
తిరుపతి : ప్రముఖ చరిత్రకారులు, పురాతత్వ పరిశోధకులు జమునాదాస్ రాసిన ‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే’ తో పాటు ‘భారత రాజ్యాంగం’ తదితర 16 తెలుగు అనువాద పుస్తకాలను తిరుపతి అంబేద్కర్ భవన్ లో పలువురు ప్రముఖులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన శ్వేత ( శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ)మాజీ డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ,‘‘ ‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే’ పుస్తకంలో చరిత్రలో ఏం జరిగిందో రచయిత జమునాదాస్ సవినయంగా రాశారే కానీ, తిరుమలను బౌద్ధులకు అప్పగించమని రాయలేదు. అజంతా గుహల్లో ఉండే పద్మరూపమే తిరుమలలో ఉన్నదా అన్నదానిపై లోతైన పరిశోధన జరగాలి. 1991లో జమునా దాస్ రాసిన ఈ పుస్తకం అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైంది. నా మిత్రుడు ఏ.ఎన్.నాగేశ్వరరావు చక్కని తెలుగులోకి అనువాదం చేశాడు.’’ అని అన్నారు.
‘‘దళితులను కమ్యూనిస్టులు కలుపుకుపోలేదన్న ఆరోపణ గతంలో ఉండేది. ఇప్పుడు దళిత చైతన్యం పెరిగింది. దళితులు ఇప్పుడు మాలాంటి వారిని కలుపుకు పోకపోతే నష్టపోతాం. మను స్మృతే రాజ్యాంగమని ఆర్ ఎస్ ఎస్ వారు ప్రకటిస్తే ఏం చేస్తున్నాం? గడిచిన ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చేసేవారు’’ అని భూమన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆధార్ మాజీ డైరెక్టర్ జనరల్ పీ.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ, ‘‘సామాజిక విప్లవానికి, ఆర్థిక విప్లవానికి భారత రాజ్యాంగం పునాది వేసింది. రాజ్యాంగం సృష్టించిన విప్లవంలో భాగంగానే మనం ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం. జ్ఞానం ఉంటేనే మనం మనుషులుగా గుర్తింపు పొందగలుగుతాం’’ అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కమిటీ బాధ్యులు పి. అంజయ్య మాట్లాడుతూ, ‘‘తిరుమలకు వెళుతుంటే మెట్ల వద్ద ముగ్గురు చెప్పులు కుట్టుకునే మాల మాదిగల విగ్రహాలు సాష్టాంగపడుతున్నట్టు చెక్కారు. ఒకప్పుడు వాళ్ళు కొండపైకి వెళ్ళడానికి వీలు లేదు. పక్కనే ఉన్న మాల్వాని గుండంలో మునిగి, వెళ్ళిపోయే వారు. ఈ స్థితిలో 1907లో చెల్లప్ప మేస్త్రీ దళితులు బస చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాంతమే ఇప్పుడు అంబేద్కర్ భవన్ ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఉత్తర ప్రదేశ్ లోని కుంభమేళాకు పది కోట్ల మంది హాజరైతే, పూసలు అమ్ముకునే ఒకే ఒక్క గిరిజన అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా డైరెక్టర్లు సైతం ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె మేకప్ ఏమీ చేసుకోలేదు. గిరిజన సౌందర్యం అంటే అది.” అన్నారు.
‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే’ పుస్తకం అనువాద రచయిత ఏ.ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ,‘‘జమునా దాస్ రాసిన ఈ పుస్తకం మూడేళ్ళ క్రితమే అనువాదమైంది. అది సమాంతరలో సీరియల్ గా వచ్చింది. తిరుమల లో ఉన్నది శివుడని కొందరు, విష్ణువని మరికొందరు, శివకేశవుల రూపమని ఇంకొందరు వాదనలను తీసుకొచ్చారు. ఒకప్పటి ఈశ్వరుడే ఇప్పుడు వెంకటేశ్వరుడయ్యాడు. నిజానికిది బౌద్ధ క్షేత్రమే. జమునా దాస్ తిరుమల, తిరుపతిలను అనేక సార్లు సందర్శించి, టీటీడీ అచ్చేసిన అనేక పుస్తకాలను పరిశీలించి, ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాక చివరగా ఇప్పుడు తెలుగులోకి అను వాదం చేశాను ’’ అంటూ ఆ పుస్తక నేపథ్యాన్ని వివరించారు.
ఈ పుస్తకాలను అచ్చు వేసిన సమాంతర పబ్లికేషన్ అధ్యక్షులు వరుణ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘అంబేద్కర్ ఆశయాలు అమలు జరిగినట్టయితే అభి వృద్ధిలో భారత దేశం చైనాను మించిపోతుంది. అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన చదువుకున్నంతగా మరెవరూ చదువుకోలేదు. ఆయన రచనలు పూర్తిగా రాలేదు. బొజ్జాతారకం, మరొకిందరు చేసిన అనువాదాలు మాత్రమే ప్రామాణికంగా ఉన్నాయి. అన్నిటినీ తెలుగులోకి తీసుకు రావడానికి కృషి చేస్తున్నాం.’’ అని వివరించారు.
అంబేద్కర్ భవన్ అధ్యక్షులు డాక్టర్ పి.పరమశివన్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరుమల సందర్శించినప్పడు ఆమెను కలిసి తిరుపతి బౌద్ధ క్షేత్రమేనని చెప్పే ఆధారాలను ఆమెకు సమర్పించామని గుర్తు చేశారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కు ఎవ్వరూ ముందుకు రాని స్థితిలో అంబేద్కర్ భవన్ ఆ సాహసం చేసిందని అన్నారు. బౌద్ధులతోనే దేవాలయ నిర్మాణం ప్రారంభమైందని న్యాయవాది కోదండరామ మట్లాడుతూ అన్నారు.
సభలో సీపీఐ నాయకులు చిన్నం కాళయ్య, పౌర చైతన్యవేదిక కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వరరావు, ఏఐఏవైఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.సంతోష్ కుమార్, కార్యదర్శి కె.నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.