
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలపై పాలస్తీనా జెండాను కొందరు ఎగరవేశారు. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు నిందితులు సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలపై పాలస్తీనా జెండాను ఎగరవేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటలో ముగ్గురు నిందితులు సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు .
బీబీసీ నివేదిక ప్రకారం, ఈ సంఘటన ఫూల్బెహాద్ కొత్వాలి ప్రాంతంలోని లఖా గ్రామంలోని ఒక పాఠశాల వద్ద జరిగింది. అక్కడ ఆదివారం(ఆగస్టు 31)నాడు కొంతమంది వ్యక్తులు త్రివర్ణ పతాకాన్ని తొలగించి పాలస్తీనా జెండాను ఎగురవేశారు.
దీనికి సంబంధించి, లఖా గ్రామానికి చెందిన సంజయ్ త్రివేది అనే వ్యక్తి ఒక వీడియో తీసి ఫూల్బెహాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
ఈ విషయంలో గ్రామ నివాసి సంజయ్ తన ఫిర్యాదులో సద్దాం, బౌరా, అన్నేతో పాటు గుర్తు తెలియని వ్యక్తి పాఠశాల పైకప్పు ఎక్కారని పేర్కొన్నారు. ఈ వ్యక్తులు త్రివర్ణ పతాకాన్ని తీసివేశారు. ఈ చర్యను వీడియో తీయడానికి సంజయ్ ప్రయత్నించినప్పుడు, నిందితుడు అతనితో దురుసుగా ప్రవర్తించి కొట్టి పారిపోయాడు.
ఘటనపై హిందూ సంస్థల ఆగ్రహం..
నిందితులను త్వరలోనే అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపుతామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కేసులో ఒక నిందితుడు సద్దాంను అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ బీబీసీకి తెలియజేశారు.
జెండా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఉద్దేశ్యంతో ఎగురవేశారనేది దర్యాప్తులో మాత్రమే వెల్లడవుతుందని పోలీసులు చెప్పారు.
గాజాలో ఇజ్రాయిల్ సృష్టిస్తోన్న మారణహోమం..
ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాలస్తీనా జెండాలను ఎగరవేసినందుకు చాలామందిని అరెస్టు చేసి, నిర్బంధించి, ప్రశ్నించారు. ఆ తర్వాత న్యాయ నిపుణులు, రాజకీయ ప్రతినిధులు అరెస్టుల మీద ప్రశ్నలను లేవనెత్తారు. ఎందుకంటే భారతదేశం పాలస్తీనాతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది.
కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి మితవాద సంస్థల చేత ఫిర్యాదులు చేయబడ్డాయి. అంతేకాకుండా భారత శిక్షాస్మృతి(ఐపీసీ), చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి.

ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, “పాలస్తీనా లక్ష్యానికి భారతదేశం మద్దతు ఇవ్వడం దేశ విదేశాంగ విధానంలో అంతర్భాగం.” 1974లో భారతదేశం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను గుర్తించిన మొదటి అరబ్ యేతర దేశంగా అవతరించింది. అంతేకాకుండా, 1988లో పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.
గమనించాల్సిందేంటంటే, భారతదేశం పాలస్తీనా శరణార్థుల కోసం గత సంవత్సరం జూలై 15న ఐక్యరాజ్యసమితి సహాయ మరియు పనుల సంస్థకు 2.5 మిలియన్ డాలర్లను విరాళంగా అందించింది. అక్టోబర్ 2023 తర్వాత ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల పాలస్తీనాలోని గాజాలో అపార ప్రాణ- ఆస్తి నష్టం చోటుచేసుకుంటుంది. అంతేకాకుండా, కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటి వరకు గాజాలో 63,000 మందికి పైగా మృతి చెందారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.