
గుజరాత్‌లోని వడోదరలో మహిసాగర్ నదిపై ఉన్న పొడవాటి వంతెన బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో చాలా వాహనాలు నదిలో పడిపోయాయి, పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానిక ప్రజలు అన్నారు.
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని వడోదరలో మహిసాగర్ నదిపై ఉన్న పొడవాటి వంతెన కూలిపోయింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. చనిపోయినవారిలో ఒక చిన్నారి కూడా ఉంది.
దైనిక్ భాస్కర్ రిపోర్ట్ ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ఎనిమిది మందిని రక్షించారు. అయితే, ప్రమాద సమయంలో వాహనాలు వంతెన మీదుగా వెళ్లాయి. పలు కథనాల ప్రకారం, ఈ వంతెన 40 సంవత్సరాల పాతది. అంతేకాకుండా మధ్య గుజరాత్‌ను సౌరాష్ట్రను ఈ వంతెన కలుపుతోంది.
ఈ సంఘటన ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి.
వార్తాపత్రిక ప్రకారం, ప్రభుత్వ నిరక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమాదానికి పాలకులను బాధ్యులు చేశారు.
“45 ఏళ్ల నాటి ఈ వంతెన మరమ్మత్తు చేయాలని అధికారులకు చాలాసార్లు సమాచారం అందించాం. కానీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం ఈరోజు చోటుచేసుకుంది” అని స్థానిక ప్రజలు వార్తాపత్రికకు తెలియజేశారు.
హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభించామని చెప్పారు. స్థానిక డైవర్లు, పడవలు, మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వడోదర మున్సిపల్ కార్పొరేషన్, అత్యవసర ప్రతిస్పందన కేంద్రం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, పరిపాలన- పోలీసుల బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని ఆయన అన్నారు.
“రక్షణా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. 6 మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నార”ని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి సంతాపం..
గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలిన ఘటనపై బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను, గాయపడిన వారికి రూ 50,000 సహాయాన్ని ఆయన ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. “గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వంతెన కూలిపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” ప్రకటనలో చెప్పబడింది.
గమనించాల్సిందేంటే, ఇది రాష్ట్రంలో జరిగిన మొదటి వంతెన ప్రమాదం కాదు. మోర్బిలోని మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి కేబుల్ వంతెన 2022 అక్టోబర్ 30న కూలిపోయింది. ఆ ఘటనలో 47 మంది పిల్లలతో పాటు 135 మంది మరణించారు. అంతేకాకుండా, 56 మంది గాయపడ్డారు. ఒక ప్రైవేట్ కంపెనీ మరమ్మతులు చేసిన తర్వాత ఈ వంతెనను 2022 అక్టోబర్ 26న ప్రజల కోసం తిరిగి తెరిచారు. కానీ దానికి మునిసిపాలిటీ నుంచి “ఫిట్నెస్ సర్టిఫికేట్” దొరకలేదు.
వంతెన నిర్వహణ, పునరుద్ధరణ, నిర్వహణకు సంబంధించిన ఒప్పందం ఒరెవా గ్రూప్‌కు చెందిన అజంతా తయారీ సంస్థతో జరిగింది. తరువాత, ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టులో సమర్పించిన నివేదికలో తీవ్రమైన సాంకేతిక లోపాలు, ఒరెవా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఒరెవా కంపెనీ ఈ పనిని “అసమర్థ ఏజెన్సీ”కి అప్పగించింది. అంతేకాకుండా సాంకేతిక నిపుణులను సంప్రదించకుండానే పనులు జరిగాయి.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.