావుజ దేనికది ప్రత్యేకమైన భాష. ఇలాంటి 56 మాతృభాషల్ని హిందీ గొడుగు కింద హిందీలో కలిపేసుకుని ఆయా భాషలు మాట్లాడేవారిని హిందీ ప్రజలుగా ముద్ర వేసేశారు.
భారతదేశ ప్రజలు మాట్లాడే మాతృభాషలు 2 వేలకు పైగా ఉన్నాయి. అత్యధిక ప్రజలు మాట్లాడే అనేక మాతృభాషలు కూడా గుర్తింపుకు నోచుకోలేక హిందీ ముసుగులు, ముద్రలు వేసుకున్నాయి. ఈ ముసుగు తీస్తే నిజంగా హిందీ మాతృభాషగా ఉన్న ప్రజలు ఈ దేశంలో ఎంతమంది??
2011 జనాభా లెక్కల ప్రకారం 44% భారతీయుల మాతృభాష హిందీ.
- 1961 జనాభా లెక్కల సమయంలో హిందీ బెల్ట్ లో 10 మాతృభాషల్ని హిందీలో కలిపి దేశ జనాభాలో హిందీ ప్రజల శాతాన్ని 30.39% కి తీసుకొస్తే, 1971 జనాభా లెక్కల్లో మరి కొన్ని భాషల్ని కలిపి 37% తెచ్చారు.
- 1991లో ఇంకొన్ని భాషల్ని మింగి హిందీ ప్రజల్ని 39.29% తెస్తే
- 2001లో మరిన్ని భాషల్ని ఆక్రమించి 41.11%
- 2011లో 56 మాతృభాషల్నిఅణచి హిందీ ప్రజల్ని 44 శాతానికి చేర్చారు.
ఇప్పటికి 15 ఏళ్ళయ్యింది. రాబోయే జనాభా లెక్కల్లో హిందీ ఇంకెన్ని భాషల్ని మింగనుందో, దేశంలో హిందీ ప్రజల శాతం ఇంకెంత పెరగనుందో! కేంద్ర నాయకుల మాయాజాలమే ఈ కృత్రిమ పెంపు.
2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా…
- పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌లో 37% మంది రాజస్థానీ భాష మాట్లాడితే.. హిందీ మాట్లాడేది 26% మాత్రమే. ఇతరుల మాతృభాష మార్వాడి, మాల్వీ, జయ్పూరి మొదలైనవి.
- హిమాచల ప్రదేశ్ లో 32% మంది పహాడీ, 36% మంది కాంగ్డీ, గడ్వాలి భాషలు మాట్లాడితే … హిందీ మాట్లాడే ప్రజలు కేవలం 15% .
- ఛత్తీస్‌గఢ్ లో 62% ప్రజలు ఛత్తీస్‌గఢీ మాట్లాడితే.. హిందీ మాట్లాడే ప్రజలు కేవలం 10%.
- జార్ఖండ్‌లో 60% పైగా ప్రజల మాతృభాష కొట్టా.
- బీహార్‌లో భోజపూరి, మైథిలి, మగధి లాంటి అధిక సంఖ్యాకులు మాట్లాడుకునే భాషలతోపాటు 146 అల్పసంఖ్యాకుల మాతృభాషలు ఉనికిలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో హిందీ మాతృభాష 10% కంటే తక్కువ.
- ఉత్తరాఖండ్ ప్రజలు మాట్లాడే భాషల్లో మొదటి 5 జాబితాలో హిందీ అసలు లేనే లేదు!
2011 జనాభా లెక్కల ప్రకారం భోజ్‌పూరి మాట్లాడే ప్రజలు 5 కోట్లకు పైగా ఉన్నారు. రాజస్థానీ మాట్లాడేవారు 2.5 కోట్ల పైగా, ఛత్తీస్ గఢీ 1.5 కోట్ల పైగా ఉంటే హర్యాన్వీ మాట్లాడే ప్రజల సంఖ్య కోటికి పైగా ఉంది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం దేశంలో భోజ్‌పూరి మాట్లాడేవారి సంఖ్య 15 కోట్ల పైగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో 7 కోట్లు, బీహార్‌లో 8 కోట్లు. వీరికి చిత్ర పరిశ్రమ కూడా ఉంది. భోజ్‌పూరి భాషలో అనేక సినిమాలు రూపు దిద్దుకున్నాయి. దేశంలో అధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడే భాషల జాబితాలో భోజ్‌పూరి కచ్చితంగా 2 లేక 3 స్థానాల్లో ఉంటుంది. అయినప్పటికీ ఈ భాషకు గుర్తింపు లేదు.
ఈ భాషలకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో జనాభా లెక్కల్లో వీరి మాతృభాష హిందీ అయ్యి కూర్చుంది. వీళ్ళంతా హిందీ వాళ్ళు అయిపోయారు. హిందీ బెల్ట్ ముసుగులో… వందల ఏళ్ళుగా ప్రజల నాలుకలపై సజీవంగా ఉన్న అనేక భాషలకు నిన్నగాక మొన్న పుట్టిన హిందీ మాండలిక ముసుగు వేసుకునే ఖర్మ పట్టింది.
హిందీ ఎప్పుడు.. ఎలా పుట్టింది?
వైదిక సంస్కృతం నుంచి సౌరసేని ప్రాకృత భాషలు పుట్టాయి. కడిబోలి, కనౌజి, పర్యాన్వీ , భ్రజ్ లాంటి అనేక ఉత్తరాధి భాషలకు ఈ ప్రాకృత భాషే మూలం. 1206లో ఢిల్లీ సుల్తాన్లు అధికారం చేపట్టేనాటికి ప్రాకృత భాష నుంచి పుట్టిన కడిబోలి భాష ఢిల్లీ ప్రజల మాతృభాషగా ఉండేది. సుల్తాన్లు పర్షన్ భాషను అధికారిక భాషగా ప్రకటించుకుని పాలన సాగించడంతో ఈ కడిబోలి భాష పర్షన్తో కలిపి ఒక కొత్త భాష పుట్టింది. దాన్నే హిందుస్థాని అన్నారు.
1526లో బాబర్ రాకతో మొగల్ సామ్రాజ్యంలో ఈ హిందుస్థానీ మరింత ఎక్కువగా పర్షన్ ప్రభావానికి లోనై ఉర్దూ భాషకు జన్మనిచ్చింది. 18వ శతాబ్ధంలో బ్రిటిష్ వారు పర్షన్ భాషను తొలగించి ఢిల్లీ స్థానికులు అధికంగా మాట్లాడే ఉర్దూని స్థానిక అధికారిక భాషగా ప్రకటించారు. ఉర్దూ భాష అరబ్ లిపిని అనుసరించడంతో మతపరమైన సమస్యలు తలెత్తాయి. దాన్ని ముస్లిం భాషగా పరిగణించి హిందూ పెద్దలు తమ కోసం ప్రత్యేక భాష కావాలనే ఉద్దేశంతో హిందుస్థానీలో మరింత సంస్కృతాన్ని చొప్పించి కొత్త భాషను అభివృద్ధి చేశారు. అదే హిందీ. దీనికీ ఉర్దూకీ పెద్దగా తేడాలేకపోయినా దేవనాగరి లిపిని అనుసరించడం వల్ల హిందువుల భాషగా ప్రచారం చేశారు.
ఆ సాహిత్య సంపద హిందీ సొంతమా?
ఇప్పటికీ హిందీ భాష వయసు మూడు శతాబ్దాలకు మించి లేదు. మగధి, భోజ్‌పూరి, భ్రజ్, బగేలీ, హరియాన్వీ , మైథిలి లాంటి హిందీ కంటే భిన్నంగా ఉండే అనేక భాషలు హిందీ కంటే చాలా పురాతనమైనవి. సాహిత్య సంపద కలిగిన భాషలు.
- తులసీ దాస్ రాసిన రామ్‌చరితమానస్, హనుమాన్ చాలీసాలు అవధి భాషలో ఉన్నాయని ఎంతమందికి తెలుసు?
- సూర్దాస్, రహీమ్ దోహేలు భ్రజ్ భాషలో..
- మీరాబాయి రచనలు రాజస్థానీ భాషలో..
- కబీర్దాస్ దోహేలు అవధి, భ్రజ్, భోజ్‌పూరి భాషల్లో..
- 12వ శతాబ్దపు ప్రసిద్ధ కవి ఆలాఖండ్ బుందేలీ, బగేలీ భాషల్లో రాశారు.
అయినా ఈ సాహిత్యం అంతా హిందీ సాహిత్యంగా మోసపూరిత ప్రచారం జరుగుతూనే ఉంది.
ఈ భాషలకు లిపి లేకపోవడం వల్ల అవి గుర్తింపుపొందలేకపోతున్నాయని కొందరు అంటుంటారు. మరి హిందీకి కూడా లిపి లేదు. ఈ అన్ని భాషలూ ఉపయోగించే దేవనాగరినే హిందీ కూడా అనుసరిస్తుంది. నిజానికి మొదట్లో చాలా భాషల రచనలు వాటి ప్రత్యేక లిపిలోనే జరిగాయి. మైథిలి భాష రచనలు తొలిదశలో దేర్హోతియా మితిలాక్షర్ అనే స్క్రిప్ట్‌లో ఉండేవి. భోజ్‌పూరికి కైతీ స్క్రిప్ట్, రాజస్థానీ, మార్వాడీకి మహాజనీ స్క్రిప్ట్, పహాడీ భాషకు టాకరీ స్క్రిప్ట్ .. ఇలా ప్రత్యేకంగా ఉండేవి.
తరతరాలుగా వాటిని భద్రపరుచుకోవడంలో, ముందు తరాలకు నేర్పించడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఆ రాతలు అంతరించిపోయాయి. నేడు అన్నిటికీ దేవనాగరి లిపే గతయ్యింది. హిందీ ఆధిపత్యానికి తలొగ్గే పరిస్థితి దాపురించింది.
ఎనలేని ప్రాచుర్యం ఎందుకొచ్చింది?
కొందరికి రాజకీయ, సాంఘిక, సామాజిక ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి హిందీ భాషాధిపత్యం కూడా అవసరమయింది. దీంతో జయ్శంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ, సుమిత్రానందన్, మైథిలీ శరణ్ గుప్త్ వంటి ఎందరో సాహితీవేత్తలు హిందీని గొప్ప భాషగా కీర్తిస్తూ రచనలు సాగించారు. హిందీకి ఎనలేని ప్రాచుర్యం తెచ్చిపెట్టడంలో నార్త్ ఇండియా మీడియా, బాలీవుడ్ సినిమా పరిశ్రమ ప్రధాన పాత్ర పోషించాయి. 90 దశకంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ వంటి టివీ సీరియల్స్ హిందీని ఇంటింటికీ చేర్చాయి.
గత 75 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి వేల కోట్లు ఖర్చుచేస్తూనే ఉంది. ఇప్పుడు బీజేపీ అధికార ఛత్రఛాయలో హిందీ భాషాధిపత్యం మళ్ళీ పుంజుకుంది. ప్రస్తుతం 70% పైగా క్యాబినెట్ పత్రాలు హిందీలోనే ఉంటున్నాయి. ఉప రాష్ట్రపతే ఏకంగా హిందీని జాతీయ భాష అని అసత్య భాషణలు చేస్తారు. సెంట్రల్ యూనివర్శిటీల శాలరీ స్లిప్స్‌లో పేర్లు హిందీలోనే ఉంటున్నాయి. కేవలం మూడు సంవత్సరాల్లో హిందీ టీచర్ల కోసం 349 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
విచిత్రమైన విషయమేంటంటే- దేశంలో హిందీ భాషకు ఏమాత్రం ఆదరణ లేని 1881 సంవత్సరంలోనే పెద్ద రాష్ట్రమైన బీహార్‌లో హిందీని అధికార భాషగా ప్రకటించారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజల్లో 99% మందికి హిందీ రాదు, ఆ భాష అర్థం కూడా కాదు.
క్రమంగా హిందీని ప్రస్తుతం చెప్పుకునే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోకి బలవంతంగా చొప్పించారు. ఇంకా హిందీని క్లాసిక్ భాషగా, పండితుల , అక్షరాస్యుల భాషగా కీర్తిస్తూ, స్థానికుల మాతృభాషల్ని నిరక్షరాస్యుల భాషగా అవహేళన చేస్తూ వస్తున్నారు. హిందీ నేర్చుకోకపోతే ఉత్తర భారతదేశంలో ఏ పనీ దొరకని పరిస్థితులు కల్పించారు.
స్వాతంత్ర్యానికి ముందే ప్రయత్నాలు
హిందీని జాతీయభాషగా గుర్తించాలని స్వాతంత్ర్యానికి ముందు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. విభిన్న సంస్కృతుల, భాషల ప్రజలు నివసించే ఈ దేశంలో అన్ని భాషలకూ సమాన గుర్తింపుగాక ఏదో ఒక భాషను అందలం ఎక్కించి దాని కనుసన్నల్లో మిగతావి మెలగాలంటే? ఈ ఆధిపత్య ధోరణి దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్న విషయం ఈ దేశ పాలకులకు 1962లోనే చాలా బాగా తెలిసొచ్చింది.
స్వాతంత్ర్యానంతరం హిందీతోబాటు ఇంగ్లిష్ ను కూడా 15 ఏళ్ళ పాటు అధికార భాషగా ప్రకటించారు. ఈలోపు దేశ ప్రజలందరి మీదా బలవంతంగా అయినా హిందీ రుద్దేసి (నేర్పించి) హిందీని జాతీయభాషగా ప్రకటించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. 15 ఏళ్ళు గడిచాక 1962లో మళ్ళీ ఇంగ్లిష్‌ని తొలగించి హిందీని జాతీయభాషగా వివాదాస్పదమైన ప్రతిపాదన తెరపైకి వచ్చేసింది. దీంతో దక్షిణ భారతీయులే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తేసరికి అప్పటి హోమ్ మంత్రి లాల్బహద్దూర్ శాస్త్రి జాతీయభాష అనే భావన పక్కపెట్టి , దేశ ప్రజలు హిందీని అమోదించనంతవరకూ హిందీ, ఇంగ్లిష్ రెండూ అధికార భాషలుగా కొనసాగేలా 1963లో చట్టం తీసుకొచ్చారు.
పోరాటాలతో అధికార భాషా హోదాలు
1951లో రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో కేవలం 14 భాషలనే అధికారికంగా గుర్తించారు. తర్వాతి కాలంలో తమ భాషను నాశనం చేస్తున్న హిందీ ఆధిపత్యాన్ని భరించలేని అనేక భాషల వాళ్ళు తీవ్రస్థాయిలో పోరాటాలు సాగించారు, ఇంకా సాగిస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలోని 21వ సవరణలో కొన్ని భాషలకూ, 71వ సవరణలో కొన్ని భాషలకూ, 92వ సవరణలో దశాబ్దాల పోరాటం తర్వాత మైథిలీ భాషకూ, మరో నాలుగు భాషలకూ ఎట్టకేలకు 2003లో అధికార హోదా, గుర్తింపు లభించింది. దాంతో ప్రస్తుతం ఈ దేశంలో గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22కి చేరుకుంది. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర భాష మైథిలీ.
పాలకుల స్వార్థం , రాజకీయ లెక్కలు ఎంత దారుణంగా ఉంటాయంటే – జార్ఖండ్‌లో గుర్తింపుపొందిన మైథిలీ భాషకు బీహార్‌లో మాత్రం గుర్తింపు లేదు. అక్కడి లక్షల సంఖ్యలో ఈ భాష మాట్లాడుతున్నప్పటికీ… బీహార్‌లో మైథిలీని అధికారికంగా గుర్తిస్తే అంతకంటే ఎక్కువ కోట్ల సంఖ్యలో ప్రజలు మాట్లాడే భోజ్‌పురి, మగధి భాషలను కూడా గుర్తించాల్సి ఉంటుంది.
మైథిలీ లాంటి భాషల విజయంతో భోజ్‌పూరి, మగధి, రాజస్థానీ, ఛత్తీస్గఢి లాంటి మరికొన్ని భాషలు హిందీ నుంచి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటంలో
39 మాతృభాషలున్నాయి. తమ భాషను 8వ షెడ్యూల్లో కచ్చితంగా చేర్చాలన్న డిమాండ్ ఉత్తర భారత రాష్ట్రాల్లో పెద్దఎత్తున వినిపిస్తోంది. ఇదే జరిగితే ఆయా ప్రజల్ని ఆ భాషా ప్రజలుగానే గుర్తిస్తారు. అప్పుడు హిందీ ప్రజలుగా మిగిలేది ఎవరు?
రాబోయే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన హిందీ ఉద్ధారకుల , సంరక్షకుల ప్రొఫెసర్ గ్రూప్ ఒకటి ఇటీవల ప్రధాని మోడీకి ఒక లేఖ రాసింది. భోజ్‌పురి, రాజస్థానీ, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీ లాంటి అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించవద్దని, 8వ షెడ్యూల్లో కలపవద్దని ఆ లేఖ సారాంశం. ఈ భాషల్ని గుర్తిస్తే లెక్కల్లో చూపించే హిందీ ప్రజల సంఖ్య తారుమారవుతుందని ఈ ప్రొఫెసర్ గుంపు చెబితే కానీ తెలుసుకోలేనంత అమాయకులు కాదుగా బీజేపీ నాయకులు!
పాపం పహాడీ భాషల్లో స్వల్ప సంఖ్యాకులు మాట్లాడే అనేక గిరిజన భాషలున్నాయి. హిందీ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడే శక్తి లేని, తమ ఉనికి కోసం పోరాటాలు సాగించలేని ఈ భాషలన్నీ అత్యంత ప్రమాదంలో పడిపోయాయి. రాబోయే 50 ఏళ్ళలో హిందీ ఆధిపత్యానికి సుమారు 400 భాషలు అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఏపీ పాలకుల తీరు ఇదీ
ఉత్తర భారత భాషలతో సంబంధం లేకుండా తమకంటూ భిన్నమైన అస్తిత్వం, ప్రాచీన స్థాయి సాహిత్యాలున్న ద్రవిడ భాషలపైన కూడా నిన్నగాక మొన్న పుట్టిన హిందీ పెత్తనాన్ని సహించలేని ఇక్కడి రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం స్వలాభం కోసం, కేంద్ర మెప్పుకోసం తెలుగు భాషను ప్రమాదంలోకి నెడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరీ హిందీకి స్వాగతం పలుగుతున్నారు. ఈ ధోరణిని తెలుగు ప్రజలు గుర్తించి వ్యతిరేకించకపోతే , తిరస్కరించకపోతే అది మన మాతృభాషకు మనం చేసుకున్న ద్రోహమే అవుతుంది.
చివరిగా…..
హిందీని వ్యతిరేకించే పంజాబ్ రాష్ట్రం, త్రిభాషా పద్ధతిని అనుసరించక తప్పని పరిస్థితుల్లో ఇంగ్లిష్, పంజాబీ తర్వాత మూడో భాషగా తెలుగుని చేర్చింది. ఇది కూడా ఘోరమైన తప్పిదమే. పరాయి భాషలు ఇష్టంతో ఎవరైనా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బలవంతంగా పిల్లల మీద రుద్ది తప్పనిసరిగా నేర్చుకోవలసిన పరిస్థితి కల్పించడం మాత్రం అన్యాయం. పంజాబ్ స్కూళ్ళలో తెలుగు నేర్పించే టీచర్లకు కూడా తెలుగు రాదు యూట్యూబ్ ల నుంచి మొదట వాళ్ళు నేర్చుకుని దాన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు. ఉచ్చారణ దోషాలే కాదు , ఒకరకంగా చెప్పాలంటే వారి చేతుల్లో తెలుగుభాష ఖూనీ అవుతోంది. కొంతకాలానికి తెలుగు భాష పట్ల పంజాబీ విద్యార్థులకు విరక్తి పుట్టొచ్చు. ఈ దుస్థితికి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేము. అక్కడ హిందీ టీచర్లు దొరికినట్టు తెలుగు టీచర్లు దొరకరు కదా. త్రిభాష అంటే హిందీనే అవసరం లేదు ఏ భారతీయ భాష అయినా నేర్చుకోవచ్చు అని వ్యర్థ మాటలు చెప్పే వారికి బాగా తెలుసు హిందీయేతర రాష్ట్రాల్లో మూడో భాషగా హిందీనే గతి అవుతుందని. అందుకే తమిళనాడు ప్రభుత్వం చాలా తెలివిగా తమ భాష మీద ఎవరి పెత్తనాన్నీ ఆమోదించని ద్విభాషా విధానమే అవలంబిస్తోంది. అన్ని రాష్ట్రాలూ ఈ త్రిభాషా విధానాన్ని తిరస్కరించి తమ మాతృభాషకు పెద్ద పీట వేయకపోతే.. ‘ పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికినట్టు’ హిందీ మెల్లమెల్లగా మీ భాషను మింగేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.