Reading Time: 6 minutes
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన పది సంవత్సరాల తరువాత భారతదేశ పారిశ్రామికరంగం ఎదుర్కొంటున్న సమస్య తీవ్రమైంది.
గత నెలలో నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నినాదంతో దేశ పారిశ్రామిక రంగం పురోగమించిన తీరు గురించి కొన్ని వివరాలు కూడా జారీ చేశారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఈ వివరాలు అటు జాతీయ గణాంక సంస్థలు ఇటు అంతర్జాతీయ గణాంక నిపుణులు వెల్లడిస్తున్న వివరాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ఇటువంటి ప్రయత్నాల ద్వారా భారత పారిశ్రామిక రంగాన్ని సంస్కరించుకునేందుకు చేసే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదం మారుమోగుతున్న గత పదేళ్లల్లో దేశ పారిశ్రామిక రంగం ఎప్పుడూ లేనంతగా చైనాపై ఆధారపడిరది.
2014లో ‘మేక్ ఇన్ ఇండియా’తో నాలుగు లక్ష్యాలను సాధించడం మోడీ ఆకాంక్ష :
- భారత పరిశ్రమ వఅద్ధి రేటును సంవత్సరానికి 12-14%కి పెంచడం.
- 2022 నాటికి 100 మిలియన్ల పారిశ్రామిక ఉద్యోగాలను సృష్టించడం.
- 2022 నాటికి తయారీ రంగం వాటాను స్థూల జాతీయోత్పత్తి (జీడీపి)లో 25%కి పెంచడం (కొన్ని సంవత్సరాల తర్వాత 2025కి గడువు మార్చబడింది)
- భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు చైనా లో పెట్టే పెట్టుబడుల కంటే ఎక్కువ విలువ వస్తుందని రుజువు చేయటం ద్వారా భారతదేశాన్ని ‘ప్రపంచపు కొత్త కర్మాగారం’గా మార్చి, చైనా స్థానాన్ని ఆక్రమించడం
ఈ ప్రాజెక్టులో భారతీయ పరిశ్రమలోని 25 కి పైగా రంగాలు పాల్గొన్నాయి. పది సంవత్సరాల తరువాత ఈ లక్ష్యాలను చేరుకోలేకపోవడమే కాకుండా, పరిస్థితి మరింతగా దిగజారింది.
పరిశ్రమల వృద్ధి రేటు రెండంకెలకు చాలా దూరంగా ఉంది . 2014 నుండి పారిశ్రామిక రంగ వృద్ధి రేటు సగటున 4% ఉంది. వస్తూత్పత్తి రంగంలో వృద్ధి రేటు ఇంతకన్నా తక్కువగా ఉంది. ఎంతగా తగ్గిందంటే జీడీపి లో తయారీ వాటా పెరగడానికి బదులుగా క్షీణించడం కొనసాగింది. కోవిడ్-19 సంక్షోభానికి ముందు 2010-11 నుండి 2019-20 మధ్యకాలంలో ఈ రంగాలు భారత ఆర్థిక వ్యవస్థకు జోడించిన విలువ రేటు 18.3% నుండి 14.72%కి పడిపోయింది.
కోవిడ్ సంక్షోభం నుండి బయటపడిన రెండు సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 2022-23లో 14.70% కి పడిపోయింది. ఇది 1968-69 తర్వాత అత్యల్ప సంఖ్య. ఆశించిన 100 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించడానికి బదులుగా పారిశ్రామిక రంగం లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయింది. వస్తూత్పత్తి రంగ కార్మికుల సంఖ్య 2017లో 51.31 మిలియన్ల నుండి 2022-23లో 35.65 మిలియన్లకు పడిపోయింది. ఈ పతానికి కోవిడ్-19 సంక్షోభం కూడా పాక్షికంగా కారణం. దీని ఫలితంగా వస్తూత్పత్తి రంగ కార్మికుల సంఖ్య 2021లో 30 మిలియన్ల కంటే తక్కువకు పడిపోయింది. 2016-17 నుండి 2022-23 మధ్య వస్తూత్పత్తి రంగం దాదాపు 1 మిలియన్ కార్మికులను కోల్పోయింది.
ఈ వైఫల్యానికి కొంతవరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) కారణం. భారతదేశంలో కారుచౌకగా దొరికే శ్రమ శక్తి కి విదేశీ పెట్టుబడులు తోడయితే చైనా తరహా నమూనాను అనుకరించవచ్చని మోడీ ప్రభుత్వం ఆశించింది. తదనుగుణంగా భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేసింది. నిజానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014లో సంవత్సరానికి 36 బిలియన్ల డాలర్లు ఉంటే 2022 నాటికి దాదాపు 85 బిలియన్లకు పెరిగింది. అయితే ఈ విజయాన్ని రెండు కోణాల నుండి చూడాలి.
మొదటది, 2018-19 నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో కొంత భాగాన్ని మాత్రమే – ఉత్పాదక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. 2020-21లో 80 బిలియన్ డాలర్లకు పైగావున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో కేవలం 21 బిలియన్ డాలర్లు మాత్రమే ఉత్పాదక పెట్టుబడులుగా ఉన్నాయి. మరో రకంగా చూస్తే దేశ స్థూల పెట్టుబడిలో 3.1% మాత్రమే. దేశ స్థూల పెట్టుబడిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 2018-19 లోనే గరిష్ట స్థాయికి చేరింది. 2018-19లో దేశ స్థూల పెట్టుబడిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 6.5% కంటే ఎక్కువ లేదు.
రెండవది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వాస్తవ ప్రయోజనాన్ని కొలవడానికి, మనం దానిని జీడీపితో అనుసంధానించాలి. ఈ కోణం నుండి చూచినప్పుడు చిత్రం భిన్నంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 2014-15 నుండి 2022-23 వరకు భారత జీడీపిలో సగటున 1.76% మాత్రమే ఉంది. ఇది అంతకు ముందటి దశాబ్దంలో 2007-08 నుండి 2014-15 మధ్యకాలంలో జీడీపిలో సగటున 2.14%, వరకు ఉంది.
మూడవది, 2022 నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గణనీయంగా తగ్గుతోంది. ఇది 2022-23లో 71 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2023-24లో 10 బిలియన్లకు పైగా పతనం అయింది. అంటే 60% తగ్గింది. 2007 నుండి ఇది అత్యల్ప సంఖ్య. ఆ సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జీడీపిలో కేవలం 0.7% మాత్రమే ఉంది. ఇది స్వతంత్ర భారతదేశంలో రికార్డు. ఈ గణాంకాలు వేసుకున్న అంచనాలకు విరుద్ధమైనవి. ఎందుకంటే బాగా ప్రచారం చేయబడిన భారీ పెట్టుబడుల శ్రేణి అమెరికాలో ‘డికప్లింగ్’, యూరప్‌లో ‘డి-రిస్క్’ అని పిలువబడే ప్రక్రియ నుండి భారతదేశం ప్రయోజనం పొందుతోందనే అభిప్రాయాన్ని స్రుష్టించింది.అంటే చైనాలో భారీగా పెట్టుబడి పెట్టిన పాశ్చాత్య సంస్థలు తమ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల ఆ దేశం నుండి పాక్షికంగా ఇతర దేశాలను మళ్లిస్తాయని ఆశించారు. దీన్నే అమెరికాలో డికప్లింగ్ అని పిలిస్తే యూరప్‌లో ప్రమాద నివారణ లేదా ప్రమాదాన్ని తగ్గించుకోడం అని పిలుస్తున్నారు. కానీ ఈ మళ్లింపు వలన వియత్నాం వంటి ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలు పొందినంత ప్రయోజనం భారతదేశానికి దక్కలేదు.
నాల్గవది, అయితే 2017 నుండి ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవలతో (ముఖ్యంగా ఐటి) ప్రారంభించి తొమ్మిది రంగాలలో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రధానంగా వస్తూత్పత్తి రంగంతో సహా మిగిలిన 53 రంగాలకు మళ్లిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో కేవలం 30% మాత్రమే పొందాయి.
చివరగా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశ నుండి ఎగుమతులను పెంచడంలో విఫలమైంది. ఈ ఎగుమతులు గత 10 సంవత్సరాలుగా క్రమంగా పడిపోయాయి. 2013-14 జీడీపిలో 10.2%గా వున్న ఈ ఎగుమతులు 2022-23లో 8.2%కి పడిపోయాయి. భారతీయ పారిశ్రామిక రంగం అధిక ఎగుమతులు చేయడంలో విఫలమైతే మరోవైపు సాపేక్షంగా చైనా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుబంధంగా, 2020 నుండి మోడీ ప్రభుత్వం ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహకాలను (పిఎల్ఐ) ఇస్తోంది. కీలక రంగాలలో పనిచేస్తున్న పెట్టుబడిదారులకు సహాయం చేయడం, భారతీయ సంస్థల అంతర్జాతీయ పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం.
పిఎల్ఐ ల రూపంలో దేశ ఖజానాపై పెరుగుతున్న భారం అటువంటి రాయితీల ప్రాసంగికతనూ, అవసరాన్ని ఔచిత్యాన్ని రెండింటిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఈ ఖర్చు సహజంగా ఇతర అంశాలకు జరిగే బడ్జెట్ కేటాయిపులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం పెద్ద సంస్థలకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఈ సమస్య చాలా సున్నితంగా ఉంటుంది. అమెరికన్ తయారీదారు మైక్రాన్ గుజరాత్లో స్థాపించిన మైక్రోప్రాసెసర్ ఫ్యాక్టరీలో – ఇది మీడియాలో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది – 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దీనిలో మైక్రాన్ పెట్టిన పెట్టుబడి కేవలం 825 మిలియన్ డాలర్లే. ‘మిగిలిన’ నిధులను న్యూడిల్లీ, గాంధీనగర్ ప్రభుత్వాలు సమకూర్చాయి. మరింత ముఖ్యమైన విషయం ఏమంటే ఇప్పటివరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పారిశ్రామిక పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి.
స్తంభించిన పారిశ్రామిక పెట్టుబడులు
1990, 2000వ దశకాలలో గణనీయంగా పెరిగిన తర్వాత ఉత్పాదక పెట్టుబడి రేటు (స్థూల మూలధన నిర్మాణం) నిర్మాణాత్మకంగా బలహీనపడిరది: ఇది 2007లో దాదాపు 42% ఉంటే 2020లో 29%కి పడిపోయింది. ఇది 2023 నాటికి 34%కి పెరిగింది, కానీ ఇది ఇప్పటికీ గతంలో వున్న 42 శాతం కంటే తక్కువే.
ఆందోళనకరమైనన ఈ పతనానికి మూల కారణం ప్రైవేట్ పెట్టుబడిలో క్షీణత. ప్రైవేట్ పెట్టుబడి రేటు 2011లో 31% నుండి 2020లో 23%కి పడిపోయింది. అప్పటి నుండి అది కోలుకున్నప్పటికీ, 2022లో 27% వద్దనే ఉంది. ముఖ్యంగా తయారీ రంగంలో 2011-12, 2021-22 మధ్య జీడీపిలో 6.1% నుండి 4.2%కి పెట్టుబడి బాగా పడిపోయింది.
ప్రైవేట్ పెట్టుబడిలో సాపేక్ష పతనాన్ని మనం ఎలా వివరించగలం?
బలహీనమైన డిమాండ్ ఇక్కడ ఒక ప్రధాన కారకంగా ఉంది. వస్తూత్పత్తి రంగంలోని కంపెనీల్లో తరచుగా మిగులు ఉత్పత్తి సామర్థ్యం సమస్యగా ఉంది. అంటే సంవత్సరానికి వెయ్యి కార్లు ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న కంపెనీ 50 కార్లే తయారు చేస్తే మిగిలిన యాభై కార్ల ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉంటుంది. అందువల్ల ఉత్పత్తి సామర్థ్యం విస్తరించుకోవాల్సిన అవసరం కంపెనీలకు కనిపించటం లేదు. 2011లో నిరుపయోగంగా ఉన్న ఉత్పాదక సామర్ధ్యం 18 శాతం వరకూ ఉంటే 2021 నాటికి 40%కి పెరిగింది. కోవిడ్ కాలంలో లాక్డౌన్ కారణంగా మూతపడటం కూడా ఈ స్థాయిలో ఉత్పాదక సామర్ధ్యం నిరుపయోగంగా పడిఉండటానికి ఓ కారణం. 2022 నుండి పరిస్థితులు కాస్తంత మెరుగు పడ్డా నిరుపయోగమైన ఉత్పాదక సామర్ధ్యం 25 శాతం వరకూ ఉంటుంది. అయినా 2011 కంటే ఇది ఎక్కువే. మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గిపోవడం ఈ గిరాకీ పడిపోవడానికి కారణం.
1990-2000 సంవత్సరాలలో మధ్యతరగతి గణనీయంగా పెరగటం, వారి కొనుగోలు శక్తి పెరగటంతో ఆ దశాబ్దంలో జరిగిన ఆర్థికాభివృద్ధికి పునాదిగా ఉంది. ఇంకా చెప్పాలంటే, 2000లను నిశితంగా పరిశీలిస్తే, భారత ఆర్థికాభివృద్ధి రెండంకెల రేట్లతో దూసుకుపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ఆకర్షణీయమైన వాస్తవ వడ్డీ రేట్లు. రెండోది కార్యరూపం దాల్చని అతి అంచనాలు. ఈ రెండిరటి కారణంగా వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. 1990లలో భారతదేశం స్వీకరించిన అభివృద్ధి నమూనా అసమానతల పెరుగుదలను తీవ్రతరం చేసింది. వాస్తవంలో కొద్దిమంది భారతీయులు మాత్రమే ప్రయోజనం పొందారు. శతాబ్దం ప్రారంభం నుండి అసమానతలలో విపరీతమైన పెరుగుదల ఉంది. జాతీయ ఆదాయంలో అత్యంత ధనవంతులైన 10% వాటా 1990లో 34.4% ఉండగా, అది 2018లో 57.1%కి పెరిగింది. అదే సమయంలో, అదే జాతీయ ఆదాయంలో అత్యంత పేదలుగావున్న 50% వాటా 20.3% నుండి 13.1%కి పడిపోయింది. ఈ కాలంలో స్థూల జాతీయ ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే మధ్యతరగతిలో కొంత భాగం పేదరికంలోనే ఉంది. దీనివల్ల కొన్ని వినియోగ వస్తువులు అందుబాటులో లేవు. నిజానికి, 1970ల తర్వాత మొదటిసారిగా 2017-18లో, జాతీయ నమూనా సర్వే కార్యాలయం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్యలో పెరుగుదలను నమోదు చేసింది. చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ – 2011-12లో 21.9% నుండి 2017-18లో 22.8%కి దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నవారి సంఖ్య పెరిగింది.
ధనిక భారతదేశం పారిశ్రామికవేత్తలను పెట్టుబడి పెట్టాలని ఒప్పించేంత పెద్ద మరియు నిలకడైన మార్కెట్‌ను అందించలేకపోయింది. దాదాపు 80 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు ఆహార సహాయానికి అర్హులు. ఇది ఖర్చు పెట్టగల వినియోగదారుల మార్కెట్ కుచించుకుపోయిందనటానికి స్పష్టమైన ఉదాహరణ.
కుదించుకుపోతున్న భారతీయ వినియోగదారుల కొనుగోలు శక్తి పొదుపు రేటు తగ్గుదల్లో కనిపిస్తుంది. ఇది 2024 జీడీపిలో 5.3% గా ఉంది. 1970ల తర్వాత ఇది అత్యల్ప స్థాయి. అదే సమయంలో ఎక్కువ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. 2023లో వినియోగదారులు తీసుకున్న రుణాలు జీడీపిలో 5.8% ఉన్నాయి. ఇది 1970ల తర్వాత మరొక రికార్డు అని చెప్పవచ్చు.
వ్యక్తిగత పొదుపు స్థాయి తక్కువగా ఉండటం వల్ల వ్యాపారాలకు రుణాలు ఇవ్వడానికి ఉపయోగించగల మిగులు వనరులు బ్యాంకుల వద్ద లేకుండా పోతున్నాయి. అందువల్ల వాటి ప్రతిపాదిత ప్రాజెక్టులు పెట్టుబడి కొరతతో విఫలమవుతున్నాయి. మరోవైపున బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లలో నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల భారం పెరిగి వ్యాపారాలకు సులభంగా రుణాలు ఇవ్వకపోతున్నాయి. 2000 దశకంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా మార్చుకోలేకపోయినందున తిరిగి బ్యాంకులకు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. ఆ సమయంలో వాస్తవాతీతమైన ప్రతిపాదనలు, నమ్మకాలుతో వివిధ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టటానికి దారితీసింది. పర్యవసానంగా బ్యాంకులు చాలా దుర్బలంగా మారిన ఫలితంగా నేడు ప్రతిపాదిత ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు.
భారతీయ పరిశ్రమ ప్రస్తుతం ఇబ్బంది పడటానికి చివరి కారణం దానికి చైనా పోటీదారులతో పోటీపడగల స్థితి లేకపోవడమే. భారతదేశం దాని సరళీకరణ విధానంలో భాగంగా తన మార్కెట్ తలుపులు తెరిచినందున చైనా ఉత్పత్తిదారులు భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలోకి చొచ్చుకుపోయేందుకు అవకాశం కల్పించింది.
చైనా పరిశ్రమపై ఆధారపడటం
2024లో 118 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో చైనా మరోసారి భారతదేశానికి ప్రముఖ వాణిజ్య భాగస్వామిగా మారింది. అప్పటి వరకూ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు అమెరికాయే ప్రధాన భాగస్వామి. కానీ గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించింది. చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 2019-20లో 46 బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 85 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత దేశం నుండి చైనాకు అయ్యే ఎగుమతుల విలువ కేవలం 17 బిలయన్ డాలర్లకంటే తక్కువే. అవి కూడా ప్రధానంగా శుద్ధి సేని వంట నూనెలు, ముడి ఇనుము వంటి ముడిసరుకులే. కానీ చైనా భారతదేశానికి చేస్తున్న ఎగుమతుల విలువ 101 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. (2019లో 70.3 బిలియన్ డాలర్లు మాత్రమే) ఉంది. వీటిలో ప్రధానంగా యంత్ర పరికరాలు, కంప్యూటర్లు, సేంద్రీయ రసాయనాలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు మరియు ప్లాస్టిక్‌లతో సహా పారిశ్రామిక ఉత్పత్తులు ఉన్నాయి.
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో సగం విద్యుత్ బొగ్గు ఆధారిత ఉత్పత్తే. హరిత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం దిశగా మారటానికి సౌరశక్తిపై ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ దాని సౌర విద్యుత్‌కు అవసరం అయిన స్థాయిలో సౌరశక్తి ఆకర్షక ప్యానెల్లను ఉత్పత్తి చేయడం లేదు. ఫలితంగా, మూడిరట రెండు వంతుల ఫోటోవోల్టాయిక్ సెల్స్, 100% వేఫర్స్ (ఈ సెల్స్ యొక్క ముఖ్యమైన భాగాలు) దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. మొత్తంమీద చైనా తన సౌర ఫలకాలకు అవసరమైన భాగాలలో 57% నుంచి 100% మధ్య భారతదేశానికి సరఫరా చేస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెలలో భారతదేశంలోకి చైనా సౌర ఫలకాల దిగుమతులు 500 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. దీనికి హాంకాంగ్ నుండి చేసుకున్న దిగుమతులలో 121 మిలియన్లు, వియత్నాం నుండి చేసుకున్న దిగుమతులలో 455 మిలియన్లు జోడించాలి. అదనంగా చైనా 500 మిలియన్ విలువైన ఫోటోవోల్టాయిక్ సెల్స్ ను విక్రయించింది. వీటి ఆధారంగా సౌర విద్యుత్ ఉత్పత్తి సాధనాలు తయారు చేసుకోవడం దేశీయ పరిశ్రమల పని. అదేవిధంగా మలేషియా 264 మిలియన్ డాలర్ల విలువైన ఉపకరణాలు, థాయిలాండ్ 138 మిలియన్ డాలర్ల విలువైన ఉపకరణాలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ గణాంకాలు భారతదేశం ఈ రంగంలో తన విదేశీ సరఫరాదారులపై అపరిమితంగా ఆధారపడటాన్ని రుజువు చేస్తున్నాయి. భారతీయ కంపెలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నప్పటికీ, వారు తమ సొంత సాంకేతికతను అభివఅద్ధి చేసుకోవడం లేదు. కానీ వారికి కావలసిన పరికరాలలో 70% చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. చైనా ఎగుమతులను పరిమితం చేయడానికి భారతదేశం సుంకం లేని అడ్డంకులను ఎక్కువగా ఆశ్రయిస్తోంది. కానీ భారతీయ తయారీదారులు తగిన సాంకేతిక పరిజ్ఞానాలను అభివ్రుద్ధి చేసుకోకపోతే ఇవి వ్యర్థమయ్యే అవకాశం ఉంది.
జనరిక్ ఔషధాల విస్తృతి రీత్యా భారత ఆర్థిక వ్యవస్థలో ఔషధ రంగం ఓ కీలక స్థానానికి చేరింది. ఈ రంగంలో కూడా ఇదే సమస్య కనిపిస్తుంది. ప్రపంచంలో అగ్రగామిగావున్న భారతదేశం అంతర్జాతీయ ఔషధ ఎగుమతుల్లో కేవలం 20% వాటా మాత్రమే కలిగి ఉంది. దీని విలువ 25 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. అయితే, ఈ రంగం ప్రధాన బలహీనత పరిశోధన మరియు అభివృద్ధి లేకపోవడమే. భారతీయ కంపెనీలు తరచుగా మాలెక్యూల్స్ లను కాపీ చేయడంతో సంతృప్తి చెందుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరం అయిన ముడిసరుకుల ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడంలో కూడా విఫలమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారికి ముందు, ఔషధాల తయారీకి అవసరం అయిన ముడిసరుకులలో మూడింట రెండు వంతులు చైనా నుండి వచ్చాయి. ప్రభుత్వం ఔషధ పరిశోధన మరియు అభివృద్ధికి 2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఇవ్వడం ద్వారా కంపెనీలు ఈ రంగంలో నూతన ఆవిష్కరణలకు సిద్ధపడేలా ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ, చైనా ఉత్పాదకాల(ఇన్పుట్లు)కు అజేయమైన పోటీతత్వం ఉండటంవల్ల పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన పది సంవత్సరాల తర్వాత భారతదేశ పారిశ్రామిక రంగంలో సమస్య తీవ్రమైంది. చైనాతో పోటీ పడే సందర్భంలో ఇది దేశ జాతీయ సార్వభౌమత్వానికి ముప్పుగా మారటమే కాకుండా, సరైన పారిశ్రామికీకరణ ప్రక్రియ లేకుండా ప్రతి సంవత్సరం ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించే కోటి మంది యువతకు లేదా వ్యవసాయాన్ని విడిచిపెట్టాలనుకునే వారికి దేశం పనిని కల్పించలేని స్థితిలో ఉంది. వాస్తవానికి ఈ విషయంలో దేశం ఫణమొడ్డుతోంది భారీ మూల్యమే.
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ సెరి సైన్సెస్‌లో పరిశోధన డైరెక్టర్. కింగ్స్ కాలేజ్ లండన్‌లో రాజకీయాలు మరియు సామాజిక శాస్త్ర ప్రొఫెసర్. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో నాన్ రెసిడెంట్ ఫెలో. ఆయన ప్రచురణలలో మోడీస్ ఇండియా: హిందూ నేషనలిజం అండ్ ది రైజ్ ఆఫ్ ఎత్నిక్ డెమోక్రసీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్, 2021, మరియు గుజరాత్ అండర్ మోడీ: లాబరేటరీ ఆఫ్ టుడేస్ ఇండియా, హర్స్ట్, 2024 వంటి రచనలు అనేకం ఉన్నాయి. ఈ రెండూ భారతదేశంలో వెస్ట్ ల్యాండ్ ద్వారా ప్రచురించబడ్డాయి.
-క్రిస్టోఫ్ జాఫ్రెలాట్
అనువాదం : నెల్లూరు నర్సింహారావు