
సంస్కరణలను స్వీకరించడం, జవాబుదారీతనం ద్వారా ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చడం, విస్తృతంగా సమాజానికి దోహదపడటం అనే ఉద్దేశ్యాన్ని వక్ఫ్ నెరవేరుస్తుందని మనం నిర్ధారించుకోవచ్చు.
మతపరమైన, సామాజిక-ఆర్థిక వైవిధ్య భారతదేశంలోని సామాజిక నిర్మాణంలో వక్ఫ్ అత్యంత ముఖ్యమైంది. కానీ తగిన పద్దతి ఉపయోగించబడని సంస్థలలో ఒకటిగా ఈ సంస్థ నిలుస్తుంది. ఇస్లామిక్ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మునిగిపోయిన ఈ చట్టబద్ధమైన సంస్థ, ముస్లిం సమాజం సామాజిక-ఆర్థిక పరిస్థితులను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే దానికి లోతైన వారసత్వం, గణనీయమైన భూములు ఉన్నప్పటికీ వక్ఫ్ నిర్వాహకుల అసమర్థత, దుర్వినియోగం, పారదర్శకత లేకపోవడం వల్ల దెబ్బతింది.
భారతదేశంలోని మూడవ అతిపెద్ద భూసంస్థగా వక్ఫ్ ఉంటుంది. ఈ సంస్థ ముస్లిం సమాజానికి అధ్యక్షత వహిస్తుంది. అయినప్పటికీ ఆ సమాజం విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక-ఆర్థిక అభ్యున్నతి సమస్యలతో సతమతమవుతుండటం నిజంగా వైచిత్రి. శతాబ్దాల క్రితం స్థాపించబడిన వక్ఫ్ ఉద్దేశ్యం పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, ఇతర ధార్మిక సంస్థల వంటి ప్రజా సంస్థలను సృష్టించడం ఇంకా నిర్వహించడం ద్వారా ముస్లింల సంక్షేమానికి సేవ చేయడమే. ఇంత విస్తారమైన వనరులను సమాజ శ్రేయస్సు కోసం సమర్థవంతంగా ఉపయోగించకపోవడం అనేక దశాబ్దాలుగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
వక్ఫ్ స్థితి
ప్రతిపాదిత ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం, అభివృద్ధి(UMEED) బిల్లు, దీనిని వక్ఫ్(సవరణ) బిల్లు, 2024 అని కూడా పిలుస్తారు, ఇది వక్ఫ్‌ను పీడిస్తున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముతవల్లీలు(సంరక్షకులు), విశ్వసనీయత లేని కొంతమంది సభ్యులు వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేయడం, వక్ఫ్ బోర్డులు ఈ ఆస్తుల విలువను పెంచకుండా నిరోధిస్తుందనే విషయాలకు సంబంధించి ముస్లిం సమాజంలో విస్తృతమైన ఏకాభిప్రాయం ఉన్నందున ఈ సంస్కరణలు కీలకమైనవి.
వక్ఫ్ యొక్క ప్రస్తుత స్థితి భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను ప్రతిబింబిస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవడం, అసమర్థతలు, అవినీతి శాశ్వతంగా కొనసాగడానికి వీలు కల్పించింది.
ప్రస్తుత వక్ఫ్ వ్యవస్థలోని అత్యంత స్పష్టమైన సమస్యలలో ఒకటి వక్ఫ్ యాజమాన్యంలోని ఆస్తుల అద్దె విధానం కాలం చెల్లిని పాత చట్రంలోనే కొనసాగటం. ఈ ఆస్తులలో చాలా వరకు దశాబ్దాల క్రితం, తరచుగా 1950ల నాటికే నిర్ణయించిన రేట్లకు అద్దెకు ఇవ్వబడుతున్నాయి. నేటి మార్కెట్లో ఈ అద్దెలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, చెల్లించాల్సిన కొద్దిపాటి మొత్తాలు కూడా తరచుగా క్రమం తప్పకుండా వసూలు చేయబడవు. అక్రమ అమ్మకాలు, వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలతో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది, ఇవి సమాజ సంక్షేమం కోసం ఉపయోగించబడే సంభావ్య ఆదాయాన్ని గణనీయంగా తగ్గించాయి.
జైపూర్‌లోని అత్యంత కేంద్ర ప్రసిద్ధ షాపింగ్ వీధి అయిన MI రోడ్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ, ఇది సంగనేరి గేట్ నుండి ప్రభుత్వ హాస్టల్ వరకు ఉంటుంది. MI అంటే మీర్జా ఇస్మాయిల్ అని చాలామందికి తెలియకపోవచ్చు. MI రోడ్లో ఉన్న కొన్ని ఆస్తులను సమాజ, మతపరమైన పనుల కోసం వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు. బోర్డు ఈ ఆస్తులను అద్దెకు కేటాయించవచ్చు, కానీ వాటిని ఎవరికీ విక్రయించకూడదు. MI రోడ్‌లోని 100-400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని వాణిజ్య ఆస్తులు ఒక్కొక్క దాని నుండి ప్రస్తుతం నెలకు ₹300 అద్దె మాత్రమే లభిస్తుంది. కానీ, అద్దె పాలసీలను నవీకరించినప్పుడు నెలకు ₹25,000 వరకు లభిస్తాయి. భారతదేశం అంతటా ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి.
సచార్ కమిటీ నివేదిక 2006 ప్రకారం, వక్ఫ్ తన ఆస్తుల నుండి వార్షికంగా 12,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేసింది. అయితే, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలు వక్ఫ్ ఆస్తుల వాస్తవ సంఖ్య సుమారు 8.72 లక్షలు ఉందని వెల్లడిస్తున్నాయి. నేడు, ద్రవ్యోల్బణం, సవరించిన అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే, సంభావ్య ఆదాయం సంవత్సరానికి 20,000 కోట్ల వరకు ఉండవచ్చు. అయినప్పటికీ, వాస్తవ ఆదాయం కేవలం ₹200 కోట్లు మాత్రమే.
ఆదాయ ఉత్పత్తి, సమాజ సంక్షేమంలో పెట్టుబడి పెట్టే సామర్థ్యం అపారమైనది. సమర్థవంతంగా నిర్వహించినట్లయితే, వక్ఫ్ ఆస్తులు భారతీయ ముస్లిం సమాజానికి మాత్రమే కాకుండా, మొత్తం భారత సమాజానికి విస్తృతంగా సేవలందించే సంస్థలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఇంకా అలాంటి మరిన్ని ప్రపంచ స్థాయి సంస్థల స్థాపనకు నిధులు సమకూర్చగలవు. ఇక్కడే మనం భారతీయ ముస్లింలుగా “సంక్షేమం” గురించి మన అవగాహనను విస్తృతం చేసుకోవాలి. సంక్షేమం అంటే శిథిలావస్థలోకి దిగజారుతున్న సంస్థలను కాదు. బదులుగా, స్వయం సమృద్ధిగా, అందరినీ కలుపుకొని, అందరికీ ఆకాంక్షించే ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థలను సృష్టించాలని మనం కోరుకోవాలి.
జాయింట్ పార్లమెంట్ కమిటీ నిర్మాణాత్మక సూచనలను అందించిన తర్వాత మనం చూడబోయే తుది వక్ఫ్(సవరణ) బిల్లు, ముస్లిం సమాజం ఉన్నతికి దారితీసే విధంగా ధర్మబద్ధమైన వక్ఫ్ అభివృద్ధి, పరిధి పట్ల దార్శనిక నిబద్ధతను అందించాలి. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పాలన- పరిపాలనను సమూలంగా మార్చడం ద్వారా సమాజానికి మెరుగైన సేవలందించగల మరింత జవాబుదారీ, పారదర్శకమైన వ్యవస్థను సృష్టించడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం.
హాజీ సయ్యద్ సల్మాన్ చిష్టీ
గడ్డి నషీన్, అజ్మీర్ షరీఫ్ దర్గా చైర్మన్, చిష్టీ ఫౌండేషన్
అనువాదం: చిగురుపాటి భాస్కరరావు, ఓపిడిఆర్
ద హిందూ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.