
స్వాతంత్రోద్యమ నేత, కేరళ వామపక్ష ఉద్యమంలో శిఖరాగ్రస్థాయి నాయకుడు, మాజీ కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కన్నుముశారు. దాదాపు నెల రోజులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన తర్వాత జూలై 21వ తేదీన, తన 102వ ఏట తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ జూలై 21వ తేదీ సోమవారం తుదిశ్వాస విడిచారు. 101 సంవత్సరాలు పూర్తిచేసుకుని 102 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వీఎస్ అచ్యుతానందన్, 2006 నుంచి 2011 మధ్య కాలంలో కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు.
రెండు పదులు నిండని వయసులోనే అచ్యుతానందన్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలుత సీపీఐలోనూ, తర్వాత ఆరు దశాబ్దాలు పాటు సీపీఎంలోనూ విశిష్ట సేవలు అందించిన శిఖరాగ్ర నేతగా అచ్యుతానందన్ గుర్తుండిపోతారు.
2019లో గుండెపోటు రావడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు. గత నెల 23వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
18వ ఏట భారత కమ్యునిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్న అచ్యుతానందన్, తన తుది శ్వాస వరకూ ఎర్ర జెండాను ఎత్తి పట్టి దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో శిఖరాగ్ర స్థాయి నేతగా నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాల సామాజిక జీవితం, రాజకీయ కృషి తర్వాత 44వ ఏట తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 82 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బహుశా ఆ వయసు వరకు క్రియాశీలక రాజకీయ జీవితంలో ఉంటూ 80వ వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారని చెప్పడం అతిశయోక్తి కాదు. జీవితాంతం కార్మిక, కర్షక రాజకీయాలకు అంకితమైన నాయకుడు అచ్యుతానందన్.
సీపీఎంలో ప్రబలమైన అంతర్గత పోరాటం నడిపిన అతికొద్ది మంది నేతల్లో అచ్యుతానందన్ ఒకరు. రెండు సార్లు పోలిట్బ్యూరో నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.
అనేకమంది రాజకీయ నేతలు ఆయన మరణం పట్లప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. “ఆయన పోరాట జీవితం, పార్టీ పట్ల అకుంఠిత దీక్షా మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని సీపీఎం పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, బీజేపీ రాష్ట్ర నేత సురేంద్రన్లు తమ సంతాపాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.