
తెలుగు సినీ కార్మికులు చేసిన మెరుపు సమ్మెతో ఎవరికి ప్రయోజనం జరిగింది? కార్మికులకు న్యాయం చేకూరిందా? అనుకున్నదొకటి జరిగింది ఒక్కటి అనే నానుడి సినీ కార్మికలోకంలో వినిపిస్తోంది. తమకు ద్రోహం జరిగిందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. కార్మికులను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫెడరేషన్ నేతలు వాడుకున్నారనే విమర్శలు ఫిలిం నగర్లో ముఖ్యంగా చిత్రపురి కాలనీలో వినిపిస్తున్నాయి.
ఒక్క రోజు ముందు రాత్రి మాట్లాడుకొని, మెరుపు సమ్మెకు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఈ సినీ కార్మికుల సమ్మె ప్రారంభం వెనుక పెద్ద కుట్ర కోణం కనిపిస్తోంది. ఇది ఫిలిం ఛాంబర్- ఫెడరేషన్ కలసి ఆడిన గొప్ప మెలోడ్రామా అని అంటున్నారు.
“18 రోజులు కొనసాగిన సమ్మెతో తమకు ఏం ప్రయోజనం జరగలేదు. పైగా, నెత్తిన పని భారం మాత్రం పెరిగింది” అని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పని భారం పెంచే చర్చల్లో స్వయంగా కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ పాత్ర కూడా ఉండటం విశేషం.
రాజ్యాంగం ప్రకారం, ఏ రంగంలో అయినా కార్మికులు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు సినీ కార్మికులపై దాదాపు 15 గంటల పని భారం పడింది. అదీ ఈ 18 రోజుల సమ్మె వల్ల కావడం విశేషం.
రసవత్తరంగా సాగిన మెలోడ్రామా..
సమ్మె వల్ల వేతనాలు పెంచిన తీరు కూడా ఆమోదయోగ్యంగా లేదు. పెద్ద నిర్మాతలకే కలసి వచ్చినట్లు కనిపిస్తోంది. కార్మికులు ఉదయం ఆరు గంటలకే ప్రొడక్షన్ కేటాయించిన వాహనాల దగ్గరకు చేరుకుంటారు. అలా వెళ్తే కానీ సెట్ ప్రాపర్టీస్, మేకప్, భోజనాలు, లైటింగ్ సెటప్ సెట్ కాదు. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్ ప్రారంభం కావాలంటే ఈ తిప్పలు తప్పవు. అవుట్ డోర్ అయితే, ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయాలి.
ఇండోర్ స్టూడియోల్లో షూటింగ్ అయితే, ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. అలా డైలీ కాల్ షీట్ ఫిక్స్ చేశారు. ఇలా చూసుకున్నా మూడు గంటల ముందు, ఆ తరువాత లైట్స్ వేడి తగ్గేంత వరకు మరో రెండు గంటలు పని తప్పని పరిస్థితిగా ఉంది.
అసలు ఈ సమ్మె వల్ల 32 షూటింగులు వేరే రాష్ట్రాలకు మళ్లాయి. ఇదే ఇంకా కొనసాగితే, అసలుకే మోసం ఎదురవుతుంది. ఇప్పుడు ఆమోదించిన డిమాండ్స్ అన్నీ తొలి విడత చర్చల్లోనే అటు ఇటుగా అంగీకరించినవే. ఇన్నాళ్లు సమ్మెను సాగించినందుకు అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కనీసం ఇండస్ట్రీ నుంచి కార్మికులకు రావాల్సిన 14 కోట్ల బకాయిలు కూడా రాబట్టుకోలేకపోయారు.
పెద్ద మనిషి అనుకున్న మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా పుసిక్కిన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేశారు. అటు ఇస్తే సరిపోదు, ఇంకో కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వక తప్పదు. ఈ రెండు కోట్లను కార్మికులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల వంతున పంచి ఉండి ఉంటే, మెగాస్టార్ మైలేజ్ ఎక్కడో ఆకాశంలో ఉండేది.
సమ్మె వెనుక అసలైన కుట్ర కోణం..
ఫెడరేషన్ నేతలు అటు చిత్రపురి కాలనీ సొసైటీకి కూడా నాయకులే. చిత్రపురి లేఅవుట్లో అక్రమ దందాలు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్న వారే. ఇప్పటికే ఈ అవినీతికి సంబంధించి ఎన్నో కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం కూడా మరో కేసు నమోదైంది.
అటు ఫిలిం ఛాంబర్లోనూ సినిమాలు తీయని నిర్మాతలు వివిధ హోదాల్లో తిష్ట వేశారు. ఫెడరేషన్‌కు, ఛాంబర్‌కు ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా వాయిదాకు అంగీకరించే పరిస్థితి లేదని గ్రహించి ఇరు పక్షాల నేతలు ఒక అక్రమ ఒప్పందానికి వచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్నికలు వాయిదా వేయవచ్చనే నిబంధనను ఉపయోగించి కార్మికులను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమ్మె ముగింపు చూసినా అట్లాగే అనిపిస్తోంది. వేతనాలు పెంచిన తీరు కూడా ఇలాగే ఉది. కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక కూడా వూడిపోయిందనే సామెత ఈ పరిస్థితికి చక్కగా సరిపోతుంది.
సమ్మె విరమించడం వెనుక బలమైన చర్చలు ఏమీ జరగలేదు. “నేను తేలుస్తా” అన్న చిరంజీవి మాటలు విని ఏమీ విరమించలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకూ ఏం లొంగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకే భయపడినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి బెదిరింపుతో చక్రం తిప్పిన దిల్ రాజు..
జాతీయ స్థాయి పురస్కారాలు గెలుచుకున్న కొందరు సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసినప్పుడు కార్మికుల సమ్మె చర్చలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే సామరస్యంగా సమ్మెకు పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ అన్నారు. దీంతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చక్రం తిప్పారు. ఇటు నిర్మాతలతో ఫెడరేషన్ నేతలతో మాట్లాడి సమ్మెకు శుభం కార్డు వేశారు.
సమ్మెలో భాగంగా, అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో బహిరంగ సభ నిర్వహించిన ఫెడరేషన్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని నినాదాలు చేశారు.
సమ్మె కొనసాగుతున్నప్పుడు పాలాభిషేకం ఎందుకు చేశారని నేను కొందరు కార్మికులతో, మరి కొందరు దర్శక నిర్మాతల మిత్రులతో మాట్లాడాను. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సంపాదన కోసం తమ ఓట్ల బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారని కొందరు చెప్పారు. అసలెందుకు పాలాభిషేకం నిర్వహించారో తెలియదని కొందరు కార్మికులు చెప్పారు.
ఫెడరేషన్ నేతలు కేసుల నుంచి బయటపడేందుకు కార్మికులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, అసలు సమ్మెతో తాము నష్టపోయామని కొందరు కార్మికులు వాపోయారు. సమ్మె వెనుక కూడా మహా రాజకీయమే కనిపిస్తోంది. మొత్తానికి కొండను తవ్వారు, చిట్టెలుకను పట్టారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.