
“ఖమేనీ ఎక్కడ దాక్కునారో మాకు తెలుసు. ప్రస్తుతానికి ఆయన్ను వెంటాడదల్చుకోలేదు” అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు ప్రపంచాన్ని కదిలించి ఉండాల్సింది. కానీ కదిలించలేకపోయాయి.
విధానపరమైన ప్రమాణాలు కొన్ని సూత్రాల మీద ఆధారపడి నడుస్తున్న ప్రపంచంలో ఇలాంటి అదరగొండితనం ప్రపంచ దౌత్యవర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అందరూ ఆ ప్రకటన విన్నారు. అవునా అనుకున్నారు.
సకల శక్తివంతులుగా ఉన్న వారి మాటలు, వాటి ప్రభావం కూడా శక్తివంతమైనవి. మాటలతో ఏం హాని జరుగుతుందని అనుకోవద్దు. అధికారంలో ఉన్న వాళ్ళు కాగలకార్యం గురించి గంధర్వులకు ఓర కంట ఇటువంటి హెచ్చరికల రూపంలో ఇచ్చే సూచనలు మరింత ప్రమాదకరం. ప్రాణాంతకం. అయినా సరే ఉమ్మడి ఖండనలు, ఆ తప్పుడు మాటలేంటనే మందలింపులు, మందలించే అంతర్జాతీయ వ్యవస్థలు కనిపించడం లేదు. ఈ అదరగొండితనాన్ని ఖండించేందుకు దేశాది నేతల సమావేశాలు జరగలేదు. కేవలం మిగిలిన వార్తల్లాగే ఈ వార్త కూడా కాలగర్భంలో కలిసిపోయింది. విసుగొచ్చేంత వరకూ వార్తల సుడిగుండంలో గింగిరాలు తిరిగింది. ఇదేదో ప్రజాకర్షణ పొందటానికి ఇచ్చిన నినాదాలు కాదు. ప్రపంచ దౌత్య నీతి ఎంతటి దుస్థితికి చేరిందో వివరించే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడయిన శక్తివంతమైన నాయకుడు మరో దేశానికి చెందిన అధ్యక్షుడిని ఏకంగా కావాలనుకున్నప్పుడు చంపగలమని బహిరంగ సవాలు విసిరితే ఇదెక్కడి దౌత్య నీతి అని నోరెత్తి అడిగేవాడే లేకపోవడానికి మించిన అదరగొండితనానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలి!
నీతినియమాలు, నిబంధనలు గాలికొదిలి..
ఎంత అసమర్ధంగానైనా అంతర్జాతీయ దౌత్య నీతి అనేది ఒకటి లోకంలో ఉంది. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గుర్తింపు, గౌరవాలు, అవగాహనలు యావత్ ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి అవగాహనలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో ఆటవిక రాజ్యం ఏలుబడిలోకి వచ్చింది. కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న సామెత అక్షరాలా అమలవుతోంది. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు బాహాటంగా చంపటం- చావడం గురించి మాట్లాడుతుంటే, అమెరికా అఘాయిత్యాలను నోరుమూసుకుని సహించడమా లేక ఘర్షణకు కాలుదువ్వడమా అన్నది తప్ప మరో గత్యంతరం లేని ప్రపంచాన్ని నిర్మించ బూనుకుంటుంటే, నాగరిక తరహా రాజకీయాల స్థానంలో అనాగరిక రాజకీయాలు అంగలుపంగలు మీద అడుగులు వేస్తుంటే ప్రపంచమంతా చోద్యం చూస్తోంది. అదేదో ఇరాన్‌ను మాత్రమే బెదిరించారు అనుకోవద్దు. ఎంతటి అధికారానికైనా కొన్ని హద్దులు, పరిమితులు, వాటిని అమలు చేసే పద్ధతులు ఉంటాయన్న ప్రాపంచిక నైతికతను తుంగలో తొక్కుతున్నారు.
ఇలా మాట్లాడుతున్నంత మాత్రాన ఇరాన్ నాయకత్వాన్ని వెనకేసుకుని వస్తున్నాను అనుకోవద్దు. దేశాధినేతలు ఎరలు కాదు వాడుకోవడానికి, ముద్దాయిలు కాదు కోట గుమ్మానికి వేలాడదీయటానికి అన్నది మౌలిక అవగాహన. ఈ అవగాహన రీత్యానే మాట్లాడుతున్నాను. సంపన్న దేశాలు చెప్తే ఏదైనా శాసనం అన్న భావన సరైనది కాదనే కోణం నుంచి మాట్లాడుతున్నాను.
మొద్దుబారిన అంతర్జాతీయ స్పందనలు..
ట్రంప్ ప్రకటన ఘోరమైందనుకుంటే, అంతటీ ఘోరాన్ని గుడ్లప్పగించి చూడటానికి లోకం సిద్ధం కావడం ఇంకెంత ఘోరాతి ఘోరమో కదా! అతిగా స్పందిస్తోందని ఆరోపణలను ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమాజం ఇపుడు అవసరమైనంత కూడా స్పందించడం లేదు. ఐక్యరాజ్యసమితి ఖండనలు ఎక్కడ? ప్రపంచంలో అగ్రజులమని చెప్పుకుంటున్న ఏడు దేశాలు ఎందుకు నోరు మెదపడం లేదు? అంతర్జాతీయ పౌరసమాజం అంతర్ధానం అయ్యిందా? అత్యవసరంగా వచ్చే సంపాదకీయ వ్యాఖ్యలు ఏవీ? నీతి బద్దంగా ఉండే వాళ్ళు కూడా నోరుమెదపరేం? ఒక వేళ ఇటువంటి ప్రకటన పుతిన్ నుండో చైనా ప్రీమియర్ నుండో లేక టర్కీ ప్రధాని నుండో వస్తే ప్రపంచం ఇలాగే చేష్టలుడిగి చూస్తుందా?
అంతటి అదరగొండితనంతో మాట్లాడినా అది అమెరికా కాబట్టి అలానే మాట్లాడుతుంది అన్న భావన కలగటానికి ప్రపంచం ఎన్ని విలువలు కోల్పోవాల్సి ఉంటుంది. అటువంటి దుందుడుకుతనాన్ని సవాలు చేయలేకపోవడం కేవలం అంతర్జాతీయ బలాబలాలు మారిపోవడం వల్లనే అని ముక్తసరిగా చెప్పుకుంటే సరిపోదు. ఎక్కడో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న నైతిక దిశా తన నిర్దేశనాన్ని కోల్పోయింది.
ఎటువంటి రాజకీయాలకు మనం జై కొడుతున్నాం?
ట్రంప్ ప్రకటన నాటకీయమైనదని ప్రకటించి చేతులు దులిపేసుకోవడం తెలికే. నిరంతరం ఏదో ఒకటి అల్లరి పనులు చేసే ఆకతాయి మాటలుగా పరిగణించి వదిలేసుకోవడం కూడా తేలికే. కానీ ఇదేమీ నాటకరంగం కాదు కదా. సామర్థ్యం ముసుగు వేసుకున్న విధాన ప్రకటనలు చేసే వేదిక కదా అధ్యక్ష భవనం? ట్రంప్ హయాంలో అమెరికా ఎటువంటి అంతర్జాతీయ క్రమశిక్షణకు కట్టుబడి ఉండదని మిత్రులకూ, శత్రువులకూ ఏకకాలంలో హెచ్చరిక చేయటం కదా ఇది!
ఇటువంటి దుందుడుకు రాజకీయాలు పరోక్షంగానైనా ఒప్పుకోవడం అంటే అంతర్జాతీయ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి మాటలు, మంతనాలు అక్కర్లేదు చేతలే ఏకైక మార్గమనే అదరగొండి రాజకీయాలను నోరుమూసుకుని అంగీకరించడమే అవుతుంది. ఈ తరహా రాజకీయాల్లో అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ చట్టాలు, విధి విధానాలకు తావే లేదని చెప్పడం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలంటే అంతులేని ఆయుధ సామాగ్రి, అరిచి పెడబొబ్బలు పెట్టే మైకులు గొంతులు ఉంటే సరిపోతుందని అంగీకరించడమే.
ఇక్కడ ప్రశ్న, ట్రంప్ ఈ మాట ఎలా అన్నాడన్నది కాదు. ప్రపంచం ఎందుకు స్పందించలేదన్నదే ప్రశ్న.
మరణ శయ్యపై మానవ చైతన్యం..
ఇదేదో దౌత్య వైఫల్యం మాత్రమే కాదు. క్రమంగా మానవ చైతన్యం, హేతుబద్ధత, అవగాహన మరణశయ్యపై చేరుతోన్న దశ. క్రమంగా మొద్దుబారుతున్న వైనం. మనకు వచ్చే ఆవేశాలూ, ఆగ్రహాలన్నీ అంతకుముందు వచ్చిన వాటికంటే తీవ్రత తగ్గిపోతూ ఉన్న స్థితి. ఈ దశలో మౌనం సర్వకాలిక స్పందనగా మారుతోంది. రాజ్యం ప్రాయోజిత హత్యాలకైనా ఇదే స్పందన.
హంతకుడు అధ్యక్ష భవనం వేదికల నుంచి ఇలాంటి భాష మాట్లాడుతుంటే, అటువంటి వాళ్లకు చరిత్ర చీకటి గదిలో జరిగిన ఘోరాలు- నేరాల గురించి సామూహిక హాననాల గురించి మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది ?
ఇది లొంగుబాటు, వ్యూహాత్మక మౌనం కాదు..
చరిత్రలో మౌనంగా ఉండటమే మార్గంగా మిగిలిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇది అలాంటి సందర్భం కాదు.
ఇది పక్షపాతం గురించి కూడా కాదు. అసలు ప్రకటన చేసిన ట్రంప్ గురించే కాదు. మనం భవిష్యత్తుకు ఎటువంటి వారసత్వాన్ని మిగిలిస్తున్నామనే దానికోసం. నేటికీ నీతి నియమాలు విలువలతో నిండిన ప్రపంచం కోసం పని చేస్తున్నామా లేక కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న అవగాహనను పూర్తిగా మత్తులా తలకెక్కించుకున్నామా అన్నది ప్రశ్న.
ఈరోజు లక్ష్యం ఇరాన్ అగ్రనేత. సందేహం లేదు. కానీ రేపు ? ఎవరైనా కావచ్చు కదా! ఒకసారి హత్యే అంతర్జాతీయ దౌత్యంగా ముసుగు వేసుకుంటే, ఆ ముసుగు తొలగించడం చాలా కష్టం. చాలా సమయం కూడా పడుతుంది.
నియంత్రణల భాషకు తిరిగి వెళ్దాం..
రాజకీయాల్లో నైతికతకు సంబంధించిన భాషను పునరుద్ధరించాలని, దేశాల బలాన్ని క్షిపణుల సంఖ్యలోనో, కల్పించే భయంలోనో కాక ప్రదర్శించే సంయమనంలోనూ, చర్చించే ఓపికలోనూ, అంతర్జాతీయ సహకారంలోనూ చూడాలి. చూడగలగాలి. అధికారం ఎంత గొప్పదైన శక్తివంతమైనదయినా దానికి మించిన మరో విలువకు అది జవాబుదారీయే అన్న అవగాహనను పెంపొందించాలి.
ఇటువంటి అహంకారపూరిత ప్రకటనల నడుమ మౌనం తటస్థత కాదు. జరిగే నేరంలో భాగస్వామ్యం మాత్రమే.
ట్రంప్‌తో మనం ఏకీభవించామా లేదాని చరిత్ర అడగదు. కానీ అవసరం అయినపుడు మనం నోరు తెరిచి అభ్యంతరం చెప్పామా లేదాని నిలదీస్తుంది. అంతర్జాతీయ గుర్తింపు, గౌరవాలతో కూడిన సమాజం పునాదులు నానాటికీ మాటల తూటాలతో, బెదిరింపులు, దండనలతో, ఏకపక్ష వ్యవహార శైలితో కూకటి వేళ్లతో సహా పెకలించబడుతున్నపుడు మనం గుడ్లప్పగించి చూస్తున్నామాని ప్రశ్నిస్తుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.