
రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సోలార్ ప్రాజెక్ట్ ఉత్పత్తి పరికరాలను తయారు చేసే బడా కార్పొరేట్ కంపెనీ ఇండో సోల్ కంపెనీకి 8,234 ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతలో కరేడు గ్రామపంచాయతీలోని 4,912 ఎకరాల భూమి సేకరించేందుకు జూన్ 21న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరేడు ప్రాంతంలో భూసేకరణకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆగ్రహించిన రైతులు వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకత్వాన జూన్ 28న ఆందోళనకు పిలుపునిచ్చారు. నిరసనలకు సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొందరు రైతులతో పాటు రైతు సంఘాల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యల వల్ల ఆగ్రహించిన వేలాదిమంది రైతులు 29వ తేదీన సమీపంలోని జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీని వల్ల చాలాసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. చివరికి సబ్‌కలెక్టర్ దిగివచ్చి ఆందోళనకారులతో చర్చించారు. తగిన న్యాయం చేస్తామని సబ్‌కలెక్టర్ హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళనను విరమించారు. మరోవైపు ఆందోళనలో పాల్గొన్న రైతుల, రైతు సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు.
రైతుల ఆందోళన తీవ్రతను గమనించిన వామపక్ష పార్టీల రైతు సంఘాల నాయకులు జూలై 2న నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడ్డారు. ఆ తర్వాత కరేడు మేజర్ పంచాయతీలోని గ్రామాలను సందర్శించి, తాము అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు.

కరేడు గ్రామ రైతుల తొలి విజయం..
రైతులు తమ భూముల కోసం రోడ్డు ఎక్కిన ఫలితంగానే జులై 4న కరేడు గ్రామపంచాయతీ సచివాలయం దగ్గర జిల్లా అధికారులు గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజల్లో అధిక సంఖ్యలో మహిళలు హాజరై “భూమి మా జీవనాధారం, మా భూముల్ని అమ్ముకోం, ఇది మా భవిష్యత్తుకు ముప్పు, పరిశ్రమల పేరుతో మా భవిష్యత్తును నాశనం చేస్తారంటే అంగీకరించేది లేదు, చావనైనా చస్తాం కానీ సెంటు భూమిని కూడా ఇవ్వం, మా రైతుల నిర్ణయాన్ని తీర్మానంగా చేసి ప్రభుత్వానికి పంపండి” అని రైతులు ముక్తకంఠంతో నినదించి సభను స్తంభింపచేశారు. చివరకు గ్రామ సభలో పాల్గొన్న సబ్ కలెక్టర్, రైతులు చెప్పిన నిర్ణయాన్ని తీర్మానంగా ప్రకటించి సభను ముగించారు. ఆ విధంగా వివిధ రైతు, పౌర హక్కుల సంఘాల అండతో కరేడు గ్రామ రైతులు తొలి విజయాన్ని సాధించారు.
కరేడు ప్రాంత గ్రామాల పచ్చని పొలాలలో కార్చిచ్చును అంటించింది ఎవరు? రైతుల జీవితాల మనుగడకే ప్రమాదంగా ముంచుకొచ్చిన ఈ సమస్యను సృష్టించింది ఎవరు?
పదేపదే మాటమారుస్తోన్న చంద్రబాబు..
పర్యావరణహితమంటూ సోలార్ విద్యుత్తు అనుకూల ప్రచారాన్ని అంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రారంభించారు. ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను కూడా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. అంతేకాకుండా, వాటికి కావలసిన వేలాది ఎకరాల భూములను కూడా భూసేకరణ చట్టం కింద సేకరించి అప్పజెప్తున్నారు.

సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను తయారు చేసే ఇండో సోల్ సోలార్ కంపెనీకి 8,348 ఎకరాలను కరేడు ప్రాంత గ్రామాల భూములు ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సోలార్ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. చేవూరు- రావూరు గ్రామాల్లో ఇండోసోల్ కంపెనీకి 76,033 కోట్ల పెట్టుబడితో 13,200 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో సాధారణ భూములను వైసీపీ ప్రభుత్వం అనువైనవిగా భావించింది. అక్కడే సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ యూనిట్టును ప్రారంభించడానికి అనుమతించింది.
ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో అనుమతులిచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది జగన్ బినామీ కంపెనీ అని ఆరోపించారు. దీనికి 2023 అక్టోబర్‌లో తెలుగుదేశం నాయకులు లోకేష్ మొదలుకొని ముఖ్య నాయకులు కోరస్ కలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మాటమార్చింది. ఏదైతే కంపెనీని వైసీపీ బినామీ అంటూ చంద్రబాబు ఆరోపించారో, ప్రాజెక్టు కొనసాగిస్తూ అదే కంపెనీకి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఉలవపాడు మండలములోని కరేడు గ్రామ భూములను కేటాయించడానికి రంగంలోకి దిగారు.
కరేడు రైతుల గుండెలపై కుంపటి..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అండతో చంద్రబాబు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రవర్తిస్తోంది. బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నిస్తోంది.

ఇండో సోల్ సోలార్ కంపెనీకి కరేడు పంట భూములను కట్టబెట్టటానికి అడ్డగోలు నిర్ణయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే తీసుకుంది. అయితే, దీనికి అసలు కారణమేంటంటే సోలార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ 14,152 కోట్లు సబ్సిడీని అప్పనంగా పొందటానికి, దీంతో పాటు బడా కార్పోరేట్ అదానీ కంపెనీకి బినామీగా ఉన్న షిరిడి సాయి కంపెనీ టీడీపీ పార్టీకి 2024 జనవరిలో ఇచ్చిన రూ 40 కోట్లు విలువచేసే ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా లబ్ది పొంది ఉండటమే. దీనికి ప్రతిఫలంగా కరేడు ప్రాంత రైతాంగాన్ని బల్లివ్వటానికి సిద్ధపడింది.
ఈ సోలార్ ప్రాజెక్ట్‌ను పెట్టటానికి ఎక్కడా భూములు లేనట్లు కరేడు భూములనే కూటమి ప్రభుత్వం ఎంచుకోవడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులను పెట్టటానికి పంటలు పండని భూములు, కొండ ప్రాంతాలను ఎంచుకుంటారు. చైనా దేశంలో నిర్మించిన సోలార్ ప్రాజెక్టులు ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తాయి. అయితే మన పాలకులకు కావాల్సింది, రైతుల సంక్షేమం కంటే బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనమే. దీని కోసమే 15 అడుగుల్లో నీరు పడే మాగాణి భూముల్లో, ఆరుగాలం వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలు మొదలుకొని వరి, పత్తి, మిర్చి, మినుములు, వేరుశనగ, ప్రత్యేక రుచి కలిగిన మామిడి పండ్ల వరకు సుమారు 19 రకాల పంటలు పండే బంగారు భూములను ఎంచుకున్నారు. అమరావతి రాజధాని భూముల విషయంలో వివిధ పంటలు పండే పచ్చని పంట భూముల విషయంలో తీసుకున్న వైఖరినే ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వివిధ రకాల పంటలతో పాటు, వ్యవసాయ కార్మికులకు ఎల్లవేళలా పనులు లభించేలా ఈ పంటభూములు ఉన్నాయి. అలాంటి భూములు పది పరకా కాదు ఏకంగా 8 వేల ఎకరాలకు పైగా భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది.
ఈ ప్రాంతంలో పెట్టేది సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కాదు. ఆ ప్రాజెక్టుకు కావలసిన పరికరాలను తయారు చేసే ఫ్యాక్టరీ మాత్రమే. మరి అలాంటి ఫ్యాక్టరీకి వేలాది ఎకరాల భూములు ఎందుకు కట్టబెడుతున్నారు? ఎందుకంటే బడా కార్పొరేట్ శక్తి అదానికి బినామీగా ఉన్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు, మరో బినామీగా ఉన్న ఇండోసోల్ సోలార్ కంపెనీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లబ్ది చేకూర్చటానికేనని వేరే చెప్పనవసరం లేదు.
బలహీనవర్గాల పొట్టకొట్టాలని చూస్తున్న చంద్రబాబు..
నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం తీర ప్రాంతంలో ఉన్న కరేడు గ్రామం ఓ మేజర్ పంచాయతీ. 20 చిన్న చిన్న గ్రామాలు ఉన్న ఈ పంచాయతీలో సుమారు 17 వేల మంది పైగా ప్రజలు నివాసముంటున్నారు. ఈ గ్రామాల్లో నూటికి 90 శాతం మంది ప్రజలు చిన్న సన్నకారు రైతులే. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో పిడుగులాంటి ఈ వార్త ఇక్కడ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వ్యవసాయ భూమితో పాటు 300కు పైగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఇళ్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా తొలగిస్తామని నోటిఫికేషన్లో ప్రకటించారు. అంతేకాదు ఈ భూములను అమ్మకూడదు, కొనకూడదని రిజిస్టార్ ఆఫీసులలో ప్రకటించాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అలాగే సామాజిక ప్రభావ అంచనా కూడా ఈ భూసేకరణకు వర్తించదని ప్రకటించటం విడ్డూరంగా ఉంది. ఈ నోటిఫికేషన్లో ప్రకటించిన ఆంక్షలు ఈ ప్రాంత రైతుల పాలిట ఉరిత్రాళ్లుగా మారాయి.
తమ జీవనాధార భూములను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కరేడు గ్రామాల ప్రజలు నడుంబిగించారు. వేలాది ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేవలం తమ కోసమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా కార్పొరేట్ కంపెనీల కోసం చేసే భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎక్కడో కాదు, కుప్పం నియోజకవర్గంలో “కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్” కోసం రంగం సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని గ్రామాల చిన్న సన్నకారు రైతుల నుంచి 2014లోనే 450 ఎకరాల భూసేకరణ చేశారు. అయితే, ఇప్పటికీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పునాది రాళ్లు కూడా వేయలేదు. మొత్తం 1474 ఎకరాల బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈనాటికీ రైతులు ఆందోళన చేస్తున్నారు.
అలానే అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో సోలార్ ప్రాజెక్టు కోసం 120 ఎకరాలు భూసేకరణను అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. ఉద్దానంలో వజ్రపు కొత్తూరు మండలంలో కార్గో ఎయిర్ పోర్టు కోసం 1400 ఎకరాల బలవంతపు భూసేకరణపై పోరాట కమిటీ నాయకత్వాన రైతులు ఆందోళన సాగిస్తున్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని గ్రామాల్లో 7000 ఎకరాల భూములను, ఆదివాసీల ఉపాధిని దెబ్బతీసే విధంగా బడా కాంట్రాక్టర్ నవయుగ సంస్థకు హైడ్రో పవర్ ప్రాజెక్టును కట్ట పెట్టటానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలు పోరాటం సాగిస్తున్నారు. కాకినాడతో పాటు ఇతర ప్రాంతాలలో ప్రత్యేక ఆర్థిక మండలాలకు(సెజ్జులకు) అక్రమంగా కేటాయించిన భూముల కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా కరేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్న వేలాది ఎకరాల బంగారు భూములను బడా కార్పొరేట్ శక్తి అదానీకి బినామీగా ఉన్న ఇండోసోల్ పవర్ కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కరేడు ప్రాంత గ్రామాల రైతాంగం ప్రారంభించిన ధర్మపోరాటం, ఇతర ప్రాంతాల రైతాంగానికి తమ పంట భూములను కాపాడుకోవడానికి మంచి ఉత్తేజంగా నిలుస్తుందని ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం అక్రమ భూసేకరణను అధికారికంగా ఆపేవరకు కరేడు ప్రాంత రైతాంగం సాగిస్తున్న పోరాటానికి ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు అన్ని రూపాలలో సహాయ సహకారాలు అందించటానికి ముందు వరుసలో నిలబడాలి.
ముప్పాళ్ళ భార్గవశ్రీ,
సీపీఐ ఎంఎల్ నాయకులు,
ఫోన్ నం: 98481 20105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.