
పర్యావరణ సంక్షోభంలో ప్రపంచం
మంచుకొండలు కూడా కాలిపోతున్నాయి
నగరాలు నదులను తలపిస్తున్నాయి
భవనాలు కాగితపు పడవలౌతున్నాయి
వంతెనలు కూలిపోతున్నాయి
పర్వతాలు రంగులు పులుముకుంటున్నాయి
ముసురు కమ్ముకున్నట్లు యుద్ధాలు కమ్ముకొస్తున్నాయి
యుద్ధం మూలాల్లో అంతరార్థాలు వేరు
ఓటు రాజ్యాంగం యిచ్చిన హక్కు
అకాల తుఫానులా అది వరస తప్పింది
మాటల్లో తూటాలు మనసుల్లో మార్మికత
ఒక చేత్తో ఒక జెండా
మరొక చేత్తో మరొక నినాదం
విజేతలు పతాక శీర్షికల్లో
అనాథలు అగాధ కుహరాల్లో
నిజం కోసం వేట
అసత్య పతంగాల జోరు
రేపటిని ధ్వంసం చేసే ఈ రోజు
వ్యక్తులు తమ నిర్మాణపు గోడలు కూల్చుకుంటున్నారు
కదలిక భౌతికమైనంత మాత్రాన
ప్రపంచం భౌతికంగా నడవదు
ప్రపంచ చలనానికి
అంతః సూత్రం ఎక్కడో తెగింది
అందరూ జాతీయ వాదులే? నిజమే!
విద్య జాతీయంగా అంతర్జాతీయంగా
అక్షర విన్యాసం చేస్తుంది
శాస్త్రీయతను, వివేచనను కోల్పోతుంది!
విద్యకు దిక్సూచిగా
మార్కెట్ మనిషిని
మాయాజాలంలోకి తీసుకు వెళ్తుందా!
కృత్రిమమా! ప్రాకృతికమా!
విద్యంటే జ్ఞాన సముపార్జనకు వాహిక
విద్యాస్థాయిని కూల్చి
బ్రతుకు దెరువు చిత్రాన్ని
ఆవిష్కరిస్తున్నారు
అవును!
బ్రతుకుదెరువు కూడా
ప్రాకృతిక సంక్షోభంతో ముడిపడింది కదా!
కృత్రిమాన్ని ఆహ్వానించే కొలది
మనిషి మేధస్సు నిర్లిప్తమౌతుంది
సృజన మృగ్యమౌతుంది
సామూహికత నుంచి
వైయక్తికం వైపు పరుగులు పెడుతున్నామా?
మనిషి తన్ను తాను తెలుసుకునేలోపే
కరిగిపోతున్నాడు
పబ్బుల్లో, క్లబ్బుల్లో కులుకులు
ఇంట్లో శునకాల గుంపులు
ప్రకృతి, వికృతి, మనిషి
సమ్మిశ్రిత యుద్దంలో వున్నాడు
శాంతి దూతలు ప్రపంచ పునర్జీవనానికి ఎలుగెత్తి చాటారు
మన దేశంలో పుట్టిన మహా బోధి ఫలాలను
ప్రపంచమంతా భిక్షువులు పంచుతన్నారు
ఒక్క బుద్ధుని మాట నేడు క్రాంతి మార్గంగా జ్వలిస్తుంది.
మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు
9849741695
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.