భారతదేశంలో కార్మికులు ఆదివారాలు కూడా శెలవు తీసుకోకుండా వారానికి 90 గంటలు పని చేయాలంటూ తాజాగా ఎల్ అండ్ టి కంపెనీ అధినేత సుబ్రమణ్యం చేసిన ప్రకటన వివాదాస్పదం అయ్యింది. కార్మిక శ్రేణు ఆగ్రహావేశాలకు కారణం అయ్యింది. అయితే భారతదేశంలో వారాంతపు శెలవులు విధానం ఏదో కొందరు బూర్జువాలు, పెట్టుబడిదారులు కార్మికులను ఆదరించటానికి అందించిన వెసులుబాటు కాదన్నది చాలా మందికి తెలీదు. భారతదేశపు తొలి పారిశ్రామిక నగరమైన బొంబాయిలో కార్మికులు సాగించిన సుదీర్ఘపోరాటాల ఫలితంగానే ఈ వెసులుబాటు కల్పించబడిరది.
వలసపాలన కాలంలో బొంబాయి పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఎదుగుతున్న కాలం అది. 1861 ` 1865 మధ్య కాలంలో పత్తి ఉత్పత్తి విస్తారించటంతో ఆ పత్తిని పారిశ్రామిక సరుకుగా మార్చేందుకు ఎంతో మంది కార్మికులు అవసరం అయ్యారు. మరో వైపున అమెరికా అంతర్యుద్ధం కారణంగా ఇంగ్లాండ్‌కు అమెరికా నుండి వచ్చే పతి దిగుమతులు నిలిచిపోయాయి. దాంతో బ్రిటన్‌లోని నూలు మిల్లులను బతికించటానికి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పత్తే మూలాధారంగా మారింది. 1860లో భారతదేశం నుండి ఇంగ్లాండ్‌కు 4,22,000 బేళ్ల పత్తి ఎగుమతి అయితే 1866 నాటికి 16 లక్షల బేళ్లకు పెరిగింది.
పత్తి పంటతో వాణిజ్యం లాభసాటిగా మారటంతో బొంబాయిలో కౌస్జీ దావర్ మరో 50 మందితో 5 లక్షల మూలధనం సమీకరించి దేశంలోనే మొట్టమొదటి నూలు మిల్లును 1851లో ప్రారంభించారు. బొంబాయిలో తర్వాత పదేళ్లలో నూలు మిల్లులు గణనీయంగా పుట్టుకొచ్చాయి. దాంతో ఈ మిల్లుల్లో పని చేయటానికి మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల నుండి లక్షలాదిమంది కార్మికులు అవసరం అయ్యారు.
ముంబై కి వలసలు
1871 ` 72, 1876 ` 76 మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని తీవ్ర కరువుకాటకాలు చుట్టుముట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు విషమించాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల నుండి పెద్దఎత్తున వలసలు మొదలయ్యాయి. 1871 నాటికి బొంబాయిలో 10 మిల్లుల్లో 8000 మంది కార్మికులను నియమించారు. తర్వాతి పాతికేళ్లలో 71 మిల్లులో ్ల కార్మికుల సంఖ్య 75000 కి చేరింది. కానీ ఈ కార్మికుల దైనందిన జీవనం అంత తేలిగ్గా ఏమీ లేదు. ఆ కాలానికి చెందిన ఫ్యాక్టరీ ఇనస్పెక్టర్ నివేదికలు పరిశీలిస్తే కార్మికుల స్థితిగతులు, రక్షణలు, హక్కులు, పని గంటలకు సంబంధించిన లోతైన అవగాహన ఏర్పడుతుంది. కనీసం తినటానికి కూడా తీరికలేని స్థితిలో పని చేస్తూనే రోజుకు 15 గంటల వరకూ యంత్రంతో పాటు యంత్రంలాగా పని చేస్తూ ఉండేవారు. ఆ మిల్లులు కూడా ఇరుకు సందుల్లాగా ఎండపొడ సోకని చీకటి గూళ్లలాగా ఉండేవి.
పని ప్రదేశంలో పరిస్తితులు మెరుగుపర్చాలంటూ 1884లో తొలిసారి ఆందోళనలు మొదలయ్యాయి. మహాత్మ జ్యోతిరావు ఫూలే స్పూర్తితో ఆయన శిష్యుడు నారాయణ మేఘాజీ లోఖాండే తొలిసారిగా బొంబాయి మిల్లుకార్మికుల సంఘాన్ని ప్రారంభించారు. తొలిసారి కార్మికులు తమ అవసరాలు, పరిస్థితులు మెరుగుపర్చుకునేందుకు గొంతెత్తడటం మొదలు పెట్టారు. ప్రత్యేకించి వారంతపు శెలవులు ప్రధాన నినాదంగా ఉండేది.
వారాంతపు శెలవుల కోసం డిమాండ్
సహజంగానే వారంలో ఒక రోజు విశ్రాంతి కావాలన్న కార్మికుల కోరిక విని యజమానుల కోపం కట్టలు తెంచుకుంది. బొంబాయి మిల్లు కార్మికుల పోరాట చరిత్రు గ్రంధస్తం చేసిన మనోహర్ కాదం కార్మికులు పండగలకూ, పబ్బాలకూ శెలవులు తీసుకుంటున్నారనీ, మహిళా కార్మికులు నెలసరి సమయంలో శెలవులు తీసుకుంటున్నారన్న నెపంతో వారాంతపు శెలవుల డిమాండ్‌ను తోసిపుచ్చారు. అసలు కార్మికులకు వారాంతపు శెలవులు ఎందుకు ఇవ్వాలి అన్నది యజమానుల ప్రశ్న. అయినా కార్మికులు పట్టు విడవలేదు. వారానికి ఒక రోజు శెలవు కావాలంటూ ఆందోళన సాగిస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు 1890 జూన్ 10న ఈ కార్మికులు చరిత్ర సృష్టించారు. 1878 నుండీ సాగుతున్న కార్మిక పోరాటాల ఫలితంగా మిల్లు యజమానుల సంఘం ఎట్టకేలకు వారి డిమాండ్లను అంగీకరించింది. ఆదివారం శెలవుదినంగా అధికారికంగా ప్రకటించారు. భారతదేశపు కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది.
ప్రస్తుతం కార్పొరేట్ దిగ్గజాలు పనిగంటలు, ఉత్పాదకత, విదేశీ కంపెనీలతో పోటీ వంటి సాకులు చూపించి కార్మికులు 90 గంటలు పని చేయాలని ప్రతిపాదిస్తున్న తరుణంలో బొంబాయి మిల్లు కార్మికుల పోరాటాల చరిత్రను పునశ్చరణ చేసుకోవాలి. వారాంతపు శెలవులు, రోజుకు నిర్దిష్ట పని గంటలు అన్నది యజమానులు ఇచ్చిన భిక్ష కాదు. కార్మికులు పోరాడి, త్యాగాలు చేసి అణచివేతలను ఎదుర్కొని సాధించుకున్న హక్కు అన్న చారిత్ర వాస్తవాన్ని దేశంలోని శ్రమజీవులంతా గుర్తించాలి. ఆదివారం శెలవు అంటే భూమి పుట్టినప్పటి నుండీ అమల్లో ఉన్న సహజ న్యాయ సూత్రం అని భావించే యువతంతా ఇది తమ పూర్వీకులైన కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాధించుకున్న హక్కు అన్న చారిత్ర వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పోరాటాలు భారత కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఈ పోరాట వారసత్వాన్ని విస్మరిస్తే 21వ శతాబ్దంలో కూడా పని ప్రదేశాల్లో పరిస్థితులు 1860 దశకం నాటికి నెట్టబడతాయనటంలో సందేహం లేదు.
రాధే శ్యాం జాధవ్
అనువాదం : కొండూరి వీరయ్య