
Reading Time: 3 minutes
వెంటాడి వేధించి ఓ వ్యక్తిని దేశ ద్రోహి అని ముద్ర వేసినంత మాత్రాన ఆ ముద్ర వేసేవారంతా దేశభక్తులు కాలేరు.
నేను దేశం కోసం దేశ భద్రత కోసం సరిహద్దుల్లో నలభై ఏళ్ల పాటు కాపలా కాశాను. జైసల్మీర్ సెక్టార్లో 1971లో జరిగిన ఆపరేషన్ కాక్టల్ లిలీ యుద్ధంలో పాల్గొన్నాను. పంజాబ్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచాను. పోరాడాను.
ఏవేవో కారణాలతో దారితప్పి ఆయుధం చేతబట్టిన తోటి భారతీయులకు వ్యతిరేకంగా నిలబడటం, పోరాడటం, అవసరమైన ప్రాణాలు అర్పించటం సరిహద్దుల్లో శత్రుదేశంతో పోరాడటం కంటే ఎంత సంక్లిష్టమైన సవాలో నాలాగా జీవితాన్ని సైన్యంలో దేశ ప్రయోజనాల కోసం అంకితం చేసిన వారు ఎవరైనా అర్థం చేసుకోగలరు. సాంప్రదాయక యుద్ధం కంటే భిన్నమైనది ఈ పోరాటం. సాంప్రదాయక యుద్ధంలో శత్రువులు ఎవరో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఈ అంతర్గత సాయుధ ఘర్షణల్లో శత్రువులను, దేశ శత్రువులను గుర్తించటం అంత తేలికకాదు.
అనేక సందర్భాల్లో దేశానికి, సైన్యానికి నష్టదాయకమైన ధోరణల గురించి రాశాను, మాట్లాడాను. కఠిన వాస్తవాలు ప్రజల ముందుంచటం సైనికులుగా మా కర్తవ్యం. ఎందుకంటే కఠినమైన వాస్తవాల ఆధారంగానే సరైన గుణపాఠాలు తీసుకోగలం. సరైన వ్యూహాన్ని రూపొదించుకోగలం. భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవటం దేశభక్తి కాదని భావించేవారు కొందరున్నారు.
పాకిస్తాన్‌కు వెళ్లండి అనే నినాదం- దానికి నా సమాధానం..
గత కొంత కాలంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి అన్న విమర్శలు నేనూ ఎదుర్కొంటూ వచ్చాను. అటువంటి వాళ్లందరికీ ‘నేను ఆల్రెడీ పాకిస్తాన్ వెళ్లాను.(సింధ్ సెక్టార్‌కు) అక్కడ (డిసెంబరు 1971 నాటి లోంగ్‌వాల్ యుద్ధం తర్వాత) ఆర్నెల్లు ఉండి వచ్చాను. అది కూడా పాస్ పోర్టు, వీసా లేకుండానే వెళ్లి వచ్చాను’ అని సమాధానం చెప్పేవాడిని.
నాతో పాటు సైన్యంలో చేరిన వారూ, నాతో పాటు జాతీయ రక్షణ అకాడమీలో శిక్షణ పొందిన వాళ్లూ తరచూ అడిగేవారు. ‘మేమంతా ఉద్యోగంలో చేరిన చోటనే ఉండిపోయాము. మీరెలా అంచెలంచెలుగా ఎదిగారు’ అని. ఏవో కొన్ని అసాధారణ పరిస్థితులు, కారణాలు దీనికి దారి తీశాయేమో అన్నది వారి అభిప్రాయం. అవన్నీ ఇక్కడ ప్రస్తావించటం అంటే పాఠకులను ఇబ్బంది పెట్టడమే.
వారు అడిగిన ప్రశ్నలకు తలూపటం కంటే వాస్తవాలు వివరించటం మంచిది. ఎవరేమనుకున్నా నేను నా దేశం కోసం అంకిత భావంతో అకుంఠిత దీక్షతో పని చేశాను. నా కృషికి, త్యాగానికి తగ్గ ఫలితాన్ని పొందాను అని భావిస్తున్నాను. సైన్యం నా సేవలను సరిగ్గానే గుర్తించిందని సంతోషిస్తున్నాను. నా దేశం పట్ల నాకున్న అంకిత భావాన్ని నా నుదుటన రాసుకుని తిరగాల్సిన పరిస్థితి నాకెప్పుడూ కలగలేదు.
నా రెజిమెంట్ నా నాయకత్వంలో ఉన్నప్పుడే అత్యంత సమర్ధవంతంగా పని చేసిందన్న గుర్తింపు సైన్యంలో ఉంది. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. నేటికీ నా దళమే నా కుటుంబం. వారందరితోనూ సజీవ సంబంధాలు ఉన్నాయి. నా కొడుకు కూడా అదే రెజిమెంట్‌లో సేవలందించారు. నా కుటుంబమంతా సైనికులే. కేవలం ప్రతిభాపాటవాల ఆధారంగా నేను అనేక కోర్సులు నేర్చుకోవడానికీ, బోధించటానికి ఎంపిక చేయబడ్డాను.
సౌదీ అరేబియాలో భారత విదేశాంగ రాయబార కార్యాలయానికి రక్షణ శాఖ తరఫున బాధ్యుడిగా పని చేసే అవకాశం కలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరబ్బులను భారత దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మల్చటానికి శ్రమించాము. ఆ ప్రయత్నం సత్ఫలితాలనిచ్చిందని నమ్ముతున్నాను. మిగిలిన గల్ఫ్ దేశాల్లో జరుగుతోన్న మార్పులు కూడా నా అభిప్రాయాన్ని, అంచనానూ నిరూపిస్తున్నాయి. నా పదవీకాలం చివరి సంవత్సరాల్లో అన్ని రెజిమెంట్లు కలిసి ఉమ్మడిగా నన్ను కల్నల్ కమాండెండ్ గౌరవంతో సత్కరించాయి. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను.
ఈ మధ్యనే నా సోదరుడు నసీరుద్దీన్‌షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ‘నేను కోల్పోయిన దేశం’ అన్న శీర్షికతో ఓ వ్యాసం రాశారు. ‘నసీరుద్దీన్ షా అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అద్భుతమైన విశ్లేషణ’ అన్న వ్యాఖ్యానాన్ని జోడించి నా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాను.
తన భావాలు వ్యక్తీకరించే క్రమంలో ఎవరినీ నొప్పించకుండా వ్యక్తీకరించటానికి ప్రయత్నం చేయాలని నసీరుద్దీన్‌కు ఎల్లప్పుడూ చెప్పేవాడిని. మేము పుట్టింది సాంప్రదాయక కుటుంబంలోనే అయినా అదృష్టవశాత్తూ ఛాందసత్వం వంటబట్టలేదు. అటువంటి ఉన్నతాశయాలే నాకు జాతీయ రక్షణ అకాడమిలో కనిపించాయి. పదిహేనేళ్ల యువకుడిగా ఆ అకాడమిలో చేరాను. ఎనిమిది నెలలు శిక్షణ పొందాను. ఆ తర్వాత జీవింతాంతం నేను పని చేసిన సైన్యంలో కూడా అదే విలువలు నిండుగా ఉన్నాయి. ప్రాథమిక దశలో మనకు శిక్షణ ఇచ్చేటప్పుడు మనకు నేర్పిన మనం నేర్చుకున్న కొన్ని విలువలను కొంతమంది అధికారులు తర్వాతి కాలంలో మర్చిపోయి ఉండొచ్చు. అలా మర్చిపోయిన వారంతా వాట్సప్ యూనివర్శిటీ అందించే విలువలనే అందిపుచ్చుకుంటున్నారు.
నేను ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యాసం గురించి ఎంతో మంది మెచ్చుకోలు వ్యాఖ్యలు రాశారు. సహజంగానే కొన్ని ఊహించిన కోణాల్లో విద్వేషపు స్పందనలు కూడా వచ్చి చేరాయి. కుప్పలు తెప్పలుగా. పీజీ వుడ్‌హౌస్ అనే రచయిత ‘కొంతమంది ఆలోచనలు వీధి మూలన ఉంటే రెష్టారెంట్లలో రుచి పచి లేని సూప్‌లాగా ఉంటాయి. దాన్ని ఎంతసేపు పొయ్యి మీద పెట్టి గంటె తిప్పినా రుచి మారదు. దానికోసం సమయం వెచ్చించటం వృధా’ అని సూచిస్తాడు. ఆ రచయిత సూచనను పాటించి ఇటువంటి వారితో వాదించి మెప్పించే ప్రయత్నానికి పూనుకోదల్చుకోలేదు.
సంకుచిత ధోరణులు, నిలువెల్లా విద్వేషం నింపుకున్న వారిదే కాలం..
నా పోస్టు మీద ఎన్ని విద్వేషపు వ్యాఖ్యలు వచ్చినా నన్ను, నా వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేయలేవు. ఒకరిద్దరు ఎక్స్ ఖాతాదారులు నన్ను జిహాది జనరల్ అని వ్యాఖ్యానించినప్పుడు వారి ఖాతాలను బ్లాక్ చేశాను. మిగిలిన వారికీ అదే స్పందన నాది.
నాకున్న నమ్మకంలోనే నా బలం దాగి ఉంది. ఈ దేశపు ఉప్పు తిన్నాను కాబట్టి ఈ దేశానికి తుదిశ్వాస వరకూ కట్టుబడి ఉండాలన్నది నా నమ్మకం, విశ్వాసం. నా మతపరమైన విశ్వాసానికి, దేశం పట్ల నాకున్న నిబద్ధతకూ మధ్య వైరుధ్యమూ లేదు. ఘర్షణ అంతకన్నా లేదు. నిజానికి ఈ రెండు నిబద్ధతలూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి.
దురదృష్టవశాత్తూ సంకుచిత ఆలోచనలు కలిగిన కొందరు, విద్వేషం నిలువెల్లా నింపుకున్న వాళ్లూ నిస్పాక్షికమైన మేధావులు, విశ్లేషకులుగా టీవీల ముందు కూర్చుని అరుస్తుంటారు. మిగిలిన వాళ్లు తమ పనేదో తాము చేసుకుని పోతుంటారు. మరికొందరు నిరంతరం భయాందోళనల నడుమ బతుకులు వెళ్లదీస్తూ ఉంటారు. నేను ఈ చివరి రెండు కోవలకు చెందిన వాడినైతే కానేకాదు. అందుకే ఈ ఆవేదన.
లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దిన్ షా భారత సైన్యంలో సేవలందించి పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారి. పదవీ విరమణకు ముందు ఆయన భారత సైన్యంలో డిప్యూటి ఛీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ స్టాఫ్(పర్సనల్ అండ్ సిస్టమ్స్) హోదాలో పని చేశారు. అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా కూడా పని చేశారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.