
హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయటానికి కాషాయదళం వాడుకొంటున్న చిహ్నాలు రాముడు, రామరాజ్యంలో కూడా ఎంతో వైవిధ్యం ఇమిడి వుంది. నా చిన్న నాటి జ్ఞాపకాల ఆధారంగా గుర్తున్న విషయాలు ప్రస్తావిస్తాను. వింధ్యకు అవతల వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి అనేక మంది రాజులను జంతువులతో పోల్చి రామాయణంలో చూపుతారు. వాళ్లను మనుషులుగా పరిగణించటానికి రామాయణం సిద్ధం కాలేదు. ఇది ద్రవిడులపై ఆర్యుల ఆధిపత్యానికి చిహ్నం కాదా?
కేరళలో ఓనం పండగ గురించిన కథ విందాం. కేరళ ప్రజలు తమ చక్రవర్తి మహాబలి తిరిగి భూమ్మీదకు వచ్చిన రోజుగా ఓనం పండుగ జరుపుకుంటారు. బలి చక్రవర్తి పేరు ఆర్యుల ఇతిహాసాల్లో రాక్షసుల రాజు అని ప్రస్తావించబడుతుంది. అతన్ని చంపటానికే విష్ణువు వామన అవతారంలో వచ్చాడని ఆ పురాణాలు చెప్తున్నాయి.
హిందువుల్లో కొందరు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజులు మరికొందరికి రాక్షసులు. (ఈ రాజులు భిన్నమైనవారని కాషాయదళం చెప్పవచ్చు. మనిషి చంద్రుడు మీద అడుగుపెట్టినప్పుడు సంత్లు, సాధువులు అందరూ ఆ చంద్రుడు వేరు అని కేకలు పెట్టినట్లు).
లేదంటే రామాయణం మొత్తం రావణుని కథగా వ్యాఖ్యానించిన సందర్భాన్ని తీసుకోండి. ఈ కథలో భూమ్మీద ఉన్న ఏ జీవీ చేతిలోనూ మరణం లేని వరాన్ని పొందిన రావణుడు చివరకు జీవితం మీద విసిగి వేసారి రాముడు రూపంలో భగవంతుడు భూమ్మీదకు రావటానికి, ఆయన చేతిలో మరణం పొందటానికి వీలుగా పన్నాగం పన్ని మరణించి మోక్షం పొందుతాడు. ఈ లెక్కన విజయదశమి చెడుపై మంచి విజయం సాధించిన రోజు కాదు. రావణుడు మోక్షం సంపాదించిన రోజుగా మనం పరిగణించాలి(వేర్వేరు రామాయణం గురించిన మరిన్ని వివరాల కోసం పౌలా రిచ్మాన్, 1992 రచన చూడండి).
నిజానికి తమిళంలో ప్రసిద్ధి గాంచిన కంబ రామాయణం థాయిలాండ్‌కు చెందిన కంపన్ అనే వ్యక్తి రచించింది. కంపన్ థాయిలాండ్ రాజభవనంలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తి. రాజభవనంలో ఇప్పటికీ ఆయన కీర్తి చిహ్నంగా చిత్రపటాలు వేలాడుతూ ఉంటాయి. కంపన్ మాటల్లో ఈ పురాణ గాథ “వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విస్తరించి ఉన్న ఒకే గాథ” అని పేర్కొంటారు. అటువంటి విశ్వవ్యాప్త గాథను నేడు ఆరెస్సెస్ కాషాయదళం రాజకీయ ప్రయోజనాల కోసం ఫాసిస్టు హిందూ రాష్ట్ర సాధన కోసం హైజాక్ చేస్తోంది.
గోల్వాల్కర్ చర్చ గురించి మాట్లాడుకుందాం. ఆయన పుస్తకం ముగింపులో “ప్రాచీన నాగరికతలన్నీ ఒకటి రెండు రోజులు మనుగడ సాగించి కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే అవి సాధించటానికి ఇక్కడ ఏమీ మిగల్లేదు. కానీ మన నాగరికత అలా కాదు. ఎన్నో అవాంతరాలు, ఉత్పాతాలు ఎదుర్కొని నిలిచింది. ప్రపంచం మీద విజయం సాధించింది. అందువల్ల మనం ఆశ చంపుకోవాల్సిన అవసరం లేదు. మొదట పని చేయాలి. మనకు బాధలెక్కువ. మారుతున్న పరిస్థితులతో విసిగిపోయాము. కానీ మనం ఓపికతో ఉండాలి. ఐదో అంకంలో ఈ భీకర నాటకం సారాంశం ఏమిటో అంతుబడుతుంది. ఓపిక పట్టండి”. (గోల్వాల్కర్ 1939, పేజి 65)
ఈ భీకర నాటకం ఫాసిస్టు ప్రమాణాలతో తెరమీదకొస్తోంది. జార్జి డిమిట్రోవ్ “పాత బూర్జువా పార్టీలతో విసిగిపోయిన ప్రజలను ఫాసిజం ఇట్టే ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా చేయటం మితవాద, ప్రతీఘాత బూర్జువా వర్గాలకు ఎంతో ప్రయోజనకరం. కానీ ఫాసిజం బూర్జువా ప్రభుత్వాలపై సాగించే ఘాటైన విమర్శలతో ప్రజలను ఆకట్టుకొంటుంది. పాత బూర్జువా పార్టీల పట్ల దూషణ, భూషణలతో సాగుతుంది.” (డిమిట్రోవ్, 1972, పేజి12).
స్వతంత్ర భారత రాజకీయాలకు పునాదులుగా ఉన్న లౌకికతత్వం, ప్రజాస్వామ్యంలపై కాషాయదళం సాగిస్తున్న విద్వేష ప్రచారాన్ని మనం చూడొచ్చు. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రస్తుతం ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం తప్ప కాషాయదళం రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి సాగించిన విధ్వంసకర చర్యలు కారణం కాదన్న తప్పుడు ప్రచారం సర్వత్రా సాగుతోంది.
డిమిట్రోవ్ తన హెచ్చరికను కొనసాగిస్తూ, “ప్రజల్లో దాగి ఉన్న నిరాశా నిస్పృహలనే పణంగా పెట్టి నిజాయితీ కలిగిన, అవినీతికి తావులేని ప్రభుత్వం అనే వాగ్దానాలతో ముందుకొచ్చే ఫాసిజం, చివరకు ప్రజలను అత్యంత అవినీతికరమైన విషతుల్యమైన ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తుంది.
ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్లుగా ఫాసిజం సరికొత్త వాదనలకు దిగుతుంది. పెటీ బూర్జువా వర్గం, కొందరు కార్మికులు కూడా నిరుద్యోగం, అభద్రత, తీరని కోర్కెలతో జాతి దురహంకారంతో నిండిన ఫాసిస్టు వాగాడంబరానికి బలైపోతారు.” (డిమిట్రోవ్, 1972, పేజి 12).
కాషాయదళం నేడు సాగిస్తున్న వాగాడంబర ప్రచారం సరిగ్గా ఈ లక్షణాలనే ప్రతిఫలిస్తోంది.(అవినీతిరహిత ప్రభుత్వం గురించి వల్లెవేస్తూనే బీజేపీ మరో వైపు ఆరెస్సెస్ పరివారానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 15 కోట్ల విలువైన ఆస్తులు కట్టబెట్టింది. (ఇండియా టుడే, అక్టోబరు 30, 1992) సాధ్వి రితంబరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుకోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా కట్టబెట్టింది).
బూర్జువా భూస్వామ్య వర్గపాలనతో ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా చోటు చేసుకున్న అసంతృప్తిని దారి మళ్ళించటానికి ఈ శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. తమ జీవితాలు మరింత మెరుగు పర్చుకోవటానికి బదులుగా ఇటువంటి ఫాసిస్టు శక్తుల రాజకీయ లక్ష్యాల సాధనకు ఈ అసంతృప్తిని సాధనంగా వాడుకుంటున్నాయి.
రామమందిర నిర్మాణం ఒక్కటే ఎజెండాగా ప్రజల ముందు పెట్టిన కాషాయదళం, నిజానికి ఇక్కట్లలో ఉన్న ప్రజలను మరింత దోపిడీ చేయటానికి అవసరమైన పరిస్థితులను, పునాదులను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఈ ప్రయత్నాలకు సామ్రాజ్యవాద శక్తుల మద్దతు బహిరంగంగా సేకరించటానికి కాషాయదళం సిద్ధం కావటం రానున్న కాలంలో భారత ప్రజానీకం ముందుకు రాబోయే పెను ప్రమాదం గురించి హెచ్చరికగా పని చేస్తోంది.
కోట్లాది ప్రజల కష్టాలు, కడగళ్ళు తొలగించటం దాని రాజకీయ లక్ష్యం కాదని కాషాయదళం తన లక్ష్యాలను మరింత బాహాటంగా వెల్లడించింది. అమెరికాలో ఉన్న మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది భారతదేశంలో దారిద్య్రంలో మగ్గుతుంటే కాషాయదళాలకు ఏమీ పట్టదు. అనేక దేశాల్లో ఉన్న మొత్తం పిల్లలకంటే ఎక్కువ మంది పిల్లలు భారతదేశంలో చదువుకోవాల్సిన వయసులో పొట్టనింపుకోవటం కోసం కష్టపడుతున్నా వారికి ఏమీ పట్టదు. ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువమంది ప్రతి ఏటా భారతదేశంలో ఆకలితో చనిపోతున్నా వీరికి చీమకుట్టినట్లు ఉండదు. అటువంటి ప్రజల అసంతృప్తిని సమాధానపర్చటానికి బదులుగా పక్షపాతంతో కూడిన రాజకీయ లక్ష్య సిద్ధి కోసం వినియోగించుకోవటాన్ని మనం అనుమతించాలా? రాముడి పేరుతో కోట్లాది మంది భారతీయులను కష్టాలు, కడగళ్ళపాలు చేస్తోంది.
అంతేకాదు, కాషాయదళం ఎజెండా భారత ఆర్థికవ్యవస్థను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. 1992 డిసెంబరు 6 తర్వాత జరిగిన అల్లర్లలో వేల కోట్ల రూపాయల విలువైన సంపద బుగ్గిపాలైంది.
బొంబాయి పేలుళ్ళ తర్వాత జరిగిన ఘాతుకాలు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చాయి. మధుర, వారణాసిలలో ఉన్న మసీదులను కూడా కూల్చనున్నామని అద్వానీ ప్రకటించారు. ఇటువంటి చర్యలు భారతీయులను శాశ్వతంగా అంతఃకలహాల్లో ముంచేసే దిశగా అడుగులు వేయించనున్నాయి.
కానీ గోల్వాల్కర్, కాషాయదళాలు మాత్రం “మనకు నష్టదాయకమైనవి ఇటువంటి పరిస్థితులు కాదు. నిద్రాణంగా ఉన్న జాతీయ భావనే నష్టదాయకమని” వాదిస్తాయి.
దేశం ముందు కాషాయదళం ఉంచుతున్న ఎజెండా దాన్ని సాధించటానికి అనుసరిస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు భారతీయ తరహా ఫాసిజం తప్ప మరోటి కాదు. రాజ్య నిర్మాణంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక సామాజిక విధానాలు బిజెపి అత్యంత అభివృద్ధినిరోధక పాలకవర్గ పార్టీ అని నిరూపించాయి. ప్రస్తుతం కాషాయదళం ప్రయత్నిస్తున్నది దేశంలో కేవలం మధ్యయుగాలనాటి చీకటి సామ్రాజ్యం హిందూరాష్ట్ర నిర్మాణం ఒక్కటే కాదు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వంల పునాదులనే ధ్వంసం చేయడం జరుగుతుంది.
ఫాసిస్టు ప్రమాదం కేవలం అధికారంలో ఒక పార్టీ మారి మరో పార్టీ రావటంగా పరిగణించటానికి వీలు లేదు. సాధారణంగా ఎన్నికల్లో ఒక పార్టీ చేతిలో నుంచి మరో పార్టీ చేతిలోకి అధికారం బదిలీ కావటంగా భావించటానికి వీల్లేదు. ప్రజాస్వామ్యం ప్రాతిపదికన పని చేసే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అసహన పూరితమైన మతోన్మాదభరితమైన సిద్ధాంతం నిరంకుశత్వానికి పునాదులు వేయటంగా చూడాలి. ఇది కేవలం పార్టీల రంగుల్లో వచ్చిన మార్పు కాదు. స్వభావంలో వచ్చిన విషపూరితమైన మార్పు. ఆధునిక భారతాన్ని కాపాడుకోవాలంటే కాషాయదళం ఎజెండాను ఓడించక తప్పదు. భారతదేశాన్ని కాపాడకుండా దాన్ని మార్చటం సాధ్యం కాదు.
ముస్లిం ఛాందసవాదం..
గోల్వాల్కర్ రాసిన ఈ పుస్తకం ముద్రించిన రెండేళ్ల తర్వాత జమాత్ ఎ ఇస్లామి సంస్థ ప్రారంభమైంది. 1941 ఆగస్టు 26న మౌలానా అబుల్ అలా మహదుది నాయకత్వంలో పటాన్‌కోటలో జరిగిన ప్రారంభ మహాసభలో ఈ సంస్థ ప్రాణం పోసుకొన్నది. ఆరెస్సెస్‌కు గోల్వాల్కర్ ఎంతో జమాత్‌కు మహదుది అంత. రెండు శక్తుల మధ్య పోలికే కాదు. వారు సాధించదల్చుకున్న రాజకీయ లక్ష్యాల మధ్య కూడా పోలిక అసామాన్యం.
గోల్వాల్కర్‌కు హిట్లర్ హీరో అయితే మహదుదికి కూడా హిట్లర్ ఆరాధ్య పురుషుడే, మానవాళి నాగరికతలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ వంటి ఆధునికతనంతటినీ విదేశీ భావాలని గోల్వాల్కర్ తిరస్కరించినట్లే, మహదుది– ముస్లిం ఛాందసవాదం కూడా తిరస్కరిస్తోంది.
1947 మేలో పటాన్‌కోటలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ మహదుది దేశ విభజన తప్పదని తేలిన తర్వాత భారతదేశాన్ని తమ హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పరిపాలించుకోమని విజ్ఞప్తి చేశాము. పాకిస్తాన్‌ను అల్లా ప్రతిపాదించిన చట్టాల ద్వారా పరిపాలించుకుంటామని చెప్పాము. క్వాదియానీలకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో జరిగిన మతకల్లోలాలపై విచారణ కోసం నియమించిన ఏక సభ్య విచారణ సంఘం అధ్యక్షులు జస్టిస్ మొహ్మద్ మునిర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు వివరణ ఇస్తూ మహదుది, “భారతదేశంలో హిందూ ప్రభుత్వం అధికారానికి వచ్చి మనుధర్మ శాస్త్రం దేశ పరిపాలనా సాధనంగా మారినందున ఆ దేశంలో పాకిస్తాన్ ప్రజలను అంటరానివారిగా చూసినా, ప్రభుత్వంలో ఎటువంటి భాగస్వామ్యం ఇవ్వకపోయినా, కనీస పౌరహక్కులు కూడా ఇవ్వకపోయినా నాకు అభ్యంతరం లేదు” అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. (జెడ్ ఎ నిజామి 1975, పే 11)
హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం ఒకదాన్ని ఒకటి పెంచి పోషించుకుంటాయి. రెండు రకాల మతోన్మాదాలు జాతీయ సమగ్ర సమైక్యతలకు భంగం కలిగిస్తూ మతోన్మాద విషాన్ని మరింత ఘాటుగా విరజిమ్ముతాయి. వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే అత్యధిక ప్రజల ప్రయోజనాలకే ఈ మతోన్మాదాలు గొడ్డలి పెట్టుగా మారతాయి. ఇటువంటి మతోన్మాద రాజకీయాలను భారతీయులు తిరస్కరించారు. కాబట్టే భారతదేశం నేడు లౌకిక ప్రజాతంత్ర దేశంగా మనుగడ సాగించగలుగుతోంది. లౌకిక ప్రజాతంత్ర భారతాన్ని కాపాడుకోవాలంటే హిట్లర్ – గోల్వాల్కర్ మహదుది త్రయాన్ని ఓడించాలి. తమ చైతన్యాన్ని, అవగాహనను జాతి విద్రోహులకు తాకట్టు పెట్టని దేశభక్తులందరూ ఇటువంటి ఫాసిస్టు సవాలును అధిగమించటానికి ఒక్క తాటిమీద ముందుకు నడవాలి.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అయ్యింది. ఇది ఆరవ భాగం, ఐదవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.