
“భారతదేశాన్ని, ఇతర ప్రపంచ దేశాల్ని మతం అనే కళ్లద్దాల్లోంచి చూసినప్పుడు నాకు భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. అవన్నీ భ్రమలకు, మూఢ నమ్మకాలకు, దోపిడికి, కొందరి స్వార్థ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రుజువైంది. అందుకే ఎప్పటికప్పుడు నేను వాటిని ఖండిస్తూ వస్తున్నాను. అంతేకాదు, వాటిని సమూలంగా నాశనం చేసి, సమాజాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది.”
– జవహర్లాల్ నెహ్రూ(భారత తొలి ప్రధాని)
సైన్సు ఒక అత్యాధునిక అంశం. మతం ఒక అతిపురాతన అంశం. మతానికి కొన్ని పరిమితులు- హద్దులు ఉన్నాయి. సైన్సుకు అవి ఉన్నా, ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. మతం సంకుచితమై, జనాన్ని కుంచింపజేస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సంప్రదాయాలు, నియమాలు, చాదస్తాలతో కట్టిపడేస్తూ ఉంటుంది. యోగా, సమాధి, ఆధ్యాత్మికత పేర్లతో పవిత్ర వాక్యం, ప్రవచనాల పేర్లతో, దైవవాక్యం, భగవత్ ఉవాచ వంటి బెదిరింపులతో జనాన్ని కట్టి పడేస్తుంది. నిరుత్తరుల్ని చేస్తుంది. ప్రజల ప్రశ్నల్ని అణచివేస్తుంది. అనుమానాల్ని నిరంతరం పెంచి పోషిస్తుంది. గాఢం, నిగూఢం అంటూ మతబోధకులు ఎవరికి తోచింది వారు చెపుతూ ఉంటారు.
గొర్రె కటిక వాణ్ణి నమ్ముతుందన్నట్లు కొన్ని శతాబ్దాలుగా సామాన్య జనం మూర్ఖ పండితుల పాండిత్యానికి బలవుతూ వచ్చారు. ఇంకా అవుతూనే ఉన్నారు. దీపం వెలిగించగానే చుట్టూ ఉన్న చీకట్లు మటుమాయమైనట్లు సైన్సు రంగ ప్రవేశం చేసే సరికి మతానికి గడ్డు కాలం ఎదురైంది.
సైన్సు జనానికి ప్రశ్ననిచ్చింది. అన్వేషణకు దారులు వేసింది. సంకుచితత్వపు చీకట్లు బద్దలు కొట్టి, విశాలత్వపు వెలుగుల్ని పంచింది. రహస్యాల్ని ఛేదించింది. జీవం పుట్టుకను విప్పి చెప్పింది. భూమి, సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలు ఏవేమిటో అర్ధం చేస్తూ వచ్చింది.
మతాన్నే కాదు, అన్ని మతాలకూ మూలాధారమైన దేవుణ్ణే ప్రశ్నించింది. సైన్సు శోధనలో దేవుడెక్కడా కనబడలేదు. ఉండి ఉంటే ఆయన ధైర్యంగా వచ్చి ముందు నిలబడనూ లేదు. మనిషి తన అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని రంగరించి దేవుణ్ణి చేసుకున్నాడని అనుకుంటే, దేవుడనే ఊహని, భ్రమని, కల్పనని నిలుపుకోవడానికి మనిషికి ఓ మతం అవసరమైంది. మళ్లీ మనుషులు తమతమ స్వార్థ చింతనతో, తమ ప్రత్యేకతని కాపాడుకోవడానికి, తమ అస్థిత్వాన్ని ప్రకటించుకోవడానికి వందల వేల సంఖ్యలో దేవుళ్లని ఏర్పరుచుకున్నారు. ఆ దేవుళ్ల చుట్టూ మతాల్ని వృద్ధి చేసుకుని, వ్యాపింపజేసుకుని, వ్యాపారాలు చేస్తున్నారు.
సైన్సు అంటే ఏంటంటే..
సైన్సు ప్రకారం, సత్యం అనేది ఒక వాస్తవంగా ఉండాలి. నిరూపణకు నిలబడాలి. కాలక్రమంలో పరిశీలనలు, పరిశోధనలు జరుగుతున్న కొద్దీ, నిన్నటి దాకా సత్యం అనుకున్నది మారిపోవచ్చు. రూపాంతరం చెందొచ్చు. మార్పు దాని సహజ లక్షణం.
సైన్సంటే సత్యం కోసం జరిపే నిరంతర అన్వేషణే! అందువల్ల, భ్రమకూ వాస్తవానికీ ఎలాగైతే పొత్తు కుదరదో, మతానికీ సైన్సుకు కూడా కుదరదు. రెండు వేర్వేరు విషయాలు.

గంజాయి తాగి ఎవరైనా మత్తులో జోగుతానంటే అది వారిష్టం. అది హానికరం కాబట్టి, పౌష్టికాహారం తిని సమాజానికి పనికొచ్చే పనులు చేస్తానని ఇంకొకరంటే, ఇది వీరిష్టం. అంతేగాని, రెండింటినీ కలుపుకుని పోవాలనుకోవడం పిచ్చి ఆలోచనే అవుతుంది.
ఎంతటి మేధో సంపద కలవారైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత అధికారమున్నా హేతుబద్ధత లేని మాటమాట్లాడితే అది నిలవదు. దేవుడి ఆశిస్సులతో శాస్త్రజ్ఞాఉఉల పరిశోధనలు చేయాలని చెప్పడం మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. చాలామంది వైజ్ఞానికులే గోడ మీది పిల్లుల్లాగా, భయస్తుల్లాగా, పలాయనవాదుల్లాగా ఉంటారు. అది వేరే విషయం. వారు ఇలాంటి చర్యల్ని ఖండించరు. కనీసం వ్యతిరేకించరు. నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు.
అధికారంలో ఉన్నవారి దృష్టిలో చెడుగా పడడమెందుకూ అన్నది వారి ఆలోచన కావొచ్చు. కానీ, నిజానికి అది వారి పరికితనం. అదే తప్పు. అంతమాత్రం చేత అబద్ధం నిజంగా మారిపోదు కదా? అన్ని మతాలదీ ఒకటే సిద్ధాంతం. ఊటలేని, ప్రవాహగుణం లేని, నిలిచిన మురుగుగుంట సిద్ధాంతం. ఈ విషయం సామాన్యులు కూడా గ్రహిస్తుంటే, శాస్ర్తవేత్తలు- పెద్ద పదవుల్లో ఉన్న “మహానుభావులు” గ్రహించపోవడం విచారకరం. ఇంకా చెప్పాలంటే అలాంటి వారంతా భోరున ఏడ్వాల్సిన విషయం. ఎంత వెనుకబడి ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.
మన భారతీయ సంస్కృతీ- సంప్రదాయాలు చెట్టు వేళ్లులాంటివనీ, పైకి ఎదిగిన కొమ్మలు మన వైజ్ఞానిక పరిశోధనలని ఓ సన్యాసి అతి తెలివి ప్రదర్శించి వ్యాఖ్యానించారు. నిజానికి అది అర్ధం లేని మాట, ఒకే కాండానికి ఒక వైపు మతమూ, మరోవైపు సైన్సూ ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. రెండింటినీ సమన్వయం చేద్దామని కష్టపడ్డారు. కానీ, పోలిక కుదరలేదు. ఎందుకంటే సంప్రదాయపు వేళ్లలోంచి సైన్సు పుట్టలేదు. చెట్టు వేళ్లు దేనివైతే, కొమ్మలు దానివే వస్తాయి- విత్తొకటైతే చెట్టొకటి మొలవదు అన్నట్టు – వేళ్లు నరికేస్తే చెట్టే కూలిపోతుంది. అంటే ఆయన అనే సంస్కృతీ- సంప్రదాయాల వేళ్లు నరికేస్తే భారతీయ వైజ్ఞానిక శాఖలన్నీ కుప్పగూలవు కదా? పిచ్చిమాటలెందుకూ?
భారతీయ సంస్కృతి- సంప్రదాయాలు కేవలం మన దేశానికి సంబంధించినవని. వైజ్ఞానిక పరిశోధనలు మొత్తం ప్రపంచ మానవాళికి సంబంధించినవి.
ఒక స్వామీజీ తన మూఢ భక్తిని ఇలా సైన్సు పరిభాషలో చెప్పారు. విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి హైటెన్షన్ వైరు బయలుదేరి అది ఎలక్ట్రిక్ స్థంబాల మీదుగా విడిపోతూ నగర వీధుల్లో, ఇళ్లలో విద్యుద్దీపాలు వెలిగిస్తుంది. వైర్లలో అంతర్గతంగా విద్యుచ్ఛక్తి ప్రవహిస్తోంది. ఇది మనకు తెలిసిన విషయం. ఇక ఆ స్వాముల వారు చెప్పిందేమంటే, ప్రతి గుడి మహిమాన్వితమైన ఒక పవర్ స్టేషన్ అని, అందులో నుంచి ఎనర్జీ బయట ఉన్న ధ్వజస్థంభం మీదికి వెళ్లి- గుళ్లో ఉన్న ఇతర దేవతా విగ్రహాల మీదుగా సాగి, ఆ ఎనర్జీ(శక్తి) ఊళ్లో ప్రతి ఇంటికి చేరుతుందట. ఇంతకూ ఆయన సిద్ధాంతీకరించేదేమంటే “గుళ్లు- పవర్ స్టేషన్లు” అని!
ఎలక్ట్రిక్ వైరు పట్టుకుంటే షాక్కొట్టి మనిషి టప్పున చచ్చిపోతాడు. అదే మీరు ధ్వజస్థంభాన్ని ముట్టుకున్నా, కౌగిలించుకున్నా ఏమీ కాదు. కారణం అందులో ఏం లేదు గనక! దేవుడనే వాడే ఒక కల్పన అయితే, ఆ కల్పనకు శక్తి ఆపాదించడమంటే, కల్పనకు మరో కల్పనను జత చేయడమవుతుంది. సున్నా పక్కన ఎన్ని సున్నాలు పెడితే మాత్రం ఏం లాభం? విలువ పెరగదు కదా?
ఎవరి విశ్వాసాలు వారికి వ్యక్తిగతం. వాటిని వారి స్థాయిలోనే ఉంచుకోవాలి. అంతేగాని వాటితో సమాజాన్ని ప్రభావితం చేయాలనుకోవడం తప్పు. ఆ పని చేసేది ఎలాంటి వారైనా తప్పు తప్పే. మరీ ముఖ్యంగా ప్రజాధనాన్ని నిసిగ్గుగా ఖర్చు చేస్తూ అధికారిక లాంఛనాలన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు అది వారి వ్యక్తిగతం కాదు. కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యవహరించాల్సిన నాయకులు ఇలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును, రాజ్యాంగ స్ఫూర్తిని కూలదోయడమే.
తమ వ్యక్తిగతాన్ని, మనోగతాన్ని ప్రజల మీద, ప్రజా జీవనం మీద రుద్దడం ఘోరం. మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది? “మతం వ్యక్తిగతం” అని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుకు విరుద్ధంగా నడుచుకునే వారంతా నేరస్తులే. సెలవుపెట్టి స్వంత డబ్బుతో, స్వంత వాహనంలో, హోదాకున్న ప్రోటోకాల్ పాటించకుండా వారి ఇష్టం ఉన్న చోటికి వెళ్లొచ్చు. కానీ వారలా చేయడం లేదే? అధికార పీఠం మీద ఉన్నారు గనుక. వారికి శిక్షేముంటుంది? కానీ, నైతికంగా దిగజారిన మనుషుల్లా- వాళ్లంతా జనం ముందు తలదించుకోవాల్సి వాళ్లే!
దేవుడైనా సరే సైన్సును గుర్తించాల్సిందే. సైన్సు మాత్రం దేవుడున్నాడని ఒప్పుకోదు. పైగా సైన్సు లేకపోతే, ఆన్లైన్ బుకింగ్లు జరగకపోతే, విమానాల్లో, రైళ్లల్లో, బస్సుల్లో భక్తులు లక్షల సంఖ్యలో తిరుపతికి చేరే అవకాశమే లేదు. సుప్రభాతం పట్టణమంతా వినబడాలంటే మైక్ కావాలి. అది సైన్సే, గుళ్లో వెలిగే విద్యుద్దీపాలు సైన్సే. దైవ భావన ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా టెలివిజన్ ఛానళ్లు పెట్టి, కార్యక్రమాలు ప్రసారం చేయడమంటే అదే సైన్స్!
తిరుపతి ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సమావేశాలు- బఫూనరీకి నిదర్శనమనీ గతంలో మన నోబెల్ గ్రహీత డా వెంకీ రామకృష్ణన్ కితాబిచ్చారు. ఇలాంటి వాటికి తను మళ్లీ రానని కూడా చెప్పారు.
నిజనిర్ధారణలకు, నిరూపణలకూ నిలబడి చేసే సత్యాన్వేషణలో రాజకీయ నాయకుల ప్రమేయం, మత బోధకుల ప్రమేయం, ఇతర అసాంఘిక శక్తుల ప్రమేయం ఏమీ ఉండకూడదని గట్టిగా వాదించారు.
అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలైనా వైజ్ఞానిక స్పహను కచ్చితంగా ప్రోత్సహించాలి. జీవితాలని ధారపోసే శాస్త్రజ్ఞులకు అన్ని వసతులూ సమకూర్చాలి. వారి రాజకీయాల ప్రభావం పరిశోధనా రంగం మీద పడకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత ఎప్పుడూ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలదేనని నొక్కి చెప్పారు. ఆయన రాయల్ సొసయిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయిన సందర్భంగా “హిందూ” ఇంగ్లీష్ దినపత్రికకు మార్చి 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. నిజమే కదా?
ఈ విషయమ్మీదే పత్రికా గోష్టిలో మాట్లాడుతూ “ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే భారతదేశం మాత్రం అశాస్త్రీయ విధానాలతో వందేళ్లు వెనకబడిందనీ, ఇలాంటి సైన్సు కాంగ్రెస్ సమావేశాలతో ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమీ లేద”నీ హైదరాబాద్లోని సీసీఎంబీ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీఎం భార్గవ అన్నారు.
అత్యున్నత స్థాయికెదిగిన, అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల మాటలు విందామా? లేక జనం చెవుల్లో పువ్వులు పెట్టి వెర్రివాళ్లను చేసే రాజకీయ నాయకుల మాటలు విందామా? ప్రజలమైన మనమే నిర్ణయించుకోవాలి.
ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో భారతదేశం ఎందుకు వెనకబడుతూ వస్తోంది? మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాముఖ్యతలు వేటికీ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ- మనదేశంలో బుల్లెట్ ట్రైయిన్ ప్రవేశపెట్టడానికి జరగాల్సిన ఒప్పందాల కోసం జపాన్ ప్రధాని మనదేశం వచ్చారు. సరే ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక ఇక దేశంలో చూపించాల్సిన ప్రదేశాలే లేనట్టు ఆయనను మన భారత ప్రధాని గంగానది ఒడ్డున “గంగా హారతి” కార్యక్రమానికి తీసుకెళ్లారు.
మూడు గంటలు ఓపిక పట్టిన జపాన్ ప్రధాని వెళ్లేటప్పుడు ఓ ప్రశ్న వేశారు. “మీకు తీరికగా గంటలకొద్దీ “గంగా హారతి” చూసుకునే విరామం ఇంతగా ఉంటే- మరి బుల్లెట్ ట్రెయిన్ ఎందుకు అవసరమౌతోంది? అని! అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలోనే చాలా ఉంది.
(వ్యాస రచయిత విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.