
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యక్తిగత డిజిటల్ డేటా సంరక్షణ చట్టం, దానికి అనుగుణంగా రూపొందించిన నిబంధనల ప్రభావం గురించి చర్చించేందుకు సామాజిక ఉద్యమకారులు, ప్రచారకులు, మాజీ న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, మీడియా సంస్థలు, జర్నలిస్టులతో కూడిన బృందం రోజంతా సమావేశం అయ్యింది.
ఈ సమావేశాన్ని సమాచార హక్కు చట్ట సవరణలను వెనక్కు తీసుకోవాలని ఉద్యమం నిర్వహిస్తున్న బృందం, క్యాంపెయిన్ ఫర్ జ్యూడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్లను ఏర్పాటు చేశారు. ఇందులో, సమాచార హక్కు చట్టం కోసం పని చేస్తున్న బృందంలో దాదాపు 30 పౌర సమాజ సంస్థలు పని చేస్తున్నాయి.
వ్యక్తిగత డిజిటల్ డేటా సంరక్షణ చట్టం కింద రూపొందించిన నిబంధనలు ఈ సంవత్సరం జనవరిలో విడుదల అయ్యాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే పత్రికా స్వాతంత్య్రం మాత్రమే కాక ప్రజల సమాచారాన్ని తెలుసుకునే హక్కు కూడా ప్రమాదంలో పడుతుందని, చట్టం పేరుతో కేంద్ర ప్రభుత్వానికి విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని చర్చలో పాల్గొన్న పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ రాష్ట్ర సమితి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడతూ, గత వారం పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ ముసాయిదా నిబంధనలపై ఇప్పటి వరకూ పౌర సమాజం, వివిధ కంపెనీలు, ఇతర భాగస్వాముల నుంచి 6915 సవరణలు, సూచనలు వచ్చాయని వెల్లడించినట్లు తెలిపారు.
ఈ సమావేశం ముగింపులో జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఈ చట్టం కింద ఏ విధమైన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, వ్యాఖ్యానించే సామాజిక క్రియాశీల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పౌర సమాజం, మీడియా, జర్నలిస్టులు ఇతర సంస్థలు అన్నీ డేటా చోరీకి పాల్పడుతున్న వారిగా పరిగణించబడతారని హెచ్చరించింది.
‘‘ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు కట్టబెడుతున్నారు. ఈ చట్టం ద్వారా ఏర్పాటయ్యే డేటా ప్రొటెక్షన్ బోర్డు డేటా చోరీకి పాల్పడ్డారని భావించిన వారిపై 250 కోట్ల రూపాయల వరకూ జరిమానా కూడా విధించే అధికారాలు ఉంటాయి.(అవసరం అని భావిస్తే ఈ జరిమానాను 500 కోట్లకు కూడా పెంచవచ్చు). అంటే ఈ చట్టం ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ డిమాండ్ చేసే ఉద్యమాలు, కార్యకర్తలు, పౌరసమాజం, మీడియా మాధ్యమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పదునైన ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది’’ అని పత్రికా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ రేఖా శర్మ, సీనియర్ న్యాయవాదులు సియు సింగ్, ప్రశాంత భూషన్, ప్రశాంతో సేన్, హజెఫా అహ్మది, త్రిదిప్ పైస్, నిత్యా రామకృష్ణన్, నిజాం పాషా, సరీం నవేద్, రిత్విక్ దత్తా, గౌతం భాటియా, అపార్ గుప్త, సురూర్ మందర్, సౌతిక్ బెనర్జీ, చెరిల్ డిసౌజా, షారుఖ్ ఆలంలు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఈ చట్టం వలన పరిశోధనాత్మక జర్నలిజం ఏ విధంగా ప్రభావితం అవుతుందో వివరించారు. ఈ చర్చలో సీపీఎం ఎంపీ శివదాసన్, సీపీఐ ఎంఎల్ ఎంపీ రాజా రాంసింగ్, బీఏస్పీ ఎంపీ రాజ్ కుమార్ రావత్‌లు కూడా పాల్గొన్నారు.
రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్, నేషనల్ క్యాంపెయిన్ ఫర్ దళిత్ హ్యుమన్ రైట్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్, రైట్ టు ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం పనితీరును పర్యవేక్షించే మేధో, పౌర సమాజ సంస్థల కార్యకలాపాలను ఈ చట్టం ఎలా ప్రభావితం చేయనున్నదో తమతమ అనుభవాల నేపథ్యంలో వివరించారు.
సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అజంలి భరద్వాజ్, నిఖిల్ డే, కామోడోర్ లోకేష్ బాత్ర, జయరాం, బాస్కర్ ప్రభు, ప్రవీర్ పీటర్, అమ్రిత జౌరిలు ఈ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టం ఎలా నిర్వీర్యం అవుతుందో వివరించారు. ఆర్థికవేత్త జయతి ఘోష్, పలువురు ఐఎఎస్ అధికారులు, మాజీ కేంద్ర సమాచార హక్కు కమిషనర్ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 43(3) ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చటానికి ప్రభుత్వం ఎలా పూనుకుందన్న అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ సెక్షన్ ద్వారా ప్రభుత్వం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)ని సవరించబూనుకున్నది. తాజా చట్టంలో వ్యక్తిగత సమాచారం అన్న శీర్షికన ఉన్న ఏ సమాచారాన్ని అయినా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వటానికి తిరస్కరించే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. అలా తిరస్కరించటానికి కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదని తాజా చట్టం చెప్తోంది.
వ్యక్తిగత సమాచారం సంరక్షణ ముసుగులో సాధారణ హక్కులను కూడా నీరుగార్చేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం ఓ ఆయుధంగా ప్రయోగించే అవకాశం ఉందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం మౌలికంగా మీడియా సంస్థల నిర్వహణ తీరుతెన్నులను మార్చేస్తుందని సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు.