తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొందరు చాలా కష్టపడతారు, చివరికి తమ లక్ష్యాన్ని చేరుకొని తమ చుట్టూ ఉన్న వారి ప్రశంసలను పొందుతారు. అలానే తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడింది. తన లక్ష్యాన్ని చేరుకొని, మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది.
తెలంగాణలోని భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకుంది. క్రికెట్ మీద ఉన్న త్రిష ఆసక్తిని తన తండ్రి గొంగడి రాంరెడ్డి గమనించారు. రాంరెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్లో త్రిష నైపుణ్యాన్ని సాధించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి విశ్వ వేదికల మీద తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. తాము ఎంచుకున్న లక్ష్యం చేరుకోగలమని తమ మీద తమకు నమ్మకం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. దీనికి ఉదాహరణగా యువక్రికెటర్ త్రిషను చూపించవచ్చు. ప్రస్తుతం ఐసీసీ అండర్- 19 టీ20 ప్రపంచకప్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో త్రిష పేరు మారుమ్రోగుతోంది.
ఆటలో త్రిష దూకుడు..
మలేషియా వేదికగా ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్ జరిగింది. ఇందులో భారత మహిళా క్రికెట్ జట్టు కూడా పాల్గొన్నది. ఈ క్రికెట్ జట్టులోని త్రిష మొదటి నుంచే ఆటలో దూకుడు చూపించింది. ఓ వైపు బ్యాటింగ్‌తో మరో వైపు బౌలింగ్‌తో అదరగొట్టింది. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా బౌలింగ్‌లో 3 వికెట్లను పడగొట్టి ‘‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’’గా, 309 పరుగులతో టోర్ని టాప్‌స్కోరర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఏడు వికెట్లు తీసి ‘‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’’ అవార్డును కూడా త్రిష తన ఖాతాలో వేసుకుంది.
కోటి రూపాయల నజరానా..
ఈ నేపథ్యంలో యువక్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ అభినందించారు. ‘‘నీ ప్రతిభ తెలంగాణ గర్వించదగినది. భవిష్యత్తులో భారత జట్టును మరింతగా గెలిపించాలి’’ అని సీఎం రేవంత్ ప్రశంసించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సన్మానించి త్రిషకు కోటి రూపాయల నజరానాను కూడా ప్రకటించారు.
తండ్రి సంతోషం..
ప్రపంచకప్ ఆటలో త్రిష చూపిన అద్భుత ప్రదర్శనపై ఆమె తండ్రి రాంరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఓ వైపు ఏకాగ్రతతో చదువుకుంటూ మరోవైపు ప్రతిరోజూ 8 గంటలు క్రికెట్ కోసం త్రిష కష్టపడేది.’’ అని రాంరెడ్డి అన్నాడు. ‘‘మలేషియాలోని పిచ్‌లకు తగినట్టుగా ముందే ప్రాక్టిస్ చేశాం. అమ్మనాన్నలు, కోచ్, టీమ్ సభ్యుల సహకారం వల్ల ఆటలో మంచి ప్రదర్శన ఇవ్వగలిగాను.’’ అని త్రిష సంతోషాన్ని వ్యక్తం చేసింది.