
మొదటి నుంచి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికీ మధ్య చాలా దూరం ఉంటూ వచ్చింది. శాస్త్రవేత్త తన ప్రయోగాల ఫలితాలను ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఉన్నా, శాస్త్రవేత్తలు ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక పదాలు వారికి అర్ధం కావు. తత్ఫలితంగా ఈ సగటు మనిషి, తాత్కాలికంగా రంగుల కలలను చూపించే కల్పనా సాహిత్యం వైపు మొగ్గు చూపుతాడే గానీ, ప్రకృతి రహస్యాలను, మానవుడి విజయాలను గురించి చెప్పే “విజ్ఞాన సారస్వతం” జోలికి పోడు. మనిషి కదలికలను, చేతి గీతలను, జాతకాలను, ముహుర్తాలను నమ్మేవారు నమ్ముకుంటూ ప్రాణాల మీదికి తెచ్చకుంటూనే ఉన్నారు.
మూఢాఛారాలు, కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఇంకా పోలేదు. ఇందుకు ప్రభుత్వాధినేతల బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి సామాన్యుడి కోసం సైన్సు రాయాల్సిన అవసరం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటూ ఉంది. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో దేశం ప్రగతి సాధించాలంటే ప్రజలకు శాస్త్రీయ అవగాహన అలవడటం చాలా అవసరం! హేతుబద్ధమైన దృష్టీ, శ్రమశక్తి పట్ల గౌరవం, వ్యక్తి చేసే పనివల్ల సామాజిక ప్రయోజనం వంటి వాటిని శాస్త్రీయ అవగాహన స్పష్టం చేస్తుంది. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కృషి చేసిన తెలుగు రచయితలు చాలా మందే ఉన్నారు.
పావులూరి మల్లన్న రాసిన “గణిత శాస్త్రం” దక్షిణ భారతంలో మొట్టమొదటి వైజ్ఞానిక రచన అని పలువురి అభిప్రాయం. తర్వాతి కాలంలో వేమూరి విశ్వనాథశర్మ, ఎం నర్సింహము, కే సీతారమయ్య, డా ఆచంట లక్ష్మీపతి, నిడదవోలు, కాళీపట్నం కొండయ్య మొదలైనవారు 1914- 1940 మధ్యకాలంలో తెలుగులో సైన్సు రచనలు విరివిగా రావడానికి కారణమయ్యారు. ఆ తర్వాత, త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, గోపరాజు రామచంద్రరావు, హరి ఆదిశేషువు, భేతన భట్ల విశ్వనాథం, డాజీ గోపాలరావు, శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, ఆర్వీజీ సుందరరావులు విరివిగా సైన్సు రచనలు ప్రకటించారు.
తర్వాత తరంలో అంటే, 1950- 80 మధ్య ఆధునిక దృక్కోణంలోంచి కొత్తతరం తెలుగు సైన్సు రచయితలు పుట్టుకొచ్చారు. వసంతరావు వెంకటరావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు, కొడవటిగంటి కుటుంబరావు, డా మహీధర నళినీ మోహనరావు, గాలి బాలసుందరరావు, డా పీ దక్షిణామూర్తి, అయ్యగారి వీరభద్రరావు, రావురి భరద్వాజ, రావిపూడి వెంకటాద్రి, కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ మొదలైన వారు. ఇక్కడ ప్రముఖులైన వారి పేర్లను చెప్పింది ఎందుకంటే, సైన్సు రచయితలుగా నిలబడాలనుకున్నవారూ, ఇతరత్రా అభిరుచి ఉన్నవారు, వీరి రచనలు వెతుక్కుని తప్పక చదువుతారని నా ఆశ! గతాన్ని బాగా అవగతం చేసుకున్నప్పుడే కదా, మన వర్తమానాన్ని కావాల్సిన రీతిలో తీర్చిదిద్దుకునేది?
“కళ కళకోసమే, కవిత్వం కవిత్వం కోసమే”లాగా సైన్సు సైన్సు కోసమేనని అనుకునే వారున్నారు. అలాంటి వారి వల్ల సమాజానికి పెద్దగా లాభం ఉండదు. అన్నీ సమాజ శ్రేయస్సు కోసమే అనుకుని పనిచేసే వారు కావాలి! సైన్సు సైన్సు పాఠంలాగా కాకుండా సమాజ గతికి అన్వయించి, సామాజిక కోణంలోంచి చెప్పే వారు కావాలి. ఇలాంటి వారు చాలా తక్కువ మందే ఉన్నారు. యువతరం ఇప్పుడీ పనిని చేపట్టాల్సి ఉంది. ఎవరి పరిధిలో వారు. ఎవరి స్థాయిలో వారు. ఎవరికి వీలైనంత వారు వైజ్ఞానిక- హేతువాద ప్రచారానికి కృషి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ విషయాలు బాలబాలికలకు, యువతీయువకులకు తెలియజేయడం చాలా అవసరం. ఎందుకంటే భావి భారత పౌరులు వారే, వారి దృక్పథంలో మార్పు వస్తే క్రమక్రమంగా రాగల కాలంలో సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇప్పటికే కొన్ని స్టడీ సర్కిల్స్‌లో చర్చలు నిర్వహించుకుంటున్నారు. ఆలోచనలు పంచుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వైజ్ఞానిక స్పృహ కలిగించే పుస్తకాలు పరిచయం చేస్తున్నారు. పత్రికల్లోని ఇలాంటి వ్యాసాలు చదివి వినిపిస్తున్నారు. అవసరమైన చోట వారి అనుమానాలు తీరుస్తున్నారు. కొంతమంది ఉదార స్వభావులు తమ స్వంత డబ్బుతో సైన్సు, హేతువాద, మానవవాద పత్రికలకు చందాలు చెల్లించి, తమ ప్రాంతంలోని గ్రంథాలయాలకు ఆ పత్రికలు అందేట్లు చేస్తున్నారు.
జన విజ్ఞానవేదిక, మానవ వికాస వేదిక, విజ్ఞాన దర్శిని, ప్రజాసైన్సులాంటి సంస్థలున్నాయి. వాటి శక్తి మేరకు అవి పని చేస్తున్నాయి. అలాగే హేతువాది, సైన్సు- హేతువాదం, స్వేచ్ఛాలోచన, గ్రీన్‌బెల్ట్, నాస్తిక దర్శిని, వాయిస్ ఆఫ్ చార్వాక, భౌతికవాది, ప్రజాసైన్స్ వేదిక, వివేక పథంలాంటి చిన్న, పెద్ద పత్రికలెన్నో ఉన్నాయి. చెకుముకి పిల్లల సైన్సు పత్రిక ఉంది. వీటి వెనుక అనుభవజ్ఞులైన సంపాదకులు, రచయితలు, కార్యకర్తలు ఉన్నారు. నిజమే! అయినా ఈ నివేదికలూ ఈ పత్రికలూ సరిపోవు. ఇంకా ఇంకా కావాలి. వేదికల సంఖ్య పత్రికల సంఖ్య ఎన్నో రెట్లు పెరగాలి. జనంలోని మూఢత్వాన్ని, మరీ ముఖ్యంగా విద్యావంతుల్లో మూర్ఖత్వాన్నివదిలించాలంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో సైన్స్ కార్యకర్తలు ముందుకు రావాలి!
అన్ని దిన, వార, మాస పత్రికల్లో వైజ్ఞానిక స్పృహను పెంచే రచనలు వస్తూ ఉండాలి. కొన్ని టెలివిజన్ ఛానళ్లలో మూఢ నమ్మకాలపై చర్చలు జరుగుతుంటాయి. సంతోషించాల్సిన విషయమే. కానీ, వాటికంటే నాలుగురెట్లు ఎక్కువగా జ్యోతిష్యం, రంగుల రాళ్లు, అల్లాగొలుసులు(తాయెత్తులు), బాబా హారతి కార్యక్రమాలు- ప్రత్యక్షప్రసారాలు జరుగుతుంటాయి. సమాజంలో అన్ని వర్గాల వారిని, అన్ని ఆలోచనా ధోరణులను ఆదరించాలనుకుంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. దర్శనీయ స్థలాల పేరిట ఉచితంగా కైలాస దర్శనం, వైకుంఠ దర్శనం, మక్కా, బెత్లాహేం వగైరాను కొన్ని చానళ్లు చూపిస్తూనే ఉంటాయి. భక్తిని, మూఢ నమ్మకాలను పోషించడంలో టెలివిజన్ ఛానళ్లు, పత్రికలు బహుశా పోటీపడుతుంటాయి. వాస్తు, వారఫలాలు లేని పత్రిక ఏదైనా ఉందా? సుప్రభాతాలు లేని రేడియో ఛానలుందా? ఇవన్నీ చెప్పుకోవడమెందుకంటే, ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటూ సైన్స్ కార్యకర్తలు సమాజంలో వైజ్ఞానిక స్పృహను పెంచడం చాలా కష్టం. ఇదంత సులభమేమీ కాదు. అట్లని బాధ్యతను గాలికి వదిలేసి, చేతులు ముడుచుకుని కూర్చోకూడదు!
వయసులో ఉన్నప్పుడు కొంతమంది సైన్సు రచయితలు ఏదో చేసెయ్యాలని ఉబలాట పడతారు. కానీ, వాస్తవానికి వారు చేసింది ఏమీ ఉండదు. పైగా పెరిగే వయసు వల్ల శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఫలితంగా యోగుల కథలు, సాధువుల జీవిత చరిత్రలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి ఆరిపోయే దీపాల వల్ల యువతరానికి ఏమాత్రం లాభం ఉండదు. అలాంటి వారిని వదిలేసి ముందుకు దూసుకుపోవడం జరుగుతూనే ఉండాలి. సైన్స్ కార్యకర్తలెప్పుడూ పరిగెత్తే గుర్రాల్లాగా ఉంటేనే దూసుకుపోగలరు. అన్ని రంగాల్లో వలె, ఈ రంగంలో కూడా ప్రచార పటాటోపం ప్రదర్శించే వారున్నారు. కళానిధి, సాహిత్యకోవిదులు, సైన్స్ ధురీణలాంటి బిరుదులు తగిలించుకుని ప్రచార కార్యక్రమాలు చేపడుతుంటారు. వీరికి హేతువాదం, నిరీశ్వరవాదం, మానవవాదం లాంటి పదాలు మాట్లాడడమే ఇష్టం ఉండదు.
ఇలాంటి వారు ఒకే ఒరలో రెండు కత్తులు దూరుస్తారు. సంస్కృతి పేరుతో ఒక వైపు సంప్రదాయాన్ని, మరోవైపు సైన్సును కట్టగట్టి మాట్లాడుతారు. ఇంకా చోద్యమేమంటే వారి స్వీయ మూఢనమ్మకాలకు శాస్త్రీయ నేపథ్యం ఉందని దబాయిస్టుంటారు. జనం నవ్విపోతున్నారన్న స్పృహ కూడా వారికి ఉండదు. ఇంతెందుకూ? శ్రమజీవుల స్వేదంపై అమోఘంగా పాటలు పాడేవారు. అట్టడుగు వర్గాల పట్ల గాఢమైన సానుభూతి ఉన్నవారు. పెత్తందారీ వ్యవస్థ మీద మాటల తూటాలు పేల్చేవారు. దేవుడూ, మత విశ్వాసాల విషయానికి వచ్చేసరికి నిశ్శబ్దమై పోతారు. ఒక్కమాట మాట్లాడరు. “ఎందుకూ? అలాంటి విషయాలు లేవనెత్తి- కొరివితో తలగోక్కోవడం?” అని అనుకుంటారేమో! తెలియదు. ఈ అరవై, డెబ్భై ఏళ్లుగా శాస్త్రీయ ఆలోచనా విధానానికి కొన్ని రాజకీయ పార్టీలైనా గట్టిగా నిలబడి ఉంటే, దేశం ఇంత అల్లకల్లోలమయ్యేది కాదు. ఇప్పటికైనా సరే ఆ మార్పు రావాలి. రాజకీయ, సామాజిక సంస్థలు, సంఘాలు మరింత చైతన్యవంతం కావాలి. వైజ్ఞానిక ప్రగతిని అడుగున పడేసే కార్యక్రమాల్ని అడ్డుకుంటూ ఉండాలి.
అయితే, సైన్సు నేపథ్యంలోంచి హేతువాదాన్ని ప్రచారం చేస్తున్నవారు బాబుగోగినేని. ఈయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీవీ చర్చలలో విరివిగా కనిపిస్తుంటారు. ఈ రంగంలో సీనియర్లైన డా బ్రహ్మారెడ్డి, పెన్మెత్స సుబ్బరాజు, పసల భీమన్న, షరీఫ్గోరా కొత్తపల్లి రవిబాబు, డా గుమ్మా వీరన్న, మేడూరి సత్యనారాయణ మొదలయిన వారే కాకుండా కుర్రా హనుమంతరావు, షేక్ బాబు, రావు కృష్ణారావు, జీడీ సారయ్య, షేక్ దరియావలి వంటి వారు కూడా ఉన్నారు. “నేను ఎందుకు సైన్సు రాస్తున్నాను” అనే సంకలనం డా నాగసూరి వేణుగోపాల్, మల్యాద్రిల సంపాదకత్వంలో ప్రకటించారు. ఇలాంటివి ఇంకా రావాలి. ప్రచురణ కర్తలు ముందుకొచ్చి ప్రోత్సహించాలి. ఇంకా కొన్ని పేర్లు నేను మరిచిపోయి ఉండొచ్చు. అందువల్ల వారి కృషి తక్కువదై పోదు. లేదా గతంలో మరోచోట మరికొందరిని గుర్తుచేసుకుని ఉంటాను. ఏమైనా సైన్సు మానవవాద- హేతువాద కార్యకర్తలు, రచయితలు, సంస్థలు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. తప్పదు!
(వ్యాసరచయిత కవిరాజు త్రిపురనేని జాతీయపురస్కార గ్రహీత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.