
వివిధ హిందూ సంస్థల, మతాచార్యుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని దేశ విదేశాల్లో వున్న హిందువులతో సంబంధాలు పెట్టుకోవటం గురించి చర్చించటానికి, 1964లో గోల్వాల్కర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ విధంగా నేడు మనం చూస్తున్న విశ్వహిందూ పరిషత్ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి.
ఆరెస్సెస్ ప్రచారాక్ శివరాంశంకర్ ఆప్టే విశ్వహిందూ పరిషత్‌కు మొదటి ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. తర్వాతి కాలంలో విహెచ్పీ ఎదుగుదల, ఆరెస్సెస్‌కు అత్యంత నమ్మకమైన అనుబంధ సంస్థగా ఎదిగిన తీరును అర్ధం చేసుకోవటానికి ప్రత్యేక అధ్యయనం అవసరం.(బసు, దత్తా, సర్కార్, సర్కార్సేన్,పేజి 50)గోల్వాల్కర్ తెరమీదకు తెచ్చిన మరో సంఘ నిర్మాణం కుటుంబ వ్యవస్థను పోలి ఉంటుంది. ఇటువంటి కుటుంబ వృక్షం తరహాలో నిర్మించిన అనేక సంఘాలు ఆరెస్సెస్‌కు రాజకీయ ముఖంగా మారాయి.
పేర్లు, రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటి నాయకత్వం మాత్రం ఆరెస్సెస్ చేతుల్లోనే ఉంటుంది.
ఈ తరహాలోనే 1951లో భారతీయ జనసంఘ్ ప్రారంభించటానికి ఆరెస్సెస్ ప్రచారక్లైన శ్యాంప్రసాద్ ముఖర్జీని పురమాయించారు. నాటి భారతీయ జనసంఘే నేటి భారతీయ జనతా పార్టీగా మనముందున్నది.
శ్యాంప్రసాద్‌తో పాటు జనసంఘ్ కార్యకలాపాలకోసం పురమాయించబడ్డ కార్యకర్తలు దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, ఎస్ఎస్ భండారి(ఈ విషయాన్ని 1993 బసు, దత్తా, సర్కార్, సర్కార్ సేన్లల పుస్తకం పేజి 48లో ప్రస్తావించారు)ఈ కారణంతోనే డిసెంబరు 6 ఘటనల నేపథ్యంలో అద్వానీ అరెస్టయిన తర్వాత ఎస్ఎస్ భండారి పార్టీ అధికార ప్రతినిధిగా తెరముందుకు వచ్చారు.
ఈ విధంగా నేడు మనముందున్న సంఘపరివార్ నిర్మాణాన్ని తెరమీదకు తేవటంలో గోల్వాల్కర్ పాత్రను తక్కువ అంచనా వేయటానికి వీలులేదు.
ఈ నిర్మాణాన్ని తెరమీదకు తేవటం వెనకగల ఏకైక లక్ష్యాన్ని “మనం, మన జాతీయత” పుస్తకంలో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వివరించారు.
భారతదేశం మధ్యయుగాల నాటి మత ఛాందసవాదం వైపు నడవటాన్ని తిరస్కరించే ప్రతి దేశభక్తుడూ ఈ పుస్తకాన్ని, సంఘపరివారం ఉద్దేశ్యాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
“స్వరాజ్” పదానికి సరికొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించటం ద్వారా గోల్వాల్కర్ తన కసరత్తు ప్రారంభిస్తారు. స్వరాజ్ అన్న పదంలో స్వ అంటే మేము, మనం అన్న అర్థం ప్రతిపాదిస్తారు. తన పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతంలో “జాతీయ పునర్నిర్మాణం మా లక్ష్యం. రాజ్యం రూపంలో అడ్డగోలు హక్కుల కోసం కాదు. మాకు స్వరాజ్ కావాలి. ఇందులో ‘స్వ’ అంటే అర్థం ఏమిటో మనకు స్పష్టత ఉండాలి. ‘మా రాజ్యం’. మా అంటే ఎవరు?(గోల్వాల్కర్, 1939, పేజి3). మొత్తం పుస్తకమంతా మేము అంటే హిందువులం, స్వరాజ్ అంటే హిందూరాజ్ లేదా హిందూ రాష్ట్ర అన్న విశ్లేషణతో ముందుకు సాగుతుంది.
ఉద్దేశ్యపూర్వకమైన వక్రీకరణలు..
గోల్వాల్కర్ రచన మౌలిక ఉద్దేశ్యం భారతదేశం. హిందూ రాజ్యం, హిందూ రాజ్యంగానే ఉంటుంది అన్న వాదనను నిరూపించటమే.
తన రచనలో భారతదేశం అంటే రెండు సముద్రాల మధ్య ఉన్న భూభాగంగా అర్ధం చెప్తారు. నిజానికి ఆయన పుస్తకం అట్టపై ఉన్న చిత్రపటాన్ని గమనిస్తే భారతదేశం భౌగోళిక పరిధి ఏమిటో అర్ధమవుతుంది.
ఆయన దృష్టిలో నేటి ఆఫ్ఘనిస్తాన్, బర్మా, శ్రీలంకలు అన్ని కలిపి భారతదేశం. అటు చరిత్రను, ఇటు శాస్త్ర విజ్ఞానాన్ని వక్రీకరించటం ద్వారా ఈ వాదనను నిరూపించుకోవాలని గోల్వాల్కర్ ప్రయత్నిస్తారు.
మొదటిగా శతాబ్దాల తరబడి భారతదేశంలో నివసిస్తున్న వివిధ జాతులు, మతాలు, భాష, సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన వారంతా కేవలం హిందువులే అన్న వాదనను ముందుకు తెస్తారు. హిందుయేతర ఒక వర్గాన్ని సృష్టించటం ద్వారా, అటువంటి వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ హిందువులను సంఘటితం చేసే ప్రయత్నం గోల్వాల్కర్ చేస్తారు.
ఇక్కడ గోల్వాల్కర్ ప్రధానంగా హిట్లర్ తరహా ఫాసిజం అనుభవాలపై ఆధారపడతారు. అంతర్జాతీయ కార్మికవర్గం తరఫున ఫాసిజంపై తిరుగులేని పోరాటం సాగించిన జార్జి డిమిట్రోవ్, “ఫాసిజం అత్యంత సామ్రాజ్యవాద ప్రయోజనాలతో వ్యవహరిస్తోంది. కానీ ప్రజల ముందుకు మాత్రం తాము ఏదో నష్టపోయిన జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వ్యవహరించటం ద్వారా జాతీయ మనోభావాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు”(డిమిట్రోవ్ 1972, పేజి 11) అని విశ్లేషిస్తారు.
ఆరెస్సెస్‌ను కూడా అటువంటి ఛాంపియన్‌గా చూపించేందుకు హిందువులు నిరంతరం తమ హక్కులు, తాము అనుభవించే అవకాశం లేకుండా చేయబడ్డారని ప్రచారం చేయటంతో పాటు (యూదు వ్యతిరేకతను హిట్లర్ అనుసరించిన తరహాలో) నేడు హిందువులు ఉన్న పరిస్థితికి ముస్లింలే కారణమని వారి పట్ల విద్వేషం రెచ్చగొట్టడం కూడా అవసరం. ఆయన రచన “మనం, మన జాతీయత” మౌలిక లక్ష్యం ఇదే.
నేడు ఆరెస్సెస్, దాని పరివారం సాగిస్తున్న ప్రచారమంతా గోల్వాల్కర్ ప్రతిపాదించిన ఈ రెండు సైద్ధాంతిక పునాదులపైనే ఆధారపడి సాగటం గమనార్హం. ఈ దిశగా తన లక్ష్యాన్ని సాధించటానికి గోబెల్స్ ప్రచార పాటవాలను పకడ్బందీగా అమలు చేస్తూ పెద్ద పెద్ద అబద్ధాలు పదే పదే ప్రచారం చేస్తోంది ఆరెస్సెస్ (హిట్లర్ ప్రభుత్వంలో ప్రచార శాఖ మంత్రిగా గోబెల్స్ పని చేశారు). ఎంతగా ఈ అబద్ధాలు ప్రచారం చేస్తోందంటే బహుశా అవే వాస్తవాలేమో అని సందేహం వచ్చేంతగా సాగుతుంది ఈ ప్రచారం.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆరెస్సెస్ ఈ పంథాను అనుసరించే సమయానికి భారత జాతి యావత్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. కానీ, ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తన శతృవుగా గుర్తించలేదు.
బ్రిటిష్ వ్యతిరేక ఉమ్మడి జాతీయ పోరాటం కారణంగానే, ఆరెస్సెస్ ప్రతిపాదించిన హిందూ రాష్ట్ర నినాదం చుట్టూ హిందువులు సమీకరించ బడలేదు. దీంతో బ్రిటిష్ వారి పట్ల భారత ప్రజల్లో వ్యతిరేకత పెంచటానికి బదులుగా, స్వాతంత్య్ర పోరాటంలో భుజం భుజం కలిపి నడుస్తున్న ముస్లింల పట్ల వ్యతిరేకత పెంచటమే లక్ష్యంగా పనిచేసింది ఆరెస్సెస్. ఈ కారణంగానే ఆరెస్సెస్ ఏనాడూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తన శతృవుగా ప్రకటించలేదు. దీని వల్లనే ఆరెస్సెస్ దాదాపుగా స్వాతంత్య్ర పోరాటాన్ని బహిష్కరించింది. అనేక సందర్భాల్లో స్వాతంత్ర్య పోరాటాన్ని బాహాటంగా వ్యతిరేకించింది కూడా.
ఆరెస్సెస్ పట్ల సానుభూతితో ఉన్న రచయితలు సైతం(వాల్టర్ కే ఆండర్సన్, శ్రీధర్ డీ దామ్లే ఇతరులు 1987లో రాసిన కాషాయ భ్రాతృత్వం అన్న రచనలో) స్వాతంత్య్రోద్యమంలో ఆరెస్సెస్ భాగస్వామి కాకపోవటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పొందిన రాయితీలను వివరిస్తారు.
చివరికి నానాజీ దేశముఖ్ సైతం “ఆరెస్సెస్ స్వాతంత్య్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? (దేశముఖ్- 1979, పేజి 29) అని ప్రశ్నిస్తారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయి ఆంతరంగిక మంత్రిత్వ శాఖ, “సంఘ్ తనను తాను చట్టం పరిధిలో పని చేసే సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రత్యేకించి 1942 ఆగస్టులో ప్రారంభమైన ఉద్యమంలో పాలుపంచుకోకుండా బయట ఉండి పోయింది” అని నివేదిక రూపొందించింది.(ఆండర్సన్, డామ్లే రచన నుంచి సేకరణ).
భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా నిర్మించాలన్న తపనలో ఆరెస్సెస్ బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో తన మిత్రులను వెతుక్కునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్, స్వాతంత్య్రోద్యమం తాను సాధించదల్చుకున్న లక్ష్యం నుంచి ప్రజలను దారి మళ్ళిస్తున్నాయని ఆరెస్సెస్ అంచనాకు వచ్చింది.
లౌకిక, ప్రజాతంత్ర రాజ్యంగా స్వతంత్ర భారతదేశం ఉంటుందని 1931 నాటి కరాచి ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రకటించిన నాటి నుంచీ ఆరెస్సెస్, కాంగ్రెస్ పట్ల ఈ వైషమ్యం మరింత పెచ్చరిల్లించింది. ఆరెస్సెస్ నిర్ణయించుకున్న లక్ష్యాన్ని లౌకిక ప్రజాతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించాలన్న కాంగ్రెస్ తీర్మానం పూర్తి విరుద్ధమైనదిగా భావించింది సంఘపరివారం. అత్యంత నిష్టాగరిష్టుడైన హిందూ మతావలంబీకుడు, స్వాతంత్రోద్యమ సమ్మున్నత నేత మహాత్మగాంధీ ఆరెస్సెస్ లక్ష్యానికి భిన్నంగా భారతదేశం లౌకిక ప్రజాతంత్ర రాజ్యం అన్న భావనను సమర్థించినందుకే ఆయన్ను ఆరెస్సెస్ హతమార్చింది.
గోల్వాల్కర్ తన సిద్ధాంతాన్ని నిరూపించుకోవటానికి మరికొన్ని అంశాలు స్పష్టం చేయాల్సి వచ్చింది. భారతదేశంలో హిందువులు మాత్రమే ఆది నుంచీ నివసిస్తున్న ప్రజలని నిరూపించటం మొదటి లక్ష్యం.కేవలం వక్కాణించడం ద్వారా గోల్వాల్కర్ ఈ అంశాన్ని నిరూపించటానికి ప్రయత్నం చేశాడు.
“మనం హిందువులం – ఈ భూమిని విదేశీయులు ఆక్రమించుకోక ముందు 8- 10 వేల సంవత్సరాల క్రితమే మన ఆధీనంలోకి తెచ్చుకున్నామని చెప్పటాన్ని ఇక సందేహించాల్సిన అవసరం లేదు.” అందువల్లనే “ఈ ప్రాంతాన్ని హిందువుల భూమి (గోల్వాల్కర్- 1939, పేజీ 6)అని ఆయన వాదిస్తారు. ప్రాచీన భారత దేశ చరిత్ర గురించి జరిగిన శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెలుగు చూసిన అసామాన్యమైన శాస్త్రీయ ఆధారాలను, భారతదేశానికి బయట ఉన్న వారు సింధు నదిని ఇండస్‌గా పిలవటం వల్ల, ఈ ప్రాంతానికి హిందూ దేశమని పేరు వచ్చి ఉండే అవకాశం ఉందన్న వాదనలను గోల్వాల్కర్ పరిశీలించ నిరాకరించారు.
ఈ విధంగా వక్కాణించిన తర్వాత హిందువులు మరే ఇతర ప్రాంతం నుంచి ఇక్కడకు రాలేదని, స్వతహాగా ఇక్కడి వారే అని నిరూపించటానికి పూనుకున్నాడు గోల్వాల్కర్. ఇలా నిరూపించటం గోల్వాల్కర్ నిర్దేశించుకున్న రాజకీయ లక్ష్య సాధనకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ విషయంలో ఆయన విఫలం అయ్యారంటే హిందువులు కూడా ఇతరుల్లాగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే, బయటి వారే అని నిరూపితమవుతుంది.
ఈ విషయాన్ని నిరూపించటానికి అత్యంత మోసపూరితమైన విధానాన్ని గోల్వాల్కర్ అవలంబిస్తారు. తన పుస్తకమంతటా ఆయన హిందు, ఆర్య జాతి పదాలు పర్యాయ పదాలుగా ప్రయోగిస్తారు. ఈ విధంగా ఆర్యులు ఇతర ప్రాంతాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారు కాదని, ఇక్కడి వారేనని నిరూపించటానికి పూనుకున్నారు. దీనికి భిన్నంగా ఉన్న అన్ని రకాల సాక్ష్యాధారాలను పాశ్చాత్య మేధావుల లోపభూయిష్టమైన ప్రయత్నంగా ఆయన కొట్టిపారేస్తారు.(గోల్వాల్కర్, పేజీ 6)
ఈ ప్రయత్నంలో ఆయన వేదాలు ఆర్కిటిక్ ప్రాంతంలో ఆవిర్భవించాయన్న వాదన ముందుకు తెచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అత్యంత ప్రజాదరణ కలిగిననాయకుడే కాక స్వయంగా హిందువు అయిన తిలక్ వాదనను గోల్వాల్కర్ తిరస్కరించ లేకపోయారు.
దీంతో ఒక వింత వాదనను ముందుకు తెస్తారు గోల్వాల్కర్. “ఆర్కిటిక్ ప్రాంతంకూడా నేటి బీహార్, ఒరిస్సాలకు చెందిన ప్రాంతమని” ఆ తర్వాత, “ముందు ఈ ప్రాంతం ఈశాన్యం దిశగా కదిలి తర్వాత పశ్చిమ దిక్కుగా ప్రయాణించి నేడున్న స్థానానికి చేరింది” అన్నదే ఆయన ముందుకు తెచ్చిన వింత వాదన.
ఒక వేళ అదే నిజమైతే మనమే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విడవడి హిందూస్తాన్‌గా వచ్చి స్థిరపడ్డామా? లేక మన నుంచి ఆర్కిటిక్ ప్రాంతం వేరుపడి అడ్డదిడ్డంగా ప్రయాణం చేసిందా అన్న ప్రశ్నకు వివరణ లేదు.
ఒక వేళ ఈ విషయమే లోకమాన్య తిలక్ జీవిత కాలంలో నిరూపితమై ఉంటే, ఆయన వేదాలకు నిలయమైన ఆర్కిటిక్ ప్రాంతమే హిందూస్తాన్ అని, హిందువులు ఆ ప్రాంతం నుంచి వలస రాలేదని, ఆర్కిటిక్ ప్రాంతమే హిందూస్తాన్ నుంచి వలస వెళ్లిందని విస్పష్టంగా ప్రకటించేవారని ఎటువంటి తటపటాయింపులు, తడబాటు లేకుండా అలవోకగా గోల్వాల్కర్ చెప్పేస్తారు.
(సీతారాం ఏచూరి రాసిన ఈ వ్యాసం ఆరు భాగాలుగా ప్రచురితం అవుతుంది. ఇది రెండో భాగం, మొదటి భాగం కోసం “హిందూ రాష్ట్ర అంటే ఏంటి?” మీద క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.