
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మల సీతారామన్ మార్చి 6న విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమెతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బిజెపి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పాలుపంచుకున్నారు. ఒకే వేదిక మీద ముగ్గురు ప్రధాన నాయకులు ఉండడంతో ఆంధ్ర రాష్ట్ర విషయాలు చర్చకు వస్తాయని భావించడం సహజం. కానీ అలా జరగలేదు.
అయితే, కేంద్ర ఆర్థిక శాఖామంత్రి తాజాగా కేంద్ర బడ్జట్‌పై జరిపిన మీడియా సమావేశంలో మాత్రం కొంతమంది అడిగిన ప్రశ్నకు జవాబుగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో ఎక్కువ భాగం అవాస్తవాలు, పాక్షిక వాస్తవాలు మాత్రమే ఉన్నాయి.
ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనమే..
ఆంధ్ర రాష్ట్రాన్ని గత నాలుగేళ్లుగా కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. దీనిపై ఆమె మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని, తాజాగా ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించామని, ఉద్యోగులు కోరుతున్న దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. వాస్తవం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా అమ్మేస్తామని చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలనేది ఈ ప్రాంత ప్రజల, కార్మికుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీంతో పాటుగా స్టీల్‌ప్లాంట్ లాభాల బాటలో పయనించడానికి సొంత గనులు కేటాయించాలని లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)లో విలీనం చేయాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
విచిత్రంగా వీటిలో ఒకదానిపై కూడా నోరు మెదపకుండా, కేంద్ర ప్రభుత్వం ఎవరూ అడగని ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీ అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలని షరతు కూడా విధించింది. ఆ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారం కాదని ఆనాడే అనేక మంది అన్నారు.
ఉద్ధరిస్తున్నట్టుగా ప్రకటనలు..
కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు కూడా లేవు సరి కదా విఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల ఉద్వాసానికి పూనుకుంది. కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుండి తొలిగిస్తోంది. ఇలా అన్ని రకాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరుస్తూ, మరోపక్క తామేదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రకటనలు ఇవ్వడం ఏ రకంగా సమంజసమో వారికే తెలియాలి.
అదే సందర్భంలో క్వార్టర్లలో విద్యుత్ ఛార్జీలను యాజమాన్యం అమాంతం పెంచేసింది. హెచ్ఆర్ఏను నిలిపివేసింది. వీటిపై అనేక రూపాలలో కార్మికులు పోరాడుతున్నారు. ఈ అంశాలన్నిటిపై గళమెత్తుతూ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్, సిఐటియు నాయకులు జె అయోధ్య రాముకు యాజమాన్యం షోకాజు నోటీస్ ఇచ్చింది. ఒక ప్రభుత్వరంగ పరిశ్రమను కాపాడాలని, యాజమాన్యం ఏకపక్ష చర్యలను వదలాలని కోరడం వాస్తవంగా పరిశ్రమ బలోపేతానికి సహకరిస్తుంది. కానీ అలా అడిగిన నేరానికి యూనియన్ నాయకులను శిక్షించడం అసలైన నేరం.
ముఖ్యమంత్రి ఎప్పుడు ఏది అడిగినా వెంటనే ఇచ్చేస్తున్నామని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటోందని కూడా ఆమె సెలవిచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే వీటి నిర్మాణం రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అయితే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టేసి, కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలుగజేస్తోంది.
ఉదాహరణకు చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమైన రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, క్వార్టర్స్ వంటి మౌలిక వసతులకు అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించాలి. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఇవ్వడానికి నిరాకరిస్తోంది. తాజాగా 15 వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుండి అప్పుగా ఇప్పించింది. గ్రాంటుగా ఇవ్వవలసిన సొమ్మును అప్పుగా ఇప్పించి తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకోవడం సమంజసం కాదు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ నిత్యం జపం చేసే ముఖ్యమంత్రి కూడా వారికే వంతపాడుతున్నారు. అప్పుతో రాజధాని ఎలా నిర్మిస్తారో విచిత్రమే. పోనీ ఆ అప్పైనా కేంద్ర ప్రభుత్వం తీరుస్తుందా అంటే దాని మీద కూడా నోరు మెదపడం లేదు.
మడత పేచీలు పెడుతోన్న కేంద్రం..
అలాగే అదే చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పునరావాసం, అన్ని అనుమతులతో సహా పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దీనిని జాతీయ ప్రాజెక్టు అని స్పష్టంగా చట్టంలో తెలిపారు. అయితే నిర్వాసితులకు పరిహారం, పునరావాసం, కేవలం 2014 నాటికి ఉన్న ప్రాజక్టు ఖర్చునే భరిస్తామని, అది కూడా సాగునీటికే కానీ తాగు నీటికి కాదనే వంటి అనేక మడత పేచీలు కేంద్రం పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వాదనలు చేయడం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలా సహకరిస్తుందో వారికే తెలియాలి.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పదకొండు ఏళ్ల కాలంలో ఈ నిధులు ఇచ్చింది లేదు, ఈ ప్రాంతాలు అభివృద్ధి సాధించింది అంతకంటే లేదు. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే వీటి జాబితాలో ప్రకాశం జిల్లాని కూడా కలిపారు కానీ ఒక్క రూపాయి కూడా జిల్లా అభివృద్ధికి ఇచ్చింది మాత్రం లేదు. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి.
ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం..
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 93 షెడ్యూల్ 13 ప్రకారం అనేక సంస్థల నిర్మాణం 2024 కల్లా పూర్తికావాలి. వాటిలోని దుగ్గిరాజుపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటివి సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎందుకు సాధ్యం కాదని గట్టిగా చట్టపర హక్కులకై నిలదీయవలసిన గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కట్టుకుని కూర్చోవడం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమే. ఐఐటి, సెంట్రల్, ట్రైబల్, పెట్రోలియం యూనివర్సిటీల వంటి విద్యాసంస్థల స్థితి నేటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి.
విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైల్ నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటమాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దేహీ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతోంది. హక్కుగా రావాల్సిన వాటికోసం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు.
రాష్ట్రానికి తీరని ద్రోహం..
దశాబ్దానికి పైగా రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకుండా, పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చేసిన ప్రకటనను కూడా ఖాతరు చేయకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, చేస్తోంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందేమోనని కొంతమంది భావించారు. అయితే ఇప్పుడు కూడా ఈ ద్రోహం కొనసాగుతూనే ఉంది.
‘కేంద్రం ఇవ్వదు- రాష్ట్రం అడగదు’ ఇదీ డబల్ ఇంజనీర్ సర్కార్ ఘనత. సకల వనరులు ఉన్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. అభివృద్ధి లక్ష్యంగా ప్రజానీకం రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఎ అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివఅద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.