ప్రధాని మోడీ ఈ దేశాధినేత హోదాలో రెండు ప్రధాన లక్ష్యాలు తనకి తాను నిర్దేశించుకున్నాడు. దేశాధినేత అన్న తర్వాత ఆ మాత్రం పట్టుదల ఉండాలి కదా…
మొదటిది 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం. అంటే భారతదేశం అమెరికా లాగానో చైనా లాగానో అవబోతోంది. సంపన్నవంతమైన, అంతర్జాతీయ ప్రభావం చూపగల మహా శక్తి గా. కాకపోతే దేశాన్ని అంటారు మహాశక్తిగా మార్చటానికి కావాల్సిన దృక్పదంగానీ, మార్గం గురించిన వ్యూహ రచన కానీ లేవు. ఈ లక్ష్యాన్ని చేదించాలనే ప్రధాని మోడీ ఆశిస్తున్నారు కానీ ఎలాగా అన్నదే అంతు చిక్కడం లేదు. ఆది నుండే ఎలా అడుగులు వేయాలో తెలీక తడబడుతున్నారు.
ఆయన చుట్టూ ఉన్న వందాగధులకి ఈ విషయం అర్థమవుతోంది. ఆర్థికాభివృద్ధి రేటు సాధించటంలో ఆర్థిక వ్యవస్థ తొర్రుపాటుకి గురి అవుతున్నపుడు వీళ్లంతా మౌనముద్ర దాలుస్తున్నారు. కానీ ఎక్కడన్నా ఆర్థిక వ్యవస్థలో ఓ కుదుపు లేదా కదలిక కనపడితే అదిగదిగో భళ్ళున తెల్లారే అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా అడుగులు కదలాడే అని పిక్కటిల్లుతున్నారు. ఇలా దిక్కులు పిఒకటిల్లెలా మాట్లాడేటపుడు జహార్ లాల్ నెహ్రూను ఆయన అధమస్థపు పాలనను మర్చిపోలేరు కదా… ఆయా విషయాల్లో ఆయా సందర్భాల్లో నెహ్రూ వైఫల్యాల గురించిన ప్రసంగాలు ధారాళంగా ప్రవహిస్తుంటాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నెహ్రూ ఎపుడూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపోటు పొడవలేదు. పేదలను కటిక పేదలుగా మార్చలేదు. నోట్ల రద్దు లాంటి మాస్టర్ స్ట్రోక్స్ ద్వారా జనాన్ని వీధుల పాలు చెయ్యలేదు.
మార్చి 2020 లో దేశాన్ని కొ్విడ్ కబళించింది. కానీ దానికంటే ముందే ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండేళ్ల ఎనిమిది నెలల పాటు మందగిస్తూనే ఉంది. ఎందువలన ? ఈ విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే ఒప్పుకుంటే మార్గాంతరం అన్వేషించాలి. అదేమో చేతకాని వ్యవహారం. కోవిడ్ లాక్డౌన్ నుండి బయటపడిన దేశం లో కోవిడ్ చేసిన గాయాలకు లేపనాలు రాసుకుంటూ అప్పటి వరకు కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా లేచి నిలబడే ప్రయత్నం చేసింది. రొప్పుతూ రోజుతూ ప్రయాణం మొదలు పెట్టింది. ఇంకేముంది !మహాద్భుతం జరిగినట్లు బంధుజనం బాజాభజంత్రీలతో ఊరేగింపులు మొదలు పెట్టింది. మహా నాయకుని మహిమగల శక్తి వలన సరిగ్గా కూర్చోవడం కూడా తెలీని ఆర్థిక వ్యవస్థ లేచి నిలబడింది అని బ్రహ్మరథం పట్టారు.
ఇపుడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మోరాయించడంతో ప్రమథ గణాలు మౌన ముద్రలోకి జారుకుంటున్నాయి.
ఈ రంగంలో నరేంద్రమోడీని బాగా ఆకాశానికి ఎత్తిన వ్యక్తి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన అరవింద పనగారియా. తనకి లాగే మోడీ కూడా స్వేచ్ఛా మార్కెట్ పిపాసి అనుకున్నారు పనగారియా. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా 2017 వరకు పనిచేశారు. 2017 సెప్టెంబర్ లో రాజీనామా చేసి అమెరికాకి వెనక్కి వచ్చారు. రాజీనామా చేసినప్పటి నుండి భారత ప్రభుత్వం రక్షణాత్మక ఆర్థిక విధానాలు అనుసరిస్తోందని ఆవేదన చెందుతూ విమర్శలు కురిపిస్తున్నారు. భారతదేశం 2020 లో టైర్లు టెలివిజన్ వంటి వాటిపై సుంకాలు విధించడం నోట్ల రద్దు నాటి ఆలోచనని తిరగదోడుతుందని అభిప్రాయపడ్డారు. నొట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించి, చిన్న మధ్యతరహా పరిశ్రమల మనుగడకి మార్గం సుగమం చేస్తుందని ఆయన నమ్మినట్టున్నారు. అప్పటివరకు ఆర్థిక వ్యవస్థ లావాదేవీల్లో గణనీయమైన భాగం లెక్కలోకి రావడం లేదనీ నోట్ల రద్దుతో అందరూ లెక్క చెప్పాల్సి వస్తుంది అని ప్రదానితో సహా అందరూ ఢంకా బజాయించారు.
2017 లో మోడీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు ధోరణి కారణంగా ఆయన ఆందోళన చెందుతున్నట్టు రక్షణాత్మక విధానాలకు అది ఆరంభం అని ఆయన ఇపుడు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. 2020లో ఆత్మ నిర్భర భారత్ పథకాన్ని ఆరంభించిన తర్వాత పనగారియ స్పందిస్తూ 1991 నుండి దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో తీసుకున్న అనేక విధానాలను ఈ పథకం తిరగదోడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
” ఈ విధానం గత ఆరేళ్లలో సాధించింది ఏమిటి?” అంటూ ఆత్మ నిర్భర భారత్ పథకం గురించి ప్రశిస్తున్నారు. “2013-19 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు 32.4 బిలియన్ డాలర్ల నుండి 55.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ కాలంలో మన ఎగుమతులు కేవలం 7.6 బిలియన్ డాలర్ల నుండి 8.9 బిలియన్ డాలర్ల కి మాత్రమే పెరిగాయి. ప్రభుత్వ మద్దతు, ఆర్థిక సహకారం, రాయితీలతో అనేక మొబైల్ కంపెనీలు వచ్చాయి కానీ అంత పెద్ద అంతర్జాతీయ మార్కెట్ లో భారత ఎగుమతులను పెంచడానికి ఏమీ తోడ్పడలేదు. అంతర్జాతీయ కంపెనీల తో పోల్చినపుడు దేశీయ కంపెనీలు మరగుజ్జులు గానే మిగిలిపోయాయి. దేశాన్ని ఎగుమతుల కేంద్రంగా మార్చడంలో విఫలం అయ్యాయి”.
ఇటువంటి అభిప్రాయాలు కలిగిన వ్యక్తే ప్రధాని ని నెట్టికెత్తుకున్నారు. ఘనకీర్తులతో కొనియాడారు. మనం నమ్మలేం. కానీ ఇది నిజం. ఫిబ్రవరి 3, 2021న కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి స్పందిస్తూ ఇది బుర్ర తిరిగే బడ్జెట్ అని, ప్రధాని నుండి ఆశించిన కలలు ఇపుడు నెరవేరబోతున్నాయని స్వయంగా పనగారియా బడ్జెట్ ప్రతిపాదనలను స్వాగతించారు. కానీ నిజానికి ఆశలేమీ కార్యరూపం దాల్చడం లేదు..
ఇక్కడ సమస్య ఏమిటంటే మోడీ కి ఓ విధాన దిశ, దశ, ప్రణాళికాబద్ధమైన పథకం ఉన్నాయని నమ్మటమే. మోడీ లో స్వేచ్ఛా మార్కెట్ పిపాసిని చూడటం పనగారియా చేసిన పాపమే తప్ప దానికి మోడీని బాధ్యుడిని చెయ్యలేము. ఓ రోజు మోడీని అకాశానికెత్తి ఆరాధించడం, మరో రోజు భారత ఆర్థిక వ్యవస్థ 2003-14 మధ్య కాలంలో అద్భుత వృద్ధి సాధించిందని విశ్లేషిస్తూ రిసెర్చ్ పత్రాలు సమర్పించడం పనగారియాలోని గందరగోళాన్ని ప్రతిఫలిస్తుంది.
నీళ్లేవో పాలేవో పసిగట్టి గలిగిన హంస సమానులైన పనగారియా వంటి మేధావులు కూడా అంతగా ఎందుకు నోరెళ్ళబెడుతున్నారు? దీనికి కారణం మోడీ ఎంచుకున్న రెండో బృహత్కర్తవ్యం. లక్ష్యం. అదేమిటంటే బహుళ పార్టీ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసి దాని స్థానే కండబలం మందబలం తో కూడిన మెజారిటీరియన్ రాజ్యాన్ని స్థాపించడం మోడీ ఎంచుకున్న రెండో బృహత్ కర్తవ్యం. ఈ దేశాన్ని అగ్రరాజ్యం గా మార్చాలంటే నియంతృత్వమే మార్గం అన్నది ఈ లక్ష్యం ఎంపిక వెనక ఉన్న అవగాహన. ఆలోచన. అటువంటి రాజ్యంలో మతపరంగా అల్ప సంఖ్యాకులు ఎటువంటి హక్కులు, రక్షణలూ, అవకాశాలు లేని ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారు. వారి జీవితాలు దినదిన గండంగా మారిపోతాయి. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించ లేక పోయినా ఈ రెండో కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోడీ ప్రభుత్వానికి ఘనమైన రికార్డే ఉంది. ఫలితాలు మన కళ్ళముందే ఉన్నాయి. మనం ప్రధాని మోడీని సమర్ధించినా, వ్యతిరేకించినా ఒక వాస్తవాన్ని మాత్రం కాదనలేము. అటు గుజరాత్ లో కానీ ఇటు దేశంలోకానే ఈ విషయంలో తాను అనుకున్నది మోడీ సాధిస్తున్నారు.
సామాజిక వెలి, వివక్ష, వేధింపులు, దర్యాప్తులు, విచారణాలని చట్టబద్ధ పద్ధతుల్లో నే చేస్తున్నారు. మరో మాటగా చెప్పాలంటే ఇవన్నీ చట్టం ముసుగులోనే అమలవుతున్నాయి. ముస్లింలు ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఏమి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ బతకాలి, ఎవరిని పెళ్లాడాలి, ఎలా విడాకులు ఇవ్వాలి, సమాజం మొదలు చట్టసభల వరకు వారికి ఎంత ప్రాతినిధ్యం ఉండాలి వంటివన్నీ ఎంత బాహాటంగా అమలవుతున్నాయంటే ఇపుడు అవేవీ వార్తలు కావు.
ఈ ధోరణి భారత రాజకీయాల్లో ఎంతగా నాటుకు పోయింది అంటే రానున్న పదిహేనేళ్ల లో ఈ మత్తును, జాడ్యాన్ని వదిలించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే మోడీ సాధించిన అతి పెద్ద విజయం.
ఎంతకాలం మోడీ తన దారిలో తాను ప్రయాణం సాగిస్తూ ఉంటారో అంతకాలం ఆర్థిక వ్యవస్థలో మోడీ చేసే అద్భుతాలకోసం ఎదురుచూసే భజనపరులు ఆయన దర్బారులో కుప్పలు తెప్పలుగా కూడుతూనే ఉంటారు. మోడీ అలా తన దారిలో తాను ప్రయాణం చేయగలరు. ఎందుకంటే ఈవిషయంలో ఆయనకు ఓ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం పట్ల నిబద్ధత కూడా ఉన్నాయి.
ఆకార్ పటేల్
అనువాదం : కొండూరి వీరయ్య