
………….
నన్నెంతకని తిరస్కరిస్తావు చెప్పు?
నన్నాపడానికి ఎన్ని రాజకీయ కుట్రలు, ఎన్నెన్ని కుతంత్రాలు చేస్తావు ఇంకా?
నేను గాలిపటంలా ఎగరబోతుంటే…నన్ను భూమికి లాగటానికి., కింద నుంచి ఎన్ని దారాలను కత్తిరిస్తావు చెప్పు?
నేను నడిచే దారుల్లో ఇంకేన్ని అడ్డంకుల్ని పరుస్తావు?
…………
ఎప్పుడు చూడూ నన్ను బంధించడానికి కొత్త కొత్త సంకెళ్లు తయారు చేసుకుంటూనే ఉంటావా? మనిషిగా నాలోని మానవత్వం నీకు అవసరమే లేదు!
పశువైన గోమూత్రం మాత్రం నీకు చాలా పవిత్రమైనది !
నా లాంటి మనిషి మాత్రం అపవిత్రుడు..ఎంత విచిత్రం ఇది? ఆహా..ఏం నీతి నీది?
అసలు ఏం గొడవ ఇది ?
………..
నీ మెదడులో కులం,జాతి,మతపు క్రిములు లుక లుక లాడుతున్నాయి ఎందుకు?
నీ మనసు నిండా ఉచ్ఛ నీచాల చెత్త ఎందుకు జమై ఉందో కాస్త చెబుతావా?
లేకపోతే ముందుకు అడుగేస్తున్న నన్ను ఎందుకని ఆపుతావు? ఎంతకని నన్ను ద్వేషిస్తావు..అణిచేస్తావు
శత్రువులా చూస్తావు.. ఎంతకనీ..ఇంకెన్నేళ్ళనీ?
………..
నిన్ను ఎలా నమ్మను? మనిషిగానే కనిపించని నువ్వంటే నాకు అసలు విశ్వాసమే లేదు! నిజానికి చాలా భయం నువ్వంటే ! ఎక్కడ నా గొంతు కోసేస్తావో .. ఎక్కడ నా జీవితం మరింత దుర్లభం చేసి పడేస్తావేమో అని అనుమానం.,వెరపు !
………
అసలు నీ వంశం అంతా సైతాను అంశతోనే మొదలైంది. సైతానులాంటి నీ నుంచి మనిషితనాన్ని ఆశించడమే పెద్ద తప్పు!
ఒకటి చెప్పు..ఎంతకని వేధిస్తావు నన్ను? ఎన్నాళ్ళు శూద్రుడిగానే చూస్తావు నన్ను ?
ఎంతకాలం నీకు అంట రాని వాణ్ణి నేను?
ఇంకా అడుగడుగునా ఎన్ని అవమానాలు చేస్తూ నా నడక ఆపేస్తావో చెప్పు?
………
నువ్వే కాదు..నీ మొత్తం సంస్కృతి,నీ వారసత్వ ధర్మం కూడా నాకు శత్రువుల్లా కనిపిస్తారు !
నిత్యం మీ మోసాల్ని, కుట్రావమానాలను మౌనంగా మింగుతూ ఉండడమే జీవితంగా మారిపోయింది!
అదే పనా మాకు?
ఎవర్ని దోషులనాలి ఇక్కడ?
గులాముల్లాగ బతకడం ఇక దుర్లభమైపోయింది.
మా వల్ల కాదు!
ఇక..చాలు!
ఎవరినీ లెక్క చేయకుండా..నీ సర్వ నాశనానికి సర్వమూ సిద్ధం చేసుకోవాలి !
ఒక కొత్త బాధ్యతను నెత్తి కెత్తుకోవాలి..తప్పదు !
……
నువ్వెంత బలవంతుడివో నాకు తెలుసు…నీతో యుద్ధం కష్టమే!
కానీ నా బలంతో నాతో నీ శత్రుత్వాన్ని నేను స్నేహంగా మార్చేయగలను!
నీకు తెలీదు నా శక్తి అనంతం..అజేయం !
………
నన్ను గోమూత్రం కంటే కూడా అపవిత్రుడిగా నిలబెట్టే నీ రాక్షస వారసత్వాన్ని తిరస్క రిస్తూ..నేనిక తిరుగుబాటు చేయాల్సిందే…విప్లవించాల్సిందే !
మనిషైనందుకు..ఈ కుట్రల జమా లెక్కలని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే !
మరాఠీ మూలం – శరణ్ కుమార్ లింబాలే.
హిందీ – రీనా త్యాగి.
తెలుగు – గీతాంజలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.