
ఆమె నన్ను ఎప్పుడూ దాచేస్తుంది
తన రెక్కల వెనుక
కంటిరెప్పలవెనుక
తన కొంగు వెనుక
తన కాళ్ళ వెనుక
చీకటికి తెలియకుండా
చీడకి చిక్కకుండా
తన పమిట మడతల వెనుక
ఎవరి కళ్ళూ పడకుండా
గుండెలోనో గవ్వల గూటిలోనో
రెండు దుర్భేద్యమైన చేతుల బంధంలోనో
ఆమె ఎప్పుడూ నన్ను దాచేస్తుంది
ఏటికి వెళ్ళేదారిలో నా పరుగునాపడానికి
నాకు బదులు తానే దాక్కుంటుంది
ఏ రాత్రి కటిక ఘడియలకో నేను అందకుండా
నన్ను తెల్లవారే పొద్దు చేతుల్లో దాచేస్తుంది
చేలల్లో దుబ్బులవెనుక
పొడవాటి కట్టెల వెనుక
పారే నీటి పాయల అడుగున
జలజలమనే ఉగ్గనీటి లేత అలల మధ్య
ఆమె నన్ను ఎప్పుడూ దాచేస్తుంది
నాకు నీళ్లిచ్చి తన ఎండిన గొంతు వెనక
సాయంత్రపు గాలిని చేతిలొ పట్టుకుని
సందె రంగుల వెనకాల గాలిపటంలా
నన్ను మబ్బుల్లో దాచి తాను దారమౌతుంది
నేను మిణుగురుల దండయినప్పుడు
తాను చీకటి పువ్వుగా
ఊరి మధ్య వేపచెట్టుగా నిలబడుతుంది
ఇంక నన్ను దాయకమ్మా అన్నప్పుడు
తనకు తానే ఇంత మన్నయి
నాకాళ్ళ కింది నేలై
నావెనుకే తాను దాక్కుంటూ
నన్ను మరింతగా తనలో దాచేస్తుంది
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.