
ఢిల్లీలోని వసంత్‌కుంజ్ బయటి భాగంలో కొన్ని మురికివాడలు ఉన్నాయి. వసంత్‌కుంజ్‌లోని ఇళ్లలో పనిచేసే కాపాలదారులు, డ్రైవర్లు, పేయింటర్లు, ప్లంబర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వాడలలోనే నివసిస్తారు. కటిక పేదరికంతో జీవించే వీరి పరిస్థితి గురించి ఈ నివేదిక వివరిస్తుంది.
న్యూఢిల్లీ: మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రాంతంగా దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌ను పరిగణిస్తారు. ఈ ప్రాంతానికి చెందిన బయటి భాగంలో కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఈ వాడలకు చెందిన కూలీల ద్వారానే వసంత్ కుంజ్‌లోని ఇళ్లలో పనిచేసే “మేడమ్” నుంచి, కాపాలదారు, డ్రైవర్, పేయింటర్, ప్లంబర్, పారిశుద్ధ్య కార్మికులు దొరుకుతారు. గత కొన్ని సంవత్సరాలలో ఇజ్రాయిల్ క్యాంప్లాంటి అనేక వాడల మీద బుల్డోజర్ నడిచింది. ప్రస్తుతం జైహింద్ క్యాంప్ వార్తలలో నిలిచింది. 2025 జూలై 8న పోలీసు బలగాలతో జైహింద్ క్యాంప్‌కు వెళ్లిన బీఎస్ఈఎస్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
రోడ్డుకు ఒక వైపు జిలుగువెలుగులీనె ఢిల్లీ ఉంటే, మరోవైపు చీకటిలో మునిగిన జైహింద్ క్యాంపు ఉంది.
జైహింద్ క్యాంపు..
ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు(డీసీబీ) ప్రకారం, దీని కోడ్ నం. 701. ఈ వాడ 18,400 చదరపు మీటర్ల ప్రాంతంలో వ్యాపించి ఉంది. ఇందులొ దాదాపు వేయి కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ వాడకు ఢిల్లీ జల బోర్డు ఎనిమిది ట్యాంకర్ల నీళ్లను సరఫరా చేస్తుంది. 40- 40 వాట్ల మూడు విద్యుత్ ప్రధాన మీటర్లు(గుడిలో రెండు, మస్జీద్‌లో ఒకటి)పెట్టారు. అక్కడ నుంచి అన్ని మీటర్ల మాధ్యమంగా అన్ని ఇళ్లలోకి విద్యుత్ సరఫరా అవుతుంటుంది.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం, ఇక్కడ 593 ఓటర్లు కాగా ఇందులో 256 మహిళలు ఇంకా 337 పురుషు ఓటర్లు ఉన్నారు.
ఛతర్పూర్ నుంచి మహిపాల్పూర్ వైపు వెళ్లే రోడ్డు కుడి వైపు వసంత్ కుంజ్ స్క్వేర్ మాల్ ఉంది. ఎడమ వైపు మట్టిరోడ్డు ఉంది. ఈ కచ్చారోడ్డు మీద అలానే ముందుకు వెళ్తే, బురద పాదాలకు తగులుతుంది. ఇంకా దాని చివర మురికివాడ ఉంది. మురికివాడ ముందు చెత్తకుప్ప కనబడుతుంది.
వసంత్‌కుంజ్ ఇళ్లలో, రోడ్ల మీద, మాల్స్ నుంచి చెత్త ఎత్తే పనిని, ఇక్కడ నివసించే వాళ్లలో దాదాపు 500 మంది చేస్తుంటారని బస్తీవాసులు చెప్పారు.
ఈ బస్తీ 1990 నుంచి ఉందని బస్తీవాసి అబ్దుల్ సమర్ షేఖ్ తెలియజేస్తారు. తాను ఇక్కడ 1998 నుంచి ఉంటున్నట్టుగా చెప్పారు. ఈ వాడలో 90శాతం మంది బెంగాల్, కొందరు బిహార్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. మిగితా 10శాతం మంది అస్సాం, ఇతర రాష్ట్రాలకు చెందినవారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం, ఈ ప్రాంతంలో చాలా మంది జంక్వర్కర్స్, డ్రైవింగ్ పనులు చేస్తుంటారు. మిగితావారు మాల్, ఆఫీసులో ఊడ్చేవారిగా, సిబ్బందిరూపంలో పనిచేస్తున్నారు. ఇళ్లలో శుభ్రం- వంటచేసే పనులను మహిళలు చేస్తుంటారు. కొందరు డెలివరీ బాయ్ పనిని కూడా చేస్తున్నారు. అంటే జైహింద్ క్యాంపువాసులు ఎక్కువశాతం శుభ్రచేసే- పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులకు చెందినవారు.
చెత్తను సేకరించే హసన్ తెలియజేశారుగా, ఆయన ఉదయం నాలుగు- ఐదు గంటలకు చెత్త సేకరించడానికి వెళ్తారు. సాయంత్రం మూడు- నాలుగు గంటలకు తిరుగుముఖం పడతారు. దాదాపు 150 ఇళ్ల నుంచి ఆయన సుమారు 100 కిలోల చెత్తను సేకరిస్తారు. అందులో నుంచి ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ లేదా మెటల్‌కు సంబంధించిన వస్తువులను ఇంటికి తెస్తారు. సుమారు 300 కిలోల మిగితా చెత్తను డంపింగ్‌యార్డ్‌లో పడేస్తారు. అంటే ప్రతీ ఒక్క వ్యక్తి దాదాపు నాలుగు వందల కిలోగ్రాముల చెత్తను సేకరిస్తాడు.
ఒకవేళ 500 మందిలో ప్రతీవ్యక్తికి 400 కిలోల లెక్క చొప్పున జోడిస్తే, ఇది 200 టన్నులు అవుతుంది. ఢిల్లీలో ప్రతీరోజు సుమారు 12,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అందులో 200 టన్నులు లేదా దానికంటే ఎక్కువ చెత్తను జైహింద్ క్యాంప్ వాసులు పారవేస్తారు. నగరంలో టన్ను చెత్తను సేకరించడానికి ప్రైవేట్ కంపెనీలకు దాదాపు 2,100 రూపాయలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఈ లెక్కప్రకారం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రతిరోజు 4,20,000 రూపాయిల ఆదా అవుతోంది. ఒకవేళ దీనిని సంవత్సరపరంగా చూసుకుంటే, ఈ నగదు దాదాపు రూ. 15 కోట్ల 33 లక్షలని చెప్పవచ్చు.
ప్రధానమంత్రి ప్రతిష్టాత్మక ప్రణాళికను విజయవంతం చేసే జైహింద్ క్యాంపు వాసులు, ఫొటోల కోసం రోడ్డుల మీద చీపురు పట్టుకునే నేతల మాదిరి కాదు.
ఇదే క్యాంపులో ఉండే కొందరు 2016లో ఇజ్రాయిల్‌కు చెందిన వసంత్ స్క్వేర్మాల్లో సీవర్ శుభ్రం చేస్తు ప్రమాదానికి గురైయ్యారు. ఇప్పటికింకా వారి పరిస్థితి సాధారణ స్థితిలోకి రాలేదు. అలానే ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వసంత్ స్క్వేర్ మాల్లో స్వీపర్‌గా పనిచేసిన ఈ ప్రాంతానికి చెందిన చందన్ కుమార్ చనిపోయారు.

జైహింద్ క్యాంప్ మహిళలు ఇళ్లలో పనులను చేస్తుంటారు, దీంతో ఇంటి యజమానులు ప్రశాంతంగా తమ ఆఫీసులకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఈ యజమానులలో అనేకమంది మంత్రిత్వ శాఖలు, పోలీసు శాఖ, న్యాయవ్యవస్థతో సంబంధం కలిగి ఉండవచ్చు. వాడలోని మహిళలు ఎప్పుడైతే ఇళ్లకు వెళ్లి అల్పాహారం, భోజనం వండుతారో అక్కడ ఉన్నటువంటి గర్భవతులకు విశ్రాంతి దొరుకుతుంది. కానీ, వాడలో ఉన్నటువంటి 30- 35 మంది గర్భవతులు(వీరి సంఖ్య ఆశ వర్కర్ తెలియజేశారు) తేమతో కూడిన వేడిలో చాలా కష్టంగా పగటి సమయాన్ని, దీర్ఘరాత్రిని వెళ్లదీస్తున్నారు.
ఇతరుల పిల్లలను చూసుకోవడానికి ఈ ప్రాంత మహిళలు వెళ్లినప్పుడు, వారి స్వంత పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. అంతేకాకుండా హోంవర్క్ పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే, ముబాయిల్కు ఏం హోంవర్క్ చేయాలో పంపబడుతుంది. విద్యుత్ లేకపోవడంతో, ఫోన్లు ఛార్జింగ్ అవ్వవు. దీంతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తనకు 14, 8 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నారని బస్తీకి చెందిన ఒక ఇంటి పనిమనిషి వైబ్‌సైట్ “ది ప్రింట్”కు తెలియజేశారు. అంతేకాకుండా ఇంకా మాట్లాడుతూ, “వర్షం వల్ల మా ప్రాంతంలో దోమలు ఎక్కువైపోయాయి. వేడి ఎంతలా ఉందంటే పిల్లలు రాత్రి వేళ నిద్రపోలేక పోతున్నారు. ఈ కారణం వల్ల ఇద్దరు పిల్లలు ఎన్నో రోజుల నుంచి స్కూల్ వెళ్లలేకపోతున్నారు. నేను ప్రతీ ఉదయం ఆరుగంటలకు పనికి వెళ్లిపోతాను” అని చెప్పారు.
“ఒకవేళ నా పిల్లలను ఉదయం నిద్రలేపడానికి నేను ప్రయత్నిస్తే, రాత్రి సరిగా నిద్రపోకపోవడం వల్ల మరికొంత సమయం నిద్రపోనీమని వాళ్లు వేడుకుంటారు. ఒకవేళ నేను సమయానికి పనికి వెళ్లకపోతే తిట్లు పడతాయి. ఒకవేళ పిల్లల సహాయం కోసం ఇంటి వద్ద ఉంటే, పని పోతుంది”అని ఆమె తన సమస్యను చెప్పింది. ఇంకా చెప్తూ, “మేము చాలా కష్టాల్లో ఉన్నాము, నేను దానిని వ్యక్తీకరించనూ లేను. మేము ఎక్కువ ఏం అడగడం లేదు, కేవలం విద్యుత్‌ను పునరుద్దరించండి. దీంతో మా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. మేము ప్రశాంతంగా పనికి వెళ్లగలుగుతాము”అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
తాను ఒక ఇంటిపనిమనిషనని, రెండు పూటల ఇళ్లలో పనిచేయడానికి వెళ్తానని సహనూన్ బీబీ చెప్పారు. అద్దె ఇళ్లలో ఉండి, పిల్లలను చదివించేంత తాము సంపాదించలేమని ఆమె అన్నారు. “ఒకవేళ పిల్లలను ఊరికి పంపిస్తే వాళ్ల చదువు మధ్యలో ఆగిపోతుంది. దీంతో వాళ్లు నష్టపోతారు. ఎందుకంటే, అక్కడ బెంగాలీ మీడియం ఉంది. వాళ్లిక్కడ హిందీ మీడియంలో చదువుతున్నార”ని పేర్కొన్నారు.
మరికివాడ మీద రాజకీయ నీలినీడలు..
ఓట్ల సమయంలో ఢిల్లీలోని అన్ని కీలక పార్టీలు మురికి వాడ ప్రజలకు లేనిపోని హామీలను ఇస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరూ కూడా పట్టించుకోరు.
ఒక నివేదిక తెలుపుతుంది కదా, 2005 నుంచి 2013 మధ్య “రాజీవ్ రత్న ఆవాస్ యోజన” ప్రకారం 35,000 ఈడబ్ల్యూఎస్ ఇళ్లను నిర్మించారు(భాలస్వా, బవానా, హోలంబీలాంటి ప్రాంతాలలో). అందులో నుంచి ఎక్కువశాతం ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. తలుపులు- కిటికీలు, గ్రిల్ వరకు దోచుకుపోయారు. బవానా ప్రాంతంలో అనేక ఇళ్లు కూలిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ఆమ్ఆద్మీపార్టీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ మురికివాడలలో కేవలం 1,293 కుటుంబాలకు మాత్రమే పునరావాసాలను కల్పించింది.

ఒక్క మురికి వాడ కూడా కూల్చివేతకు గురికాదని ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. కానీ బీజేపీ ఢిల్లోలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాడలను కూల్చే ప్రక్రియలో వేగం పెరిగింది. బీజేపీ పరిపాలన నేపథ్యంలో మద్రాసీ క్యాంప్, భూమిహీన్ క్యాంప్, వజీర్పూర్, ఓఖ్లాలాంటి వాడల మీద బుల్డోజర్ను నడిపించారు. ఈ వాడలను న్యాయవ్యవస్థ కూడా పట్టించుకోవడం లేదు.
2024 డిసెంబర్ 18న ఢిల్లీ బీజేపీ నేత కుసుమ ఖత్రీ, నరేంద్ర ఖత్రీ జైహింద్ క్యాంపు మురికివాడను సందర్శించారు. “ఇక్కడ ఎక్కువ శాతం రోహింగ్యాలు నివసిస్తున్నారని నాకు తెలిసింది. నేను ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని సందర్శించానో అది నిజమని తేలింది. ఇక్కడ 15 వేల రోహింగ్యాలు ఉన్నారు” అని కుసుమ ఖత్రీ అన్నారు.
డిసెంబర్ 2023లో లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు “బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల”ను గుర్తించి చర్యల తీసుకున్నారు. అందులో జైహింద్లో కూడా కొందరిని గుర్తించారు. అయినప్పటికీ “ది ప్రింట్” ప్రకారం, “గత 6- 7 నెలలో కేవలం వసంత్ కుంజ్ ప్రాంతాల నుంచి 39 ఆధారపత్రాలులేని వలసదారులను మేము వెనక్కి పంపామ”ని ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. 39 మందిలో ఎవరు కూడా జైహింద్ క్యాంప్వాసులు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
జైహింద్ క్యాంపులో అనేక సార్లు వెరిఫికేషన్ చేసినట్టుగా అధికారి తెలియజేశారు. కానీ అక్కడ ఎవరిని కూడా “అక్రమ వలసదారు”గా గుర్తించలేదు. జైహింద్ క్యాంప్‌లో ఉండే మహిళ ఫాతిమా బీబీ కూడా ఈ మాటలకు బలాన్ని చేకూర్చారు. “ఢిల్లీ పోలీసులు మా ఊరికి కూడా వెళ్లారు. అక్కడ ఊరిపెద్దను కలిసి వెరిఫికేషన్ చేశారు. జైహింద్ క్యాంప్‌లో ఏ బంగ్లాదేశీ కూడా ఉండరు. కానీ మీడియాలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, చూపిస్తున్నారు” అని ఆ మహిళ పేర్కొన్నారు.
2025 జూలై 8న బస్తీలో విద్యుత్‌ను నిలిపివేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బస్తీలో విద్యుత్ పునరుద్ధరించబడలేదు. ‘సంగ్రామ్ గృహ కార్మికుల సంఘం’ సభ్యులు కోర్టు నుంచి 160 ఇళ్ల కోసం స్టే తెచ్చింది. బస్తీవాసులకు విద్యుత్ పునరుద్ధరణ కోసం వారు ప్రయత్నిస్తున్నారు.
“‘ఎక్కడైతే మురికివాడ ఉందో అక్కడే ఇళ్లు’ అని ప్రభుత్వం అంటోంది. కానీ ఇప్పుడు మా వాడను కూల్చాలని కోరుకుంటుంది” అని బస్తీవాసులు తెలియజేశారు. ఇంకా మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో శుభ్రమైన నీరు, పక్కా రోడ్లలాంటి సౌకర్యాలను కల్పిస్తామని హామీలను ఇస్తారు. కానీ ఇప్పుడు బురదనిండిన ప్రాంతం నుంచి కూడా మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారు. ఎవరైతే ఓటు అడగడానికి వచ్చారో, వాళ్లు ప్రస్తుతం మమ్మల్ని గుర్తించను కూడా గుర్తించరు”అని వాపోయారు. తమకు వచ్చే తక్కువ జీతంతో అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలను చెల్లించలేమని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ బస్తీని కూల్చివేస్తే, ఉండడానికి తమకు ఎక్కడ చోటు కల్పిస్తుందని బాధితులు ప్రశ్నించారు.
పునరావాసానికి పూర్తి హక్కుదారులు బస్తీవాసులు..
గమించాల్సిదేంటే, ఢిల్లీ ప్రభుత్వ పునరావాస చట్టం– 2015 ప్రకారం జైహింద్ క్యాంప్ నివాసులకు పునరావాసాన్ని పొందే హక్కు ఉంది. ఈ బస్తీ 2006 ముందు నుంచే ఉంది. అంతేకాకుండా, ఇక్కడ ఉండే వారి వద్ద 2015 కంటే ముందు జారీ చేయపడిన ధృవపత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ బస్తీ వాళ్లు ప్రైవేటు భూమి మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడ నుంచి పంపేయాలనుకుంటే, ఈ బస్తీవాసులకు “ఇన్- సిటూ’‘ చట్టం ప్రకారం పునరావాసం లభించాలి.
“ఇన్- సిటూ” చట్టం ప్రకారం ఎక్కడైతే వాడ ఉందో, అక్కడే దాని అభివృద్ధి జరగాలి. ఒకవేళ ఆ స్థలం ప్రభుత్వానికి అవసరమైతే, మూడు కిలోమీటర్ల లోపు ఆ బస్తీ పునరావాస కార్యక్రమాలు చేయాలి. ఎప్పటివరకైతే పునరావాసం జరగదో, అప్పటి వరకు వారికి విద్యుత్ సౌకర్యంతోపాటు మంచినీరులాంటి నిత్యవసర సౌకర్యాలు లభించాలి.
డీయూఎస్ఐబీ జాబితాలో జైహింద్ క్యాంప్ డీడీఏ భూమి మీద చూపించడం జరిగింది. అయితే, ప్రస్తుతం దీనిని ప్రైవేట్ భూమిగా ప్రభుత్వం పరిగణిస్తుంది. డుసిబ్ జాబితాలో బస్తీ యజమానులందరి హక్కుల ప్రస్థావన ఉంది. 675 బస్తీలలో నుంచి ఒక బస్తీ ప్రైవేటు భూమి మీద ఉందనే ప్రస్థావన ఏదైతే ఉందో అది పటేల్ చెస్ట్, డాకా ఊరికి సమీపంలో ఉంది. అక్కడ 7,811 చదరపు మీటర్లలో 236 వాడలు ఉన్నాయి.
డూసిబీ తాజా జాబితా ప్రకారం, 675 వాడలలో నుంచి 4 వాడలు జనతా జీవన్ క్యాంప్, ప్లాట్ నం. బీ-22/2 & 22/3, ఓఖ్లా ఇండస్ట్రీయల్ ఏరియా, పటేల్ చెస్ట్, డాకా గావ్ సమీపంలో, డీబీ గుప్తా రోడ్, కరోల్ బాఘ్ ఇంకా ఖూబీరామ్ పార్క్, ప్రేమ్ నగర్ ప్రైవేటు భూమిలో ఉన్నాయి. ఇక్కడ కూడా జైహింద్ క్యాంప్‌ను ప్రైవేట్ భూమి మీద ఏర్పడినట్టుగా చూపించబడలేదు. అయితే, కోర్టులో ఏ ప్రామాణిక ఆధారంగా ఈ భూమి మసూద్‌పూర్ ఊరికి చెందిన వారిదిగా చూపించబడింది?
కానీ, ప్రభుత్వం మళ్లీ ఈ బస్తీని కూల్చడంలో తలమునకలైంది. ఇదేం కొత్త కాదు. ఈ బస్తీ 2002, 2006 ఇంకా 2014లో దగ్ధమైందని, దీనిని మళ్లీమళ్లీ పునరుద్ధరించుకున్నామని బస్తీవాసులు తెలియజేశారు.
ఈసారి ఇది ఏ విధంగా తన అస్థిత్వాన్ని కోల్పోతుంది, ఎలా రూపాంతరీకరణం చెందుతుంది?
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
(వ్యాస రచయిత సునీల్ కుమార్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయన సామాజిక కార్యకర్త కూడా.)