
యావత్ ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశాలకు సంబంధించిన సమగ్ర పరిశీలన, పరిశోధన కోణాలు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పరిశోధక పాత్రికేయులకు కనిపిస్తాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగానూ జరగడమే ప్రజాస్వామ్యానికి ఆరోగ్య దాయకం.
ఆగస్టు 7వ తేదీ రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో అత్యున్నత స్థాయిలో చట్టబద్ధత ముసుగు వేసుకుంటున్న వ్యవస్థీకృత అవినీతిని బట్టబయలు చేశారు.
ఈ ఆరోపణలకు ప్రాతిపదికగా విశ్వసనీయమైన సమాచారం, స్పష్టమైన ప్రతిపాదనలు, వ్యక్తీకరణలు గాంధీ మాటల్లో, ఆయన చూపించిన ప్రజెంటేషన్‌లో ఉన్నాయి.
ఈ చర్చలో ఓ విషయం స్పష్టం అయ్యింది. అదేంటంటే, బెంగళూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో అవకతవకలు జరిగాయి.
కేవలం ఈ ఒక్క నియోజవర్గంలోనే లక్ష అక్రమ ఓట్లు తారసపడ్డాయి. మహదేవ్‌పురలో గెలుపొందటానికి కావలసిన పథకాన్ని బీజేపీ సిద్ధం చేసుకున్నట్లు దీని వల్ల తేటతెల్లం అయ్యింది.
అసలు విషయం వదిలేసి అల్పాహారం కోసం ఆబగా ఎదురుచూసిన విలేకరులు..
లక్ష మంది అక్రమ ఓటర్లు అన్న మాటే విలేకరులను పరుగులు తీయించాలి. ఈ వాస్తవాల వెలుగులో విలేకరులు, వార్తా సంస్థలు తమ మేధో మధనానికి పదును పెట్టాలి. దేశంలో మారుమూల ఒకచోట జరిగినా మోసమే ఇంత భారీ స్థాయిలో ఉంటే, ఇటువంటి వ్యూహాలు దేశవ్యాప్తంగా అమలు జరిగి ఉన్నట్లయితే, దాని ప్రమాదకర పర్యవసానాలు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటాయి?
సమావేశం పూర్తయిన తర్వాత హాజరైన విలేకరులు లేచి నిలబడ్డారు, ఆవలించారు. ఆ తర్వాత పక్కనే ఎదురు చూస్తున్న ఫలహారం వైపు పరుగులు తీశారు. అంతే తప్ప ఇంత పెద్ద వార్తను ఎలా కథనంగా మార్చాలి? ఎటువంటి శీర్షికలు ఎంచుకోవాలి? అన్న దిశగా చర్చలు లేవు. అభిప్రాయాలు, వ్యక్తీకరణలు లేవు. వీక్షకులు, పాఠకుల ముందు ఏదో ఒకటి వల్లె వేయడానికి సిద్ధపడిపోయారు.
ప్రస్తుతం చుట్టూ ఉన్న మీడియా సంస్థలు బాకాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ తరువాత విషయాలను పరిశీలిస్తే సరిపోతుంది.
కేథరిన్ ది గ్రేట్ మహారాణిని మెప్పించడం కోసం ఆ దేశ సైన్యాధినేత గ్రిగొరి పోటెంకిన్ ఓ వ్యూహాన్ని పన్నుతాడు. సమకాలీన రష్యాలో దుర్భర గ్రామీణ జీవితాలను మహారాణి కంటపడకుండా చేయడానికి సైన్యాధినేత బ్రహ్మాండమైన రహదారిని నిర్మిస్తాడు. దాంతో దేశమంతా సస్యశ్యామలంగా ఉంది అనుకుంటుందా మహారాణి.
మన చుట్టూ అపారమైన వార్తా ప్రపంచం విస్తరించి ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడే యాంకర్లు- న్యూస్ రీడర్లు, నిత్యం జరిగే ఇష్టాగోష్టులు, ప్రతిభాపాటవాలు కలిగిన వారితో విశ్లేషణలు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇందులో ఏది వాస్తవానికి దగ్గరగా ఉండదు. గ్రిగొరి పోటెంకిన్ సృష్టించిన నకిలీ సస్యశ్యామలత్వమే కనిపిస్తుంది.
గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ తరువాత వార్తా సంస్థల స్పందన..
మన కోసం వండి వార్చే పోటెంకిన్ వ్యవస్థలో అంతర్భాగమైన సమాచార వనరుల మీద మాత్రమే ఈ వార్త సంస్థలన్నీ ఆధారపడ్డాయి.
ఎన్ఐ లాంటి వార్తా సంస్థలు, బీజేపీ ఐటి సెల్లు అలా పోటేంకిన్ తరహా వార్తలను వండి వారుస్తూ ఉంటాయి.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన కాసేపటికి బీజేపీ ప్రముఖుల నుంచి వెలువడిన అద్భుతమైన మాటలు విని, చదివి చూడవలసిందే.
వెలుగు చూసిన వాస్తవాలపై దుమ్మెత్తి పోయడానికి రవిశంకర్ ప్రసాద్, సంబిత్ పాత్ర లాంటి వాళ్లు ఎలాను ఉండనే ఉన్నారు.
సాయంత్రం టీవీ చర్చల్లోనూ, తెల్లారి పత్రికల్లోనూ కనిపించిన వినిపించిన వ్యాఖ్యానం ఒకటే. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైనది అదే’, ‘ ఎన్నికల సంఘం చర్చలకు పిలుస్తోంది. అయినా కావాలనే పార్లమెంటు నిర్వహణకు అవంతరాలు కల్పిస్తున్నారు’ ‘బాధ్యతారహితం, దేశద్రోహం’ వంటి మాటలే వార్తలుగా చలామణి అవుతున్నాయి.
మరికొంతమంది దూకుడుగా “ఆయన అబద్దాలకోరు, అబద్ధాలు ఆడటం కాంగ్రెస్ సంస్కృతి” అంటూ ఆరోపిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ చర్చకు పెట్టిన విషయాలను లోతుగా పరిశీలించడానికి, విశ్లేషించడానికి విముఖత చూపించటం.
తప్పుడు వార్తలను ఉద్ధృతం చేయటం రెండవ అంశం. ఆజ్‌తక్ ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న వివరాలు ఫ్యాక్ట్ చెక్ చేస్తే, రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నది. వెంటనే ఆ వార్తను, సోకాల్డ్ వార్తా సంస్థల వెబ్సైట్లు పత్రికల్లో వైరల్ అయ్యింది. బీజేపీ సోషల్ మీడియా విభాగం కూడా ఈ తరహా వార్తలను విస్తృతంగా వ్యాపించేలా చేస్తుంది, చూస్తుంది.
ప్రతిభావంతులైన ఫ్యాక్ట్ చెక్కర్స్ ఈ మోసపూరిత ఫ్యాక్ట్ చెక్‌లోని విషయాలను బట్టబయలు చేసేంతవరకు ఈ వ్యాఖ్యానాలు చలామణి అవుతూనే ఉన్నాయి.
ఇక మూడో అంశం టాకింగ్ పాయింట్స్ గురించి. రాహుల్ గాంధీ చెప్తున్న విషయాలు ప్రమాణం చేసి, ప్రమాణ పత్రం సమర్పించి చెప్తే, తగు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తప్పులు బయటకు తీసిన వారిని ప్రమాణం చేయమని కోరటం పారదర్శకం కాదు. ఓ రకమైన బెదిరింపు మాత్రమే.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన అంశాలలో, లోతుపాతులు పరిశీలించి దేశానికి భరోసా ఇచ్చే విధంగా స్పందించాల్సిన ఎన్నికల సంఘం ఈ విధంగా ఎల గీసి బరిలోకి దిగిన విధంగా వ్యవహరించటం ఎన్నికల సంఘం దురుద్దేశాలను వెల్లడిస్తోంది. కానీ ప్రైమ్ టైం వార్తా కథనాల్లో ఎన్నికల సంఘం విసిరిన ప్రతి సవాలే కీలకంగా చర్చనీయాంశం అయింది. రాహుల్ గాంధీ విధివిధానాలు పాటించడం లేదు అన్న అభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా కల్పించడానికి ప్రైమ్ టైం చర్చలు ప్రయత్నించాయి. మర్నాడు పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలు కూడా ఎన్నికల సంఘం వాదనకే మొగ్గు చూపాయి. ఓ పత్రిక అయితే ఏకంగా ప్రమాణ పత్రం అందజేస్తారా, లేక ఆరోపణలు ఉపసంహరించుకుంటారా అని సవాలు విసిరింది.
ఇక నాలుగో అంశం టీవీ చర్చలలో కనిపించిన ధోరణులు. లేవనెత్తిన అంశాలు పసలేనివని చెప్పడానికి మాత్రమే ప్రతి టీవీ చర్చలోను విమర్శకులు ప్రాధాన్యతనిచ్చారు. పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలపై స్పందించిన తీరులో ఈ ధోరణి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఓట్ల దొంగల రాగం కాంగ్రెస్‌కే నష్టం కలిగించిందని టైమ్స్ నౌ నిర్ధారిస్తే, ఆటంబాంబా లేక పొగ బాంబాని- బాంబా లేక హడావిడాని ఇండియా టుడే వ్యాఖ్యానించింది.
ఇక ఐదో అంశం, ఒకటో అరో మినహాయింపులు తప్ప ప్రధాన పత్రికలన్నీ రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న పలువురు వ్యక్తులు ప్రధాన మీడియా మోసపూరిత వైఖరి పట్ల అప్రమత్తంగా వ్యవహరించారు. తరుణ్ గౌతమ్ అనే అతను మర్నాడు పత్రికల ప్రధాన శీర్షికలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ దైనిక్ జాగరణ్, అమర్ ఉజాల వంటి పత్రికలు కనీసం రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిన విషయాలకు స్థానమే కల్పించలేదు అన్న విషయాన్ని బహిర్గతం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో కనిపించేది ఏంటంటే, పౌర సమాజం నుంచి రాజకీయ రంగం నుంచి తలెత్తుతున్న ప్రశ్నలకు రాజ్యాంగబద్ధమైన సాధికారిక సంస్థగా స్పందించాల్సిన ఎన్నికల సంఘం ఒక రాజకీయ పార్టీలాగా స్పందించిందని ఒక రాజకీయ వ్యాఖ్యాత విశ్లేషించటం ముఖ్యమైన పరిణామం.
ఇదిలా ఉండగా, కుహనా మీడియా సాధ్యమైన అన్ని ప్రయత్నాలలో రాహుల్ గాంధీని కించపరిచే విధంగా వ్యవహరించడమే కాక ఎన్నికలసంఘం వైఫల్యాలను గుర్తించ నిరాకరించే విధంగా వ్యవహరించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిర్రర్, ఇండియా టుడే విలేకరులు 80 మంది ఓటర్లకు నివాసంగా ఉన్న చిన్న గదిని ప్రత్యక్షంగా సందర్శించారు. రాహుల్ గాంధీ దేశముందుంచిన విషయాలు వాస్తవమైనవేనని ధృవీకరించారు.
ఈ పత్రికల విలేకరులు తమంతట తామే చొరవగా వెళ్లారా లేక న్యూస్ లాండ్రీ, న్యూస్ మినిట్ వంటి పత్రికల ప్రతినిధులతో వెళ్లారా?
అనువాదం: కొండూరి వీరయ్య