
”ఈ విశ్వం ఏర్పడి సుమారు 1380 కోట్ల సంవత్సరాలు అయ్యింది” అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దాదాపు 450 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడిన భూమిపై మనిషి ఆవిర్భవించి దాదాపు రెండు లక్షల ఏండ్లు అవుతుంది. ఆ మనిషి జంతు దశ నుంచి వ్యవసాయం ఆధారంగా బ్రతికే సమయం వచ్చే నాటికి కాల గమనాన్ని లెక్కించడం ప్రారంభమైంది. మొదట సూర్యగమనాన్ని పరిశీలించి నీడల ద్వారా కాలాన్ని కొలిచారు. నవీన శిలాయుగం నాటికి స్థిర నివాసాలు, సంచార జీవనం, రాత్రి- పగలు తెల్సుకోవడం, అడవులు నరికి వ్యవసాయం చేయడం, నీటి సౌకర్యం గల ప్రాంతాల్లో నివసించడం, ఇనుము కనుగొనడం, నాగరికత ఆరంభంగా చెప్పుకోవచ్చు.
సుమారు 10,000 సంవత్సరాల క్రితం నాటి స్కాట్లాండ్లోని అబెర్డీన్షైర్లోని వారెన్ ఫీల్డ్‌లో 12 గుంటల మిసోలిథిక్ అమరిక దొరికింది. ఇది సూక్ష్మ శిలాయుగం నాటి నిర్మాణంగా పరిశోధకులు నిర్ధారించారు. దీనిని చంద్రమాన క్యాలెండర్‌గా శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. పురాతన సుమేరియన్ క్యాలెండర్ ఒక సంవత్సరాన్ని 29 లేదా 30 రోజుల 12 చంద్రయాన నెలలుగా విభజించింది. ఈ క్యాలెండర్ ప్రతినెల అమావాస్యతో ప్రారంభమవుతుంది. అయితే, క్రీ.పూ రెండవ సహస్రాబ్ధి నుండి పర్షియన్లకు క్యాలెండర్ ఉంది. ఐరోపాలో 1582 సంవత్సరాల క్రితం జొలియస్ క్యాలెండర్ ఆరంభమైంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ”గ్రెగోరియన్ క్యాలెండర్”ని వాడుతున్నారు. క్రీ.పూ 2000 కాలంనాడు బాబిలోయిన్లు మార్చి 23న కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. క్రీ.శ 5వ శతాబ్దంలో ”వరహమిహిరుడు” వసంత విషువత్తు కదలికను బట్టి చైత్ర మాసాన్నిసంవత్సరాదిగా నిర్ధారించారు. కాలాన్ని గణించడానికి భారత్‌లో అనుసరించే గణిత శాస్త్రాల పద్ధతుల్లో చంద్రయానం, సౌరయానం ముఖ్యం. అయితే తమిళులు సౌరయానాన్ని, తెలుగు- కన్నడ ప్రజలు చంద్రయానాన్ని అనుసరిస్తారు.
యుగాదిని సంవత్సరారంభంగా భావిస్తూ తెలుగు ప్రజలు ఉగాది అన్నారు. ప్రకృతిలో మిళితమైన షడ్రుచుల పండుగే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమే ఉగాది పండుగ. పౌరాణికంగా శ్రీకృష్ణ అవతార పరిసమాప్తినే కలియుగారంభంగా భావిస్తారు. దీన్నే బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజుగా పౌరాణికులు చెప్పారు. విక్రమార్కుడు, శివాజీలు చైత్రశుద్ధ పాడ్యమినాడే పట్టాభిషిక్తులయ్యారు. చంద్రమానమైనా, సౌరమానమైన జీవకోటిని మత్తెక్కించే మధుమాసాన్ని వసంతోత్సవంగా జరుపుకోవడం ప్రకృతి సౌందర్యారాధనలో భాగం.
కాలమానం లిప్త, సెకను, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఆయానాలు, సంవత్సరాలు, యుగాలుగా ఉంది. క్రీ.పూ. 3101 కలియుగం ఆరంభమని ప్రాచీనులు అంటారు. హాలుని గాథాసప్తశతిలో తెలుగు పదాలు కనిపిస్తాయి. శాతవాహనుల, ఇక్ష్వాకుల నాణేలపై తెలుగు లిపి ఉంది. క్రీ.శ 7వ సంవత్సరం ప్రభవగా ఉంది. ‘ప్రభవ’ తొలి సంవత్సరం అయితే 60 సంవత్సరాలు 60 పేర్లతో ఉండి, మళ్లీ 61వ సంవత్సరం ప్రభవ వస్తుంది. మొత్తం తెలుగు సంవత్సరాలు 60. తెలుగు వారి సంప్రదాయంలో భాగంగా 60 సంవత్సరాలకు షష్టిపూర్తి వేడుకను చేసుకుంటారు. నమ్మకాలు, విశ్వాసాలు, అభిరుచులు అనేవి మతంతో ముడిపడి ఉంటాయి.
తెలుగు సంవత్సరాలు..
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాది, 14. విక్రమ, 15. వృష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్తు, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మధ, 30, దుర్ముఖి, 31.హేవిళంబి, 32. విళంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృతు, 37. శోభకృతు, 38. క్రోధి, 39. విశ్వావసు(2025-26), 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృతు, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్తి, 53. సిద్ధార్థ, 54. కౌద్రి, 55. దుర్మతి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్ష్యి, 59. క్షోధన, 60. అక్షయ
అయితే, 1987లో ప్రభవ వచ్చింది ఆ తర్వాత మళ్లీ 2047లో వస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంగాలతో కూడినదే ”పంచాంగం”. ఉగాది పచ్చడి(షడ్రుచులతో), పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు తెలుగు వారికి అనాదిగా వస్తున్న ఆనవాయితి.
పంచాంగంలోని రాశులు- 12..
1.మేషం,2.వృషభం,3.మిథునం,4.కర్కాటకం,5.సింహం,6.కన్య,7.తుల,8.వృశ్ఛికం,9.ధనస్సు,10.మకరం,11.కుంభం,12.మీనం.
27 నక్షత్రాలు..
1.అశ్వని, 2. భరణి, 3. కృత్తిక, 4. రోహిణి, 5. మృగశిర, 6. ఆరుద్ర, 7. పునర్వసు, 8. పుష్యమి, 9. ఆశ్లేష, 10. మఖ, 11. పుబ్బ, 12. ఉత్తర, 13. హస్త, 14. చిత్త, 15. స్వాతి, 16. విశాఖ, 17. అనురాధ, 18. జ్యేష్ఠ, 19. మూల, 20, పూర్వాషాడ, 21. ఉత్తరాషాడ, 22. శ్రవణం, 23. ధనిష్ట, 24. శతభిషం, 25. పూర్వాభద్ర, 26. ఉత్తరాభద్ర, 27. రేవతి.
వీటి ఆధారంగా మానవులు తమ జీవితంలో మంచి, చెడులు చూసుకుంటారు.
ఉగాది పండుగ సందర్భంగా కొత్త దుస్తులు ధరించడం, ఔషధ గుణాలున్న వేప పచ్చడి సేవించడం చేస్తారు. అంతేకాకుండా ఆలయాలను సందర్శిస్తారు. అయితే ఉగాది నాడు చేసే ఉగాది పచ్చడి ఎంతో ఆరోగ్యకరమైంది. కొబ్బరి, కొత్తబెల్లం, పచ్చిమిర్చి, చింతపండు, చెరుకు ముక్కలు, మిరియాలు, ఉప్పు, మామిడి పెందెలు, గసగసాలు, వేపపూత వేసి ”ఉగాది పచ్చడి”ని కొత్త కుండలో కలిపి చేసి సేవిస్తారు.
అయితే ఉగాది పచ్చడికి మరో అంతరార్ధం కూడా ఉంది. అదేంటంటే జీవితంలో ఎదురయ్యే సుఖ, సంతోష, దుఃఖాలు, బాధలు, కష్టాలకు ఈ పచ్చడి షడ్రుచుల(తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) సమ్మేళనంగా భావిస్తారు. పండుగనాడు ప్రతి తెలుగింట పచ్చడిని తయారు చేసి సేవిస్తారు.
సూర్య- చంద్రయానాలు..
ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. 12 రాశుల సూర్యుని గమనం బట్టి సౌరయానాన్ని పంచాంగ కర్తలు లెక్కిస్తారు. చంద్రుడు 12 రాశుల్లో 2 1/2 రోజులుంటాడు. నెలకు 30 రోజులు. చంద్రుని గమనంతో చంద్రయానాన్ని లెక్కిస్తారు.
చంద్రకళలు
అంతేకాకుండా 16 తిథుల పేర్లు ఉన్నాయి. వాటిని చంద్రకళలుగా పిలుస్తారు.అవి 1.పాడ్యమి,2.విదియ,3.తదియ,4.చవితి,5.పంచమి,6.షష్ఠి,7.సప్తమి,8.అష్టమి,9.నవమి,10.దశమి,11.ఏకాదశి,12.ద్వాదశి,13.త్రయోదశి,14.చతుర్దశి,15.పౌర్ణమి,16.అమావాస్య.
యూరప్ దేశాలు జనవరిని సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటారు. తెలుగువారు’ఉగాది’ పండుగను సంవత్సరాదిగా జరుపుకొంటారు. భారతదేశం వ్యవసాయ దేశం. పంటలు చేతి కొచ్చిన కాలంలో ఉగాది వస్తుంది. ఉగాదినాడు చేసే ఉగది పచ్చడిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
1. మామిడిలో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఏ కూడా లభిస్తుంది.
2. వేపపూతలో యాంటీబయోటిక్ లక్షణం ఉంది. వాతాన్ని హరిస్తుంది. చర్మరోగాన్ని కుష్టుని పోగొడుతుంది. కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.
3. కొత్త చింతపండులో విటమిన్ సి లభిస్తుంది.
4. చెరకులో రక్తశుద్ధిగుణం ఉంది.
5. బెల్లంలో కాలేయ సంబంధ వ్యాధుల్ని పొగెట్టే గుణం ఉంటుంది.
6. మామిడిలో పీచు పదార్థం ఉటుంది. ఇది ప్రేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.
నక్షత్రాలు- జీవనశైలి..
హిందూ సంప్రదాయం ప్రకారం మానవుని పుట్టుక నక్షత్రాల గమనం మీద ఆ వ్యక్తి జాతకం ఆధారపడి ఉంటుందని పంచాంగకర్తలు చెపుతారు. అంతేకాకుండా వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయాన్ని ఏరువాక నుంచి ప్రారంభిస్తారు. పంటలు ఏఏ కాలాలలో ఏవేవి వేయాలో పంచాంగం ద్వారా నిర్ధారించుకుంటారు. ఇది పూర్తి విశ్వాసం, నమ్మికతో కూడుకుని ఉంటుంది. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు అనే వాటిని 4 యుగాలుగా చెప్పుకుంటారు. ఈ కాలగణనలో కృతయుగానికి ఉగాది చైత్రశుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా సూర్య గమనాన్ని, చంద్రమానాన్ని బృహస్పతి గమనాన్ని, నక్షత్ర మానాన్ని బట్టి నిర్ణయిస్తారు.
ఆకాశంలోని నక్షత్రాలను 12 గుంపులుగా విభజించుకొని, ఆ గుంపుల ఆకారాలను బట్టి 12 రాశులుగా పేర్లు పెట్టారు. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాల చొప్పున అశ్విని నుంచి రేవతి దాకా గల 27 నక్షత్రాలు. ఇలా 108 పాదాలు ఏర్పడి ఒక్కొక్క నక్షత్ర రాశి సూర్యుని ప్రభావం ఉండే కాలాన్ని చంద్రుని పెరుగుదల- తరుగుదలను బట్టి తిథులుగా లెక్కించబడతాయి. పాడ్యమి నుండి అమావాస్యదాకా ఉంటాయి.
పుట్టుక, పెళ్లి, మరణం, రజస్వల, అక్షరాభ్యాస సందర్భాల్లో తెలుగు పంచాంగాన్ని ప్రజలు అనుసరిస్తారు. మనం నిత్యం వాడతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ క్రీస్తు శకంలో ఆరంభమైంది. దీన్నే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరు అనుసరిస్తున్నారు. శక సంవత్సరం అంటే క్రీస్తు పుట్టిన తరువాత 78 సంవత్సరాల చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. దీంతో ప్రస్తుతం శక సంవత్సరం ప్రకారం 2025 కాదు, 1947గా పరిగణిస్తారు. ఆంగ్ల సంవత్సరంలో 78 సంవత్సరాలను తగ్గించాలి. ఆకాశవాణిలో ప్రతిరోజూ శక సంవత్సరం గురించి చెపుతారు.
గుజరాతీయులకు క్రీ.పూ 58వ సంత్సరంతో విక్రమ శకం ప్రారంభం అవుతుంది. యూదులు హిబ్రూ క్యాలెండర్, ముస్లింలు హిజ్రీ క్యాలెండర్‌ను అనుసరిస్తారు. థాయ్‌లో ఏప్రిల్ 13-15 మధ్య, ఇథియోపియాలో సెప్టెంబర్ 11న నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. రోమన్లు వారి దేవుడు ‘జనస్’ గుర్తుగా జనవరిని ప్రారంభ సంవత్సరంగా భావిస్తారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో నూతన సంవత్సరాలు ఏర్పడ్డాయి. తెలుగు సంవత్సరంలో 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగములు, 11 కరణములున్నాయి. తెలుగు పంచాంగం చైత్రమాసంలో శుక్ల పక్ష పాడ్యమి నాడు సూర్యోదయాన ‘ఉగాది’ రోజు ప్రారంభమవుతుంది. తెలుగు ప్రజలందరికి ‘ఉగాది’ శుభాకాంక్షలు.
తంగిరాల చక్రవర్తి
93938 04472
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.