
రాజకీయాల్లో, పార్లమెంటు చర్చల్లో స్త్రీద్వేషాన్ని మామూలు విషయం చేయటం (సాధారణీకరించడం) ఈ దేశపు సగం జనాభాకు తీరని అన్యాయంగా చెప్పవచ్చు.
ఈ దేశంలో పరస్పర రాజకీయ వాదవివాదాల్లో అప్పుడప్పుడూ ముద్రవేసే విషపూరిత, వ్యక్తిగత దాడులను అటుంచితే అన్ని కాలాల్లో స్థిరంగా కొనసాగుతున్నదీ, అన్ని వైపుల్నించి ఇకిలింతకు కారణం అయ్యేదీ, పార్టీలకతీతంగా అందర్నీ కలిపేది భారత రాజకీయాల్లో ఒక్కటే అది ‘‘మగ చూపు’’ అనవచ్చు.
2005లో లాలూప్రసాద్ యాదవ్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు ఆయన గతంలో సీఎంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రోడ్లని అభివృద్ధి చేయించానని, హేమమాలిని బుగ్గల్లా తయారు చేశానని పేర్కొన్నారు. ఈ మాటల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది విద్యావంతులైన కొందరు మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న అతని సహచరులు అధికార పీఠానికి ఇరువైపుల ఉన్నవారు కూడా ఈ సారూప్యతను నీళ్లల్లో చేపల్లా సహజంగా తీసుకున్నారు.
తాజాగా బీజేపీ నేత రమేష్ బింధూరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన వాఖ్యాలు ఈ నీచమైన వారసత్వానికి కొనసాగింపు. రమేష్ బిదూరి ఢల్లీిలోని కల్కాజీ పార్లమెంటరీ స్థానాకినిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో దానికి వెనకా ముందూ జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా సాధికారతపై తీసిన రాగాలు తీసిన పాలక పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు ఎన్నికలు ముగియగానే ఈ మహిళా సాధికారత రాగాన్ని అటకెక్కించారు. తర్వాతి కాలంలో మిగిలిన పార్టీలు కూడా ఇదే రాగాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ వాఖ్య రావటం ఒక వ్యంగ్యత.
పార్లమెంటేరియన్‌గా మారిన సీనియర్ సినీ తార మొదలు తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మహిళ వరకూ పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదు. భారతరాజకీయాల్లో సర్వత్రా వ్యాపించి ఉన్న స్త్రీ ద్వేషం నుండి బతికి బట్ట కట్టింది ఏ కొద్దిమందో. వ్యక్తులుగా బృందాలుగా మహిళలు లక్ష్యంగా మారినపుడు అక్కడక్కడా పేవలమైన నిరసన గొంతుకలు తప్ప వేరేం జరగలేదు.
‘‘పర్కటీ ఔరతే’’ (రెక్కలు కత్తిరించిన స్త్రీలు అనే అర్ధం. నిజానికి జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు అనే అర్ధంలో ఎగతాళిగా వాడారు) అని లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సంర్భంగా అన్న శరద్ యాదవ్ దగ్గరుండి, 2012 సామూహిక అత్యాచారంపై వీధుల్లో కొచ్చిన నిరసనకారులను అవహేళన చేసిన ఎంపీ అభిజిత్ ముఖర్జీ వరకూ భారత రాజకీయాలు స్త్రీలను ఎగతాళి చేయటానికో, ఎగతాళి చేయటం ఓ వినోదంగా మార్చుకోవడానికో లేదా స్త్రీలను ఎగతాళి చేయటం ఓ సామాజిక లక్షంగా మారటానికో నిదర్శనంగానే ఉన్నాయి. మరీ ప్రతేక్యకించి సదురు స్త్రీలు విద్యావంతులై, తమ రాజ్యాంగ హక్కుల కోసం గొంతెత్తి నినదించే వారితే వారిని విమర్శించటం అత్యంత మామూలు విషయంగా మారింది.
కొన్నిసార్లు ‘‘మగ చూపు’’ స్త్రీలకు సంబంధం లేని విషయాల్లో జరిగే చర్చల్లోకి కూడాచొచ్చుకు వస్తుంది. భీమా రంగంలో విదేశీ పెట్టుబడులపై 2018లో రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు జేడీ(యూ) శరద్ యాదవ్ సభలో ఆర్ధిక విషయాలను ప్రస్తావించేందుకు పోలికగా దక్షిణ భారత దేశపు స్త్రీల నలుపు శరీరాల గురించి వాడిన పదజాలం గుర్తుకొస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వ్యాఖ్యలపై రాజ్య సభలోని పెద్దలందరూ కురుసభలో భీష్మాదుల్లాగా నిర్వేదపూరిత మౌనం పాటించారు. ప్రేక్షకుల గాలరీలోని మేం అనుభవించిన అసహ్యాన్ని కేవలం ఒకేఒక్క ఒంటరి గొంతు డీఎంకె ఎంపీ కనిమొళి వ్యక్తపరిచారు.
2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సీఎంని ప్రధాని మోదీ ‘‘దీదీ ఓ దీదీ’’ అని వ్యంగ్యంగా సంబోధించడం తన నినాదంగా చేసుకున్నారు. కలకత్తాలో పెరుగుతున్నప్పుడు నేను విన్న వింత పిల్లి కూతలు జ్ఞాపకం వచ్చాయి. భారతదేశపు ఏ నగరపు వీధుల్లోనయినా స్త్రీలు ప్రతి రోజూ వినేవే. మోడీ సంభోదన పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తే మరికొందరు విమర్శించారు.
అయినా గాని మొత్తం ప్రచారంలో మమతా బెనర్జీని తూలనాడటానికి నరేంద్రమోదీ దీన్ని ఈ ఎగతాళి ధోరణిని మరీ మరీ ప్రదర్శించారు. ఎన్నికల తర్వాత జరిగిన విశ్లేషణలో బీజేపీ ఓడి పోవడానికి గల కారణాల్లో ఇది కూడా ప్రధానమైందిగా వెల్లడైంది.
సాధికారిత పార్శ్వానికి భిన్నంగా…
ప్రస్తుత తాజా వివాదానికి ముందు కూడా బిధూరి ఈ విషయంలో అనుభవం లేని వాడేం కాదు. మోదీ భారత దేశ స్త్రీల ఉద్ధారకుడిగా చూపడంతో పాటు స్త్రీలను ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన ఓటు బ్యాంకుగా గుర్తించి స్పష్టమైన ఎజెండాతో గత ఎన్నికల్లో బీజేపీ తలపడిన తీరుకు ఇది పూర్తిగా విరుద్ధమైంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ‘మామాజీ’ అనే ముద్దుపేరు సంపాదించి పెట్టిన ‘లాడ్లి బెహన్’ పథకం (స్త్రీలకు నెలకు రూ.1250 ఇచ్చే పథకం) దగ్గర నుండి ఇటీవల మహారాష్ట్రలో స్త్రీలకు నెలకు రూ.1500 ఇచ్చే ‘లాడ్కీ బహీన్’ వరకూ వివిధ రూపాల్లో స్త్రీల సాధికారిత కోసం ప్రభుత్వాలు మాటల కోటలు కట్టాయి.
వీళ్లని అనుకరిస్తూ ఢల్లీి ఆమ్ఆద్మీ పార్టీ మహిళలకు నెలకు రూ.1000 ఇచ్చే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ప్రకటించింది. దాని అడుగుజాడల్లో ఢిల్లీ స్త్రీలకు ‘ప్యారీ దీదీ’ పేరిట నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
స్త్రీలను గౌరవించడంలో నెలవారీ ఆదాయం భాగం అనడం ఓ వైపు ఉంటే మరో వైపు పార్టీలోని వ్యక్తులు (ఎంపీ కంగనారనౌత్‌పై రేటుకార్డ్ అంటూ కాంగ్రెస్ సభ్యురాలు సుప్రియా శ్రీనాటే వ్యాఖ్య) సామాజికంగానూ, వ్యక్తిగతంగానూ కించపరిచే దూషణలకు దిగడం కలత కలిగించే విషయం. దీనికి వ్యతిరేకంగా అపుడపుడూ వ్యక్తం అయ్యే కోపం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేవిగా ఎన్నడూ లేకపోవడం మరింత కలవరం కలిగించే అంశంగా పరిగణించవచ్చు.
స్త్రీలను అవమానించే పదజాలాన్ని రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవటంలో భారతీయ సమాజం ఏ ఇతర దేశాలకంటే ముందంజలో ఉంది. కుటుంబంలో ఎవరికి ఎవరి మీద కోపం వచ్చినా ఆడవాళ్లని తిట్టడంతోనే మొదలవుతుంది. నిజంగా చెప్పాలంటే కనీసం భారతీయ భాషల్లో ఆడవారిని కించపర్చే పదాలు వాడకంపై నిషేధం విధిస్తే మగాళ్లు మాట్లాడే పదాల్లో సగానికి సగం తగ్గిపోతాయి. దురదృష్టం కొద్దీ రాజకీయ నాయకులు అదే స్థాయిలో కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్లు ఎంత అసభ్యంగా వ్యవహరించినా సమాజంలో నాయకులుగా చలామణి అవుతున్నారు. ఏవో ఒకటో రెండో మినహాయింపులు తప్ప స్త్రీలకు కూడా అటువంటి పద ప్రయోగంలో తప్పేం కనిపించదు. దానికి కారకం బహుశ చిన్నప్పటి నుండి స్త్రీలు చేసే వాటిపై కోపం తెచ్చుకోకుండా అలవాటు చేయబడటం వలన కావచ్చు.
నిజానికి మూసిన తలుపుల వెనుక నాలుగు గోడల మధ్యన వ్యక్తిగత జీవితంలో భాగంగా పొట్టి దుస్తులను ధరించటంపై సమాజంలో వ్యక్తమయ్యేంత కోపం ఓ మహిళపై దారుణంగా లైంగిక అత్యాచారం జరిగినప్పుడు కూడా వ్యక్తం కాదు. అదే ఆలోచనాధోరణి చట్ట సభలలోకి పొంగి పొర్లడం తప్పక జరుగుతుంది కదా. మమతను మోదీ పిలిచిన పిలుపుకు ప్రతిసారి జనం తీవ్రంగా స్పందించారు. బిజెపికి బుద్ధి చెప్పారు. హేమమాలినిపై లాలూ వ్యాఖ్య రాజకీయ వాడుక పదాల్లో చేరిపోయింది. దీన్నే తరచుగా మిగిలిన వాళ్లు కూడా వాడుతున్నారు.
భారతస్త్రీలు ప్రతిరోజు స్త్రీద్వేషం మధ్య బతుకుతున్నారు. పార్లమెంటు రాజకీయాల్లో దీన్ని సర్వసాధారణం చేయటం అంటే దేశంలో సగం జనాభా పట్ల అపచారం చేయడమే. స్త్రీలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏ ఒక్క సభ్యుడిపైనైనా ఆదర్శప్రాయమైన రీతిలో చర్యతీసుకున్న ఒక్క ఉదాహరణ కూడా లేని రాజకీయ పార్టీలకు దీని గురించిన బాధ్యత ఎంతవుందో భారత పౌరులమైన మనపైన కూడా అంతే ఉంది. ఇది కోడి ముందా? గుడ్డు ముందాలాంటి పరిస్థితి.
2005 – 2025 వరకు మొత్తం ఇరవై ఏళ్లు గడిచాయి. రాజకీయాల్లో ఒక సుదీర్ఘకాలం ఇంకా మనం మౌలిక సదుపాయాల సంభాషణల్లో స్త్రీల బుగ్గల గురించే మాట్లాడుతున్నాం అంటే కడుపులో తెమలాలి. రాతలు మారాలి.
అబంతికా ఘోష్ జర్నలిస్టు, పబ్లిక్ పాలసీ కన్సల్టెంట్.
అనువాదం: పిఎ దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.