
కలసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహా బలం వంటివి ప్రాచుర్యం పొందిన నినాదాలు. “చట్టా పట్టాల్ కట్టుకుని దేశస్థులంతా నడవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ వెలగవలెనోయ్” అని కవి గురజాడ అన్నాడు. ఆవాజ్ దో హమ్ ఏక్ హై అనే నినాదాన్ని పోరాటాల సందర్భంగా సాధారణంగా శ్రామికులు ఇస్తూ ఉంటారు. దీనర్ధం మేమంతా ఒక్కటే అని గట్టిగా నినదించడం. ఇక్కడ మేము అంటే ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందినవారు కాదు. ఆ తరగతి ప్రజల విశాల ఐక్యత. ఇటువంటివన్నీ దేశ ప్రజలలో ఐక్యత భావాన్ని పెంపొందించి, దేశాన్ని ముందుకు నడిపించే నినాదాలు. మేమంతా భారతీయులమనే ఇటువంటి ఐక్యతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందేలా చేసింది. అయితే ఇప్పుడంతా అలా సజావుగా లేదు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో అవి అవాంఛనీయంగాను, హింసాత్మకంగానూ కూడా మారాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, ప్రజల మధ్య సుహృద్భావం పెంచేలా కృషి చేయవలసిన పాలక పార్టీల పెద్దలు ఆ పని చేయకపోగా, తిరిగి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు..
ఇటువంటి సందర్భాలను ప్రజల మధ్య విభజనలు తేవడానికి, విద్వేషాలు రాజేయడానికి వాడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ హిందువులు తమ ఆత్మ రక్షణ కోసం ఆయుధాలను ఇంట్లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులను రెచ్చగొట్టడమే ఈ పిలుపు లక్ష్యం. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ ప్రసంగాలు బిజెపి నాయకులు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. దేశ ప్రధాని కూడా దీనికి మినహాయింపు కాకపోవడమే కాక, ముందుండి దీనికి నాయకత్వం వహిస్తున్నారు.
మోసపూరిత నినాదం…
కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ, భిన్నమైన మరో నినాదం ఇచ్చారు. అదేమిటంటే ‘ఏక్ హైతో సేఫ్ హై’. దీనర్థం ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటామని. ఇది కూడా పైకి చూస్తే మంచి నినాదంలానే కనపడుతుంది. కానీ ఈ నినాదం ఇచ్చింది సామాన్యులు కాదు. దేశ ప్రజలను ముక్కలు చెక్కలుగా విడగొట్టడమే వీరి నినాద లక్ష్యం. హిందువులందరూ ఒకటిగా ఉండాలి అనే రెచ్చగొట్టే నినాదమిది. ఉత్తర ప్రదేశ్ వీరి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో అడుగు ముందుకు వేసి ‘బటేంగేతో కటేంగే’ అంటే విడిపోతే నాశనం అవుతామనే నినాదంతో హిందువుల్లో భయాలను కూడా కల్పించడానికి యత్నించారు.
ఈ నినాదంతో నిజంగా హిందువులందరినీ ఒకటిగా చేయడమే వీరి లక్ష్యం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వీరు నమ్మిన మనుధర్మం పచ్చి వివక్షతా భావాలను పెంచి పోషించి, హిందువులను విడగొట్టేది. కుల వ్యవస్థ, మహిళల పట్ల వివక్షత, అంటరానితనం వంటివి మనుధర్మంలో అంతర్భాగాలు. ఇలా ప్రజలను చీల్చేసిన సిద్ధాంతంతో ఎలా ఏకం చేయగలరు అన్నది అసలు అంశం.
గబ్బు కొట్టే కుల వ్యవస్థ..
నిజంగా వీరికి హిందువులందరినీ ఏకం చేయడమే ఉద్దేశంగా ఉంటే వెంటనే వీరు చేయవలసిన పని ఏమిటంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు దేశంలో కుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి. అలాగే పురుషులతో సమానమైన హక్కులు ఆచరణలో మహిళలకు ఉండాలి. ఈ రెండూ లేకుండా ఏకం చేయడం అన్న నినాదం ఇవ్వడం అంటే, అది వీరి రాజకీయ స్వలాభం గురించే తప్ప నిజంగా హిందూ మతం మీద అభిమానంతో కాదు అన్నది మాత్రం స్పష్టం.
మనదేశంలో నేడున్న కుల వ్యవస్థకు పునాది వర్ణ వ్యవస్థ వేసింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు సేవ చేసేవారిగానే శూద్రులను వర్ణ వ్యవస్థ నిర్దేశించింది. కాలక్రమేణా ఈ వర్ణవ్యవస్థ మరింత పదునుగా మారి కుల వ్యవస్థ, అంటరానితనం వంటివి మన సమాజంలో వేళ్లూనుకుని పోయాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధిస్తున్న పురోగతి గానీ, ఆర్ధికాభివృద్ధి వంటివి గానీ ఈ కుల వ్యవస్థను నిర్మూలించలేకపోవడం విశేషం. మన దేశాన్ని పాలించిన స్థానిక పాలకులు, తరువాత వచ్చిన మొగలులు, యూరోపియన్ పాలకులు దేశంలో అనేక మార్పులు ప్రవేశపెట్టినా ఎవరూ కూడా ఈ కుల వ్యవస్థను మాత్రం తాకలేకపోయారు. ప్రజలను పుట్టుకతోనే వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా విభజించే ఈ కుల వ్యవస్థ భారతదేశ సనాతన ధర్మంలో భాగంగా ఇమిడిపోయి, పెద్ద జాడ్యంలా నేటికీ కొనసాగుతోంది. ఎన్నికలలో గెలుపుకు బ్రహ్మాస్త్రంలా సోషల్ ఇంజనీరింగ్ అనే నేటి రాజకీయ నేతల ప్రోద్బలంతో మరింత బలోపేతం అయ్యే దిశలో సాగుతోంది.
నేటికీ చీకటే..
తాజాగా బిజెపికి చెందిన అస్సాం ముఖ్యమంత్రి మూడు అగ్రవర్ణాల సేవకే శూద్రులు అని బహిరంగంగానే కుండ బద్దలు కొట్టినట్లు సెలవిచ్చారు. వీటన్నిటి ఫలితంగా ఉదయించిన సూర్యుడు అందరికీ వెలుగులు తెస్తే, మన దేశంలో మాత్రం కొన్ని నిమ్నకులాల వారికి నేటికీ చీకటే కొనసాగుతోంది. ఇటీవల వీరు “గడప లోపలే కులం- గడప దాటితే మనమంతా హిందువులం” అనే కొత్త నినాదం ఇచ్చారు. ఇది గబ్బుకొట్టే కులవ్యవస్థను మతం ముసుగులో కప్పిపుచ్చడానికే. వాస్తవంగా ‘గడప లోపలే మతం- గడప దాటితే మనమంతా భారతీయులం’ అనే భావనే దేశానికి రక్షగా నిలుస్తుంది.
మహిళా వివక్షత..
దీంతో పాటే మన దేశంలో మరొక అతిపెద్ద సామాజిక రుగ్మత మహిళల పట్ల వివక్షత. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా, మహిళలు అనేక రంగాలలో పురోగతి సాధిస్తున్నా, నేటి సమాజంలో మహిళల పట్ల వివక్షత మాత్రం కొనసాగుతూనే ఉంది.
‘ప్రపంచ ఆర్థిక నివేదిక 2024 ప్రకారం లింగ వివక్షత సూచీలో 144 దేశాలకు గాను మన దేశ స్థానం 127. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీ లంక, నేపాల్, భూటాన్ వంటివి లింగ సమానత్వంలో మన కంటే మెరుగ్గా ఉండడం విశేషం. ‘జార్జిటౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్’ సంస్థ నివేదిక ప్రకారం శాంతి, సంరక్షణ వంటి అంశాలలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది. మహిళలపై లైంగిక హింస, వేధింపులు, అక్రమ రవాణా వంటి అంశాలలో ఆసియా ఖండంలో ప్రమాదకర దేశం ఇండియా అని ఆ నివేదిక పేర్కొంది. పురిట్లోనే ఆడ శిశువులను చంపేసిన చరిత్రా మనకుంది. ఆడపిల్లను కన్నందుకు భార్యను వేధించే ఘనులూ మనకున్నారు. అనాదిగా ఉన్న వరకట్న దురాచారం నేటికీ కొనసాగుతూనే ఉంది. చివరకు పిల్లల్ని కనడం అనే స్వేచ్ఛ కూడా మహిళకు లేకుండా చేసి, అనేక కుటుంబాల్లో ఈ పెత్తనాన్ని భర్తలు, ఇతర కుటుంబ పెద్దలే పోషిస్తున్నారు. ఇప్పుడు వీరు చెప్పే మనుధర్మ సిద్దాంతం, పాటించే విధానాలు వివక్షతను మరింత పెంచేదిగానే ఉంటున్నాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల పట్ల సమానత్వం సాధించకుండా ప్రధాని ఇచ్చిన ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం ఎలా సాధ్యమవుతుంది?
పెరుగుతున్న అత్యాచారాలు..
నేడు మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నది అత్యధికంగా ఆ మహిళలకు సన్నిహితంగా ఉన్నవారే. అంటే మోదీ గారు చెప్పిన ఏక్ హై అనేది వీరికి పూర్తిగా వర్తిస్తుంది. అయితే మహిళకు మాత్రం మోదీ చెప్పిన సేఫ్ అంటే రక్షణ మాత్రం లేకుండా పోయింది. ఆశ్చర్యకరంగా ఈ నినాదాలిచ్చిన వారే ఇటువంటి రాబందుల కొమ్ము కాస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, మోదీ పద్ధతిలో ఏకమైతే ఆటోమేటిక్‌గా మహిళలు సురక్షితంగా ఉంటారా అన్నవి వీరు సమాధానం చెప్పాలి. అందువల్ల మహిళా సమానత్వం, మనుధర్మ వాదుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అసలు వీరి సనాతనమంటేనే సమానత్వానికి వ్యతిరేకం. “మహిళలకు పురుషులపై అధిపత్యం ఉండననక్కర లేదు- వారిపై వారికి ఉంటే చాలు” అన్నారు మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ అనే 18వ శతాబ్దపు ప్రముఖ బ్రిటీష్ తత్వవేత్త. నేడు మన దేశంలో సరిగ్గా అదే కరువైంది.
పెరుగుతున్న పేదరికం, ఆర్థిక అసమానతలు..
గత దశాబ్ద కాలంలో తారా స్థాయికి చేరుకున్న తీవ్ర పేదరికం, ఆర్ధిక అసమానతలతో దేశం కునారిల్లుతోంది. మన దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి తోడ్పడేలా ప్రభుత్వ విధానాలను రూపొందించి, మొత్తంగా ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ స్వరూపాన్ని మోదీ ప్రభుత్వం మార్చేసింది. ఫలితంగా ప్రపంచంలోనే ఆదాయాలు, సంపదలలో తీవ్ర ఆర్ధిక అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. 2022-23 ప్రపంచ అసమానతల నివేదిక దేశంలోని ఒక్క శాతం సంపన్నులు 22.6 శాతం ఆదాయాలను, 40.1 శాతం దేశ సంపదను స్వంతం చేసుకున్నారని వెల్లడించింది. బ్రిటిష్ వలస పాలనా కంటే కూడా ఇది అత్యధికం. అదే సందర్భంలో దేశంలోని అట్టడుగు 50 శాతం మంది చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉందని పేర్కొంది. ఈ పేదరికం, అసమానతల వంటి కష్టాలను అనుభవిస్తున్నది సహజంగా హిందువులే.
మనువాదుల మోసాలు..
వీరి మనుధర్మానికి అసలు పునాది అయిన ప్రజలను చీల్చి ఉంచే కుల వ్యవస్థను, మహిళల పట్ల వివక్షతను పెంచి పోషిస్తూ, పేదరికాన్ని పెంచే విధానాలు అవలంభిస్తూ, మరోపక్క ఏకం కండి అనే నినాదం ఇవ్వడం పచ్చి విద్వేషపూరిత, రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నదే. మతం పేరున ప్రజలను మభ్యగొట్టి, వీరి పాలన ద్వారా సంభవిస్తున్న నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, ధరల పెరుగుదల, మహిళలపై అత్యాచారాలు, విద్వేష దాడులు, తెగల మధ్య చిచ్చులు వంటి దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఉద్దేశించినవే. లెనిన్ మహాశయుడు చెప్పినట్లు ”ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు”అన్నది అక్షర సత్యం.
స్వాతంత్రోద్యమ వారసత్వం..
మోదీ చెప్పిన కోణం నుంచి కాకుండా మరో కోణం నుంచి చూస్తే ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సకల సమస్యల పరిష్కారానికి అదే నినాదం చాలా ఉపయోగపడుతుంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే ప్రస్తుత దేశ సమస్యలను పరిష్కారం చేసుకోగలం. రైతులందరూ ఐక్యంగా ఉద్యమిస్తేనే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర సాధించుకోవడం సాధ్యం. కార్మికులందరూ ఐక్యంగా పోరాడితేనే హక్కులు నిలుపుకోవడం, దేశ సంపదను, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవడం సాధ్యం. దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఉపాధి లేమి, ఆర్థిక అసమానతలు, దారిద్రం వంటి సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. కుల మతాలకతీతంగా ప్రజలందరూ చైతన్యం ప్రదర్శిస్తేనే మహిళల పట్ల వివక్షత, అత్యాచారాలు నిలవరించగలం. గొప్ప సామాజిక చైతన్యం, సోదరభావం పెంపొందిస్తేనే కుల వ్యవస్థ నిర్మూలించడం సాధ్యం. వాస్తవంగా ఇటువంటి ఐక్యత మన స్వాతంత్రోద్యమ వారసత్వం. అన్నింటి కంటే విచిత్రం ఏమిటంటే, స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్రలేని వారు, తిరిగి బ్రిటిష్ వారికి దాసోహమయిన వారి వారసుల నుంచి ఇలాంటి నినాదాలు రావడం.
కలసి ఉంటే కలదు సుఖం..
అందువల్ల మోదీ దురుద్దేశ పూరిత కోణం నుంచి కాకుండా గొప్ప చైతన్య స్పూర్తితో అదే నినాదాన్ని నేడు ఆచరణలో పెట్టాలి. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి ఫలాలు అందరికీ చేరుతాయి. రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయి. ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించకపోతే, ప్రభుత్వం నేడు ప్రజలపై వేస్తున్న భారాలను మరింత పెంచుతుంది. అందువల్ల ఇక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన విడిపోతే నశిస్తాం అనే నినాదం అక్షరాల ఆ బిజెపి ప్రభుత్వానికి, పాలకుల కుట్రలకే వర్తిస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇలాంటి మోసపూరిత నినాదాలకు లోనుకాకుండా, రెచ్చిపోవడం కాకుండా, ఆ నినాదాల వెనక ఉన్న అసలు లక్ష్యాలను, ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవడం, ఆ ప్రమాదాన్ని నిలవరించడం అత్యంత అవశ్యం. పాలకులు దుర్బుద్ధితో ఆకర్షణీయ నినాదాల మాటున సృష్టిస్తున్న అడ్డంకులను ఛేదించి, మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగడమే మెరుగైన భారత్ నిర్మాణానికి నేడు అత్యవసరం.
ఎ అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.