
మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా సోహ్రా పోలీస్ స్టేషన్లో 19 ఏళ్ల యువకుడిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
న్యూఢిల్లీ: మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో 19 ఏళ్ల యువకుడిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా ఆనారోగ్యానికి గురైయ్యాడు. ఈ సంఘటనపై స్పందించిన ప్రభుత్వాధికారులు విచారణకు ఆదేశించారు.
వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు ప్రకారం, బాధితుని తల్లి మిల్డ్రెడ్ జిర్వా న్యాయం, జవాబుదారీతనం కోసం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్పీ వివేక్ సిమ్, మేఘాలయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్(రిటైర్డ్) టీ వైఫీలకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
కొన్ని రోజుల క్రితం ఒక యువకుడితో తన కొడుకుకు గొడవ జరిగిందని జిర్వా తెలిపారు. దీనికి సంబంధించి, జూలై 3న తన కుమారుడు గాట్విన్ కోసం పోలీసులు వెతికారని జిర్వా తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తన కొడుకుతో కలిసి ఉదయం 9 గంటలకు సోహ్రా పోలీస్ స్టేషన్‌కు ఆమె వెళ్లారు.
“నా కొడుకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావడం చూసి నేను షాక్‌కు గురయ్యాను. నేను వెంటనే అతన్ని సోహ్రా సీహెచ్‌సీకి తీసుకెళ్లాను. అక్కడ షిల్లాంగ్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ ఆసుపత్రిలో నా కొడుకు చికిత్స పొందుతున్నాడు. అప్పటి నుంచి అతను ఆసుపత్రిలోనే ఉన్నాడు” అని ఆమె తెలియజేశారు.
పోలీసుల తీరును ప్రశ్నిస్తూ, “నా కొడుకు నేరం చేసి ఉంటే, చట్టపరంగా తగిన చర్యలను తీసుకోవాల్సింది. అతన్ని విడుదల చేయడానికి ముందు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీకి గురిచేశారు. ఈ చర్య వల్ల తన మానవ హక్కులను ఉల్లంఘించారు. దీనివల్ల తనకు తీవ్రమైన మానసిక, శారీరక హాని కలిగింది” అని పేర్కొన్నారు.
తనతో జరిగిన సంఘటనను గేట్విన్ గుర్తుచేసుకున్నాడు. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తనను కొట్టి, ఆపై లాకప్‌లో ఉంచారు. “నేను నీళ్లు అడిగినప్పుడు, వారు నిరాకరించారు. అనివార్యంగా నన్ను మూత్రశాలలోని నీళ్లు తాగేలా బలవంతం చేశారు”అని గేట్విన్ చెప్పాడు.
ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, పోలీసు శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఎస్డీపీఓ పినుర్స్లా బీవాన్స్వెట్ను దర్యాప్తు అధికారిగా నియమించినట్లు డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ తెలిపారు.
వాస్తవాలు పూర్తిగా నిర్ధారించబడిన తర్వాత దోషులుగా తేలిన వారిపై అవసరమైన, తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. అయితే, ఈ సంఘటన ఆయనకు విస్తృత ఆందోళనను రేకెత్తించింది. ఈ విషయంపై పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు డిమాండ్ చేశాయి.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.