
దేశంలోని చలనశీల, సమత్వ శ్రామిక మార్కెట్లలో మహిళలు మార్గదర్శక పాత్ర పోషిస్తున్నారన్న అధికారిక దావాలకు భిన్నంగా స్వయం ఉపాధిలో ఉన్న మహిళల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. నిజవేతనాలు పడిపోతున్నాయి. పనిలో మహిళల శాతం పెరిగినట్లు కనబడడానికి కారణం ప్రభుత్వం ‘పని’లో తీసుకు వచ్చిన తాజా వర్గీకరణయే.
అసలు సమస్య గతకొంత కాలంగా మహిళా శ్రామికశక్తి క్రమేపీ తగ్గుతూ రావడం సామాజికవేత్తలలో, ప్రభుత్వ విధానాల రూపకర్తలలో ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. మహిళలు శ్రమలో భాగస్వాములు అవుతున్న తీరు తక్కువగా ఉండడం, క్రమేపీ తగ్గుముఖం పట్టడం దేశంలో మహిళల స్థాయి, ఆర్ధిక వ్యవస్థలో శ్రామిక మార్కెట్ల పరిస్థితుల మీద నిఖార్సైన వ్యాఖ్యానంగా మనం భావించవచ్చు. దేశంలోని శ్రామికశక్తికి తగినంత ఉత్పాదక ఉపాధిని కల్పించలేని పరిస్థితుల్లో ఉన్న మన ఆర్ధికవ్యవస్థ ఇంకా ఏటా కొత్తగా వచ్చి చేరుతున్న లక్షలాది మంది యువ ఉద్యోగార్ధులకు ఏం న్యాయం చేయగలుగుతుంది?
చాలా కాలంగా తగ్గుముఖంపడుతూనో ప్రతిష్ఠంభనకు గురయిన మహిళ ఉపాధి రేటు గణనీయంగా పెరిగిందన్న తాజా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నివేదికపట్ల అధికారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రకార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అయితే దీనిని మహిళల భాగస్వామ్యం పోటెత్తిందిగా అభివర్ణించింది. భారతశ్రామిక శక్తిలో మహిళల ముందడుగు నిలవరించజాలదని శ్లాఘించింది. మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు, శ్రమ భాగస్వామ్య రేటు గణనీయంగా పెరగడంతో పాటు మహిళలలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశం సాధించిన ఆర్ధిక ప్రగతితో పాటు చలనశీల, సమత్వ మార్కెట్లను సృష్టించడంలో, అందునా మహిళలను మార్గదర్శక స్థానంలో నిలపడంలో ప్రభుత్వ కృషికి తార్కణమని స్వయంగా కితాబు ఇచ్చుకుంది.
2017- 18 ఆర్థిక సంవత్సరంలో 71.2 శాతంగా ఉన్న పురుష కార్మికుల భాగస్వామ్య రేటు 2023- 24 సంవత్సరానికి స్వల్పంగా 76.1 శాతానికి పెరిగింది. కానీ, ఈ ఆరేళ్ల కాలంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు చాలా నాటకీయంగా పెరిగింది.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గత కొంతకాలంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి శ్రామికశక్తి సర్వేలు విడుదల చేస్తూ వస్తున్న క్రమంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు క్రమేపీ పెరుగుతూ 2023- 24 నాటికి అనూహ్యంగా 2017- 18 సంవత్సరం నాటి పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే ఒకేసారి రెట్టింపై కూర్చుంది. బహుశా ఈ పెరుగుదలే 2023- 24 సంవత్సరంలో ఉపాధి రేటు పెరగడానికి దోహదం చేసింది.
ఒకటవ పట్టికలో దేశవ్యాప్తంగా పనిలో భాగస్వామ్య పెరుగుదల రేటును సూచిస్తుంది. 2017- 18 సంవత్సరంలో పురుష కార్మికుల భాగస్వామ్య రేటు 71.2 శాతంగా ఉంటే 2023- 24 నాటికి అది 76.1 శాతానికి పెరిగింది. అయితే ఇదే ఆరేళ్ల కాలంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 22 శాతం నుంచి ఏకంగా 80 శాతం పెరిగి 2023- 24 నాటికి 40.3 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలన్నీ 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న మొత్తం జనాభాలో శాతాలు అని గమనించాలి.
Figure 1: Work Participation Rates in India, 2017-18 to 2023-24
ఆధారం: నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నివేదిక
రెండవ పట్టికలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పనిలో భాగస్వామ్య శాతం రేట్లను సూచిస్తూ ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య శాతం రేటు చాలా ఎక్కుగాను అది కూడా గత రెండేళ్లలో మరీ ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు.
Figure 2: Female Work Participation Rates in India, 2017-18 to 2023-24
ఆధారం: నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నివేదిక
పైపైన పరిశీలిస్తే ఇది ఆహ్వానించదగిన పరిణామమే. ప్రత్యేకించి గతకొద్ది సంవత్సరాలుగా పనిలో మహిళా కార్మికుల భాగస్వామ్యం పెరుగుదల రేటు చూస్తే ఉపాధిరహిత అభివృద్ధికి మంగళం పాడే రోజులు వచ్చేశాయా అన్న అనుమానం కలుగకమానదు. దేశస్థూలజాతీయోత్పత్తిలో పెరుగుదల ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు ఇబ్బడిమబ్బడిగా పెరగడానికి దారితీసి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించిందా అన్న అనుమానమూ రాకమానదు. కానీ నేషనల్ శాంపిల్ ఆఫీసు సంస్థ ‘పని’ని ఎలా నిర్వచించారో తెలుసుకుంటే తప్ప మనం ఈ గణంకాల ఆధారంగా చెప్పబూనుతన్న వివరాలు సరైనవోకావో నిర్ధారణకు రాలేం.
‘మహిళలు మరింతగా పనిలో భాగస్వామ్యం కావడం వల్ల దేశ ఆర్ధికవ్యవస్థ రూపాంతర దశకు చేరుకుని సమత్వం, సమ్మిళితం, మేళవింపులతో కొత్త అవకాశాలు కల్పిస్తుంది’అని కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ కితాబు ఇచ్చుకోవడం సరైనదో కాదో కూడా తేల్చి చెప్పలేం. ‘విద్య, వైద్య, సాంకేతిక పరిజ్ఞానం, వస్తూత్పత్తి రంగాలలోకి వివిధ స్థాయిలలో పనిచేస్తున్న మహిళలు వినూత్న ఆలోచనలు, నైపుణ్యాలు, అంకిత భావాలతో ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తు, పని ప్రదేశం గతి సూత్రాలనే మార్చేస్తున్నారు.’ అని కూడా కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ శ్లాఘించింది. అలాగే ‘మహిళా నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గడం వారికి తగిన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని, ఆ అవకాశాలను మహిళలు ఉపయోగించుకుంటున్నారని సూచిస్తుంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం, వృత్తిపరమైన సంతృప్తిదక్కడం ఈ రెండూ మెరుగయ్యాయని తెలుస్తుంది’ అని కూడా కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఇదే నిజమైతే అంతకన్నా సంబరం మరొకటి ఉండదు. కానీ మనం నిజంగా సంబరపడాలా లేదా అనేది ఇంతకు ముందు చెప్పుకున్నట్టే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు సంస్థ ‘పని’ అంటే ఏమని నిర్వచనం ఇచ్చారు. ఏ రకంగా వర్గీకరించారనేది తెలుసుకోవడం ముఖ్యం. అధికారికవర్గాలు చేస్తున్న ప్రకటనలో వాస్తవాలపాలు ఎంతో తెలుసుకోవాలంటే మహిళలకు ఏ రకమైన పనులు, ఏయే రంగాలలో అంది వచ్చాయి. అవి శ్రామిక మార్కెట్ల పరిధిలో ఇముడుతాయా లేదా అలాగే మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయా అన్న అంశాలు తేల్చుకోవాలి.
నిర్వచనాలు..
భారతదేశంలో పని, ఉద్యోగం అనే సంక్లిష్టమైన దానికి సంబంధించి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గతంలో ఏ రకంగా గుర్తించి, పరిగణించి, నిర్వచించింది, ఇప్పుడు ఏం చెబుతుందనేది తెలుసుకుందాం.
ప్రామాణికమైన ఏ డిక్షనరీలో చూసినా ‘ఏదైనా ఫలితాన్ని సాధించడానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసే కృషిని ‘పని’ అంటారు’ అని నిర్వచించాయి. ఆర్ధిక కార్యకలాపాలు అంటే సమాజంలోని అన్ని స్థాయిలలో వినిమయం కోసం సరుకులు, సేవల ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు చేపట్టే కృషి అని నిర్వచించాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పుకోవాలంటే వ్యక్తిగత వినిమయానికి దోహదం చేసేది ఆర్ధిక కార్యకలాపంగా గుర్తిస్తారు. విశ్రాంతిని ఆర్ధికేతర కార్యకలాపంగా భావిస్తారు.
ఆర్థికేతర కార్యకలాపాలు అంటే ఏమిటి అనేది మరింత సాధారణీకరించి చెప్పుకోవాలంటే ఉదాహరణకు మాతృత్వానికి సంబంధించిన విధులన్నీ ఆర్ధికేతర కార్యకలాపాలుగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లలకు మాతృస్థన్యం ఇచ్చే అవకాశం లేక ఆయాల సేవలను వినియోగించుకుంటారు. ఇందుకుగాను ఆమెకు కొంత సొమ్ముముట్టచెబుతారు. కాబట్టి ఇది ఆర్ధిక కార్యకలాపం కిందకు వస్తుంది. అలాగే తాజాగా పెరుగుతున్న అద్దెగర్భాల అంశాన్నే తీసుకుందాం. అద్దె గర్భం ధరించి బిడ్డను మోసి, కని ఇచ్చినందుకు గాను సదరు మహిళకు సొమ్ము ముట్టచెబుతారు కాబట్టి ఇది కూడా ఆర్ధిక కార్యకలాపం కోవకే చెందుతుంది.
అయితే, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సొంతంగా బిడ్డలను కనదలుచుకున్న మహిళలు జాతీయ గణాంకవ్యవస్థలోని శ్రామికశక్తిగా పరిగణించబడరు. ఉద్యోగం చేస్తూ మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తుంటారు. వాస్తవానికి ఇది సెలవు కాదు కదా ఆ మహిళ పునరుత్పత్తి ప్రక్రియలో ఉన్నట్లే కదా.
‘బిడ్డలకు స్థన్యం ఇవ్వడానికి ఆయాలను నియమించుకుంటే, ఆ పనికి గానూ ఆయాకు ప్రతిఫలం చెల్లిస్తారు కాబట్టి అది ఆర్ధికకార్యకలాపం కిందకే వస్తుంది’ (ఇటాలిక్)
2013లో జెనీవాలో జరిగిన 19వ అంతర్జాతీయ లేబర్ గణంకాల సదస్సు ఈ వైరుధ్యాన్ని పరిష్కరించింది. పని, ఉద్యోగాల నిర్వచనంలో ఉన్న తేడాలను విస్తారంగా వివరించింది. పని అంటే ఏ వయసువారైనా, ఏ జెండర్‌కి చెందిన వారైనా తమ కోసం కానీ ఇతరుల వినియోగానికి కానీ అవసరమైన సరుకులను ఉత్పత్తి చెయ్యడమో సేవలు అందజేయడమో అని నిర్వచించారు. 2014లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సు ఈ నిర్వచనాన్నే ఆమోదిస్తూ తీర్మానించింది.
ఈ నిర్వచనంలో ‘తమకోసం కానీ, ఇతరుల వినియోగానికి కానీ’ అన్న వాక్యంలోనే తేడా అంతా ఇమిడి ఉంది. ఇంట్లో తమకోసం కానీ, కుటుంబ సభ్యుల కోసం చేసే శ్రమ కూడా పని కిందకే వస్తుంది. సరుకుల ఉత్పత్తి సేవల అందజేతకు ఆస్కారం లేని వాటిని (ఉదాహరణకు భిక్షమెత్తడం, దొంగతనానికి పాల్పడడం) పనిగా గుర్తించరు. శరీర శుభ్రత పాటించడం, నిద్రపోవడం, ఆటలాడడం, నేర్చుకోవడం వంటివి కూడా ‘పని’ నిర్వచనంలోకి రావు. ఈ నిర్వచనం ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబం సహా ఏ ఆర్ధిక యూనిట్‌లోనైనా చేసే ఉత్పాదక శ్రమని ‘పని’గా గుర్తించడం, ఉద్యోగం అంటే జీతానికీ, లాభానికో పనిచెయ్యడం. పట్టిక 3ను పరిశీలిస్తే ఉత్పత్తి పరిధిలోకి వచ్చే వివిధ రూపాల పనులు ఏమిటో మనకు తెలుస్తుంది.
Figure 3: Forms of Work and the System of National Accounts 2008
ఆధారం: ఐసీయస్యస్ తీర్మానం 2013
1967- 68లో జరిగిన 22వ విడత నేషనల్ శాంపిల్ సర్వే సందర్భంగా ‘పని’ అంటే వస్తువుల ఉత్పత్తి లేదా సేవల అందచేత అని ప్రాథమికంగా నిర్వచించారు. కుటుంబ సభ్యులు చేసే ఇంటిపనిని ‘పని’గా పరిగణించలేదు.
1977- 78లో చేసిన 32వ నేషనల్ శాంపిల్ సర్వే నుండి జనవరి- జూన్ 1993లో చేసిన 49వ సర్వే వరకు జీతం లాభం కుటుంబపరమైన లబ్ధి లేదా జాతీయవాదానికి అదనంగా విలువ సమకూర్చే ‘లబ్ది కార్యకలాపం’ దేనినైనా ‘పని’గా నిర్వచించారు. మారకం కోసం చేసే వస్తూత్పత్తి, సేవలను కూడా ‘పని’గా పరిగణించారు. వ్యవసాయ ఉత్పత్తులు మొత్తంగా కానీ పాక్షికంగా కానీ అమ్మకుండా స్వంత వినియోగం కోసం ఇట్టేపెట్టి లబ్ధి చేకూర్చే ‘పని’ క్యాటగిరీలోపొందుపరిచారు.
అయితే జూదం, వ్యభిచారం, స్మగ్లింగ్వంటి కార్యకలాపాల్లో ఆదాయాలు ఉన్నప్పటికీ వీటిని ‘లబ్ధి’ చేకూర్చేవిగా పరిగణించలేదు. ఈ కార్యకలాపాలు కూడా ఆదాయాన్నీ సృష్టిస్తున్నాయి. కాబట్టి ‘పని’ నిర్వచనాన్ని అనుసరించి జాతీయ ఆదాయం ఎందుకు పరిగణించకూడదు అనే వాదన కూడా ఉంది.
నేషనల్ శాంపిల్ సర్వే కూడా అతి స్పష్టంగా ఒక వ్యక్తి చేసే కార్యకలాపాలనే పరిగణనలోకి తీసుకోవాలి, తప్ప ఆ కార్యకలాపాలు చట్ట సమ్మతమా కాదా అనే పరిస్థితిని బట్టి అంచనా వేయకూడదు అని పేర్కొనడం గమనార్హం. అంటే ఆర్థిక కార్యకలాపాల పరిధి నుండి చట్టబద్ధత పేరిట ఏ కార్యకలాపాన్ని మినహాయించడానికి వీలు లేదని స్పష్టమవుతున్నది. కాబట్టి ఇక్కడ ‘నైతికత’ అన్న భావన ఎంతమాత్రం పొసగదు. కానీ సామాజిక ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు కానీ (సాధారణ పరిభాషలో ఇంటి పనులు అని చెప్పుకోవచ్చు). కమ్యూనిటీ కోసమో, సామాజిక బాధ్యతలు నెరవేర్చడం కోసమో చేపట్టే కార్యకలాపాలు కానీ ‘లబ్ధి’ చేకూర్చేవి కాదు. కాబట్టి ఇవి ‘పని’ నిర్వచనంలోకి రావు అని నిర్ధారించారు.
1993- 94 సంవత్సరం తర్వాత నుంచి నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వేలో ‘లబ్ధి చేకూర్చే కార్యకలాపాల’ బదులు ‘ఆర్ధిక కార్యకలాపాలు’ అన్న పదాన్ని స్థిరపరిచారు. ఇందులో కూడా గతంలో మాదిరే స్వంత వినియోగం చేపట్టిన వ్యవసాయరంగ మార్కెట్, మార్కెటేతర కార్యకలాపాలతోపాటు నారుపోయడం, కోతకోయడం, పంటల సేకరణ, అటవీ పెంపకం, వంట చెరకు సమీకరించడం, చేపలు పట్టడం, వేట తదితర కార్యకలాపాలన్నింటినీ ఆర్ధిక కార్యకలపాలుగా పరిగణించారు.
వీటితో పాటు స్వంతంగా ఇళ్లు కట్టుకోవడం, బావుల తవ్వకం, రోడ్లు వెయ్యడం, గృహోపయోగ వస్తువుల తయారీ, కమ్యూనిటీ కోసమో ప్రైవేటు కోసమో చేపట్టే నిర్మాణాలు వంటి స్థిరాస్థుల కల్పనలను కూడా ‘ఆర్ధిక కార్యకలపాల’ పరిధిలోకి తీసుకువచ్చారు.
నిర్మాణరంగంలో కూలీగా పనిచేసినా, సూపర్వైజర్గా పనిచేసినా దానిని ఆర్థిక కార్యకలాపంగా పరిగణించారు. అయితే వినియోగం కోసం ఉత్పత్తులను ప్రాథమిక పనిని ఆర్ధిక కార్యకలపంగా పరిగణనలోకి తీసుకోలేదు. వ్యభిచారం, జూదం, భిక్షాటనలవంటి పనులను మినహాయించినట్లే ఇంటిపనులను కూడా ఆర్ధిక కార్యకలాపాల నుండి మినహాయించారు. నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా విడుదల చేసిన శ్రామికశక్తి సర్వే నివేదికలో ఈ క్రింద పేర్కొన్న పనులను ఆర్ధిక కార్యకలాపాలుగా పేర్కొంది.
కోడ్ 11 : స్వయం ఉపాధి, గృహపరిశ్రమలో తానే కార్మికుడుగా పనిచెయ్యడం
కోడ్ 12 : స్వయం ఉపాధిలో యజమానిగా ఉంటూ చేసేపని
కోడ్ 21 : గృహపరిశ్రమలో, సహాయకుడిగా చేసేపని (చెల్లింపులు లేని కుటుంబ కార్మికుడు)
కోడ్ 31 : జీతం మీద రెగ్యులర్ ఉద్యోగి కార్మికుడు చేసేపని
కోడ్ 41 : ప్రభుత్వ రంగంలో క్యాజువల్ కార్మికుడు చేసేపని
ఇంట్లో నయా పైసా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనులు వాస్తవానికి ఆర్ధిక కార్యకలాపాలే అయినప్పటికీ ఇవే పనులు చేసి ప్రతిఫలం కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా ‘పని’ నిర్వచనం పరిధిలోకి వస్తాయి. కానీ కోడ్ 92, కోడ్ 93 ద్వారా ఈ పనులను ‘చెల్లింపులు లేని పనులు’గా నేషనల్ శాంపిల్ సర్వే వర్గీకరించడంతో దీనిని ‘శ్రామిక శక్తి’గా కూడా పరిగణలోకి తీసుకోలేదు. అలాగే కోడ్ 96ను పూర్తిగా పరిహరించారు. ఈ కార్యకలాపాల్లో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఆర్ధిక కార్యకలపాల కిందకే వస్తాయి. అయితే, ఈ కార్యకలాపాల్లో ఉన్న ఆర్ధికాంశం కన్నా నైతిక ప్రమాణాలరీత్యా ఈ పనులకు సర్వే పరిధి నుంచి పరిహరించినట్టు ఉన్నారు.
వీటితో పాటుగా పరిశ్రమలలో ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమ చేసే సహాయకులను ‘కార్మికులుగా’ ఉపవర్గీకరించడం మరింత గందరగోళానికి తావిచ్చింది. వాస్తవానికి ఈ రకమైన విభజన పాటించి చూడడం అంత సులువైన విషయం కాదు. వ్యవసాయ, వ్యవసాయేతర పనులలో ఇది మరింత అసాధ్యమైన విషయం. యన్యస్యస్ఓ ఒక విధంగా ఏకపక్షంగా ఇలాంటి కార్యకలాపాలను తన చిత్తానుసారం వర్గీకరించింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) పని, ఉపాధిని నిర్వచిస్తూ వస్తువుల ఉత్పత్తి, సేవల అందజేత కోసం చేపట్టే కార్యకలాపాలన్నీ అవి మారకం కోసం చేపట్టారా, స్వీయ వినియోగం కోసం చేపట్టారా అనే దానితో నిమిత్తం లేకుండా పనుల కిందకే వస్తాయని, ఇందులో ప్రతిఫలం ముట్టే పనులు ఉపాధి కోవకిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ లెక్కన చూస్తే ‘ప్రతిఫలం పొందని సహాయకులు’ ప్రాథమికంగా కార్మికుల కిందకురారు, వీరిని ‘ఉపాధి పొందిన’ వారిగా వర్గీకరించడం అంతకన్నా సరికాదు.
పైన మూడవ పట్టిక ‘ఇతర పనులు’ అన్న కాలమ్‌తో చెల్లింపులు లేని తప్పనిసరి పనులను ‘ఉపాధి’గా పరిగణించలేదు. సమాజంలోని పితృస్వామిక సామాజిక సంబంధాల కారణంగా కుటుంబ పరిశ్రమలో ‘సహాయకులకు డబ్బురూపేణా ఆదాయం అందుబాటులో ఉండకపోవడం అనేది మన దేశంలో సహజాతి సహజమైన వాస్తవం.
ఈ నిర్వచనాల గోలేంటీ అందులో లొసుగులు ఉంటే ఇప్పుడు ఏమొచ్చిందని తేలికగా తీసుకోవద్దు. కుటుంబపరిశ్రమలో ‘ప్రతిఫలం లేని సహాయకుల’ పద్దు కింద మహిళలు అత్యధికంగా ఉపాధి’ పొందారని ప్రభుత్వం చెబుతున్న లెక్కలలో మోసాన్ని అర్ధం చేసుకోవడానికి పై వివరాలు తెలుసుకోవడం అవసరమయ్యాయి.
పెరుగుతున్న స్వయం ఉపాధి ప్రాముఖ్యతా దాని సమస్యాత్మక స్వభావం
దిగువన పేర్కొన్న పట్టిక 4, పట్టిక 5లలో కార్యకలాపాలను బట్టి మహిళలు పొందిన వివరాలు గ్రామీణ- పట్టణ ప్రాంతాల మహిళల ఉపాధిలో ఈ మధ్య కాలంలో గణాంకాలలో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులను మనం తెలుసుకోవచ్చు.
ఈ గణాంకాలన్నీ 15 ఏళ్లు ఆ పైబడిన వయసులో ఉన్న వివిధ తరగతుల మహిళలకు సంబంధించినవి. అయితే, నిరుద్యోగ మహిళల గణాంకాలను మాత్రం వదిలేశారు. నేషనల్ శాంపిల్ సర్వే ఇంతుకు ముందు పేర్కొన్న కోడ్ 11, 12, కోడ్ 21, కోడ్ 31, కోడ్ 41, 51 నిర్వచనాల పరిధిలోకి వచ్చిన వారినే మొత్తం కార్మికులుగా చూపించారు. దానితో పాటు కోడ్ 92, 93 క్యాటగిరీ కిందకు వచ్చే ఇంటి పనులు, తత్సంబంధిత కార్యకలాపాల్లో ఉండే చెల్లింపులు లేని, కార్మికులుగా గుర్తింపుకు నోచుకోని వారిని కూడా కార్మికుల లెక్కలో కలిపేశారు. కోడ్ 96ను మాత్రం పరిహరించారు. అయితే, ఈ క్యాటగిరీలో ఏడాది వయసు దాటిన మహిళలను 2 శాతం మందిని కార్మికులుగా లెక్కలోకి తీసుకున్నారు.
అయితే, ఇదే 2 శాతం మందిని కార్మికశక్తిగా పరిగణలోకి తీసుకోలేదు. ఉదాహరణకు గ్రామీణ ప్రాంత మహిళల లెక్కలే తీసుకుందాం. 2023- 24వ సంవత్సరంలో చెల్లింపులు లేని కార్మికుల సంఖ్య (కోడ్ 92, 93) నాటకీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో స్వయం ఉపాధిలో గణనీయమైన పెరుగుదల, దాదాపు నమోదయిన ఉపాధిలో 95 శాతం పెరుగుదల కనిపిస్తుంది.
ఏ కోడ్ 92, కోడ్ 93 క్యాటగిరీలకు చెందిన వారిని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసువారు శ్రామిక శక్తిగా పరిగణనలోకి తీసుకోలేదో వారి శాతం చెల్లింపులు లేని మహిళా కార్మికుల విభాగంలో ఏ మేరకు తగ్గిందో దాదాపుగా అంతేశాతం స్వయం ఉపాధి విభాగంలో పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ పరిశ్రమలో ప్రతిఫలం లేకుండా సహాయకులుగా ఉన్నవారిని, స్వయంగా కొంత ప్రతిఫలం తీసుకు పనిచేస్తున్నవారిని రెండు క్యాటగిరీల వారు ఇందులో ఉన్నారు. రెగ్యులర్, క్యాజువల్ మహిళా కార్మికుల శాతంలో నామమాత్రపు పెరుగుదల ఉంది. అయినప్పటికీ 15 ఏళ్లు పైబడిన మొత్తం గ్రామీణ మహిళలో వీరు 1/ 10వ వంతు కూడా లేరు.
Figure 4: Rural Women by Status of Work in India, 2017-18 and 2023-24
2017- 18, 2023- 24 కాలంలో గ్రామీణ మహిళలో పనులు చేసినవారు
Figure 5: Urban Women by Status of Work in India, 2017-18 and 2023-24
అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి ఈ ధోరణులు కాస్త భిన్నంగా ఉన్నాయి. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములయిన పట్టణ మహిళలు ఎనిమిది శాతం పెరిగారు. అదే సందర్భంలో చెల్లింపులు లేని కార్మికులు ఆరు శాతం తగ్గారు. ఉపాధి పెంచిన పట్టణ మహిళలలో సగం మంది రెగ్యులర్ కార్మికుల క్యాటగిరిలోనూ మరో సగం మంది స్వయం ఉపాధి పొందిన వారిగానూ నమోదయ్యారు. ఇది కొంత సానుకూల పరిణామమే అయినప్పటికీ 15 ఏళ్లు దాటిన పట్టణ మహిళలలో రెగ్యులర్ కార్మికులు 13 శాతం కన్నా తక్కువగా ఉంటే, స్యయం ఉపాధిలో ఉన్న మహిళలు 7.4శాతంగా మాత్రమే ఉన్నారు.
గృహ పరిశ్రమలలో ప్రతిఫలాపేక్ష లేని సహాయకుల శాతం అటు గ్రామీణ, ఇటు పట్టణ మహిళలో తగ్గుముఖం పట్టింది. పట్టణ మహిళలో సగటు ఉద్యోగిత అంతర్జాతీయ ప్రమాణాలరీత్యాగానీ, సాపేక్షంగా మన దేశం వంటి వర్ధమాన దేశాలతో కానీ పోలిస్తే కేవలం 26 శాతంగా ఉన్నది.
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మనకు రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ గణంకాలు రూపొందించే క్రమంలో కోడ్ 21 క్యాటగిరిలోకి వచ్చే కుటుంబ పరిశ్రమలో ప్రతిఫలం లేని సహాయకుల సంఖ్యని కోడ్ 92, 93 క్యాటగిరీ కిందకి వచ్చే శ్రామిక శక్తిలో చేర్చని, ప్రతిఫలం పొందని కార్మికుల సంఖ్యని యథాలాపంగా అటూ ఇటూ మార్చేవీగా మహిళా ఉపాధి రేటులో సగం పెరుగుదల కనిపిస్తున్న దృష్ట్యా ఈ ప్రశ్న అసంగతం కాదని, క్షేత్రస్థాయి పరిశీలకులకు ఇచ్చిన శిక్షణ, సూచనలు ఏమిటి, వారు అవే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించారా లేదా అనేది నిర్ధారించడం కూడా అవసరమని మనకు తెలియవస్తుంది. ఇక రెండవ ప్రశ్న మహిళలు ఇంత పెద్ద ఎత్తున ప్రతిఫలాపేక్షతో కూడిన ఏ స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపుతున్నారు? వాటి నాణ్యతలు ఏంటి? ఆ స్వయం ఉపాధుల స్వభావం ఏంటి అని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు వివరించాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళలకు రెగ్యులర్‌గా దొరికే పనుల్లో ఎక్కువగా ఇళ్లలో పాచిపని చెయ్యడం, అలాగే ఎటువంటి న్యాయపరమైన, సామాజికపరమైన రక్షణలు లభించని మోటు పనులు మాత్రమే ఎక్కువ. ఇక ఆ పనుల నాణ్యత గురించి అంచనాకు రావాలంటే ఆ పనులకు ముట్టే సగటు వేతనాలను బట్టి నిర్ధారించుకోవచ్చు. కింద పొందుపరిచిన పట్టికలో నిజ వేతనాలకు సంబంధించిన ఆందోళనకర ధోరణులను మనం పసిగట్టవచ్చు.
2023- 24 ధరలతో సరిపోల్చిన భారతీయ కార్మికుల వేతనాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల రెండింటా రెగ్యులర్ మహిళా కార్మికుల నిజవేతనాలు తగ్గుముఖం పట్టడం ఒత్తిడితో కూడిన ఆ ఉపాధిలో ఇమిడి ఉండే దుర్భరమైన పరిస్థితులకు కూడా ఒక సూచిక. పట్టణ పేద మహిళలకు ఎక్కువలో ఎక్కువగా ఇళ్లలో పాచిపనులు, తత్సమాన పనులే దక్కించుకుని బతకడానికి వీలుగా అంతో ఇంతో సంపాదించుకోవడానికి ఆరాటపడే మహిళల శాతం ఎక్కువే ఒక రకంగా చెప్పాలంటే ఈ పనుల కోసం మహిళలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆదాయాలు గడించడంలో ఆడా, మగా మధ్య చాలా అంతరం ఏర్పడిన ధోరణులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గత కొంత కాలంగా పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే అంశం. దిగువ పొందుపరిచిన పట్టిక ఆరును పరిశీలిస్తే స్వయం ఉపాధిలో ఉన్న మహిళా కార్మికులు పురుష కార్మికుల ఆదాయాల్లో మూడవవంతు మాత్రమే గడించడం విభ్రమ కలిగించకమానదు.
పట్టిక 6: దేశంలో స్త్రీ- పురుష కార్మికుల వేతనాల నిష్పత్తులు
ఆధారం: నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు వార్షిక శ్రమశక్తి నివేదిక
పై వివరాలను పరిశీలిస్తే 2017- 18, 2023- 24 మధ్యకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంత రెగ్యులర్ మహిళా కార్మికుల నిజవేతనాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టమవుతుంది. స్వయం ఉపాధిలో ఉన్న మహిళల ఆదాయాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది. జెండర్‌ని బట్టి ఆదాయాల వ్యత్యాసం కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.
అన్నిటి కన్నా ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే తాజాగా విడుదల చేసిన శ్రామికశక్తి గణాంకాలను బట్టి కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ గొప్పగా ప్రచారం చేస్తున్నట్లు ‘దేశ భవిష్యత్తును తీర్చి దిద్దడంలో చలనశీల శ్రామిక మార్కెట్లలో మహిళల సమాన భాగస్వామ్యంతో మార్గదర్శక పాత్ర పోషిస్తున్నారు అనేది ఒట్టి బూటకం.
స్వయం ఉపాధి క్యాటగిరీలో హఠాత్తుగా గణనీయంగా మహిళా కార్మికుల పెరుగుదలను సూచిస్తున్న ప్రభుత్వ గణాంకాలను మరింత లోతుగా ప్రాంతాలవారీ, రాష్ట్రాలవారీ, రంగాల వారీగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాలకులు ప్రజలను నమ్మించడం కోసం కాకమ్మ కథలు వంటి గణాంకాలను వెలువరించడానికి బదులు దేశభవిష్యత్తును తీర్చిద్దిడంలో మహిళలు మార్గదర్శక పాత్ర పోషించాలంటే వారి ఆదాయాల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన, అతిస్వల్పవేతనాలు/ ఆదాయాలు వచ్చే ఉపాధి అవకాశాలు వంటి సమస్యాత్మక అంశాలను చిత్తశుద్ధితో పరిష్కారం చేసేందుకు కృషి చెయ్యాలి.
– జయతి ఘోష్
అనువాదం: కె. సత్యరంజన్
(గత మూడు దశాబ్దాలు జయతి ఘోష్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రం బోధించారు. ప్రస్తుతం యామ్ప్రెస్ట్లోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.