
ఈ దేశంలో ఎవరైనా ఎప్పుడైనా రాష్ట్రపతి లేదా గవర్నర్లను గ్రహాంతరవాసులుగా లేదా విదేశీయులుగా చూశారా? ఆ పదవిలో ఉన్నవాళ్లు మొదటి నుంచి భారతీయులే కదా? మరి వారిని ఎవరూ వేరుగా చూస్తున్నారని? రాష్ట్రపతి- గవర్నర్ల విషయంలో అనవసరమైన విచిత్రమైన అనుమానం కేంద్రానికి ఎందుకు వచ్చింది?
ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ వాదనలను వినిపిస్తూ, రాష్ట్రపతిని- గవర్నర్లను గ్రహాంతరవాసులుగా, విదేశీయులుగా చూడొద్దని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం విన్నవించుకున్న ఈ సూచనను విన్న ఎవరికైనా వింతగా విచిత్రంగా అనిపించొచ్చు.
వాదోపవాదాలు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న క్రమంలో, రాష్ట్రపతి- గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు విధించలేవని కేంద్రం పేర్కొన్నది. అంతేకాకుండా, అసలు ఈ విషయంపై న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని కూడా తేల్చి చెప్పింది.
గవర్నర్ల దగ్గర పేరుకుపోతున్న బిల్లులు..
తమిళనాడు గవర్నర్తో మొదలైన బిల్లుల ఆమోద సమస్య, ఆ తర్వాత కేరళకు కూడా పాచితీగలా పాకింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ విషయంలో గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో భాగస్వామ్యమైంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద పని చేస్తున్న రాష్ట్రపతి- గవర్నర్లు ఈ బిల్లులను ఖచ్చితంగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అలా కాకుండా తమ వద్దనే పెండింగ్లో పెట్టుకోవడాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిట్ పిటీషన్ల ద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటీషన్లపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు, బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి- గవర్నర్లకు మూడు నెలల కాలవ్యవధి విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఈ నేపథ్యంలో తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. అసలు రాష్ట్రపతి- గవర్నర్లకు బిల్లుల విషయంలో కాలవ్యవధి విధించవచ్చా? అన్న దానిపై సుప్రీంకోర్టును వివరణ కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి గవాయి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఏర్పడిన డివిజన్ బెంచ్ విచారిస్తుంది.
“రాష్ట్రపతి– గవర్నర్లకు గడువులు విధించడం, లేదా ఆదేశాలు ఇవ్వడానికి న్యాయస్థానానికి అధికారం లేదు. పైగా అసలు ఈ విషయంలో న్యాయస్థానం జోక్యమే అవసరం లేదు. ఇవి రాజకీయపరమైన అంశాలు, వాటిని రాజకీయంగానే పరిష్కరించుకోవచ్చ”ని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది.
రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతోన్న వాదనలు..
రాష్ట్రపతి వివరణ కోరడంతో, ఈ అంశంపై కోర్టులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వాదనలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాదనలు వింటుంటే, రాష్ట్రపతి- గవర్నర్లు రాజ్యాంగానికి అతితులానే అనుమానం కలుగుతోంది.
ఈ పది సంవత్సరాలలో ప్రతిపక్షానికి చెందిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడమనేది ఆనవాయితీగా మారింది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ– పార్టీ చీలికలో గవర్నర్ వ్యవహరించిన తీరును ఉదాహరణగా తీసుకోవచ్చు.
ప్రజలకు సంబంధించిన, రాష్ట్రపతి సమ్మతి అవసరమని భావించే అంశాల విషయంలో గవర్నర్ విచక్షణాధికారంతో వ్యవహరించవచ్చు. గవర్నర్కు ఈ అధికారాలను ఆర్టికల్ 200 కల్పించిందని సుప్రీంకోర్టు వివరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండలేరని, వాటిని నెల రోజులలోపు తిప్పి పంపించి, మళ్లీ శాసనసభ ఆమోదం పొందేలా మాత్రమే గవర్నర్లు నిర్ణయం తీసుకోగలరని సుప్రీంకోర్టు తెలియజేసింది.
శాసన సభ రెండో సారి బిల్లును ఆమోదించి పంపించిన తర్వాత, ఆ బిల్లును తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. లేదా ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్లు ఆ బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చని పేర్కొన్నది.
గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని పేర్కొంటూ ఆయా ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్లు దాఖలు చేశాయి. దీంతో, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం అనివార్యమవుతోంది. ఈ సంవత్సర ఏప్రిల్లో రాష్ట్రపతి– గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కాలవ్యవధిని నిర్ణయిస్తూ, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.
ఈ తీర్పుతో అసలు రాష్ట్రపతికి గవర్నర్కు కాల వ్యవధిని నిర్ణయించవచ్చానే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. సుప్రీంకోర్టులో కూడా ఈ మొత్తం వ్యవహారంపై వాదనాలు- విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆర్టికల్–143 కింద ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరారు.
వాస్తవానికి తమిళనాడు గవర్నర్ బిల్లులను తమ వద్ద ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం వల్ల ఏర్పడిన విపరీతమైన పరిస్థితుల కారణంగా తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టు తెలియజేసింది.
“గవర్నర్లు ఏళ్లతరబడి తమ వద్ద బిల్లులను అలానే ఉంచుకుంటే, “అధికారం లేనట్టు”గా చూస్తూ కూర్చోవాలా”ని ప్రధానన్యామూర్తి బీఆర్ గవాయి ఘాటుగా ప్రశ్నించారు.
ఇలాంటి విషయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర వాదనపై గవాయి స్పందిస్తూ, “ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్లు చేసే సిఫారుసులను న్యాయస్థానాలు సమీక్షించొచ్చు. మరి అదే గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారం పని చేయకపోతే, న్యాయస్థానాలు ఎందుకు స్పందించకూడద”ని అడిగారు.
ఆర్టికల్ 200- 201 ప్రకారం, రాష్ట్రాలకు పంపే బిల్లుల ఆమోదంపై గడువు విధించలేరని, అందుకే వారికి గడువు విధించరాదని సుప్రీంకోర్టుకు కేంద్రం నొక్కిచెప్తోంది.
రాష్ర్టపతికి- గవర్నర్లకు బిల్లుల విషయంలో గడువు విధించడంపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ సమస్యలను రాజకీయంగా పరిష్కరించాల్సి ఉంటుందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కేంద్రానికి అన్ని అనుకూల పరిస్థితులు– ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న కారణంగా తాము నియమించిన గవర్నర్లను– రాష్ట్రపతిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరాదని, వారు గ్రహాంతరవాసులు కాదని, విదేశీయులు అంతకంటే కాదని కేంద్రప్రభుత్వం వింతగా విచిత్రంగా వాదిస్తూ వస్తోంది.