
మితవాదశక్తులు ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లోకి శక్తివంతంగా చొచ్చుకు పోయాయి. రెట్టించిన శక్తితో, స్పష్టమైన వ్యూహంతో ఈ మితవాద రాజకీయాలను వామపక్ష శక్తులు అధిగమించాలి.
ప్రపంచవ్యాప్తంగానే ఇవాళ మితవాద శక్తులకు ఆదరణ పెరిగింది. డొనాల్డ్ ట్రంప్, జార్జియా మెలోని వంటి నాయకులు జాతీయవాద మనోభావాలను రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగా కమ్యూనిస్టు వ్యతిరేక ధోరణులను ప్రదర్శిస్తూ, అభ్యుదయ భావజాలాన్ని ఈసడిస్తున్నారు.
2025 జనవరి 20న ట్రంప్ అమెరికన్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ “ఇది విముక్తి దినం” అని అతిశయంగా ప్రకటించారు. సంస్థాగత వివక్షతకు వ్యతిరేకంగా మేల్కొన్న ప్రజల ఇంగిత జ్ఞానానికి తన ఎన్నిక ప్రతీకని మెలోని ప్రకటించుకున్నారు. వీళ్లిద్దరూ కూడా వాక్సాతంత్య్రాన్ని, మత విశ్వాసాలను పరిరక్షిస్తామని వాగ్దానం చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటన విశ్వాసాలకు, వాక్స్వాతంత్రానికి పొసగదు. అయినా ఇప్పుడు ప్రపంచమంతటా ఈ మితవాద శక్తుల అబద్ధపు ప్రచారాలదే పైచెయ్యిగా నడుస్తా ఉన్నది. సామాజిక విస్మరణకు, వెలివేతకుగురైన ప్రజానీకం, పేదలు ఈ మితవాదశక్తుల నుంచి తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
అమెరికన్ సెనెట్, కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ అధికారం చేపట్టగానే తాను సంతకాలు చేసి హిమపాతంలా వెల్లువెత్తించిన శాసనాలను “ఇంగితజ్ఞాన విప్లవం”గా ప్రస్థుతిస్తున్నారు. సొంత గొప్పలు చెప్పుకోవడంలో ట్రంప్ శైలే వేరు. అమెరికా చరిత్రలోనే 99 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన అధ్యక్షుడిని నేనే అని బడాయి పోతూ గత ఆరువారాల్లో నేను 100 కార్యనిర్వాహక శాసనాల మీద సంతకాలు చేశాను. మన అద్భుతమైన అమెరికన్ భూభాగం అంతటా ప్రజలలో ఆశలు మోసులెత్తేందుకు, వారి రక్షణకు అమెరికా మరింత సంపద్వంతం కావడానికి నేనీ చర్యలు చేపట్టాను” అని ప్రకటించారు. ఇదంతా ఈ సరికే మనకు అనుభవంలోకి వచ్చిన విషయంగా అనిపిస్తే అందుకు ఎవరినీ తప్పు పట్టాల్సి పనిలేదు. ఎనిమిది నెలల క్రితం ఇండియా బ్లాక్ రాజకీయ పక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ, మన ప్రధాని మోడీ ఏకధాటిగా 135 నిమిషాల సేపు ప్రసంగించారని ప్రచార, ప్రసార సాధనాలు మోతెక్కించి మరీ చాటి చెప్పాయి.
ఇది యాధృచ్ఛికం కానేకాదు. అలాని ట్రంప్ తమ మోడీని కాపీ కొట్టాడని భక్తులు పరవశంగా చేసిన ప్రచారమూ నిజం కాదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అధికార పీఠం అధిరోహిస్తున్న మితవాద రాజకీయనాయకులలో ఉండే సారూప్య లక్షణమే ఇది. ఇటలీ ప్రధాని మెలోని మాటల్లోనే అది స్పష్టంగా ద్యోతకమవుతుంది. 2025 ఫిబ్రవరి 23న వాషింగ్టన్లో జరిగిన “మితవాద రాజకీయ కార్యాచరణ సదస్సు(సీపీఎపీ)ను ఉద్దేశించి రోమ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ “నేను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ కలిస్తే మమ్మల్ని ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా అభివర్ణిస్తూ, అదే వామపక్ష భావజాల దేశాధినేతలు కూటమి కడితే వారిని ఆకాశానికి ఎత్తేస్తూ వామపక్షవాదులు ద్వంద్వప్రమాణాలు అనుసరిస్తున్నారని” వాపోయారు. నానా రకాల చీలికలకు గురైన వామపక్షశక్తులు మితవాద శక్తుల కూటమిపట్ల గుర్రుగా ఉన్నాయో లేదో అన్న సంగతి పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా “ఇంగితజ్ఞాన విప్లవాలు” తీసుకురావడానికి మితవాదశక్తులు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయనే వాస్తవాన్ని మెలోనీ స్పష్టం చేశారు.
ఏమిటో ఇంగిత జ్ఞానం?
మితవాద రాజకీయ నాయకులకు తమ విధానాలను, రాజకీయ వ్యూహాలను సమర్థించుకోవడానికి తరచూ ఈ “ఇంగితజ్ఞానం” అనే పదాన్ని బడాయిగా వాడుతుంటారు. సమర్ధింపుకు ఇంతకన్నా వేరే మార్గం లేదు వాళ్లకి. ప్రస్థుతం నయా ఉదారవాదం పాడె ఎక్కింది. అయితే వాళ్లు వాడే ఈ “ఇంగిత జ్ఞానం” అనే మాట తటస్థపదం కాదు. కొన్ని నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపకరించే సైద్ధాంతిక సాధనం అది. అవి ఏమిటో, ఎలాగో మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం.
ప్రజాకర్షక వ్యూహం..
మితవాద రాజకీయ నాయకులు తమ విధానాలు ఇంగిత జ్ఞానంతో కూడిన పరిష్కారాలనీ, పామరజనం ఇట్టే అర్ధ చేసుకుంటారనీ, ఎటొచ్చీ మేధావులు, కులీనులు, రాజకీయాలను అర్ధం చేసుకోలేని వాళ్లు అర్ధం చేసుకోరనీ డాంబికంగా చెబుతుంటారు. తద్వారా మేధావులు, రంగాల వారీ నిష్ణాతులూ, సంప్రదాయ రాజకీయ సంస్థలు పనికిమాలినవి, ప్రభుత్వ వ్యతిరేక శక్తులని ముద్ర వెయ్యగలుగుతారు.
వామపక్ష, అభ్యుదయ వ్యతిరేక మహాకథనాలు ట్రంప్, మోడీ, మెలోనివంటి నాయకులు ఇంగిత జ్ఞానం గురించి ప్రస్థావిస్తున్నారంటే దాని అర్ధం సాంస్కృతిక వైవిధ్యం, జెండర్
హక్కులు, పర్యావరణ అంశాలు, సామాజిక న్యాయం వంటి అభ్యుదయకర ఆలోచనలు తృణీకరిస్తున్నారని అర్ధం.
అభ్యుదయకర విధానాలను “రాజకీయంగా సరైరనవి అంటూ చాలా అతి చేశారు” అని తూలనాడుతూ తాము అనుసరించే మితవాద విధానాల ద్వారా ఆ అతిని సరిచేసి పదిమందీ మెచ్చుకునేలా సుపరిపాలన అందిస్తున్నామని నమ్మబలుకుతారు.
దేశభక్తి, జాతీయవాదం, సాంస్కృతిక అస్థిత్వం..
మెలోని చెప్పే “ఇంగిత జ్ఞానం”లో బలమైన జాతీయవాద డాంబికాలు, ఐరోపా యూనియన్ ప్రభావాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు కలగలిసి ఉంటాయి.
ఇక మోడీ “ఇంగిత జ్ఞానం” హిందూత్వ సిద్ధాంతంతో ముడిపడి, విమర్శకుల మీద దేశద్రోహులని ముద్రవేసి నోళ్లు మూయించచడం, మెజారిటీ మతతత్వ రాజకీయాలకు పెద్ద పీట వెయ్యడం ఇమిడి ఉంటాయి.
ట్రంప్ చెప్పే ఇంగితజ్ఞాన విప్లవంలో “అమెరికా ఫస్ట్” పేరిట వలసదారుల మీద దాడులు, వేధింపులు, అభ్యుదయకర విధానాలను, చట్టాలను అటక ఎక్కించడం పరిపాటిగా ఉంటుంది.
ఆర్థిక విధానాలు- ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం..
కులీనులను పైకి విమర్శిస్తూ ఆచరణలో మాత్రం బడా వ్యాపారస్థుల కొమ్ముకాయడం, కార్పోరేట్ సంస్థలకు ఉదారంగా పన్ను మినహాయింపులు ఇవ్వడం, అన్ని రకాల నియంత్రణలను నీరుగార్చడంవంటి విధానాలనే అనుసరిస్తూ ఉంటారు.
మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ఇందుకు ఒక ఉదాహరణ. పెద్దనోట్ల రద్దు, ప్రైవేటీకరణ, కార్పోరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ప్రజోపయోగ ప్రభుత్వరంగ సంస్థలు, సేవలను కారుచౌకగా బడాబాబులకు కట్టబెట్టడం వంటి చర్యలన్నీ అందులో భాగమే.
ట్రంప్ ప్రకటించిన పన్ను మినహాయింపులు, నియంత్రణల సడలింపుల మూలంగా బడా బహుళజాతీ సంస్థలు, స్టాక్ మార్కెట్లు లబ్ధిపొందాయి. ఇదంతా “అమెరికా ఫస్ట్” పేరిట జనాన్ని బురిడీ కొట్టించే విధానాలే.
ఇస్లాం పట్ల ద్వేషం, జాతి విద్వేషం ట్రంప్ ప్రకటించే భద్రతా విధానాలు వలసలకు వ్యతిరేకత, ముస్లింలపట్ల విద్వేషంతో నిండి ఉంటాయి. పదహారు ముస్లిం దేశాల ప్రజానీకం మీద అమెరికాలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా నిషేధం విధించడం, మెక్సికో సరిహద్దు గోడ నిర్మించడం వంటివి ఇందులో భాగమే. మోడీ ముస్లింల పట్ల వ్యతిరేకతతో చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యలు ఇందులో భాగమే.
ఇటలీలో రాజకీయ ఆశ్రయం పొందుతున్న వారిని, శరణార్ధులుగా వలస వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని వలస నిరోధక చట్టాలు రూపొందించిన మెలోని రాజకీయ చర్యలూ ఈ కోవకు చెందినవే.
ఈ రకంగా “ఇంగితజ్ఞానం” అనేది మితవాద రాజకీయ నాయకులకు అందివచ్చిన రాజకీయ సాధనం. తటస్థత పాటిస్తూ సార్వజనీన జనామోదం పొందడానికి బదులు మితవాద రాజకీయ నాయకులు కొత్తగా ఎత్తుకున్న “ఇంగిత జ్ఞాన” నినాదాన్ని అభ్యుదయ ఉద్యమాలను తేరగా తిని కూర్చునేవాళ్లు చేసే ఉబుసుపోని ఆందోళనలుగా అవహేళన చెయ్యడానికి, అప్రతిష్ట పాల్జెయ్యడానికి, జాతీవాదాన్ని, మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, వాస్తవిక దృష్టి పేరిట మెజార్టీవాదాన్ని రుద్దడానికి, సాధారణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులమని చెప్పుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అడ్డూ అదుపూ లేకుండా పెంచి పోషించడానికి సైద్ధాంతిక సాధనంగా మలుచుకున్నారు.
మితవాద శక్తుల ప్రజాకర్షణ..
మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలు, ప్రచారాలతో వామపక్ష రాజకీయ శక్తులు ప్రజలతో సంబంధాలు కోల్పోయిన వాటిగా, కొండొకచీ ప్రమాదకర శక్తులుగా ముద్రవెయ్యగలుగుతాయి. సామాజిక న్యాయం, స్త్రీ- పురుష సమానత్వం వంటి సామాజిక అభ్యుదయ విధానాలను “వోకిజం” పేరిట తూలనాడడం ఈ మితవాద శక్తులకు పరిపాటి మెలోని కూడా ట్రంప్ మాదిరే తాను అసలుసిసలైన సామాన్య ప్రజానీకం పరిరక్షకురాలనని చెప్పుకుంటారు. శాస్త్రీయ ఆలోచనలు, సామూహిక చైతన్యం పట్ల మితవాదశక్తులు ప్రదర్శించే విముఖత మూలంగా సంక్లిష్టమైన సామాజిక ఆర్థిక సంబంధాలను అతి సాధారణీకరించి వాటిని వివిధ సామాన్య ప్రజానీకానికి అవినీతిపరులైన కులీనశక్తులకు మధ్య జరిగే పోరాటంగా చలామణి చెయ్యాలని చూస్తాయి.
ట్రంప్ ప్రవచించే “అమెరికా ఫస్ట్” నినాదం గానీ, మెలోనీ ప్రదర్శించే కుహనా జాతీయవాదం గానీ దేశసార్వభౌమత్వం గురించి డాంభికమైన ప్రచారానికి దారి తీస్తుంది. ఇందుకు అంతర్జాతీయ సంబంధాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా లెక్క చెయ్యరు. వీళ్లు అనుసరించే విధానాల మూలంగా ప్రపంచవ్యాప్త దారిద్ర్య నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించే లక్ష్యాలతో పనిచేసే ఐక్యరాజ్యసమితి తదితర బహుళజాతి అంతర్జాతీయ సంస్థలు బలహీన పడతాయి. అంతర్జాతీయ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని పనికి మాలనిదిగా ముద్రవేసి తమకు తమ జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అంటూ దేశీయంగా ప్రజామద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి, పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన క్యోటోప్రోటోకాల్ నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించడం ఇందులో భాగమే.
మితవాదశక్తులు దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంపొదిస్తామనీ లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, కార్మికులందరికీ మెరుగైన వేతనాలు అందేలా చూస్తామని భారీ వాగ్దానాలు చేసి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాక బడాకార్పోరేట్ సంస్థలు, సంపన్న వర్గాల సేవలో తరించిపోతుంటాయి. నియంత్రణలు తొలగించడం, సంపన్నులకు మరిన్ని పన్ను రాయితీలు కల్పించడం, సంక్షేమ పథకాల వ్యయంలో కోతపెట్టడం ద్వారా సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు మరింత పెరిగిపోయేలా చేస్తారు. ఆర్థిక విధానాలు ఇలా నయా ఉదారవాద మార్గం పట్టడం మూలంగా కార్మికుల హక్కులకు కత్తెర పడుతుంది. సామాజిక సంక్షేమ పథకాలు కోతకు గురవుతాయి. అన్నిటికీ మించి వర్థమాన దేశాల్లోని మెజారిటీ కార్మికవర్గం, పేదలు మరిన్ని ఇక్కట్ల పాలవుతారు.
మితవాద శక్తులు తరచూ న్యాయస్థానాలను మీడియాను, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను తులనాడుతూ, అప్రతిష్ట పాల్జేయడానికి ప్రయత్నిస్తూ ప్రజాస్వామిక సంస్థలపై దాడికి తెగబడుతుంటాయి. ట్రంప్ తన విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్థలను ప్రజలకు శత్రువులని, ఫేక్ న్యూస్ ప్రచారకర్తలని విరుచుకుపడుతుంటారు. మెలోని అయితే వామపక్ష ఉద్యమాలు ఇటలీ ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతున్నాయని ఆరోపిస్తూ నియంతృత్వ పాలన సాగించడానికి అనువైన వాతావరణం సృష్టించుకున్నారు. ప్రజాస్వామిక సంస్థలపై మితవాద రారజకీయ నాయకులు చేసే ఈ దాడులమూలంగా అణిచివేత ధోరణులను ఎదుర్కోవడానికి పౌరచైతన్యాన్ని, న్యాయస్థానాలను ఆశ్రయించే నిమ్నవర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంది.
ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలోని అనేక దేశాలలో మితవాద శక్తులు అధికారంలోకి వస్తున్నాయి. అమెరికాలో ట్రంప్, మనదేశంలో మోడీ, బ్రెజిల్లో జైర్ బోల్సనారో, అర్జెంటీనాలో జేవియర్ మిలే, ఇటలీలో మెలోనీ వీరంతా ఈ కోవకే చెందుతారు. ఉదారవాద ప్రజాస్వామిక సూత్రాలను తోసిరాజని నియంతృత్వ పోకడల పరిపాలన సాగించడానికి మొగ్గుచూపుతారు. ఇందులో భాగంగానే సామాజిక అభ్యుదయ ఉద్యమాల అణిచివేతకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, వామపక్ష శక్తులపై నిర్హేతుకమైన దాడులకు తెగబడుతూ, సమాజంలోని సాంస్కృతిక బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని తృణీకరిస్తూ ఉంటారు. ఈ భావజాలానికి చెందిన వారిని దేశద్రోహులుగా, ప్రమాదకరవ్యక్తులుగా చిత్రీకరిస్తూ ఉంటారు.
మితవాదశక్తులు ఇంత విస్తృతంగా అనేక దేశాల్లో అధికారంలోకి రావడానికి తోడ్పడిన కొన్ని కీలకమైన కారణాలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.
♦ నయా ఉదారవాద విధానాలు విఫలమై ఆర్ధికంగా తీవ్ర అసంతృప్తి ప్రబలడం: ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాల అమలు ఊపందుకున్నది. ఈ విధానాలు కార్మికవర్గ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక వైపున జీతభత్యాల్లో ఎదుగూబొదుగూ లేకుండా పోవడం, మరోపక్కన యాంత్రీకరణ పెరుగుదల మూలంగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు రావడంతో కార్మికవర్గంలో ఆర్ధిక అభద్రతాభావం పెరిగిపోయింది. మితవాదశక్తులు తమని తాము సామాన్య ప్రజల, కార్మికుల ప్రయోజనాల పరిరక్షకులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం మూలంగా సాధారణ ప్రజానీకం ఈ ప్రచార మాయాజాలంలో చిక్కుకున్నారు.
♦ ఉదారవాదశక్తులలో నెలకొన్న సంక్షోభం: మధ్యేవాద, ఉదారవాదవామపక్ష రాజకీయ పార్టీలు సామాజిక- ఆర్ధిక అసమానతలను పరిష్కరించడంలో విఫలం కావడంతో ప్రజలలో ఈ పార్టీలపై ఉన్న భ్రమలు తొలిగిపోయాయి. కార్పోరేట్ ఆధిపత్యం, ప్రైవేటీకరణ, పొదుపు చర్యలకు ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించక పోవడం మూలంగా ఈ రాజకీయశక్తులపై సాధారణ ప్రజానీకంలో అపనమ్మకం ఏర్పడింది. ఇదే అదనుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తామే అసలైన ప్రతినిధులమంటూ మితవాద శక్తులు నిర్వహించిన ప్రచారహోరును ప్రజలు నిజమని విశ్వసించి వారికి అధికారం కట్టబెట్టారు.
♦ సాంస్కృతిక జాతీయవాదం, వలస వ్యతిరేక భావోద్వేగాలు: వలసలు, ప్రపంచీకరణ, బహుళ సాంస్కృతికవాద ప్రమాదాల నుంచి జాతిని, జాతి సంస్కృతిని కాపాడే సత్తా తమకే ఉన్నదని మితవాద శక్తులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రచారానికి పూనుకున్నాయి. ట్రంప్ “అమెరికా ఫస్ట్” అని నినాదం ఇచ్చినా, “సంప్రదాయ ఇటలీ జాతీయ విలువలు పరిరక్షిస్తానని” మెలోని ప్రచారం చేసినా, “అన్యమతాలపై విద్వేష ప్రచారానికి తెగబడి మరీ హిందువులు, హిందూమతం ప్రమాదంలో పడ్డాయ”ని మోడీ ప్రచారం చేసినా ఇవన్నీ లేని శత్రువును సృష్టించి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందడమే.
♦ మీడియా, సామాజిక మాధ్యమాల పాత్ర: సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది. దీంతో మితవాదశక్తుల తప్పుడు ప్రచారవ్యాప్తికి ఊతం చిక్కింది. ప్రధాన స్రవంతి మీడియా వామపక్ష శక్తుల గుప్పిట్లో ఉందని, పక్షపాత ధోరణులు ప్రదర్శిస్తుందని తెగబడుతూ మితవాదశక్తులు బలం పుంజుకున్నాయి.
♦ “వోకిజం” పేరిట దాడి: జెండర్ సమానత్వం, జాత్యహంకార ధోరణుల నియంత్రణ, పర్యావరణ సమస్యల పేరిట అభ్యుదయ ఉద్యమాలు వాక్సాతంత్రాన్ని పరిహరిస్తున్నాయి. కొత్త తరహా నియంతృత్వానికి పాల్పడుతున్నాయని మితవాదశక్తులు నానాయాగీ చేస్తున్నాయి.
♦ మితవాదశక్తుల వ్యూహాత్మక పొత్తులు: వామపక్ష “హిపోక్రసీ”ని ఎండగట్టే పేరిట ట్రంప్, మోడీ, మెలోనీలు కూటమి కట్టారు. “మేం కూటమి కడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొచ్చిందని ప్రచారం చేసే వామపక్ష, ఉదారవాద శక్తులు వాళ్లలో వాళ్లు కూటమి కట్టి దానిని అభ్యుదయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది తగునా” అని బాధితుల స్వరం వినిపిస్తూ తమ పునాదిని మితవాదశక్తులు విస్తరించుకుంటున్నాయి.
పేదలపై ప్రభావం..
మితవాదశక్తులు అనుసరించే విధానాల మూలంగా పేదలు, బలహీనవర్గాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులకు లోనవుతున్నారు.
♦ అసమానతలు తీవ్రతరం కావడం: ప్రైవేటీకరణ, సంపన్నులకు పన్ను రాయితీలు, ప్రజోపయోగసేవలకు కేటాయించే నిధులలో కోతల మూలంగా అల్పాదాయ వర్గాల ప్రజానీకం, పేదలపై విపరీతమైన ఆర్ధికభారం పడుతోంది. మితవాదశక్తులు అనుసరించే ఆర్థికవిధానాలు కార్మికవర్గం జీవన ప్రమాణాలను ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. సంక్షేమ పథకాల్లో కోత, ఆరోగ్య సేవల్లో కోతల మూలంగా లక్షలాది మంది ప్రజానీకం నిత్యజీవితం బతుకుపోరాటంగా మారిపోతుంది.
♦ కార్మిక, సామాజిక న్యాయ ఉద్యమాల అణిచివేత: కార్మిక సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాల విద్యార్థి ఉద్యమాలు, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేసే గొంతుకలు ఇవన్నీ దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారాయని మితవాదశక్తులు ముద్రవేస్తాయి. ప్రభుత్వ దన్నుతో కార్పొరేట్ శక్తులు పనికి తగిన వేతనాలు, పని ప్రదేశంలో తగిన రక్షణలు కల్పించడం, పదవీ విరమణానంతర సౌకర్యాల కల్పనవంటి కార్మికుల ఉద్యోగుల డిమాండ్లను అణిచివేస్తాయి.
♦ పర్యావరణ పరిరక్షణా కార్యాచరణకు విఘాతం: పర్యావరణ నష్టానికి దారి తీసే చర్యలు ఒఠ్ఠి హంబర్ అని మితవాదశక్తులు తేలిగ్గాకొట్టి పారేస్తాయి. పర్యావరణ అనుమతులు, నియంత్రణలను పలుచన చేసేస్తాయి. జాతీయ ప్రయోజనాలు, ఆర్థికాభివృద్ధికి ఇవి చేటుచేస్తున్నాయని తప్పుడు ప్రచారానికి పాల్పడతాయి. దీని మూలంగా ప్రకృతి ఉత్పాతాల సందర్భంగా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు.
♦ జాత్యహంకార ధోరణులు పెచ్చరిల్లడం, మైనార్టీల హక్కులకు భంగం కలగడం: పరాయి దేశాల నుంచి వలసలు పెరగడం మూలంగా దేశం భ్రష్టుపట్టిపోతుందనే ప్రచారంతో మితవాద శక్తులు సమాజంలో జాత్యహంకార ధోరణులు, విద్వేషాలను రెచ్చగొడతాయి. తత్ఫలితంగా మైనారిటీలపై భౌతికదాడులు, హింసాత్మక అణిచివేతల పెరుగుదలకు ఆస్కారం కల్పిస్తారు. ప్రజల మధ్య నెలకొని ఉండే సామాజిక సమరసతను ఛిన్నాభిన్నం చేసి తగని చేటు చేస్తారు.
ట్రంప్, మెలోనీల రూపంలో తలెత్తిన మితవాద శక్తులు సమిష్టి న్యాయసూత్రాలు, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, శాస్త్రీయమైన పరిపాలనా విధానాల మీద సైద్ధాంతికంగా పెద్ద ఎత్తున దాడికి తెగబడుతుంటాయి. అవి అనుసరించే జాతివాదం, ఆర్థిక నియంత్రణల సడలింపు. వామపక్ష వ్యతిరరేక వాగాడంబరత్వం- ఇవన్నీ ప్రజాస్వామిక సంస్థలను దుంపనాశనం చేస్తాయి. ఆర్థిక అసమానతలు తీవ్రతరమై పేదల మీద పోషించనలవి కానీ రీతిలో భారాలు మోపుతాయి. సమ్మిళిత ఆర్థిక విధానాలు, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సహకారాలను పెంపొందించే విధంగా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తే తప్ప ఈ తిరోగమన శక్తులను నిలవరించలేం. ఈ మితవాద శక్తులను ప్రతిఘటించలేకపోతే నియంతృత్వాధికారం బలపడిపోతుంది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లిపోతాయి.
మితవాద శక్తులను ఎదుర్కోనే మార్గాలు..
మితవాద శక్తుల దూకుడును శక్తివంతంగా నిలవరించాలంటే వామపక్షశక్తులు సిద్ధాంత విభేదాలను పక్కన పెట్టి మితవాదశక్తుల విధానాలకు బలవుతోన్న ప్రజానీకాన్ని విశాళ ప్రాతిపదికన ఐక్యం చేసే కృషి చేపట్టాలి. ఇందుకు అనుగుణంగా తగిన రాజకీయ, సైద్ధాంతిక వ్యూహాలను రూపొందించుకోవాలి. ఈ వ్యూహాలు సృజనాత్మకంగా ఉండాలి. అయితే కొన్ని సాధారణ అంశాలను ఆ వ్యూహంలో భాగం చేసుకోవాలి.
♦ ఆర్థిక న్యాయం కోసం పిలుపు: ఆర్థిక అసమానతల మూలాల్లోకంటూ వెళ్లి అందుకు దారి తీసిన తప్పుడు ఆర్థిక విధానాలను వామపక్ష శక్తులు ప్రజలలో ఎండగట్టాలి. అస్థిత్వ రాజకీయాల గుంజాటనలో పడకుండా కార్మికవర్గ హక్కుల మీద, సంపద పంపిణీ విధానాల మీదా, ప్రజా సంక్షేమం మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా కార్మికులను, కష్టజీవులను మితవాదశక్తుల ప్రభావం నుంచి దూరం చేయవచ్చు.
♦ బలమైన ప్రత్యామ్నాయ ప్రచారం చేపట్టాలి: దేశభక్తి, రక్షణ, రక్షిత ఆర్థిక విధానాలపై మితవాద శక్తుల కథనాల నియంత్రణను బద్దలు కొట్టాలి. ఇందుకుగాను వామపక్ష శక్తులు ప్రజాస్వామ్యం, హేతుబద్ధమైన పాలన, ప్రజాప్రయోజనాలు కేంద్రకంగా ప్రభుత్వ విధానాలు ఉండాలనే డిమాండ్లతో పటిష్టమైన ప్రచారం చేపట్టాలి.
♦ పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలను పూడ్చుకోవాలి: గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకం నగర జీవిత శైలితో పోల్చుకుంటే పరాయీకరణకు గురయ్యామని భావిస్తారు. మితవాద శక్తులు ఈ విధంగా పరాయికరణకు గురైన ప్రజానికాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తాయి. కాబట్టి వామపక్ష శక్తులు ఈ అంశాన్ని విస్మరించకుండా పరాయికరణకు దారితీసిన భౌతిక పరిస్థితుల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి.
♦ ప్రజాస్వామిక సంస్థల పరిరక్షణ: మితవాద శక్తులు న్యాయవ్యవస్థ స్వతంత్ర్యతను, మీడియా స్వేచ్ఛను, ఎన్నికల వ్యవస్థను దెబ్బతీసేదానికి ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి వామపక్షశక్తులు ఈ ప్రజాస్వామిక సంస్థలను కాపాడుకుంటూ, వీటిని మరింత బలోపేతం చేసి, సమాజంలోని అణగారినవర్గాలకు ప్రయోజనాలకు ఈ సంస్థలు పూచీపడేలా చూడాలి.
♦ అంతర్జాతీయ సౌభ్రాతృత్వం: మితవాద శక్తులు తమ పట్టును కోల్పోకుండా, మరింత బలపడేదాని కోసం సారూప్య శక్తులు అన్నింటితో అంతర్జాతీయంగా పటిష్టమైన సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటాయి. కాబట్టి వామపక్ష శక్తులు కూడా ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణల ఆధారంగా అంతర్జాతీయంగా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టాలి.
♦ తప్పుడు ప్రచారాలను ఎండగట్టడం: మితవాద శక్తులు తప్పుడు ప్రచారవ్యాప్తి ద్వారా ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ప్రజలలో వివిధ తరగతుల ప్రజానీకం మధ్య వైషమ్యాలు, శతృత్వ భావనలు పెంచి పోషిస్తుంటాయి. వామపక్షశక్తులు ఈ ప్రయత్నాలను పెద్ద ఎత్తున, బలంగా తిప్పి కొట్టాలి. మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో సాగే డిజిటల్ ప్రచారంలో చురుగ్గా ఉండాలి.
మితవాద శక్తులు బలం పుంజుకోవడం ఆర్థిక- సామాజిక సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి, హేతుబద్ధమైన పరిపాలనకు కడుప్రమాదం. మితవాద శక్తులు ఇప్పటికే ప్రజల ఆర్థిక సాంస్కృతిక సంక్లిష్ట ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వామపక్ష శక్తులు రెట్టించిన బలంతో స్పష్టమైన వ్యూహంతో ఈ మితవాద రాజకీయశక్తుల ఆటకట్టించాలి. వామపక్ష శక్తులు మాత్రమే ఈ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాయి. ఈ కర్తవ్య నిర్వహణలో వామపక్ష శక్తులు ఏ మాత్రం తడబడినా, వెనుకడుగు లేసినా సామాజిక, అభ్యుదయ ఉద్యమాలు దెబ్బతినిపోవడమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంక్షోభం తీవ్రతరమవుతుంది.
అనువాదం: కే సత్యరంజన్
(వ్యాస రచయిత ఆనంద్ తెల్తుంబ్డే పీఐఎల్ మాజీ సీఈఓ, ఐఐటీ ఖర్గపూర్, గోవా జీఐఎంలలో ఆచార్యుడిగా పనిచేశారు. రచయిత, మానవ హక్కుల కార్యకర్త)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.