
మదమెక్కిన గిట్టల కింద
నుగ్గు నుగ్గయిన కూనల కోసం
వెతికీ వెతికీ అడవి సొమ్మ సిల్లింది
ఎగురుతూ గంతులేస్తూ
వెన్నలని కండ్లలో పండించుకున్న
లేడిపిల్లల అడుగులజాడ
ఎక్కడా లేదని
దారికిరువైపుల
చూపులను కాపలా పరిచి
లొద్ది లొద్దికీ లెంకుతున్నది
క్రూర మృగాల కోరలు వూడదిసే
యుద్ధ తంత్రం తెలిసిన అడవి
నాగరిక ఆబోతుల కామాన్ని
పసిగట్ట లేక పోయింది
అమ్మ కోసం అరిచి అరిచి
తడారిన గొంతుతో పిలిచి పిలిచి
అలసి సొలసి పాపలు ఎక్కడో
నిద్ర లోకి జారుకున్నయి
చినిగిన దేహాలతో పలిగిన తలలతో
మట్టిదుప్పటికిందసేదదీరుతున్నయి
ఎక్కడ పాదం మోపినా
చిదిమేయబడ్డ మణిపూర్ మొగ్గల
శీలమే వెక్కిరిస్తుంది
ఎక్కడ చెవి ఆనించినా
ఆఖరు నిమిషం అరుపులే
గుండె గోడల్ని కదిలిస్తున్నయి
నదులు, వాగుల నిండా
మణిపూర్ దుఃఖమే పారుతున్నది
ఒలచబడ్డ చీరల చాటున
గడ్డ కట్టిన శోకమే తలుగుతున్నది
నెర్రెలు బాసిన శరీరాల్లో
మాతృత్వాన్ని దాచుకున్న
దీనులున్న నేల కదా
కోయబడ్డ ముక్కులు
తెంచ బడ్డ నాలుకల చాటున
కసిని అణిచివేసుకున్న
చెల్లెండ్ల భూమికదా
అలవాటైన జీవితాలకి
అలవాటుగా లొంగిపోయినదేహాలకి
కొత్తరుతువంటూ
కొత్త పొద్దంటూ
కొత్త సంబరమంటూ నోచుకోని
తల్లులున్న భూమికదా
ఇన్నిమోసాలు ఇన్ని ద్వేషాల మధ్య
ఏది తన కన్నో ఏది పరాయి కన్నో
తెలుసుకోలేని
ఒట్టి అక్వెరియంలోనిబతుకులుకదా
ఇక చాలు
మనిషిని కాపాడలేని మీ ప్రార్థనలు
మనిషిని బతక నివ్వని ప్రవచనాలు
ఇకనుంచి మా డోసిట్లో పొయ్యకండి
అడవికి వసంతాన్ని
పంచడమే కాదు
నదిలా ముంచెత్తడమూ తెలుసు
‘’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’
డా. ఉదారి నారాయణ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.